అభివృద్ధి పనులకు వెంటనే క్లియరెన్స్ | Development work, as soon as the clearance | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు వెంటనే క్లియరెన్స్

Published Sun, Jun 8 2014 2:01 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM

అభివృద్ధి పనులకు వెంటనే క్లియరెన్స్ - Sakshi

అభివృద్ధి పనులకు వెంటనే క్లియరెన్స్

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడం తన బాధ్యత అని పేర్కొన్నారు. మంత్రిగా నియామకమైన తర్వాత ఆయన శనివారం తొలిసారిగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్‌బాబు జిల్లాలో నెలకొన్న సమస్యలు, పలు ప్రధాన శాఖల వారీగా పనితీరును మంత్రికి వివరించారు. సుమారు గంటన్నరపాటుగా శాఖలవారీగా అంశాలను కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

అంతకుముందు డీపీఆర్వో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర స్థాయిలో చర్చిస్తానన్నారు. వ్యవసాయం, వైద్య, విద్య, వనరులపై దృష్టి సారిస్తానని, జిల్లా నుంచి మంత్రి లేకపోవడంతో ఇన్నాళ్లు అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్‌లు అవసరమైతే వెంటనే ఇవ్వడం జరుగుతుందని, దీనిపై ప్రిన్సిపల్ సెక్రెటరీలతో చర్చిస్తామని చెప్పారు. అంతకుముందు కలెక్టర్ అహ్మద్‌బాబు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా శాఖల్లో ఖాళీలు, ల్యాండ్ అక్విషన్, వైద్యం, విద్య, నీటి పారుదల, జిల్లా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ తదితర వాటిపై చర్చించారు. 34 మంది జిల్లా స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, డీడీటీడబ్ల్యూ, డీటీవో, అదనపు డీఎంహెచ్‌వో లాంటి పోస్టులు ఖాళీగా ఉండడంతో ఒక్కొక్కరు మూడు చోట్ల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈసారి ఏడాది పొడవున విద్యపై దృష్టి పెట్టేలా ప్రణాళిక తయారు చేశామన్నారు. ముఖ్యంగా 7, 8, 9, 10 తరగతి విద్యార్థుల కోసం ప్రతి మండలానికి పర్యవేక్షణ కోసం ఇతర శాఖ అధికారిని నియమించినట్లు వివరించారు.

భూములు లేక వివిధ ప్రాజెక్టు పనులు సైతం నిలిచిపోయాయన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్ కింద 430 పట్టాలు పంపిణీ చేయడానికి అనుమతులు రావాల్సి ఉందన్నారు. మంచిర్యాలలో వ్యవసాయానికి సంబంధించి ఫర్టిలైజర్ రేక్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ నీటిసరఫరాలో పనిచేస్తున్న టెక్నికల్ కన్సల్టెన్సీలకు ఎనిమిది నెలల నుంచి వేతనాలు రావడం లేదని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో వాటర్, విద్యుత్ సమస్యలు ఉన్నాయన్నారు. పర్యాటకానికి వచ్చేవారికి నిర్మల్, ఇచ్చోడ మధ్యలో హరిత హోటల్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. గాంధీపార్కులో శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు రూ. 2.05 కోట్లు పడుతుందన్నారు. 47 వేల రేషన్‌కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

అనంతరం పీహెచ్‌సీలో ఎక్కువ కాన్పులు చేయించిన సిబ్బందికి మంత్రి జోగు రామన్న రూ.5 వేల చెక్కులను అందజేశారు. కళ్యాణి (ఇచ్చోడ), కోవ లక్ష్మి (జైనూర్), అనితా (ఇంద్రవెల్లి), ప్రణీత (నార్నూర్), సింధు (కెరమెరి), దీప (వాంకిడి)కు చెక్కులిచ్చారు. సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే సోయం బాపురావు, జేసీ లక్ష్మీకాంతం, ఐటీడీఏ పీవో జనార ్దన్ నివాస్, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఓఎస్డీ పనాసరెడ్డి, ఆర్డీవో సుధాకర్‌డ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement