మానుకోటకు మరో ఆర్‌యూబీ
- నెల రోజుల్లో నిర్మాణం పూర్తి
- ములుగులో స్కూల్, మెడికల్ కళాశాల ఏర్పాటు
- కేంద్ర మంత్రి బలరాంనాయక్
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రాంతంలో మరో ఏడు రైల్వే అండర్ బ్రిడ్జిలు (ఆర్‌యూబీ) నిర్మించనున్నామని.. ఇందులో ఒకటి మానుకోటకు మంజూరైనట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి బలరాం నాయక్ తెలిపారు. మహబూబాబాద్ మధ్యగేటు ప్రాంతంలో జరుగుతున్న ఆర్‌యూబీ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ నూతనంగా చేపట్టనున్న ఆర్‌యూబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.3.60 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే... టెండర్లు పూర్తిచేసి ఆర్‌యూబీ పనులు ప్రారంభిస్తామన్నారు. దీని కోసం ఏ-క్యాబిన్ రోడ్డులో అధికారులు గతంలోనే స్థలాన్ని కూడా పరిశీలించారని గుర్తు చేశారు. నెలరోజుల్లోపు నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఇక మధ్యగేటు ప్రాంతంలో జరుగుతున్న ఆర్‌యూబీ నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కాంట్రాక్టర్ల వైఫల్యమేనన్నారు. దీనికి సంబంధించి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడానని, నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
కంతనపల్లి ప్రాజెక్ట్ పూర్తయితే మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మానుకోట, నర్సంపేట, ములుగు, డోర్నకల్ నియోజకవర్గాలకు సాగు, తాగునీటి సమస్య తీరుతుందన్నారు. లక్కమారికాపులోని 107 ఉప కులాలను ఓబీసీలో చేర్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ములుగులో ఏకలవ్య స్కూల్, మేడారం ప్రాంతంలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరైందని వివరించారు. ములుగులో ప్రైవేట్ మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం చెన్నైలోని సింగేరి సంస్థతో మాట్లాడామని, ఆ సంస్థ స్థలాన్ని కూడా పరిశీలించిందని చెప్పారు. త్వరలోనే వారి ఆధ్వర్యంలో వంద పడకల ఆస్పత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటు జరగనుందన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా ముందకు పోతున్నామని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 22 నుంచి మానుకోటలో గోదావరి, నెక్కొండలో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లు ఆగుతాయని, ప్రయాణికుల సౌకార్యర్థం రైల్వే అధికారులతో మాట్లాడి హాల్టింగ్‌కు కృషి చేశానన్నారు. మంత్రి వెంట పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ మాదవపెద్ది శశివర్ధన్‌రెడ్డి, నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, పజ్జూరి ఇంద్రారెడ్డి, రావుల రవిచందర్‌రెడ్డి, ముల్లంగి ప్రతాప్ ఉన్నారు.