- 49 అంశాలకు ప్రాధాన్యం
- మరిన్ని అంశాలను చేర్చాలని సూచించిన ప్రజాప్రతినిధులు
- ప్రభుత్వానికి నివేదిస్తాం: జెడ్పీచైర్మన్ భాస్కర్
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’కు జిల్లా ప్రణాళిక ఆమోదం తెలిపింది. ఆదివారం జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశం 49 అంశాలకు సంబంధించిన పనులను పొందుపరిచి ఆమోదించింది. వీటిలో తాగునీటికి రూ.1310 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.850కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా తాగునీరు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సుదీర్ఘంగా సాగింది.
ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు గ్రామస్థాయిలో, 18 నుంచి 23 తేదీ వరకు మండలస్థాయిలో, 23 నుంచి 28వ తేదీ వరకు జిల్లా స్థాయిలో జరిగిన ప్రణాళికలను సర్వసభ్య సమావేశంలో ఆమోదిస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ స్పష్టంచేశారు. తాజాగా ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ప్రస్తావించిన అంశాలను కూడా చేర్చి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. సమావేశంలో ముందుగా కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత తెలంగాణ అమరవీరుల ఆత్మశాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
సభ దృష్టికి సమస్యలు..
సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయా నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను కూడా ప్రణాళికలో చేర్చి పనులు మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో మొదటగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ... ప్రణాళికలో కాంగ్రెస్‌కు చెందిన ఐదు నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారన్నారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ వెంటనే అదుపులోకి వచ్చింది. ఆ
తర్వాత మిగతా ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు సాయంత్రం వరకు వారి ప్రాంతాల్లో ఉన్న ప్రధానంగా నెలకొన్న తాగునీరు, మరుగుదొడ్లు, రోడ్లనిర్మాణం, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ సమస్యల చిట్టాను వినిపించారు. మండలాల్లో జెడ్పీటీసీలకు ప్రత్యేకంగా చాంబర్, టోల్‌గేట్ వద్ద ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. స్పందించిన ఆయన సభ్యుల హామిని కచ్చితంగా అమలుచేస్తామన్నారు. బంగారు తెలంగాణను నిర్మించుకునేందుకు పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు.
సమగ్ర సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలి: కలెక్టర్
రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని కోరారు. ఆ ఒక్కరోజు ఎటువంటి పనులు ఉండకుండా అధికారులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ నెల 19న ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించినట్లు చెప్పారు. సర్వే ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం గ్రామాలు, మండలాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, అందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేల గైర్హాజర్
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ ఆమోదం పొందే కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్యతో పాటు టీడీపీ చెందిన నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కొండగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, గువ్వల బాల్‌రాజ్, మర్రి జనార్దన్‌రెడ్డి, డీకే అరుణ, జి.చిన్నారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, వైస్ జెడ్పీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీసభ్యులు, ఎంపీపీలు, జెడ్పీ సీఈవో రవిందర్ ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలివే..
- పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టాలి.
- గట్టు మండలంలో వెయ్యి మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
- హైదరాబాద్ నుంచి అలంపూర్ దాకా పరిశ్రమల కారిడార్.
- హైదరాబాద్ నుంచి జడ్చర్ల వరకు డబుల్ రైల్వేలైన్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో వైద్యకళాశాలల ఏర్పాటు.
- ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీరు ప్రాజెక్టులను పూర్తిచేయాలి.
- కొత్తూరులో డ్రైపోర్ట్. గద్వాల, నారాయణపేటల యందు టెక్స్‌టైల్ పార్క్‌ల ఏర్పాటు
- మహబూబ్‌నగర్ లో ఔటర్‌రింగ్ రోడ్డు ఏర్పాటు.
- పాలమూరు యూనివర్సిటీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్థాయి పెంపు.
- జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 17 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు.
- జిల్లా ఆస్పత్రిని 600 పడకల ఆస్పత్రిగా మార్పు, గద్వాలలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చడం
- ఆర్డీఎస్ పనులను త్వరతగతిన పూర్తిచేడం తదితర 20 అంశాలకు ప్రణాళికలో చోటుదక్కింది.