గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం
ఆసిఫాబాద్ : గ్రామ స్వరాజ్యంతోనే దేశ స్వరాజ్యమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మన ఊరు-మన ప్రణాళికపై డివిజన్ స్థాయి శిక్షణ శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు గ్రామ పంచవర్ష ప్రణాళిక తయారీకి నిర్ణయించారని చెప్పారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధికి అవసరమైన అంశాలపై ప్రతిపాదనలు సేకరించి ప్రణాళికను ప్రభుత్వానికి పంపిస్తారని తెలిపారు.
ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారితోపా టు సభ్యులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసి వాటిని బడ్జెట్‌లో ప్రవేశపెడతామని అన్నారు. దీని ప్రకారమే బడ్జెట్ కేటాయింపు ఉంటుందన్నారు. 17 శాఖలను గ్రామ పంచాయతీకు బదలాయించి సర్పంచులకు పూర్తి అధికారాలు కట్టబెడతామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణా లు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
అటవీ అడ్డంకులు తొలగిస్తాం..
జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు తొలగిస్తామని మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లాలో 41 రోడ్లు, 11 సాగునీటి ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయని, త్వరలో వాటికి అనుమతులు మంజూరు చేయిస్తామని చెప్పారు. జిల్లాలో అటవీ సంపదను 23 శాతం నుంచి 33 శాతానికి పెంచుతామని, ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల మొక్కలు, గ్రామ పంచాయతీలో 33 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రత్యేక శిక్షకుడు విశ్రాంత డీఎల్‌పీవో శంకరయ్య ప్రొజెక్టర్ ద్వారా మన ఊరు-మన ప్రణాళికపై అవగాహన కల్పించారు. కలెక్టర్ జగన్‌మోహన్ మాట్లాడుతూ జిల్లాలోని 866 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 13 నుంచి 18 వరకు సమావేశాలు నిర్వహించి గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక తయారు చేయాలన్నారు. గ్రామసభ నిర్వహించే స్థలం ఇతర ప్రజాప్రతినిధులతో చర్చించి సర్పంచులే నిర్ణయించాలన్నారు. తెలంగాణ గీతాన్ని ఆలపించి అమరులకు నివాళులర్పించాలని తెలిపారు.
సబ్ కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్యల హేమాజి, ఎంపీపీ తారాబాయి, డీఎల్‌పీవో శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు.
బిల్లును ఉపసంహరించుకోవాలి
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటులో ఆమోదం పొం దిన బిల్లును ఉపసంహరించుకోవాలని మంత్రి రామన్న అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వెంకయ్యనాయుడుతో ఒత్తిడి తెచ్చి బిల్లును ఆమోదింపజేశారని అన్నారు. దీనిపై తెలంగాణలోని బీజేపీ, టీడీపీ నాయకులు అధిష్టానాన్ని ప్రశ్నించాలని అన్నారు.