తెలుసుకోండి..! | - | Sakshi
Sakshi News home page

తెలుసుకోండి..!

Apr 17 2025 1:11 AM | Updated on Apr 17 2025 1:33 PM

తెలుస

తెలుసుకోండి..!

కొనేముందు 
 

ఖిలా వరంగల్‌: బంగారం ఆభరణాలంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు మక్కువ చూపుతారు. హుందాకు చిహ్నంగా భావిస్తారు. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో బంగార ఆభరణాలదే అగ్రస్థానం. ధర ఎంత పెరిగినా.. పసిడిని కొనుగోలు చేయడం మానరు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం సంప్రదాయ అవసరాలు తీర్చడమే కాకుండా పెట్టుబడులకు కూడా ఉపయోగపడుతోంది. అందుకే చాలా మంది భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా బంగారం విక్రయాలు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో షాపులు కూడా పెరుగుతున్నాయి. భూపాలపల్లి, మహబూబాబాద్‌, జనగామ, ములుగు, ఏటూరునాగరం, నర్సంపేట, పరకాల, తొర్రూరు, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యల్లో బంగారు ఆభరణాల షాపులు ఉన్నాయి. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు బంగారం, దాని నాణ్యతను సులువుగా గుర్తించి మోసాలకు చెక్‌ పెట్టొచ్చు. వరంగల్‌ ట్రైసిటీలో చిన్న, పెద్ద కలిపి సుమారు 150పైగా దుకాణాలు ఉన్నాయి. అనధికారికంగా మరికొన్ని వెలుస్తున్నాయి. ప్ర స్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.95 వేలకుపైగా చేరింది. ఈ క్రమంలో కొనుగోలు సమయంలో వినియోగదారులు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

బంగారంలోనే రంగులు

బంగారు ఆభరణం తయారీలో నికిల్‌, మాంగనీస్‌ లేదా పల్లాడియం వంటి లోహాలు కలుపుతారు. అప్పుడు అది బంగారం వర్ణంలోనే కొంచెం తెల్లని ఛాయలో ఉంటుంది. రాగి ఎక్కువ కలిపితే ఎరుపు, గులాబీ ఛాయలో కనిపిస్తుంది. రోజ్‌గోల్డ్‌ అయితే అందులో 25 శాతం రాగి కలిపినట్లు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ బంగారంతో 18 క్యారెట్లు మాత్రమే ఉంటుంది. వెండి, మాంగనీస్‌, రాగిని ఉపయోగిస్తే బూడిద రంగు ఛాయలో ఉంటుంది. కేవలం వెండిని మాత్రమే కలిపితే గ్రీనిస్‌ షేడ్‌లో కనిపిస్తుంది.

స్వచ్ఛత గుర్తింపు ఇలా..

ఆభరణం అంచులు రంగు పోయి బంగారపు వర్ణం కాకుండా ఇతర వర్ణం కనిపిస్తుంటే అది కచ్చితంగా పూత పోసిన ఆభరణమని గ్రహించాలి. నోటి పళ్ల మధ్య పెట్టి బలంతో ఆభరణాన్ని నొక్కి చూడండి. స్వచ్ఛ బంగారమా.. పూత పోసిందా అని తెలుసుకోవచ్చు. పంటి గాట్లను గమనించి బంగారం నాణ్యతను సులభంగా తెలుసుకోవచ్చు. బంగారంలో ఇనుము కలిసి ఉంటే ఆయస్కాంతంతో గుర్తించొచ్చు. షైనింగ్‌ లేని సిరామిక్‌ ప్లేట్‌ మీద బంగారు ఆభరణాన్ని రుద్దితే నల్లని చారలు పడితే ఆది స్వచ్ఛమైనది కాదు. బంగారు గీతలు పడితే స్వచ్ఛమైనది అని అర్థం. ఆభరణం కొనుగోలుకు ముందే షాపు వద్ద నైట్రిక్‌ యాసిడ్‌తో టెస్ట్‌ చేయమని కోరవచ్చు. ఆభరణంపై చుక్క నైట్రిక్‌ యాసిడ్‌ వేసిన వెంటనే రసాయనిక చర్య ప్రారంభమై ఆకుపచ్చ రంగులో కనిపిస్తే బేస్‌ మెటల్‌ లేదా బంగారు పూత వేసిందిగా గ్రహించాలి. బంగారం వర్ణంలోనే రియాక్షన్‌ కనిపిస్తే బంగారం పూత వేసి ఇత్తడిగా గమనించాలి. పాల రంగులో కనిపిస్తే వెండి ఆభరణంగా ఎలాంటి రియాక్షన్‌ లేకపోతే దానిని స్వచ్ఛమైన ఆభరణంగా గుర్తించాలి.

కేడీఎం అంటే..

జ్యూవెల్లరీ దుకాణంలో బంగారం కొనే సమయంలో ఆ ఆభరణం కేడీఎం అని షాపు యజమానులు చెబుతారు. అసలు కేడీఎం అంటే బంగారు ఆభరణాలు తయారీలో కాడ్మియంతో సోల్డరింగ్‌ చేస్తారు. ఇవి 91.6 స్వచ్ఛతతో ఉంటాయి.

ఇవి గమనించాలి..

24 క్యారెట్ల బంగారంలో 99.9, 22 క్యారెట్‌ బంగారంలో 91.6 శాతం స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛ బంగారం మొత్తగా ఉంటుంది. బంగారంలో కలిపిన ఇతర లోహాల శాతాన్ని బట్టి ఆభరణాల రంగు, గట్టిదనం, మన్నిక ఆధారపడి ఉంటాయి. నాణ్యత తెలిపే కొలమానం వేయించుకుని రశీదులు తీసుకోవాలి. భవిష్యత్‌లో తేడా వస్తే కేసు వేయడానికి అవకాశం ఉంటుంది.

 

పసిడి నాణ్యతను గుర్తించండిలా..

హాల్‌మార్క్‌తోనే మోసాలకు చెక్‌

యూనిక్‌ ఐడీ నంబర్‌ను బట్టి స్వచ్ఛత

నాణ్యత శాతం సర్టిఫికెట్‌తోనే

అసలు గుర్తింపు

క్యారెట్ల బట్టి స్వచ్ఛత..

24 క్యారెట్ల: 99.9 శాతం స్వచ్ఛత ఇది.

బిస్కెట్‌ రూపంలో ఉంటుంది.

22 క్యారెట్లు: 91.6 శాతం బంగారం,

మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి.

18 క్యారెట్ల: 75 శాతం బంగారం,

మిగతా 25శాతం ఇతర లోహాలు

14 క్యారెట్లు: 58.5 శాతం బంగారం,

మిగతా భాగం ఇతర లోహలు

12 క్యారెట్లు: 50శాతం మాత్రమే

బంగారం, మిగతా 50శాతం ఇతర లోహాలు మిశ్రమంతో తయారీ అవుతుంది.

10 క్యారెట్లు: 41.7 శాతం బంగారం మాత్రమే ఉంటుంది.

24 క్యారెట్లు అంటే..

బంగారం స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అంటారు. దీనితో ఆభరణాలు చేయరు. ఇది బిస్కెట్‌ రూపంలోనే ఉంటుంది. ఆభరణాలు గట్టిగా , మన్నికగా ఉండేందుకు గాను స్వచ్ఛమైన బంగారానికి రాగి, వెండి, కాడ్మియం, జింక్‌ వంటి ఇతర లోహాలు కలుపుతారు. ఇలా చేయడం ద్వారా బంగారం స్వచ్ఛత 22.18.14 క్యారెట్లుగా నిర్ధారిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement