Department of Environment
-
23న దేశవ్యాప్తంగా ‘ఎర్త్ అవర్’
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎర్త్ అవర్‌లో భాగంగా...ఈ నెల 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంట పాటు విద్యుత్ దీపాలు ఆర్పేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ కోరారు. సచివాలయంలో మంగళవారం ఆమె ‘ఎర్త్ అవర్’పోస్టర్‌ను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎర్త్ అవర్ అనేది భూగోళం ఎదుర్కొంటున్న మూడు రకాల సంక్షోభాలను గుర్తించడానికని తెలి పారు. వాతావరణ మార్పులు, జీవ–వైవిధ్య నష్టం, పర్యా వరణ రక్షణకు... దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాల యాలు, ప్రభుత్వ సంస్థలతో పాటు ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి 8.30–9.30 సమయంలో హైదరా బాద్‌లోని సెక్రటేరియట్, దుర్గం చెరువు, బీఆర్ అంబేడ్కర్, బుద్ధ విగ్రçహాలు, గోల్కొండ కోట, చార్మినార్, రాష్ట్ర గ్రంథాలయం, రాష్ట్రంలోని ఇతర స్మారక చిహ్నాలన్నింటిలో లైట్లు ఆర్పాలని చెప్పారు. -
పల్నాడు ప్ర‘జల కళ’.. వరికపుడిశెల
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. పులుల అభయారణ్యం (టైగర్ ఫారెస్ట్)లో వరికపుడిశెల ఎత్తిపోతల, పైపులైన్ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అంగీకరించింది. దీంతో వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను రూ.340.26 కోట్లతో చేపట్టేందుకు మాచర్లలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి.. అధునాతన పైప్డ్ ఇరిగేషన్(పూర్తిగా పైపులైన్ల ద్వారా) పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పల్నాడు ప్రాంతం ఒకటి. తలాపున వరికపుడిశెల వాగు, కృష్ణా నదులు ప్రవహిస్తున్నా పల్నాడులో సాగునీటికే కాదు.. గుక్కెడు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులే. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కి.మీ.ల ఎగువన కృష్ణా నదిలో వరికపుడిశెలవాగు కలవక ముందే.. ఆ వాగు నుంచి జలాలను ఎత్తిపోసి పల్నాడును సుభిక్షం చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులు చేపట్టడానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితమైంది. పల్నాడును సస్యశ్యామలం చేసే దిశగా వరికపుడిశెలవాగు, కృష్ణా, గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానం ద్వారా నదీ జలాలను తరలించి దుర్భిక్ష పల్నాడును సుభిక్షం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానం తొలి దశ పనులతోపాటు వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను అధికారులు చేపట్టారు. వరికపుడిశెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.340.26 కోట్లతో చేపట్టారు. టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో వరికపుడిశెల వాగుపై ఎత్తిపోతల నిర్మాణం, ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించడానికి 4 కి.మీ.ల పొడవున పైపు లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధులు, జల వనరుల శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చలు జరపడంతో కేంద్రం కదిలింది. వరికపుడిశెల ఎత్తిపోతలకు ఏప్రిల్ 28న అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. పనులకు తొలగిన అడ్డంకి శ్రీశైలం–నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో వరికపుడిశెల ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దాంతో వరికపుడిశెలవాగు కుడి గట్టుపై పంప్‌హౌస్ నిర్మాణానికి.. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 4 కి.మీ.ల పొడవున పైపులైన్ నిర్మించడానికి మార్గం సుగమమైంది. దాంతో ఆ ఎత్తిపోతల పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తున్నారు. ఎత్తిపోతల ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి వీలుగా పైపు లైన్లు వేయనున్నారు. పైపులైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని.. ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందింవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు వరికపుడిశెల ఎత్తిపోతల రెండో దశలో పల్నాడు ప్రాంతంలో భారీ ఎత్తున ఆయకట్టుకు నీళ్లందించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
పాలమూరుకు లైన్ క్లియర్!
కుట్రలను ఛేదించి.. కేసులను అధిగమించి.. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులపై మంత్రి హరీశ్‌రావు ట్వీట్ సాక్షి, హైదరాబాద్: కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ పర్యావరణ అనుమతులు సాధించారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం సీఎం కేసీఆర్ సాధించిన మరో అపూర్వ, చరిత్రాత్మక విజయం..’’అని హరీశ్ పేర్కొన్నారు. కేసీఆర్ మొక్కవోని దీక్షకు, ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడుగా సాధించిన ఫలితం ఇదని.. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భంగా మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టమని అభివర్ణించారు. సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ/ఈఏసీ) పలు షరతులతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫార్సు చేసింది. గత నెల 24న జరిగిన సమావేశం నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. దీంతో త్వరలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ కానున్నాయి. రూ.55,086.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో మొత్తం 8,83,945 హెక్టార్ల ఆయకట్టుకు ప్రభుత్వం నీరు అందించనుంది. ఆ అధికారులపై చర్యలు తీసుకున్నాకే.. పర్యావరణ అనుమతులు లేకుండానే పనులను చేపట్టినందుకుగాను.. ప్రాజెక్టును ప్రతిపాదించిన అధికారి (ప్రాజెక్టు ప్రపోనెంట్)పై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 19 కింద రాష్ట్ర ప్రభుత్వం/కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ షరతు విధించింది. పర్యావరణ అనుమతుల జారీకి ముందే ఈ చర్యల వివరాలను సమర్పించాలని.. అనుమతులు జారీ చేసే వరకు పనులేవీ చేపట్టరాదని స్పష్టం చేసింది. రూ.106 కోట్ల జరిమానా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో.. పర్యావరణ ప్రభావం మదింపు (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ఈఐఏ) నోటిఫికేషన్ 2006ను నీటిపారుదల శాఖ ఉల్లంఘించినట్టు నిపుణుల మదింపు కమిటీ గతంలోనే నిర్థారించింది. ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీకి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను అమలు చేయాల్సి ఉంటుందని తేల్చింది. ఈ క్రమంలో.. పర్యావరణ పునరుద్ధరణకు రూ.72.63 కోట్లు, ప్రకృతి వనరుల వృద్ధికి రూ.40.2 కోట్లు, సామాజిక వనరుల అభివృద్ధికి రూ.40.8 కోట్లు కలిపి మొత్తం రూ.153.7 కోట్లతో ఎస్ఓపీ ప్రణాళికలు అమలు చేస్తామని నీటిపారుదల శాఖ ప్రతిపాదించగా.. నిపుణుల కమిటీ ఆమోదించింది. ఈ మొత్తానికి ఐదేళ్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని షరతు విధించింది. ఇక అనుమతులు లేకుండానే రూ.21,200 కోట్లతో పనులు చేసినందున.. నిబంధనల ప్రకారం అందులో 0.5శాతం (రూ.106 కోట్లు) జరిమానాగా పీసీబీకి చెల్లించాలని ఆదేశించింది. కోర్టు కేసుల చిక్కులు తొలగినట్టే! పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. అయినా పనులు కొనసాగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానకి రూ.920.85 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందింది. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలను మాత్రమే తరలించేలా ప్రాజెక్టు పనులకు సుప్రీం నుంచి అనుమతులు పొందింది. కానీ ఏకంగా 120 టీఎంసీల నీటి తరలింపునకు వీలుగా ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేస్తోందని ధ్రువీకరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు తాజాగా సుప్రీంకోర్టులో సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. దీంతో కోర్టు ధిక్కరణ చర్యలకు ఆస్కారం ఉండటంతో నీటిపారుదల శాఖవర్గాలు ఆందోళనలో పడ్డాయి. అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో దానిపై విచారణ జరగనుండగా.. ఆలోపే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో న్యాయపరమైన చిక్కులు తొలగిపోనున్నాయి. నిపుణుల కమిటీ షరతుల్లో ముఖ్యమైనవి పర్యావరణ/సామాజిక నష్టాన్ని నిర్దేశిత గడువులోగా పునరుద్ధరించాలి. మూడేళ్లలోగా రూ.153.7 కోట్లతో నష్ట నివారణ ప్రణాళిక అమలు పూర్తి చేయాలి. ఎన్జీటీ ఆదేశాల మేరకు నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు నష్ట నివారణ చర్యలుండాలి. అన్ని రిజర్వాయర్లకు 500 మీటర్ల దూరం వరకు పెద్దెత్తున మొక్కలు నాటి అందులో కనీసం 90శాతాన్ని సంరక్షించాలి. వాటర్షెడ్ల అభివృద్ధి ప్రణాళిక, వన్యమృగాల సంరక్షణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. ప్రాజెక్టు ఉద్యోగాలు, ఇతర అవకాశాల్లో స్థానిక గ్రామస్తులకు, నిర్వాసితుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఎల్రక్టీ్టషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి వృత్తుల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, వైద్యం వంటి మౌలిక వసతులు కల్పించాలి. ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామస్తులకు సోలార్ ప్యానెళ్లు అందజేయాలి. ప్రభావిత గ్రామాల్లో బయో గ్యాస్ ప్లాంట్లు నెలకొల్పాలి. -
మంత్రుల్లేరు.. ప్రొటోకాల్ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘నా శాఖలైన పౌర సరఫరాలు, పర్యావరణ శాఖల సమీక్షకు రాష్ట్ర మంత్రులెవరూ హాజరవలేదు. ప్రొటోకాల్ పాటించలేదు. అతిథి మర్యాద లేదు’ అని కేంద్ర అటవీ, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సమీక్షకు ఆయా శాఖల అధికారులే వచ్చారన్నారు. ఆదివారం రాత్రి మీడియాతో చౌబే మాట్లాడుతూ ‘2021లో 141.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. రైతులకు రూ. 26 వేల కోట్లు చెల్లించింది’ అని చెప్పారు. ‘కేంద్రంపై అవినీతి ఆరోపణల్లో నిజం లేదు. మోదీ చరిత్రలో అవినీతికి తావులేదు. కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే అది మీ మీదే పడుతుంది’ అన్నారు. తెలంగాణతో ఇతర రాష్ట్రాల రేషన్ షాపుల్లో 2023 కల్లా ఫోర్టిఫైడ్ రైస్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 2024లో దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లోకి తెస్తామన్నారు. ‘తెలంగాణలో 25 రైస్ మిల్లులు తమ మిషనరీని అప్‌గ్రేడ్ చేసుకున్నాయి. మున్ముందు మిగతా రైస్ మిల్లులూ అప్‌గ్రేడ్ కానున్నాయి’ అని అశ్వనీకుమార్ చౌబే వివరించారు. -
సిద్దిపేట బల్దియాకు లీడర్షిప్ అవార్డు
సిద్దిపేటజోన్: వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛబడి పేరిట ప్రజల్లో చెత్త పునర్వినియోగంపై అవగాహన ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో నెట్వర్క్ కలిగి, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖకు అనుబంధంగా పనిచేసే ఎర్త్ డే ఆర్గనైజేషన్, సిద్దిపేట మున్సిపాలిటీ లీడర్షిప్ అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క సిద్దిపేటకే ఈ అవార్డు రావడం విశేషం. సిద్దిపేటతో పాటు కోయంబత్తూరు, భువనేశ్వర్, చండీగఢ్, వాడి, జమ్మూ, రాజ్‌కోట్, బెంగళూరు తదితర పట్టణాలకు సైతం ఈ పురస్కారం లభించింది. సోమవారం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. -
1న బీడీడీ చాల్స్‌కు శంకుస్థాపన
సాక్షి, ముంబై: వర్లీ బీడీడీ చాల్స్ అభివృద్ధి పనుల భూమి పూజా కార్యక్రమానికి ఆగస్టు ఒకటో (ఆదివారం) తేదీన ముహూర్తం ఖరా రైంది. అందుకు మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) అధికార వర్గాలు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు భూమి పూజా కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరిగే ఈ భూమి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే తదితర మంత్రులు, ప్రముఖులు హాజరవుతారని మాడా అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా భూమిపూజా కార్యక్రమం గతంలో కూడా ఒకసారి వాయిదా పడింది. ఆ తరువాత ఈ నెల 27న జరగాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో జనజీవనం స్థంభించిపోయింది. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. వేలాది కుటుంబాలు గూడు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సందర్భంలో నూతన గృహ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడం సమంజసం కాదని ముఖ్యమంత్రి భావించారు. అదే సందర్భంలో వరద ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి బయలుదేరడంతో ఆయన నాలుగైదు రోజులు బిజీగా ఉన్నారు. దీంతో ఈ నెల 27వ తేదీన జరగాల్సిన భూమి పూజా కార్యక్రమం వాయిదా వేయాల్సి వచ్చింది. చివరకు ఆగస్టు ఒకటో తేదీన మళ్లీ ముహూర్తం ఖారు చేయడంతో వర్లీ ప్రాంత వాసుల్లో ఆనందం చిగురించింది. ఈసారైన భూమిపూజా కార్యక్రమం సఫలమవుతుందా...? లేక మరేమైన అడ్డంకులు ఎదురవుతాయా..? అనే సందిగ్ధంలో ఉన్నారు. -
దీని దారి రహదారే
సాక్షి, అమరావతి: పులస చేపల స్వేచ్ఛా విహారం కోసం పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పులస చేపలు ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించడానికి వీలుగా స్పిల్ వే రెండో పియర్‌లో ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చుతోంది. ప్రపంచంలో ఈ ఏర్పాట్లు ఉన్న అతి పెద్ద జలాశయం పోలవరం ప్రాజెక్టే కావడం గమనార్హం. పుస్తెలమ్మైనా సరే పులస తినాలన్నది ఉభయ గోదావరి జిల్లాల్లో నానుడి. దీన్ని బట్టే పులసకున్న ప్రాధాన్యతను, దాని రుచిని ఊహించుకోవచ్చు. గోదావరి వరద ప్రవాహం సముద్రంలో కలిసే సమయంలో అంటే.. జూన్ నాలుగో వారం నుంచి జూలై, ఆగస్టు మధ్యన సముద్రంలో జీవించే ఇలస రకం చేపలు సంతానోత్పత్తి కోసం నదిలోకి ఎదురీదుతాయి. ఇలా గోదావరిలోకి చేరాక పులసలుగా రూపాంతరం చెందుతాయి. ప్రపంచంలో ఎక్కడా, మరే ఇతర సముద్రపు చేపలు నదుల్లోకి ఎదురీదే ఉదంతాలు లేవు. వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకు ఈ చేప నదిలో ఎదురీదుతుంది. సంతానోత్పత్తి చేశాక తిరిగి సముద్రంలోకి చేరి మళ్లీ ఇలసగా మారుతుంది. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే అత్యంత అరుదైన పులస చేపల రాకపోకలకు విఘాతం కల్పించినట్లు అవుతుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే తగిన ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. చేప సైకాలజీపై అధ్యయనం ఇలస రాక, పులస పోక ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేందుకు వీలుగా పోలవరం ప్రాజెక్టుకు గేట్ల ఏర్పాటుపై అధ్యయనం బాధ్యతను కొల్‌కతాలోని ప్రఖ్యాత సీఐఎఫ్ఆర్ఐ (సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాకపోకల సమయంలో చేప ప్రవర్తించే తీరుపై సుమారు ఐదేళ్ల అధ్యయనానంతరం సీఐఎఫ్ఆర్ఐ.. ఫిష్ ల్యాడర్ గేట్లను డిజైన్ చేసింది. కేంద్ర జల సంఘం ఆమోదించిన మేరకు ఈ గేట్లను తయారు చేయించిన ప్రభుత్వం స్పిల్ వే రెండో పియర్‌కు అమర్చుతోంది. ఏ స్థాయిలో ప్రవాహం ఉన్నా.. గోదావరి నదిలో వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉన్నా పులసలు స్వేచ్ఛగా తిరిగేలా మూడు చోట్ల ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చుతున్నారు. ఫిష్ ల్యాడర్ 252 మీటర్ల పొడవు ఉంటుంది. దీనికి నాలుగు గేట్లు ఉంటాయి. స్పిల్ వే రెండో పియర్‌కు క్రస్ట్ లెవల్లో అంటే 25 మీటర్ల స్థాయిలో ఫిష్ ల్యాడర్‌కు ఒకటి, రెండు గేట్లను.. 34 మీటర్ల స్థాయిలో మూడో గేటును.. 41 మీటర్ల స్థాయిలో నాలుగో గేటును పెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు, కనిష్ట నీటి మట్టం 25.72 మీటర్లు. అంటే.. గోదావరిలో నీటి మట్టం గరిష్టంగా ఉన్నా, సాధారణంగా ఉన్నా, కనిష్టంగా ఉన్నా ఈ చేప ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించేందుకు ఈ గేట్లు అనుకూలంగా ఉంటాయన్న మాట. ప్రపంచంలో ఒక చేప జాతి సైకాలజీపై అధ్యయనం చేసి.. దాని స్వేచ్ఛకు విఘాతం కల్పించకుండా నిర్మిస్తున్న ఏకైక ప్రాజెక్టు పోలవరమేనని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఏపీ సర్కారుకు రూ.100 కోట్ల జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతంలోనే అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వాటర్ మ్యాన్‌గా ప్రసిద్ధి గాంచిన తరుణ్ భారత్ సంఘ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాజేంద్రసింగ్, ప్రొఫెసర్ విక్రమ్‌సోనీ, అనుమోలు గాంధీ, సత్యనారాయణ బొలిశెట్టి గత ఏడాది అక్టోబర్‌లో రాసిన లేఖను పిటిషన్‌గా పరిగణిస్తూ ఎన్జీటీ ఈ కేసును విచారించింది. అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయిన ఇసుక మాఫియా ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల్లో ఇసుకను తోడేస్తోందని, ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి అత్యంత సమీపంలో యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్లు తమ లేఖలో పేర్కొన్నారు. తాము చేపట్టిన నదీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆ విధ్వంసాన్ని స్వయంగా చూసి దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు. పర్యావరణ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తూ, వేలాది ట్రక్కుల్లో తరలిస్తున్నారని వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు స్థానికులు తమతో చెప్పారని లేఖలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలను వ్యతిరేకించినందుకు అధికార పార్టీ నేతలు, మద్దతుదారులు తమపై దాడులకు సైతం పాల్పడ్డారని ఆక్షేపించారు. ఈ వ్యవహారంపై డీజీపీకి, స్థానిక పోలీసులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇసుక దొంగలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇసుక తవ్వకాల వల్ల నదీ స్వరూపం ప్రమాదంలో పడుతోందని, పర్యావరణం దెబ్బతిన్నదని వివరించారు. భారీ ట్రక్కుల వల్ల ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక క్రయవిక్రయాల్లో నల్లధనం చేతులు మారుతోందని ఆరోపించారు. అక్రమ తవ్వకాలను వ్యతిరేకించే రైతులపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడుతోందన్నారు. అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసేందుకు గ్రామస్థాయి అధికారి నుంచి రాష్ట్రస్థాయి అధికారి వరకు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ లేఖను ఎన్జీటీ పిటిషన్‌గా స్వీకరించి, విచారించింది. చర్యలపై నెల రోజుల్లోపు నివేదిక సమర్పించాలని డిసెంబరు 21న కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ), ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ)ని ఎన్టీజీ ఆదేశించింది. జరిమానా విధించడం సబబే... తాజాగా పిటిషన్ గురువారం విచారణకు రాగా, పిటిషనర్ల తరపున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. 2015 నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోందని, తద్వారా పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని, గతంలోనే రేలా స్వచ్ఛంద సంస్థ తరపున పిటిషన్ కూడా దాఖలు చేశామని నివేదించారు. ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనాలు ఉన్నాయన్నారు. ఇక పిటిషన్లో ఉన్న అంశాలను ధ్రువీకరిస్తూ ఏపీపీసీబీ, సీపీసీబీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఎన్జీటీ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సీపీసీబీ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. అనుమతి లేని ఇసుక తవ్వకాలను తక్షణమే నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ‘‘ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉన్న ప్రాంతంలోని ఇన్ని అక్రమాలు చోటు చేసుకుంటుంటే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సీపీసీబీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైనింగ్–ధన్‌బాద్ ప్రతినిధులతో కూడిన కమిటీ సంయుక్తంగా తనిఖీ చేసి, ఇప్పటివరకు జరిగిన ఇసుక తవ్వకాలు, నదులకు జరిగిన నష్టం, ప్రభుత్వం కోల్పోయిన ఆదాయాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలి. జరిగిన నష్టంపై శాఖాధితిపతులను బాధ్యులను చేయాల్సి ఉంటుంది. అక్రమాలకు పాల్పడ్డ వారి నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంటుంది’’ అని ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు ఇచ్చే ముందు ఏపీపీసీబీ తరపు న్యాయవాది ధనుంజయ్ తొలుత ఏపీ ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌లోని అంశాలను ధ్రువీకరిస్తూ ఏపీపీసీబీ, సీపీసీబీ నివేదిక ఉన్నందున ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధించడం సబబేనని ధర్మాసనం తేల్చిచెప్పింది. తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. -
రూ.10 కోట్లతో పట్టణాభివృద్ధి పనులు
మంత్రి జోగు రామన్న పనులకు శంకుస్థాపన ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపాల్టీలోని 36 వార్డుల్లో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం పట్టణంలోని 26, 31వ వార్డుల్లో రూ.4 లక్షల చొప్పున వ్యయంతో నిర్మించనున్న మురికి కాలువల పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందించడానికి రూ.4 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని, విద్యుత్ సౌకర్యం లేని వీధులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరూఖ్ అహ్మద్, కౌన్సిలర్లు నజీర్ ఆస్మపర్వీన్, వెంకన్న, కమిషనర్ కమిషనర్ మంగతాయారు, ఈఈ నాగమల్లేశ్వర్రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ ఆయాజ్‌ఖాన్, టీఆర్ఎస్ నాయకులు సాజిదొద్దీన్, అడ్డి బోజారెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్, జహీర్‌రంజానీ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు -
హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ విస్తరణకు లైన్ క్లియర్
పర్యావరణ శాఖ అనుమతులు.. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం రిఫైనరీ విస్తరణ కోసం ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్‌కు షరతులతో కూడిన పర్యావరణ అనుమతి లభించింది. 8.33 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీని రూ.18,400 కోట్ల పెట్టుబడులతో 15మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న రిఫైనరీగా విస్తరించాలని హెచ్‌పీసీఎల్ యోచిస్తోంది. గత నెలలో జరిగిన పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) సమావేశంలో ఈ రిఫైనరీ విస్తరణకు ఆమోదం లభించింది. విశాఖలో కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక విస్తరణపై నిషేధం ఉన్నదన్న కారణంగా ఈ రిఫైనరీ విస్తరణ ప్రతిపాదనను 2013లో తిరస్కరించారు. గత ఏడాది జనవరి 26న ఆంధ్రప్రదేశ కాలుష్య నియంత్రణ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగిన జనవిచారణ(పబ్లిక్ హియరింగ్)లో వెల్లడైన వివిధ అంశాలపై ఈఏసీ చర్చించింది. కంపెనీ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్), ప్లాంట్ పరిసరాల్లో యాక్సిడెంట్లు, ట్రాఫిక్, పర్యావరణ కాలుష్యాలు, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, స్థానికులకు ఉద్యోగవకాశాలు, నీటి సరఫరా తదితర అంశాలకు హెచ్‌పీసీఎల్ కంపెనీ సంతృప్తికరంగా సమాధానాలిచ్చిందని ఈఏసీ వెల్లడించింది. సీఎస్ఆర్ కింద రూ.60 కోట్లు కేటాయించాలని, కొన్ని పనులకు కాలపరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తూ ఈ రిఫైనరీ విస్తరణకు ఈఏసీ పచ్చజెండా ఊపింది. కాగా హిందూస్తాన్ పెట్రో కెమికల్స్(హెచ్‌పీసీఎల్)కు ముంబైలో ఒకటి, విశాఖలో ఒకటి మొత్తం రెండు రిఫైనరీలు ఉన్నాయి. ముంబైలో ఉన్న 7.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 9.5 మిలయన్ టన్నులకు పెంచుకోవాలని కూడా హెచ్‌పీసీఎల్ ప్రతిపాదిస్తోంది. దీనికి సంబంధించి పబ్లిక్ హియరింగ్ జరపాలని, వెల్లడైన విషయాలను, అభ్యంతరాలపై కంపెనీ తన వ్యాఖ్యలను కూడా జతపరచి పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈఏసీ ఆదేశించింది. -
మరో థర్మల్ పవర్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాకు మరో థర్మల్ పవర్ ప్రాజెక్టు రానుంది. ఇప్పటికే పరవాడలో రెండు వేల మెగావాట్ల సామర్థ్యం కల ప్రాజెక్టు నడుస్తున్న నేపథ్యంలో మరో ప్రాజెక్టు దిశగా అడుగులు పడుతున్నాయి. అచ్యుతాపురం-రాంబిల్లి మండలాల మధ్య నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశను దాటగలిగింది. అవసరమైన అనుమతులు పొందడంలో ముందడుగు వేసింది. తొలుత అభ్యంతరం వ్యక్తం చేసిన పర్యావరణ శాఖ కూడా చివరికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పచ్చజెండా ఊపింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ తర్వాత నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ భారీ పవర్‌ప్లాంటు పూర్తయితే 4వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. దానిలో అధిక భాగం రాష్ట్ర ప్రయోజనాలకే వినియోగించనున్నారు. జిల్లాలోని అచ్యుతాపురం-రాంబిల్లి మండలాల మధ్య ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను కేంద్రం రెండు రోజుల క్రితం మంజూరు చేసింది. మే నాటికి పర్యావరణ శాఖ అనుమతులకు సంబంధించిన పర్యావరణ ప్రభావిత నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆశించిన స్థాయిలో ఉత్పత్తి చేయడం లేదు. శ్రీశైలం, సీలేరు, నాగార్జుల సాగర్ జల విద్యుత్ కేంద్రాలు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో సీలేరు మినహా మిగతా రెండిటి విషయంలోనూ తెలంగాణతో వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో ఎన్టీపీసీ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. ఎన్టీపీసీ భారీ ప్రాజెక్టు 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించనున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన 1200 ఎకరాల భూమిని ఏపీఐఐసీ కేటాయించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.26 కోట్లు కాగా దానిలో మెయిన్ ప్టాంటు వ్యయం రూ.20వేల కోట్లు. దాని నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. పర్యావరణ నివేదిక తయారువుతుండగానే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఆ ప్రక్రియ కూడా మే నెలలో ప్రారంభించున్నారు. జూన్ నాటికి టెండర్లు, ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ నివేదిక పూర్తిచేసి పనులు మొదలుపెట్టనున్నారు. సెప్టెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 20 శాతం స్థానిక అవసరాలకు వినియోగించి, మిగిలినది ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. స్థానిక యువకులకు,నిపుణులకు కూడా ఉ పాధి లభిం చనుంది. -
పర్యావరణానికి కోత!
పర్యావరణ శాఖకు తాజా బడ్జెట్లో కోత పడింది. గతేడాది ఈ శాఖకు రూ. 1,764.6 కోట్లను కేటాయించగా, ఈసారి ఐదు శాతం తగ్గించి రూ. 1,681.60 కోట్లను కేటాయించారు. అదేవిధంగా వాయు, నీటి కాలుష్య నివారణ చర్యల కోసం నిధులను 48 శాతం పెంచి రూ. 136.33 కోట్లు కేటాయించారు. జాతీయ నదుల్లో కాలుష్య నివారణకు ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదు. వన్యప్రాణుల సంరక్షణకు, అడవుల పెంపకానికి, ఇతర పర్యావరణ కార్యక్రమాలకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. -
ఎన్టీపీసీకి కేంద్ర పర్యావరణ శాఖ షాక్
విశాఖ: విశాఖ జిల్లా పూడిమడక విద్యుత్ కేంద్రాన్ని మరో ప్రాంతానికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పూడిమడక అనుకూలం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పర్యావరణశాఖ నివేదిక సమర్పించింది. పూడిమడక సునామీ బారిన పడే ప్రాంతం అని పర్యావరణ శాఖ హెచ్చరించింది. పర్యావరణ శాఖ నివేదిక మేరకు విద్యుత్ కేంద్రం మార్పుపై కేంద్రం చర్యలు చేపట్టింది. పూడిమడకలో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. -
డిష్యూం.. డిష్యూం!
పిడిగుద్దుల మోత మోగింది.. రాళ్లవర్షం కురిసింది.. అరుపులు కేకలతో దద్దరిల్లింది.. చీపుర్లు, చెప్పులు గాల్లో ఎగిరాయి.. పత్తి జిన్నింగ్ మిల్లుల తనిఖీ కోసం వచ్చిన అధికారులకు ఏం జరుగుతుందో తెలియక చెమటలు పట్టాయి. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పనిచెప్పారు. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.. వెరసి గద్వాల రమ్య జిన్నింగ్ మిల్లు వద్ద జరిగిన ఘర్షణ సినిమా సీన్‌ను తలపించింది. గద్వాల/టౌన్/న్యూటౌన్: పర్యావరణ శాఖ అధికారులు మంగళవారం చేపట్టిన పత్తి మిల్లుల తనిఖీ రసాబాసగా మారింది. కాంగ్రెస్, మిల్లు యాజమాన్యం దాడులకు పూనుకుంది. పత్తి డీలింటింగ్ (పత్తి నుంచి గింజలను వేరుచేసే ప్రక్రియ)లో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మోతాదుకు మించి వాడుతున్నారన్న ఫిర్యాదుమేరకు పర్యావరణ శాఖ అధికారుల బృందం గద్వాల పట్టణంలోని రమ్య జిన్నింగ్ మిల్లును తనిఖీ చేసేందుకు వచ్చింది. కాగా, వారి వెంట వచ్చిన గద్వాల మునిసిపల్ చైర్పర్సన్ బృందాన్ని మిల్లు యాజమాన్యం, కార్మికులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనలో వైస్ చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు గాయపడ్డారు. అలాగే ఇరువర్గాల జరిగిన రాళ్లదాడిలో గద్వాల డీఎస్పీ బాలకోటి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఏం జరిగిందంటే.. గద్వాల పట్టణం చుట్టూ సీడ్ విత్తనోత్పత్తిలో భాగమైన జిన్నింగ్, డీలింటింగ్ పద్ధతులను పాటించేందుకు 18కి పైగా ఫ్యాక్టరీలు వెలిశాయి. ఇందుకోసం సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎక్కువ మొత్తంలో వాడుతున్నందున తాగునీరు కలుషితం కావడంతో పాటు భూమి దెబ్బతింటుందని మునిపిపల్ చైర్పర్సన్ పద్మావతితో పాటు నడిగడ్డ పరిరక్షణ సమితి నాయకులు గతంలో పర్యావరణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు ఇంతకుముందే పలుమార్లు తనిఖీలు చేపట్టారు. మరోసారి ఫిర్యాదులు అందడంతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి పర్యావరణ స్క్వాడ్ బృందం స్థానిక రమ్య జిన్నింగ్ మిల్లుకు చేరుకుంది. వారి వెంట మునిసిపిల్ చైర్పర్సన్ బండాల పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. ఫ్యాక్టరీలోకి ఎవరు రానిచ్చారు, ఎలా వచ్చారని వారిని ఫ్యాక్టరీ యజమానులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు ప్రశ్నించారు. అక్కడే ఉన్న పోలీసుల ఎదుటే ఇరువర్గాల మధ్య తిట్ల పురాణం మొదలైంది. ఈ తరుణంలో అధికారులు తనిఖీ చేస్తారని, బయటికి వెళ్లాలని చైర్పర్సన్ బృందాన్ని ఎస్ఐ సైదాబాబు కోరారు. తనిఖీ జరిగే వరకు ఇక్కడే ఉంటామని ఫ్లాట్‌పాంపై బైఠాయించారు. అయినప్పటికీ రెండువర్గాల మధ్య వాదోపవాదాలు పెరగడంతో ఘర్షణ వాతావరణంలో రెండువైపులా చీపుర్లు, చెప్పులు విసురుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. మునిసిపల్ చైర్పర్సన్ తదితరులను బయటకు తీసుకొస్తుండగా డీఎస్పీ బాలకోటి, సీఐ సురేష్ అక్కడికి చేరుకున్నారు. ఇంతలో మళ్లీ రెండువైపులా రాళ్లవర్షం ప్రారంభమైంది. దీంతో పోలీసులు చైరపర్సన్ బృందాన్ని వాహనాల్లో అక్కడినుంచి తరలించారు. పలువురికి గాయాలు జిన్నింగ్ మిల్లు వద్ద జరిగిన రాళ్లదాడిలో మునిసిపల్ వైస్‌చైర్మన్ శంకర్‌తో పాటు కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్, చందు, తుమ్మల నర్సింహులు, నాయకులు బండల వెంకట్రాములు, కొత్త గణేష్ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. చైర్మన్, వైస్ చైర్మన్ బృందం డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని అక్కడే బైఠాయించింది. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులతో కలిసి మిల్లును పరిశీలించేందుకు తమను రానివ్వకుండా దాడులు చేసి గాయపర్చడాన్ని నిరసిస్తూ బుధవారం పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మునిసిపల్ చైర్పర్సన్ పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్ తెలిపారు. -
గోల గోల
కొత్తగూడెం/ పాల్వంచ రూరల్ : తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో పాల్వంచలో నిర్మించనున్న కేటీపీఎస్ ఏడో దశ నిర్మాణానికి పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా సాగింది. కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన వారిని అడుగడుగునా తనిఖీ చేయడంతో ప్రారంభంలోనే పోలీసులకు - ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారి వైఖరి పట్ల సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి - పోలీసులకు మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఇక సభ ప్రారంభం కాగానే స్థానిక జెడ్పీటీసీ, సర్పంచ్‌లను వేదికపైకి పిలవకపోవడంతో వారు సభా ప్రాంగణం ఎదుటే బైఠాయించారు. అయితే వేదికపై స్థలం తక్కువగా ఉండడం వల్లే పిలువలేదని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సముదాయించినా వారు శాంతించలేదు. దీంతో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొని జెడ్పీటీసీ, సొసైటీ అధ్యక్షులను వేదికపైకి పిలవాలని కలెక్టర్‌కు సూచించారు. కాగా, తమను అవమానించారంటూ అప్పటికే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం.. 6వ దశలో క్యాజువల్ లేబర్‌గా తీసుకుని ఇటీవల తొలగించడాన్ని నిరసిస్తూ గిరిజన సంఘాలు ప్లకార్డులతో నిరసన తెలిపాయి. ఇలా గందరగోళం మధ్యనే సభ కొనసాగింది. మూడేళ్లలో 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం : సీఎండీ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని, వచ్చే మూడేళ్లలో 10,793 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,365.26 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, అందులో 2,282 మెగావాట్ల థర్మల్ పవర్, 2,081 మెగావాట్ల జల విద్యుత్, ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ వస్తోందని చెప్పారు. విద్యుత్ లోటు పూడ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని సీఎం కేసీఆర్ సూచించారని, వచ్చే మూడేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. దీంతోపాటు ఛత్తీస్‌గఢ్ నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ కొరతతో ప్రస్తుతం గృహావసరాలతోపాటు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులయ్యే వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. దీంతోపాటు సీఎస్ఆర్ పాలసీ కింద రూ.21 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు జెన్కో కట్టుబడి ఉందన్నారు. విద్యుత్ కొరతను అధిగమిస్తేనే బంగారు తెలంగాణ : పొంగులేటి ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణం ఎంతో అవసరమని, వాటిని తమ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకించదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే విద్యుత్ కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణం ఎంత ముఖ్యమో, దానివల్ల నిర్వాసితులయ్యే వారికి, కాలుష్యం బారిన పడుతున్న వారికి న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని సూచించారు. భూ నిర్వాసితుల కుటుంబాలకు కేటీపీఎస్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలుష్య ప్రభావిత ప్రాంతాలలో సంస్థ ఆధ్వర్యంలో విద్య, వైద్య, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సీఎస్ఆర్ పాలసీని సక్రమంగా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కొత్త టెక్నాలజీని వినియోగించి కాలుష్యం ఎక్కువగా రాకుండా చూడాలని కోరారు. దీంతోపాటు యాష్పాండ్లు ఎక్కువగా నిర్మించి జల కాలుష్యం పెరగకుండా చూడాలన్నారు. 6 దశల ద్వారా కేవలం 1720 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారని, 7వ దశ ద్వారా 800 మెగావాట్ల ప్లాంటును నిర్మించడం అభినందనీయమన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ ఇంజనీర్లకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చే వీటీసీ విజయవాడకు వెళ్లిందని, దాన్ని కేటీపీఎస్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త ప్రాజెక్టులు రావడం వల్ల స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కేటీపీఎస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు అమాయకులను మోసం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేటీపీఎస్‌లోని 1 నుంచి మూడు యూనిట్ల కాలపరిమితి ముగిసిందని, వాటి స్థానంలో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని కోరారు. 6వ దశ నిర్మాణంలో తీసుకున్న 409 మంది క్యాజువల్ కార్మికులను పది నెలల తర్వాత తొలగించారని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేటీపీఎస్ కాలుష్యంతో కిన్నెరసాని నది కలుషితం అవుతోందన్నారు. మరిన్ని గ్రామాలను కేటీపీఎస్ దత్తత తీసుకొని అక్కడ సీఎస్ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ప్రాజెక్టులను నిర్మిస్తునప్పటికీ ఆ వర్గాల వారికి మాత్రం ఉద్యోగాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పద్ధతిని పటిష్టంగా అమలు చేసి గిరిజనులకు, దళితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కేటీపీఎస్ నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు కొందరు మృతి చెందారని, వారి కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం చేయలేదని అన్నారు. వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పర్యావరణ సమతుల్యత పాటించాలని కోరారు. కేటీపీఎస్ కాలుష్యంతో అనేక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన కేటీపీఎస్ అధికారులు.. ప్రస్తుతం లక్ష మొక్కలను మాత్రమే నాటుతామని చెప్పడం దారుణమని విమర్శించారు. సంస్థ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నారాయణ పాల్గొన్నారు. -
శాఖలపైమంత్రి సమీక్ష
కలెక్టరేట్ : ప్రభుత్వ శాఖలలో అమలవుతున్న పథకాలపై అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న సమీక్షించారు. మంగళవారం అటవీశాఖ కార్యాలయంలోని అతిథి గృహం లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, ఆత్మ, వెటర్నరీ, ఉద్యానవన, గ్రామీణ నీటి సరఫరాపై అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ముందుగారా మన్నను ఆయా శాఖల ఆధ్వర్యంలో పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు, గతేడాదిలో శాఖలవారీగా లక్ష్యం, సాధించిన ప్రగతి నివేదిక లు తనకు సమర్పించాలని సూచించారు. పెండింగ్ బడ్జెట్ పూర్తి సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాఖల మీద అవగాహన కోసం సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నార్నూర్ మం డలంలోని వెటర్నరీ భవనానికి సంబంధించి నిధులు రాలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెట ర్నరీ శాఖలో ఉద్యోగుల ఖాళీలు తదితర వివరాలు తన కు పంపించాలన్నారు. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న పౌల్ట్రీ, డెయిరీఫాంలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. వాటర్షెడ్లు జిల్లాలో ఎన్ని ఉన్నాయని అడగగా, జిల్లాలో 30 చోట్ల వాటర్షెడ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులకు శిక్షణ అందించడంలో ఆత్మ వెనుకబాటుగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మకు సంబంధించిన వివరాలు తనకు పంపాలన్నారు. హార్టికల్చర్ పంటలకు సంబంధించి మామిడి, పసుపు, మిర్చి, అరటి, కూరగాయల పంటలను పండిం చే విధానం, జిల్లాలో ఎక్కడెక్కడ పండిస్తున్నారో తెలుసుకున్నారు. 21,673 హెక్టార్లలో మామిడి, 2,600 హెక్టార్లలో పసుపు పండిస్తున్నారని ఏడీ రమణ పవర్‌పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమలులో జిల్లా వెనుకబడి ఉందన్నారు. వ్యవసాయానికి సంబంధించి ఈ ఏడాది 27 కంపెనీలకు చెందిన 20.63 లక్షల ప్యాకెట్ల విత్తనాలు మన జిల్లాకు వచ్చాయని జేడీఏ రోజ్‌లీల తెలిపారు. నష్టపరిహారం వచ్చిందా? ఇంకేంత రా వాల్సి ఉంది? అనే విషయాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. విత్తనాల ఉత్పత్తిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలిపారు. అయితే జిల్లాలో గోదాముల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జాతీయ ఆహార భద్రత పథకం, గ్రామీణ నీటి సరఫరాపై సమీక్షించారు. అంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న జననీ సురక్ష యోజన తదితర పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పేద రోగుల కు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో సౌకర్యాలు, నిధుల వినియోగంపై తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎడీఎహెచ్ రామరావు, కుమారస్వామి, నర్సింగ్‌రావు, హార్టికల్చర్ ఏడీ రమణ, ఆత్మ పీడీ మనోహర్, జేడీ ఏ రోజ్‌లీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాకు మంత్రి పదవి
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : కేసీఆర్ మంత్రి వర్గంలో జిల్లాకు చోటు దక్కింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 11 మంది ఎమ్మెల్యేలకు స్థానం దక్కగా, అందులో జిల్లా నుంచి జోగు రామన్నకు అవకాశాలు రావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు మొండిచేయి చూపించిన విషయం తెలిసిందే. దీంతో అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా నియామకం కావడంతో అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌కు ప్రాధాన్యత లభించినట్లయింది. ఆదిలాబాద్ పట్టణంతోపాటు మంచిర్యాల, నిర్మల్ పట్టణాల్లో కాలుష్యం పెరిగింది. దీని నివారణకు పర్యావరణ పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అడవుల జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో నడపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి.. కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయి వరకు అనేక రాజకీయ పదవులు అనుభవించారు. 1984 సంవత్సరంలో టీడీపీలో చేరారు. 1985 నుంచి 1986 వరకు జైనథ్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శిగా, 1987-88 వరకు మండల టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు. 1988 నుంచి 1995 వరకు దీపాయిగూడ సర్పంచ్, జైనథ్ మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 1995 నుంచి 2001 వరకు జైనథ్ మండల పరిషత్ అధ్యక్షునిగా, 2005-06, 2009-11 వరకు జైనథ్ మండల జెడ్పీటీసీగా పనిచేశారు. 2004 సంవత్సరంలో టీడీపీ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి పోటీ చేసి 2009 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011 సంవత్సరంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి నిరసనగా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2012 సంవత్సరంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ప్రసుత్తం మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపోందారు.