Jog Ramanna
-
గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం
ఆసిఫాబాద్ : గ్రామ స్వరాజ్యంతోనే దేశ స్వరాజ్యమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మన ఊరు-మన ప్రణాళికపై డివిజన్ స్థాయి శిక్షణ శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు గ్రామ పంచవర్ష ప్రణాళిక తయారీకి నిర్ణయించారని చెప్పారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధికి అవసరమైన అంశాలపై ప్రతిపాదనలు సేకరించి ప్రణాళికను ప్రభుత్వానికి పంపిస్తారని తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారితోపా టు సభ్యులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసి వాటిని బడ్జెట్లో ప్రవేశపెడతామని అన్నారు. దీని ప్రకారమే బడ్జెట్ కేటాయింపు ఉంటుందన్నారు. 17 శాఖలను గ్రామ పంచాయతీకు బదలాయించి సర్పంచులకు పూర్తి అధికారాలు కట్టబెడతామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణా లు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అటవీ అడ్డంకులు తొలగిస్తాం.. జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు తొలగిస్తామని మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లాలో 41 రోడ్లు, 11 సాగునీటి ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయని, త్వరలో వాటికి అనుమతులు మంజూరు చేయిస్తామని చెప్పారు. జిల్లాలో అటవీ సంపదను 23 శాతం నుంచి 33 శాతానికి పెంచుతామని, ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల మొక్కలు, గ్రామ పంచాయతీలో 33 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రత్యేక శిక్షకుడు విశ్రాంత డీఎల్పీవో శంకరయ్య ప్రొజెక్టర్ ద్వారా మన ఊరు-మన ప్రణాళికపై అవగాహన కల్పించారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లాలోని 866 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 13 నుంచి 18 వరకు సమావేశాలు నిర్వహించి గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక తయారు చేయాలన్నారు. గ్రామసభ నిర్వహించే స్థలం ఇతర ప్రజాప్రతినిధులతో చర్చించి సర్పంచులే నిర్ణయించాలన్నారు. తెలంగాణ గీతాన్ని ఆలపించి అమరులకు నివాళులర్పించాలని తెలిపారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్యల హేమాజి, ఎంపీపీ తారాబాయి, డీఎల్పీవో శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు. బిల్లును ఉపసంహరించుకోవాలి పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటులో ఆమోదం పొం దిన బిల్లును ఉపసంహరించుకోవాలని మంత్రి రామన్న అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వెంకయ్యనాయుడుతో ఒత్తిడి తెచ్చి బిల్లును ఆమోదింపజేశారని అన్నారు. దీనిపై తెలంగాణలోని బీజేపీ, టీడీపీ నాయకులు అధిష్టానాన్ని ప్రశ్నించాలని అన్నారు. -
అటవీ సిబ్బందికి ఆయుధాలిస్తాం!
33 శాతానికి అడవులు పెంచుతాం పర్యావరణ అసమతుల్యతే సర్వ అనర్థాలకు హేతువు ‘సాక్షి’తో అటవీ, పర్యావరణ మంత్రి జోగు రామన్న హైదరాబాద్: అడవుల సంరక్షణకుగాను అటవీ సిబ్బందికి ఆయుధాలను సమకూర్చాలని యోచిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. వర్షాభావం, ఆయుర్దాయ ప్రమాణాలు, మానవ జీవచక్రంలో క్రమగతులు తప్పడం వంటి సర్వ అనర్థాలకు మూలహేతువు పర్యావరణ అసమతుల్యతే అని అన్నారు. అటవీశాఖ విస్తీర్ణం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించనున్న విధానం వంటివాటిపై ‘సాక్షి’తో జోగు రామన్న ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం తీసుకోబోయే చర్యల గురించి ఆయన మాటల్లోనే... అడవులకు హద్దులు లేవు: రిజర్వు అడవులకు ఇప్పటివరకు హద్దులు లేవు. నిజాం హయాంలో జరిగిన సర్వే ప్రకారంగానే హద్దులున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, సమస్యలపై అధికారుల నుంచి సమగ్ర నివేదికలు కోరినం. త్వరలోనే సమగ్ర సర్వే నిర్వహించి, హద్దులు పాతుతం. జీహెచ్ఎంసీ పరిధిలోనే 5 కోట్ల మొక్కలు: జిల్లాకు 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించినం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 కోట్ల మొక్కలు పెడతం. సంరక్షణ చర్యలు తీసుకుంటం. అడవులను 23 నుంచి 33 శాతానికి ఐదేళ్లలో పెంచుతం. స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం: అడవుల నరికివేత, వృక్ష సంపద అపహరణ, స్మగ్లింగ్‌లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. గతంలో అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలుండేవి. నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో ఆయుధాలు అపహరణకు గురవుతున్నాయని వాటిని ఉపసంహరించిన్రు. మళ్లీ ఆయుధాలను ఇవ్వాలనుకుంటున్నం. పరిశ్రమలకు అడవులను బలిపెట్టం: పరిశ్రమలు రావాల్సిందే.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, రాష్ట్ర స్థూలాదాయం పెరగాల్సిందే. పారిశ్రామిక అభివృద్ధికి అడవులను, పర్యావరణాన్ని బలిపెట్టం. అడవి చల్లగా ఉంటే సమస్యలన్నీ పోతయి. సకాలంలో వానలు పడతయి. స్వచ్ఛమైన గాలి, నీరు సమృద్ధిగా ఉంటయి. పరిశ్రమల కోసం ప్రత్యేక జోన్‌ను కేటాయిస్తాం. యూనిట్లవారీగా సమతుల్యతను లెక్కగడతాం. కాలుష్య ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. కాలుష్య నియంత్రణ బోర్డుకు ప్రత్యేక అధికారాలు ఇస్తాం. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. -
అభివృద్ధి పనులకు వెంటనే క్లియరెన్స్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడం తన బాధ్యత అని పేర్కొన్నారు. మంత్రిగా నియామకమైన తర్వాత ఆయన శనివారం తొలిసారిగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్‌బాబు జిల్లాలో నెలకొన్న సమస్యలు, పలు ప్రధాన శాఖల వారీగా పనితీరును మంత్రికి వివరించారు. సుమారు గంటన్నరపాటుగా శాఖలవారీగా అంశాలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతకుముందు డీపీఆర్వో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర స్థాయిలో చర్చిస్తానన్నారు. వ్యవసాయం, వైద్య, విద్య, వనరులపై దృష్టి సారిస్తానని, జిల్లా నుంచి మంత్రి లేకపోవడంతో ఇన్నాళ్లు అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్‌లు అవసరమైతే వెంటనే ఇవ్వడం జరుగుతుందని, దీనిపై ప్రిన్సిపల్ సెక్రెటరీలతో చర్చిస్తామని చెప్పారు. అంతకుముందు కలెక్టర్ అహ్మద్‌బాబు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శాఖల్లో ఖాళీలు, ల్యాండ్ అక్విషన్, వైద్యం, విద్య, నీటి పారుదల, జిల్లా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ తదితర వాటిపై చర్చించారు. 34 మంది జిల్లా స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, డీడీటీడబ్ల్యూ, డీటీవో, అదనపు డీఎంహెచ్‌వో లాంటి పోస్టులు ఖాళీగా ఉండడంతో ఒక్కొక్కరు మూడు చోట్ల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈసారి ఏడాది పొడవున విద్యపై దృష్టి పెట్టేలా ప్రణాళిక తయారు చేశామన్నారు. ముఖ్యంగా 7, 8, 9, 10 తరగతి విద్యార్థుల కోసం ప్రతి మండలానికి పర్యవేక్షణ కోసం ఇతర శాఖ అధికారిని నియమించినట్లు వివరించారు. భూములు లేక వివిధ ప్రాజెక్టు పనులు సైతం నిలిచిపోయాయన్నారు. ఆర్వోఎఫ్ఆర్ కింద 430 పట్టాలు పంపిణీ చేయడానికి అనుమతులు రావాల్సి ఉందన్నారు. మంచిర్యాలలో వ్యవసాయానికి సంబంధించి ఫర్టిలైజర్ రేక్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ నీటిసరఫరాలో పనిచేస్తున్న టెక్నికల్ కన్సల్టెన్సీలకు ఎనిమిది నెలల నుంచి వేతనాలు రావడం లేదని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో వాటర్, విద్యుత్ సమస్యలు ఉన్నాయన్నారు. పర్యాటకానికి వచ్చేవారికి నిర్మల్, ఇచ్చోడ మధ్యలో హరిత హోటల్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. గాంధీపార్కులో శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు రూ. 2.05 కోట్లు పడుతుందన్నారు. 47 వేల రేషన్‌కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. అనంతరం పీహెచ్సీలో ఎక్కువ కాన్పులు చేయించిన సిబ్బందికి మంత్రి జోగు రామన్న రూ.5 వేల చెక్కులను అందజేశారు. కళ్యాణి (ఇచ్చోడ), కోవ లక్ష్మి (జైనూర్), అనితా (ఇంద్రవెల్లి), ప్రణీత (నార్నూర్), సింధు (కెరమెరి), దీప (వాంకిడి)కు చెక్కులిచ్చారు. సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే సోయం బాపురావు, జేసీ లక్ష్మీకాంతం, ఐటీడీఏ పీవో జనార ్దన్ నివాస్, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఓఎస్డీ పనాసరెడ్డి, ఆర్డీవో సుధాకర్‌డ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాకు మరో పదవి
ఆదిలాబాద్ : కేసీఆర్ సర్కారులో జిల్లాను మరో పదవి వరించింది. ఆదిలాబాద్ ఎ మ్మెల్యే జోగు రామన్నకు ఇప్పటికే మంత్రి పదవి దక్కగా, ఇప్పుడు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాలాచారికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి పదవి లభించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవికి కేబినేట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చారి టీఆర్ఎస్ అభ్యర్థిగా ముథోల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం విదితమే. గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలతో చారికి ఈ పదవి దక్కింది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. హామీల కమిటీ చైర్మన్‌గా వేణుగోపాలాచారి బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ల వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ, ఇతర అనుమతులు తీసుకురావడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడం వంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అధినేత కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని వేణుగోపాలాచారి ‘సాక్షి ప్రతినిధి’తో పేర్కొన్నారు. -
జిల్లాకు మంత్రి పదవి
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : కేసీఆర్ మంత్రి వర్గంలో జిల్లాకు చోటు దక్కింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 11 మంది ఎమ్మెల్యేలకు స్థానం దక్కగా, అందులో జిల్లా నుంచి జోగు రామన్నకు అవకాశాలు రావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు మొండిచేయి చూపించిన విషయం తెలిసిందే. దీంతో అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా నియామకం కావడంతో అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌కు ప్రాధాన్యత లభించినట్లయింది. ఆదిలాబాద్ పట్టణంతోపాటు మంచిర్యాల, నిర్మల్ పట్టణాల్లో కాలుష్యం పెరిగింది. దీని నివారణకు పర్యావరణ పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అడవుల జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో నడపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి.. కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయి వరకు అనేక రాజకీయ పదవులు అనుభవించారు. 1984 సంవత్సరంలో టీడీపీలో చేరారు. 1985 నుంచి 1986 వరకు జైనథ్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శిగా, 1987-88 వరకు మండల టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు. 1988 నుంచి 1995 వరకు దీపాయిగూడ సర్పంచ్, జైనథ్ మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 1995 నుంచి 2001 వరకు జైనథ్ మండల పరిషత్ అధ్యక్షునిగా, 2005-06, 2009-11 వరకు జైనథ్ మండల జెడ్పీటీసీగా పనిచేశారు. 2004 సంవత్సరంలో టీడీపీ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి పోటీ చేసి 2009 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011 సంవత్సరంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి నిరసనగా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2012 సంవత్సరంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ప్రసుత్తం మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపోందారు.