
సిద్దిపేటజోన్: వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛబడి పేరిట ప్రజల్లో చెత్త పునర్వినియోగంపై అవగాహన ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో నెట్‌వర్క్ కలిగి, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖకు అనుబంధంగా పనిచేసే ఎర్త్ డే ఆర్గనైజేషన్, సిద్దిపేట మున్సిపాలిటీ లీడర్‌షిప్ అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క సిద్దిపేటకే ఈ అవార్డు రావడం విశేషం. సిద్దిపేటతో పాటు కోయంబత్తూరు, భువనేశ్వర్, చండీగఢ్, వాడి, జమ్మూ, రాజ్‌కోట్, బెంగళూరు తదితర పట్టణాలకు సైతం ఈ పురస్కారం లభించింది. సోమవారం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.