సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ తలపెట్టిన తెలంగాణ విజయోత్సవ సభకు అచ్చొచ్చినట్టు లేదు. సభ ఏర్పాట్లను చర్చించేందుకు హైదరాబాద్‌లో మంత్రి పొన్నాల నివాసంలో మంగళవారం జరిగిన సమావేశం రచ్చరచ్చగా ముగిసింది. కేంద్ర మంత్రి బలరాం నాయక్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య ఘర్షణతో అట్టుడికింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, చీఫ్ విప్ గండ్ర, ఎంపీ రాజయ్య, ఎమ్మెల్యేలు కవిత, శ్రీధర్, డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతోపాటు జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి తరలివెళ్లారు. సభ ఎక్కడ... ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో చివరి వరకు నేతలు మల్లగుల్లాలు పడ్డారు. ఎట్టకేలకు వచ్చే నెల తొమ్మిదో తేదీన వరంగల్‌లో విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించారు. హన్మకొండలోని జేఎన్‌ఎస్ మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. జన సమీకరణలో భాగంగా నవంబర్ రెండో తేదీన డీసీసీ భవన్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయూలని నిర్ణరుుంచారు. ఇంత కసరత్తు జరిగిన సమావేశం... చివరన రసాభాసగా ముగిసింది.
తిరిగి వెళ్లిపోయే సమయంలో డీసీసీబీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కేంద్ర మంత్రి బలరాం నాయక్‌తో గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఒకరికొకరు దుర్భాషలాడుకోవడం... చొక్కాలు పట్టుకునే వరకూ వెళ్లడంతో అక్కడున్న వారు కంగుతిన్నారు. అనూహ్యంగా భగ్గుమన్న ఈ వివాదం పార్టీ ముఖ్యుల మధ్య చర్చనీయాంశంగా మారింది. అసలు సభ విషయం పక్కనబెట్టి ఈ వివాదమే నేతలందరి నోటా ప్రధాన అంశంగా మారింది. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేసినప్పటికీ... ఈ వివాదం ఇప్పటికిప్పుడు చల్లారేలా లేదనే వాదనలు వినిపిస్తున్నారుు. అరుుతే సమావేశంలో అలాంటి గొడవేమీ జరగలేదని... అనవసరంగా రాద్ధాంతం చేశారని డీసీసీబీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ‘సాక్షి’తో అన్నారు. ‘ఆప్కాబ్ సమావేశానికి హాజరవాల్సి ఉండడంతో నేను ముందుగా అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. మంత్రికి చెప్పి వెళ్లిపోదామనే ఉద్దేశంతో గదిలోకి వెళ్లాను. మా మధ్య గొడవేమీ జరగలేదు...’ అని చెప్పారు. ‘విజయోత్సవ సభ నిర్వహణ విషయంలోనే రభస జరిగింది. ముందుగా సభను నా అధర్వ్యంలో మహబూబాబాద్‌లో నిర్వహించాల న్నారు. తర్వాత వరంగల్‌లో అన్నారు. మహబూబాబాద్‌లో ఓకే అన్నాక... అక్కర్లేదు అని మాట మార్చా రు. రోజుకో తీరుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం.. స్పష్టత ఉండాలి... అని సమావేశంలో నేను నేతలను నిలదీశాను. సమావేశం నుంచి బయటకు వెళ్లేటప్పుడు అదే విషయంలో ఏకవచనంలో సంబోధిస్తూ.. రాఘవరెడ్డి ఏదో కామెంట్ చేశాడట. అది తెలిసి... నేను సీరియస్ అయ్యాను. ఇద్దరం ఎదురెదురుగా మాటలేమీ అనుకోలేదు. ఘర్షణేమీ జరగలేదు’ అని గద్వాలలో ఉన్న నాయక్ ఫోన్‌లో చెప్పారు.
అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం
మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, చీఫ్ విప్ గండ్ర, ఎంపీ రాజయ్య, ఎమ్మెల్యేలు కవిత, శ్రీధర్, డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు దుగ్యాల శ్రీనివాసరావు, పొడెం వీరయ్య, ఆరోగ్యం, సీనియర్ నేతలు నాయిని రాజేందర్‌రెడ్డి, వరద రాజేశ్వరరావు, సమ్మారావు, రాధారపు ప్రతాప్, కె.దయాసాగర్, ఎర్రబెల్లి స్వర్ణ, పొన్నాల వైశాలి, డాక్టర్ హరిరమాదేవి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరందరి సమక్షంలో జరిగిన ఈ వివాదం.. జిల్లా పార్టీలో రగులుతున్న అంతర్గత విభేదాలను బయటపెట్టింది. స్వయానా కేంద్ర మంత్రికి సంబంధించిన గొడవ కావడంతో పార్టీ అధిష్టానం ఈ ఘటనపై ఎలా స్పందిస్తుంది... క్రమశిక్షణ చర్యలేమైనా తీసుకుంటుందా... ఇద్దరు మంత్రులు సయోధ్య కుదిర్చి వివాదాన్ని చల్లారుస్తారా... అనే సందేహాలు అందరినోటా వెల్లువెత్తుతున్నారుు. మరోవైపు విజయోత్సవ సభకు ఈ సంఘటన ఆటంకంగా నిలుస్తుందా... నవంబరు 9న సభ జరుగుతుందా.. లేదా.. అనే మీమాంస పార్టీ నేతలను సైతం అయోమయానికి గురి చేస్తోంది.
ముందే.. ముదిరింది
Published Wed, Oct 30 2013 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement