నాలుగు సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి సర్వే షురూ
ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు.. కొత్త రేషన్‌కార్డుల జారీ
లబ్ధిదారుల ఎంపికలో అధికారులు, సిబ్బంది బిజీ బిజీ
తుది జాబితాల రూపకల్పనలో మంత్రులు, ఎమ్మెల్యేలదే కీలకపాత్ర!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులే కీలక పాత్ర పోషించనున్నారు. లబ్ధిదారులను అధికారులు ప్రాథమికంగా ఎంపిక చేసిన తర్వాత జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో తుది జాబితా సిద్ధం కానుంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు, కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ షురూ కానుంది. దీంతో గురువారం నుంచి దాదాపుగా అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖలు రంగంలోకి దిగాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన సూచనలతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయికి తరలివెళ్లింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, ఎంఏయూడీ, హౌసింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది అర్హులను గుర్తించడంలో బిజీగా ఉన్నారు. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. 21, 22 తేదీల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించనున్నారు. అర్హులు, అనర్హుల జాబితాను ఈ సభల్లో ప్రకటించే అవకాశం ఉంది.
23, 24 తేదీల్లో జిల్లా స్థాయిల్లో తుది జాబితా సిద్ధం కానుంది. తుది జాబితాను రూపొందించే క్రమంలో ప్రజా ప్రతినిధుల నిర్ణయం కీలకం కానుంది. స్థానికంగా ఉన్న రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అర్హుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నారు.
ఎమ్మెల్యేల సిఫారసులతో తుదిరూపు దిద్దుకున్న జాబితా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఆ జాబితా ప్రకారమే 26వ తేదీన లబ్ధిదారుల ప్రకటన ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెపుతున్నాయి.
భూభారతిలోకి సాగు యోగ్యం కాని భూములు
రైతుభరోసా పథకం కింద సీజన్‌కు రూ. 6,000 చొప్పున వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ప్రస్తుతం ఫీల్డ్ సర్వే జరుగుతోంది.
సాగు యోగ్యం కాని భూములను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మండల వ్యవసాయ విస్తరణాధికారులు పరిశీలించి, భూ భారతి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి గ్రామసభల్లో నివేదిస్తారు. గ్రామసభల్లో వచ్చే విజ్ఞాపనల ఆధారంగా స్థానిక ఎమ్మెల్యే ఆమోదంతోనే అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా నమోదై ఉండి సంవత్సరంలో కనీసం 20 రోజుల పాటు వ్యవసాయ కూలీగా పనిచేసిన వారి కుటుంబాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఒక కుటుంబంలో ఎంత మంది కూలీలు ఉన్నా, ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఒక్కో సీజన్‌కు రూ.6 వేల చొప్పున రెండు సీజన్లకు ఏటా రూ.12 వేలు ఈ పథకం కింద చెల్లించనున్నారు.
ఈ మేరకు అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించే పనిలో అధికారులున్నారు. అయితే కుటుంబాన్ని నిర్ధారించేందుకు రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే రేషన్‌కార్డులు గత కొన్నేళ్లుగా అప్‌డేట్ కాకపోవడంతో కుటుంబంలోని వారికి పెళ్లిళ్లై, వేర్వేరు కుటుంబాల్లో నివసించే పక్షంలో వారిని గుర్తించడంలో గ్రామసభలు కీలకం కానున్నాయి. ఇక్కడ వచ్చిన ఫిర్యాదులు, సూచనలను కూడా స్థానిక ఎమ్మెల్యేల దృష్టికే తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అర్హులందరికీ రేషన్‌కార్డులు!
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేలో ఏ కుటుంబానికి రేషన్‌కార్డు లేదనేది సిబ్బంది నమోదు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 20 లక్షల కుటుంబాలు కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తుండగా, కార్డుల్లో పేర్ల చేర్పుల కోసం లక్షలాది మంది వెయిటింగ్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలకు రేషన్‌కార్డుల అంశం కీలకం కాబట్టి అర్హులైన వారందరికీ ఇప్పించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఓ ప్రజా ప్రతినిధి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లతోనే తిప్పలు
నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి నియోజకవర్గంలో కొత్తగా ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇప్పటికే ఫీల్డ్ సర్వే కూడా పూర్తయింది. లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది.
కాగా ఒక్కో గ్రామం నుంచి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారనేదే ప్రధాన సమస్యగా మారనుంది. ఇప్పటికే సొంత స్థలం ఉన్న వారికి తొలి ప్రాధాన్యత అని ప్రభుత్వం చెప్పడంతో ఎమ్మెల్యే విచక్షణ మేరకు ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment