సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘మన గ్రామం-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రణాళికల తయారు, పర్యవేక్షణ, ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులను పరుగులు పెట్టిస్తోంది. గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంపై ఇది వరకే జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాజాగా ఈనెల 13 నుంచి 28వ తేదీ వరకు అధికారులు గ్రామాలలో పర్యటించాలని ప్రభుత్వం శని వారం జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.
పర్యటన సందర్భంగా ప్రాధాన్యం కలిగిన అన్ని సమావేశాలలో అధికారులు పాల్గొనాలని సూచించింది. పర్యటన నివేదికలను అధికారులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అందజేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో ఆదేశించింది. ఈ కార్యక్రమం అమలు కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి బి.జనార్దన్‌రెడ్డిని జిల్లాకు ప్రత్యేకాధికారిగా నియమించారు. మరోవైపు తాజా ఉత్తర్వులతో అధికారులు పల్లెలకు పరుగులు పెట్టనున్నారు. ముందస్తుగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యం లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో అధికారులకు పల్లెబాట తప్పనిసరిగా మారింది.
ఊరులో సందడి
అధికారుల పర్యటనలతో గ్రామాలలో సందడి నెలకొననుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పల్లెల్లో పర్యటించే అధికారులు ప్రాధాన్యత గల ప్రతి సమావేశంలో పాల్గొనాలి. ప్రాధాన్యాంశాలను నివేదికగా రూపొందించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధిశాఖల ద్వారా ప్రభుత్వానికి సమర్పించాలి. అంతేగాకుండా జిల్లాలోని గ్రామాల అధికారులు, సిబ్బంది గ్రామం యూనిట్‌గా ‘మన గ్రామం మన ప్రణాళిక’ కోసం నివేదికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు.
జిల్లాలోని 718 గ్రా మ పంచాయతీల పరిధిలో కార్యక్రమం ప్రారంభం కానుంది. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం తదితర రంగాల్లో గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో వివరాలు సేకరించాల్సిన ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 28 తర్వాత ఆ నివేదికలను ప్రభుత్వానికి పంపే విధంగా సిద్ధం కావాలని కలెక్టర్ వెంకటేశ్వర్‌రావు అధికారులకు సూచించారు.
విద్య, వ్యవసాయానికి పెద్దపీట
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో మొదటగా విద్య, వైద్య, సంక్షేమ, వ్యవసాయరంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కార్యాచరణను రూపొం దించిన అధికారులు గ్రామస్థాయి ప్రణాళికలు ఈనెల 13 నుంచి 18 వరకు, ఈనెల 19 నుంచి 23 వరకు మండల ప్రణాళికలు, ఈ నెల 24 నుంచి 28 వరకు జిల్లా ప్రణా ళికలను సిద్ధం చేస్తారు. ఇది వరకే అన్నిస్థాయిల్లో రిసోర్సు పర్సన్‌లను నియమించారు.
గ్రామస్థాయిలో వివరాలు సేకరించి మండలానికి, మండలంలో పంచాయతీల వారీగా క్రోడీకరించి జిల్లా కేంద్రానికి నివేదికల రూపేణా పంపుతారు. ఆ తర్వాత జిల్లా యూనిట్‌గా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. గ్రామ పంచాయతీ పేరు, కుటుంబాల సంఖ్య, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్యాలయ వివరాలు, ఇతర సంస్థలు, గ్రామ స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ ఆస్తులు, ఖర్చు, సంక్షేమం, అభివృద్ధి, విద్య, అవాస ప్రాధాన్యతలు.. ఇలా ముందుగా రూపొందించిన 14 కేటగిరిలపై వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నం కానున్నారు.
నేటి నుంచి ఊరూరికి
Published Sun, Jul 13 2014 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement