ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : కేసీఆర్ మంత్రి వర్గంలో జిల్లాకు చోటు దక్కింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 11 మంది ఎమ్మెల్యేలకు స్థానం దక్కగా, అందులో జిల్లా నుంచి జోగు రామన్నకు అవకాశాలు రావడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు మొండిచేయి చూపించిన విషయం తెలిసిందే. దీంతో అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా నియామకం కావడంతో అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌కు ప్రాధాన్యత లభించినట్లయింది. ఆదిలాబాద్ పట్టణంతోపాటు మంచిర్యాల, నిర్మల్ పట్టణాల్లో కాలుష్యం పెరిగింది. దీని నివారణకు పర్యావరణ పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అడవుల జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో నడపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కార్యకర్త స్థాయి నుంచి..
కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయి వరకు అనేక రాజకీయ పదవులు అనుభవించారు. 1984 సంవత్సరంలో టీడీపీలో చేరారు. 1985 నుంచి 1986 వరకు జైనథ్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శిగా, 1987-88 వరకు మండల టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు. 1988 నుంచి 1995 వరకు దీపాయిగూడ సర్పంచ్, జైనథ్ మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 1995 నుంచి 2001 వరకు జైనథ్ మండల పరిషత్ అధ్యక్షునిగా, 2005-06, 2009-11 వరకు జైనథ్ మండల జెడ్పీటీసీగా పనిచేశారు. 2004 సంవత్సరంలో టీడీపీ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి పోటీ చేసి 2009 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011 సంవత్సరంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి నిరసనగా రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2012 సంవత్సరంలో ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ప్రసుత్తం మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపోందారు.
జిల్లాకు మంత్రి పదవి
Published Tue, Jun 3 2014 1:15 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement