అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం
అన్ని వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో సీఎం రేవంత్ వీడియో సందేశం
సాక్షి, హైదరాబాద్: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రేవంత్ అన్నగా ప్రజలు ఆశీర్వదించడంతో ఏర్పడ్డ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఆయా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయడంతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెక్కులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభల్లో తొలుత సీఎం వీడియో సందేశం ప్రదర్శించారు.
మీ ఆశీర్వాదంతోనే సీఎంగా 13 నెలలు పూర్తిచేశా..
‘మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13 నెలలు పూర్తి చేశా. రాష్ట్ర ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారం, వరికి బోనస్ లాంటి వాటితో పాటు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలెండర్ అందిస్తూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం.
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. దళిత, గిరిజన ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, నిరుపేదలు.. ఇలా అన్ని వర్గాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది..’ అని సీఎం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment