
దిగుమతి సుంకాలు తగ్గిస్తే పత్తి రైతులకు నష్టాలు
వరంగల్: ది సదరన్ ఇండియా మిల్స్ అసోసియేషన్ కోరినట్లు దిగుమతి సుంకాలను 11శాతం కంటే ఎక్కువ మినహాయింపు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దేశంలోని పత్తి రైతులు నష్టపోతారని తెలంగాణ కాటన్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ అధ్వర్యంలో కేంద్ర కమిషనర్ ఆఫ్ టెక్స్‌టైల్స్ రూప్ రాశి.. వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. ఈ వీసీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టెక్స్‌టైల్స్ సెక్రటరీలు, ఫైనాన్స్ సెక్రటరీలు, సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తా, దేశంలో టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషనలతోపాటు తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ దిగుమతి చేసుకుంటున్న దూదిబేళ్లపై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం మినహాయింపు(తగ్గిస్తే) ఇస్తే దేశంలోకి ఇతర దేశాలనుంచి దూదిబేళ్ల దిగుమతులు ఎక్కువై సాగు చేసే రైతుల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.