
నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రతీకారమే
హన్మకొండ చౌరస్తా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రతీకారానికి దిగుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీల పేర్లు చార్జీషీట్‌లో నమోదు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గురువారం హనుమకొండలోని అశోకా జంక్షన్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సోనియా, రాహుల్, ఇతర అగ్రనేతలపై చార్జీషీట్ దాఖలు చేయడమంటే ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేయడమేనన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన విపక్ష పార్టీపై దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. కార్యక్రమంలో ఎంపీ కావ్య, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్, విజయశ్రీరజాలీ, మామిండ్ల రాజు మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు.