ప్రభుత్వ పథకాలన్నిటికీ ఇకపై ఒకే కార్డు
ప్రతి కుటుంబానికి ఓ డిజిటల్ కార్డు ఇచ్చే సన్నాహాల్లో సర్కారు
సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో చర్చ
ఆరోగ్య, సంక్షేమ పథకాలతోపాటు రేషన్‌కు సైతం ఈ కార్డే ఆధారం
ఆధార్/సెల్ నంబర్‌తో అనుసంధానంకుటుంబసభ్యుల వివరాలన్నీ నమోదు
పొందుతున్న పథకాలు, ఆరోగ్య సమాచారం నిక్షిప్తం
ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు
ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి త్వరగా నివేదిక ఇవ్వాలన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పథకానికి ఇకపై ఒకే కార్డు ఆధారం కానుంది. అదే డిజిటల్ కార్డు. ప్రతి కుటుంబానికీ ఇచ్చే ఈ డిజిటల్ కార్డులో కుటుంబసభ్యుల వివరాలన్నీ నమోదై ఉంటాయి. ఆరోగ్య, సంక్షేమ పథకాలతో పాటు రేషన్ సరుకులకు సైతం ఉపయోగపడేలా ఈ కార్డును రూపొందించనున్నారు. కుటుంబానికి చెందిన ఆధార్ కార్డు లేదా సెల్ నంబర్‌ను ఈ డిజిటల్ కార్డుతో అనుసంధానిస్తారు. ప్రస్తుతం కర్ణాటక, రాజస్తాన్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో కుటుంబ ఆర్యోగానికి సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ కార్డులో పొందుపరిచి ఉపయోగిస్తున్నారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అన్ని ప్రభుత్వ పథకాలకు చిప్ అమర్చిన ఒకే డిజిటల్ కార్డు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో ఒక్కో పథకానికి ఒక్కో నంబర్‌ను కేటాయిస్తారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఈ విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది.
అయితే ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురావడానికి ముందే ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాన్ని అధ్యయనం చేయాలని, అక్కడ ఎదురవుతున్న సమస్యలు ఇక్కడ తలెత్తకుండా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారుల బృందాన్ని అక్కడకు పంపించాలని నిర్ణయించారు.
అన్ని రికార్డులు ఒకే దగ్గర..: కేవలం ఆరోగ్యానికి సంబంధించిన అంశాలే కాకుండా.. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, ఆ కుటుంబ సభ్యులకు అందుతున్న పథకాల వివరాలను కూడా ఈ డిజిటల్ కార్డులో పొందుపర్చనున్నారు. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే..ఆ కుటుంబానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్)ను కేటాయించి, కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా ఆ యూఐఎన్‌కు బై నంబర్ కేటాయిస్తారు.
ఆ బై నంబర్ ఎదురుగా ఆ కుటుంబ సభ్యుని పేరు, ఆ సభ్యుడి సమస్త సమాచారం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ డిజిటల్ కార్డు పూర్తిగా సురక్షితమైనదని, అన్నిరకాల రికార్డులు ఒకే దగ్గర అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.
కాగా కుటుంబంలోని ప్రతి ఇంటి సభ్యుని హెల్త్ ప్రొఫైల్ అందులో ఉండాలని, తద్వారా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఇది ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమాచారంతో పాటు, సంక్షేమ పథకాలు కూడా ఒకేచోట ఒకే క్లిక్‌తో లభ్యమవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎక్కడైనా సేవలు, రేషన్ పొందేలా..
రాజస్థాన్, హరియాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కార్డులపై అధ్యయనం చేయాలని, వాటితో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి త్వరగా ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని సూచించారు. లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఈ కార్డులు ఉండాలని అన్నారు.
కుటుంబసభ్యులను జత చేయడం, తొలగింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకునేలా ఉండాలని కూడా సీఎం సూచించారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పర్యవేక్షణకు జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, సంగీత సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
ఆలస్యం లేకుండా వైద్యం
డిజిటల్ కార్డులపై సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, సీఎస్ శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ డిజిటల్ కార్డులో ఆ కుటుంబంలోని సభ్యుల పూర్తి ఆరోగ్య సమాచారం, వారు అంతకుముందు చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలు ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వంలో ఎంప్యానల్ అయిన అసుపత్రులన్నింటిలోనూ ఈ కార్డులను ఉపయోగించి ఎలాంటి ఆలస్యం లేకుండా వైద్యం చేయించుకోవడానికి వీలవుతుందని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment