Monitoring
-
ఏఐ చిప్‌లపై అమెరికా ఆంక్షల ప్రభావం
అమెరికా ఇటీవల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. భారత్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఎగుమతికి సంబంధించి అమెరికా ఆంక్షలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల ప్రారంభంలో దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు చైనా, రష్యా వంటి దేశాల్లో సాంకేతిక పురోగతిని నిరోధించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇతర దేశాలపైనా వీటి ప్రభావంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏఐ చిప్ ఎగుమతుల పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.అమెరికా ఆంక్షల పరిధిఅమెరికా ఎగుమతులపై విధించిన ఆంక్షలకు సంబంధించి వివిధ దేశాలను భద్రత, మానవ హక్కుల ప్రమాణాల ఆధారంగా మూడు అంచెలుగా వర్గీకరించింది. టైర్ 1లో యూకే, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలు ఉన్నాయి. ఇవి ఎటువంటి ఆంక్షలను ఎదుర్కోవు. భారతదేశం, సింగపూర్, ఇజ్రాయెల్ టైర్ 2 దిగుమతులపై కొన్ని పరిమితులను ఎదుర్కొంటాయి. ఇందులో భాగంగా అధునాతన ఏఐ చిప్‌లకు లైసెన్సింగ్ అవసరం. టైర్ 3లో చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు తయారు చేసిన చిప్‌లను కొనుగోలు చేయకుండా పూర్తిగా నిషేధించాయి.ఇదీ చదవండి: మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరంభారత్ ఏఐ మౌలిక సదుపాయాలపై ప్రభావంసమీప భవిష్యత్తులో 10,000 జీపీయూ(Graphics Processing Unit)లతో ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిష్టాత్మక జాతీయ ఏఐ మిషన్ ఈ ఆంక్షల కారణంగా అడ్డంకులను ఎదుర్కొనుంది. 2027 వరకు 50,000 జీపీయూలను సిద్ధం చేయాలనే భారత ప్రణాళికలు ఈ ఆంక్షల వల్ల ప్రభావితం చెందే అవకాశం ఉంది. అయితే భారత్ యూఎస్ ఆంక్షల పరంగా టైర్2 విభాగంలో ఉండడంతో ఏఐ చిప్‌ల లైసెన్సింగ్ సదుపాయాలు మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆంక్షల వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లకు కీలకమైన జీపీయూలకు మార్కెట్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన మార్గాలను అన్వేషించాలని కోరింది. -
తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై టీటీడీ నిఘా
-
కన్నవారి ఆరోగ్యంపై బెంగ.. ఎన్ఆర్ఐల కోసం ఏఐ పరిష్కారం
ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా చాలా మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. అయితే వారి బెంగ అంతా భారత్‌లో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఆరోగ్యంపైనే ఉంటుంది. ఇలాంటి ఎన్ఆర్ఐల కోసమే డోజీ అనే కంపెనీ డోజీ శ్రవణ్ పేరుతో క్లినికల్-గ్రేడ్ ఏఐ ఆధారిత రిమోట్ పేరెంట్ మానిటరింగ్ సర్వీస్‌ను ఆవిష్కరించింది.డోజీ శ్రవణ్‌తో విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు భారత్‌లోని తమ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా ట్రాక్ చేయొచ్చు. డోజీ ఏఐ ఆధారిత, కాంటాక్ట్‌లెస్ రిమోట్ హెల్త్ మానిటరింగ్ టెక్నాలజీ వృద్ధులకు ఎటాంటి ఇబ్బంది లేకుండా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి కుటుంబ సభ్యులకు, వైద్యులకు చేరవేస్తుంది.ఏఐ ఆధారిత బలిస్టోకార్డియోగ్రఫీతో రూపొందించిన ఈ సిస్టమ్ బయోమార్కర్లను విశ్లేషించడానికి, ఏవైనా వ్యత్యాసాలుంటే సకాలంలో హెచ్చరికలను అందించడానికి అధునాతన ఏఐ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించి సకాలంలో వైద్య సేవలు పొందేలా చేస్తుంది. ఈ సాంకేతికత యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం పొందింది. డేటా గోప్యత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉంది. -
Lok Sabha Elections 2024: ఈసీ ‘మెనూ కార్డు’
చాయ్‌కి పంజాబ్‌లోని జలంధర్‌లో రూ.15. అదే మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో అయితే రూ.7. సమోసా కూడా పంజాబ్‌లో రూ.15 అయితే మధ్యప్రదేశ్‌లో రూ.7.5. ఏమిటీ ధరలంటారా? లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలివి. వీటిని జిల్లా ఎన్నికల విభాగాలు స్థానికంగా నిర్ధారిస్తుంటాయి. దాంతో అవి ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై గరిష్ట పరిమితి ఉందన్నది తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి ఈసీ నిర్ధారించిన పరిమితి రూ.95 లక్షలు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం రూ.75 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.75–95 లక్షల మధ్య ఉంది. నామినేషనల్ దాఖలు చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించే తేదీ దాకా అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయం ఈ పరిమితిని దాటకుండా ఈసీ డేగ కళ్లతో గమనిస్తూ ఉంటుంది. ఇందుకోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభా వేదికలు మొదలుకుని కార్యకర్తలు, అభిమానులకు ఆహారం దాకా ప్రతిదానికీ రేటును ఫిక్స్ చేస్తుంది. అయితే వాటికీ, వాస్తవ ధరలకూ చాలాసార్లు పొంతనే ఉండదు. దాంతో ఈసీ ‘మెనూ కార్డు’పై మీడియాలో, సోషల్ మీడియాలో జోకులు పేలుతుండటం పరిపాటి. మరోవైపు, ఎన్నికల వ్యయంపై అభ్యర్థులకు పరిమితి ఉన్నా పార్టీలు చేసే ఖర్చుకు మాత్రం అలాంటిదేమీ లేకపోవడం విశేషం! చాయ్ రూ.5 నుంచి 15 దాకా... చాయ్ ధరను దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 దాకా ఈసీ నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో కప్పు చాయ్ రూ.5, సమోసా రూ.10. ఇడ్లీ, సాంబార్ వడా, పోహా–జిలేబీ ప్లేటు రూ.20. దోసా, ఉప్మా మాత్రం ప్లేటు రూ.30. మణిపూర్‌లో జాతుల హింసకు కేంద్రాల్లో ఒకటైన తౌబల్ జిల్లాలో చాయ్, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ఒక్కోటీ రూ.10. రాష్ట్రంలోని తెంగ్నౌపాల్ జిల్లాలో బ్లాక్ టీ రూ.5, సాదా టీ రూ.10. మణిపూర్‌లో బాతు మాంసం రూ.300. పంది మాంసం రూ.400. ఇక్కడి ఈసీ మెనూలో చికెన్‌తో పాటు చేపలు కూడా ఉన్నాయి. జలంధర్‌లో ప్లేటు చోలే భటూరేకు ఈసీ నిర్ధారించిన ధర రూ.40. కిలో చికెన్‌కు రూ.250, మటన్‌కు రూ.500. మిఠాయిల్లో ధోడా రూ.450, ఘీ పిన్నీ రూ.300. గ్లాసు లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15. చెన్నైలో తగ్గిన చికెన్ బిర్యానీ రేటు చెన్నైలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్ ధరను రూ.10 నుంచి రూ.15కు ఈసీ పెంచింది. కాఫీ కూడా రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. కానీ చికెన్ బిర్యానీ ధరను మాత్రం రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం విశేషం! ఢిల్లీ శివార్లలో నోయిడా పరిధిలోని గౌతంబుద్ధ నగర్లో వెజ్ భోజనం రూ.100. సమోసా, చాయ్ రూ.10. కచోరీ రూ.15, శాండ్విచ్ రూ.25, జిలేబీ కిలో రూ.90. ఉత్తర గోవాలో బటాటా (ఆలూ) వడ, సమోసా రూ.15. చాయ్ రూ.15, కాఫీ రూ.20. హరియాణాలోని జింద్‌లో దాల్ మఖానీ, మిక్స్డ్ వెజ్ కర్రీ రూ.130. మటర్ పనీర్ రూ.160. ఇక్కడ ఈసీ మెనూలో బటర్ నాన్, మిస్సీ రోటీ, ప్లెయిన్ రోటీలతో పాటు కాజూ కట్లీ, గులాబ్‌జామ్ వంటివి కూడా ఉన్నాయి. వీటికీ రేట్లు ఫిక్స్... ► ఖరీదైన హెలీప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్‌హౌజ్‌లతో పాటు పూలు, కూలర్లు, టవర్ ఏసీలు, సోఫాల వంటివాటికి కూడా ఈసీ రేట్లు నిర్ధారించింది. ► సభలు, సమావేశాలకు జనాన్ని తరలించేందుకు బస్సులు మొదలుకుని టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్... ఇలా బ్రాండ్లవారీగా కూడా ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించింది. ► దండల్లో కూడా గులాబీ, బంతి... ఇలా పూలను బట్టి రేట్లు నిర్ణయమయ్యాయి. పార్టీల జెండాలు, టోపీలకూ అంతే. ► సభలు, సమావేశాలకు వేదికలు, నేతలకు బస తదితరాలతో పాటు ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రికి కూడా ఇంత అని ఈసీ ముందే రేట్లు ఫిక్స్ చేసి పెట్టింది. కొసమెరుపు: ఎన్నికల వేళ కార్యకర్తలకు పారీ్టలు, అభ్యర్థులు మద్యం అందుబాటులో ఉంచడం బహిరంగ రహస్యమే. కానీ ఈసీ మెనూలో మద్యానికి మాత్రం చోటులేకపోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iceland volcano: భూగర్భంలో భుగభుగలు
అనగనగా ఒక చిన్న పల్లెపట్టు. అంతా సజావుగా సాగిపోతున్న వేళ. ఉన్నట్టుండి ఎటు చూస్తే అటు భూమిపై పగుళ్లు. చూస్తుండగానే అందులోంచి ఫౌంటేన్‌లా విరజిమ్ముతూ లావా ప్రవాహాలు. బిక్కచచి్చపోయి కకావికలమవుతున్న జనం. ఏదో హాలీవుడ్ సినిమాలా ఉంది కదూ! ఐస్లాండ్లో పశ్చిమ రెగ్జానెస్ ద్వీపకల్పంలోని గ్రెంతావిక్ అనే బుల్లి బెస్త గ్రామం, దాని పరిసర ప్రాంతాలు ఇప్పుడు అచ్చం అలాంటి భయానక పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. అక్కడ భూగర్భంలో 800 ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అపారమైన లావా రాశి కొన్నాళ్లుగా ఒళ్లు విరుచుకుంటోంది. భారీ ప్రవాహంగా మారి భయపెడుతోంది...! ఐస్లాండ్ అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. అక్కడి రెగ్జానెస్ ద్వీపకల్పమైతే అందమైన అగ్నిపర్వతాలకు నిలయం. పెద్ద టూరిస్టు స్పాట్ కూడా. గత 800 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క అగ్నిపర్వతం కూడా బద్దలవలేదు. అలాంటిది గతేడాది నుంచి ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజులుగా భయానక స్థాయికి చేరాయి. ముఖ్యంగా గ్రెంతావిక్, పరిసర ప్రాంతాల్లో గత నెల రోజుల్లోపే ఏకంగా మూడుసార్లు అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. లావా ప్రవాహాలు ఉవ్వెత్తున ఎగజిమ్మి భయభ్రాంతులను చేశాయి. దాంతో ఆ ప్రాంతాలవారిని ఖాళీ చేయించాల్సి వచి్చంది. ఇదంతా టీజర్ మాత్రమేనని అసలు ముప్పు ముందుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రెంతావిక్ కింద భూగర్భంలో మాగ్మా (శిలాద్రవం) పూర్తిగా కరిగి అపార లావా ప్రవహంగా మారిందని తేల్చారు! దాని పరిమాణం రికార్డు స్థాయిలో ఏకంగా 65 లక్షల క్యూబిక్ మీటర్లని లెక్కగట్టారు! అంతేకాదు, ఈ లావా భూగర్భంలో ఏకంగా సెకనుకు 7,400 క్యుబిక్ మీటర్ల వేగంతో ప్రవహిస్తోందట. ఇది డాన్యుబ్ వంటి భారీ నదుల ప్రవాహ వేగం కంటే కూడా చాలా ఎక్కువ. 2021–23 మధ్య ఇక్కడ భూగర్భంలో నమోదైన లావా ప్రవాహ రేటు కంటే ఇది 100 రెట్లు ఎక్కువని అధ్యయన సారథి యూనివర్సిటీ ఆఫ్ ఐస్లాండ్లోని నోర్డిక్ వోల్కెనోలాజికల్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ ఫ్రెస్టెనిన్ సిగ్మండ్సన్ లెక్కగట్టారు. ఈ లావా ప్రవాహం ఉజ్జాయింపుగా 15 కిలోమీటర్ల పొడవు, నాలుగు కిలోమీటర్ల ఎత్తు, కేవలం కొన్ని మీటర్ల వెడల్పున్నట్టు తేల్చారు. ఈ గణాంకాలు, హెచ్చరికలతో కూడిన అధ్యయనం జర్నల్‌సైన్స్‌లో గురువారం ప్రచురితమైంది. అందుకు కేవలం కొన్ని గంటల ముందే ఆ ప్రాంతమంతటా అగ్నిపర్వతం బద్దలవడంతో పాటు భూగర్భం నుంచి కూడా లావా ఎగజిమ్మిన ఉదంతాలు నమోదయ్యాయి! ఇలా జరగడం గత రెండు నెలల్లో మూడోసారి. గతేడాది డిసెంబర్ 18 నుంచి ఈ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు లావా ఎగజిమ్మింది. మళ్లీ ఈ ఏడాది జనవరి 14న కూడా రెండుసార్లు లావా పెల్లుబికింది. దాంతో ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగింది. ఈ ద్వీపకల్పమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది. భవిష్యత్తుపై ఆందోళన తాజా పరిస్థితుల నేపథ్యంలో రెగ్జానెస్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొద్ది రోజులుగా గ్రెంతావిక్తో పాటు ఇక్కడి పలు ఆవాస ప్రాంతాల్లో భూగర్భంపై ఒత్తిడి తీవ్రతరమవుతున్న సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. భూమిలోంచి లావా ప్రవాహాలు ఎగజిమ్ముతుండటమే గాక ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో భూ ప్రకంపనలూ నమోదవుతున్నాయి. ఒక పెద్ద క్రీడా మైదానంలో సగానికి పైగా భారీ పగులు ఏర్పడటం వణికిస్తోంది. ప్రస్తుతానికైతే మొత్తం ద్వీపకల్పం భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నాయని ప్రొఫెసర్ సిగ్మండ్సన్ ఆవేదనగా చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ లావా ప్రవాహం మరింతగా పెరిగేలా ఉందని కూడా ఆయన హెచ్చరించారు. అగ్నిపర్వతాల పుట్టిల్లు ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఐస్లాండ్కు పేరుంది. అందుకే దాన్ని లాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని చమత్కరిస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30కి పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి. ఇవి భారీ పర్యాటక ఆకర్షణలు కూడా. వీటిని చూసేందుకు ఏటా విదేశీయులు వస్తుంటారు. ఐస్లాండ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఉండటమే అక్కడ ఇన్ని అగ్నిపర్వాతల పుట్టుకకు ప్రధాన కారణమన్నది సైంటిస్టుల అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో ఠక్కున చెప్పేసే డివైజ్!
ఇంకా మాటలు రాని వయసులో కేరింతలు, ఏడుపులు మాత్రమే పసికందుల భాష. పసిపిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు బోసినవ్వులొలికిస్తూ కేరింతలు కొడతారు. ఆకలేసినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తారు. పసిపిల్లల ఏడుపును అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఆకలితోనే ఏడుస్తున్నారా, మరే కారణం వల్ల ఏడుస్తున్నారా తెలుసుకోవడం అంత సులువు కాదు. గుక్కతిప్పుకోకుండా ఏడ్చే పసిపిల్లలతో తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పసిపిల్లలు ఏడ్చేటప్పుడు ఇకపై అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇదిగో ఈ బుల్లిపరికరం పసికందుల ఏడుపును మనకు బోధపడే భాషలోకి అనువదిస్తుంది. ఇది ఇరవై నాలుగు గంటలూ పసికందులను కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటుంది. వారు ఏడుస్తున్నట్లయితే, ఎందుకు ఏడుస్తున్నారో ఇట్టే తెలియజెబుతుంది. అమెరికన్ కంపెనీ ‘మాక్సికోసీ’ పిల్లల ఏడుపును అనువదించే ఈ బుల్లిరోబోను ఇటీవల రూపొందించింది. దీనికి అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే బేబీ మానిటర్ కూడా ఉంటుంది. పిల్లలు ఏడుస్తున్నట్లయితే, వారు ఆకలికి ఏడుస్తున్నారో, నిద్రవస్తున్నందుకు ఏడుస్తున్నారో, భయం వల్ల ఏడుస్తున్నారో, గందరగోళం వల్ల ఏడుస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది. దీని ధర 61.99 డాలర్లు (రూ.5,154) మాత్రమే!. (చదవండి: కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ గురించి విన్నారా?) -
పోలీస్ స్పందన 7 నిమిషాల్లో..
సాక్షి, హైదరాబాద్: ఏదైనా సంఘటన చోటుచేసుకున్న వెంటనే బాధితులు లేదా అక్కడ ఉన్నవారు వెంటనే డయల్ 100కు కాల్ చేస్తారు. ఆ కాల్ రిసీవ్ చేసుకున్నాక ఎంత తక్కువ సమయంలో పోలీసులు ఆ స్థలానికి చేరుకుంటే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. దీనినే సాంకేతికంగా ‘పోలీస్ రెస్పాన్స్ టైమ్’అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం, నేరాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే పెట్రోలింగ్ జరిగేలా చూడటం తదితర లక్ష్యాలతో ఓ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా 2023కు సంబంధించి రెస్పాన్స్ టైమ్‌ను లెక్కించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరిన ఈ సమయం ఏడు నిమిషాలుగా ఉండగా, ఈ ఏడాది మరింత తగ్గించాలనేది పోలీసులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఒకప్పుడు ఇలా... ఎవరైనా ‘100’కు కాల్ చేస్తే, అది నేరుగా ‘డయల్–100’కమాండ్ సెంటర్‌కు చేరుతుంది. వెంటనే వారు బాధితుడు ఏ ఠాణా పరిధిలోకి వస్తాడో వాకబు చేస్తారు. ఆ తర్వాత సదరు ఫోన్ కాల్లోని అంశాలను సంక్షిప్త సందేశంగా (టెక్ట్స్) మార్చి బాధితుడున్న ఏరియాలోకి వచ్చే ఠాణాతో పాటు జోన్ కార్యాలయం, కమిషనరేట్‌కు చెందిన ప్రధాన కంట్రోల్ రూమ్‌లోని కంప్యూటర్లకు పంపించేవారు. దీంతో పాటు వాకీటాకీ ద్వారానూ సమాచారం ఇచ్చి గస్తీ వాహనాలను అప్రమత్తం చేసేవారు. ఈ సమాచారం అందుకునే గస్తీ వాహనం ఎక్కడ ఉంది? బాధితుడికి ఎంత దూరంలో ఉంది? తదితర అంశాలు తెలుసుకునే అవకాశం ఉండేదికాదు. ఫలితంగా గస్తీ వాహనం బాధితుడి వద్దకు చేరే సమయం చాలా ఎక్కువగా ఉండేది. ఘటనాస్థలికి చేరిన తర్వాత పెట్రోలింగ్ సిబ్బంది చెప్పే అంశాల ఆధారంగా ఫిర్యాదుగా పరిగణించే ఫోన్ కాల్‌ను క్లోజ్ చేసేవారు. ఇప్పుడు...ట్యాబ్నే ‘జీపీఎస్’ బాధితుడు ‘100’కు ఫోన్ చేసి సçహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. సిటీలోని ప్రతి గస్తీ వాహనం, బ్లూకోల్ట్స్లకు పోలీసు విభాగం ట్యాబ్స్ అందించింది. ఇవే జీపీఎస్ పరికరంగా పనిచేస్తుండటంతో దాని ఆధారంగా ‘డయల్–100’సిబ్బందికి ఏ వాహనం ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్ తెర/ట్యాబ్/ప్రత్యేక యాప్ ద్వారా కచి్చతంగా తెలుస్తుంది. దీంతో బాధితుడు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ ఫోన్ కాల్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ తతంగం మొత్తం కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. పెట్రోలింగ్ వాహనాల్లో ఉండే సిబ్బంది ఫోన్లకు ‘100’నుంచి డైవర్డ్ అయిన కాల్ వస్తే.. ప్రత్యేక రింగ్‌టోన్ ద్వారా ట్యాబ్‌లో రింగ్ వస్తుంది. ఫోన్ ఎక్కడ నుంచి అనేది తేలిగ్గా తెలియడానికి అన్ని వాహనాల్లోని సిబ్బందికీ ఇలాంటి రింగ్‌టోన్ ఏర్పాటు చేశారు. ఆ సిబ్బంది ఫోన్ ఎత్తిన వెంటనే ఆ ట్యాబ్‌లో తెరపై ఓ నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. అందులో బాధితుడు/ఫిర్యాదుదారుడికి సంబంధించిన అంశాలు, ఫిర్యాదు ఏమిటన్నవి కనిపిస్తాయి. వీటిని చూసిన వెంటనే గస్తీ వాహనంలోని సిబ్బంది ‘రిసీవ్డ్’అనే బటన్ నొక్కడం ద్వారా ఫిర్యాదు అందుకున్నట్టు ధ్రువీకరిస్తున్నారు. అలా...గణన షురూ.. పెట్రోలింగ్ వాహనం, బ్లూకోల్ట్స్ సిబ్బంది ఒకసారి ఫిర్యాదు అందుకున్నట్టు ట్యాబ్‌లో ఉండే ‘100 యాప్’ద్వారా ధ్రువీకరించిన వెంటనే ‘రెస్పాన్స్ టైమ్’లెక్కింపు ప్రారంభమవుతోంది. ఘటనాస్థలికి చేరుకునే గస్తీ వాహనాలు ఫిర్యాదు తీరును బట్టి అవసరమైన రీతిలో స్పందించే విధంగా సాంకేతిక చర్యలు తీసుకున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, ఆధారాల కోసం ఫొటోలు తీసుకుంటున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో జరిగే గొడవలు, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదు అయితే స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తారు. దీంతో ఘటనాస్థలాల్ని వీడియోలో చిత్రీకరించి భద్రపరుస్తున్నారు. సహాయక చర్యలు, తదుపరి యాక్షన్స్ తీసుకోవడం పూర్తయిన వెంటనే సదరు ఫొటోలు, వీడియోలు ఆన్లైన్ ద్వారానే సంబంధిత స్టేషన్ హౌస్ఆఫీసర్కు పంపిస్తున్నారు. ‘క్లోజ్’చేసే వరకు ‘టైమ్ రన్నింగ్’... గస్తీ బృందాలు ఘటనాస్థలికి చేరుకోవడం వంటి చర్యలు పూర్తయిన తర్వాత మొదట వచ్చిన నోటిఫికేషన్ మళ్లీ ఓపెన్ చేయాలి. అందులో ఉండే ‘కాల్ క్లోజ్’బటన్ నొక్కడంతో ఈ వ్యవహారం పూర్తవుతుంది. అప్పటి వరకు సమయం లెక్కింపు జరుగుతూ ఉంటుంది. ఈ సమయాన్నే ‘పోలీసు రెస్పాన్స్ టైమ్’గా పరిగణిస్తున్నారు. ఫోన్‌కాల్ వచ్చిన దగ్గర నుంచి జరిగే ప్రతిదీ ‘డయల్–100’తో పాటు కమిషనరేట్ కంట్రోల్ రూమ్, జోనల్ కార్యాలయాలకు చేరుతూ పర్యవేక్షణకు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెస్పాన్స్ టైమ్ పట్టణాల్లో తక్కువగా, గ్రామాల్లో ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అన్ని ప్రాంతాల్లోనూ తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
ఆస్పత్రుల వ్యర్థాలపై నిఘా
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆస్పత్రులలోని వ్యర్థాల (బయో మెడికల్స్) సేకరణ, నిర్వీర్యంపై ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేసింది. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీకి తీసుకెళ్లి నిర్వీర్యం చేసేవరకూ నిరంతరం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడా బయో మెడికల్ వ్యర్థాలను బయట వేయకుండా.. కచ్చితంగా వాటిని నిర్వీర్యం చేసేలా వ్యవస్థను పటిష్టం చేశారు. వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చారు. ఆస్పత్రిలో వ్యర్థాలను సేకరించినప్పుడు, కంపెనీకి తరలించిన తర్వాత బ్యాగ్‌లను స్కాన్ చేసేలా బార్ కోడింగ్, కంపెనీ వద్ద ఆన్లైన్ ఎమిషన్ మోనిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు వంటి విధానాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 17,200 బెడ్స్ ఉండగా.. నిత్యం 5 వేల బెడ్స్‌పై రోగులు చికిత్స పొందుతుంటారని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లెక్కలు చెబుతున్నాయి. ప్రతి రోజూ 1.20 టన్నుల నుంచి 1.40 టన్నుల బయో మెడికల్ వ్యర్థాల సేకరణ, నిర్వీర్యం జరుగుతున్నట్టు పీసీబీ అధికారులు చెపుతున్నారు. తరలింపు.. నిర్వీర్యంపై నిఘా బయో మెడికల్ వ్యర్థాలను సంబంధిత కంపెనీకి ఖచ్చితంగా తరలించేలా ప్రభుత్వం నిఘా పటిష్టం చేసింది. ప్రతి బ్యాగ్‌కు బార్ కోడింగ్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించేటప్పుడు బార్ కోడింగ్‌ను స్కాన్ చేయడంతో పాటు కంపెనీకి తరలించిన తర్వాత దానిని స్కాన్ చేయాల్సి ఉంది. అప్పుడే దానిని నిర్వీర్యం చేసేందుకు తరలించినట్టు నిర్థారణ అవుతుంది. ఆస్పత్రి యాజమాన్యాలకు మొబైల్ యాప్ ప్రవేశ పెట్టారు. ఈ యాప్‌లో ప్రతిరోజూ ఆస్పత్రిలో ఎన్ని పడకలపై రోగులు ఉన్నారు. ఆ రోజు వ్యర్థాలు ఎంత ఉన్నాయి అనే విషయాలను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. బయో మెడికల్ వ్యర్థాలను తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి నుంచి సేకరించిన వ్యర్థాలు కంపెనీ వద్దకు వెళ్లాయా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాయా అనే దానిపై నిఘా వేస్తారు. జగ్గయ్యపేట సమీపంలో బయో వ్యర్థాల నిర్వీర్యం ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్‌లో వ్యర్థాల నిర్వీర్యం ప్రక్రియను నిరంతరం ఆన్లైన్ ఎమిషన్ మోనిటరింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తుంటారు. అక్కడ ఎంత డిగ్రీల్లో నిర్వీర్యం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వీర్యం సమయంలో వచ్చే పొగలో ఏమైనా రసాయనాలు ఉన్నాయా, హానికర కాలుష్యం వస్తోందా అనే అంశాలను పరిశీలిస్తారు. వ్యర్థాలకు కలర్ కోడింగ్ ఆస్పత్రిలోని వ్యర్థాలకు కలర్ కోడింగ్‌ను ఏర్పాటు చేశారు. పసుపు, ఎరుపు, బ్లూ, తెలుపు నాలుగు రంగుల్లో ఉన్న బ్యాగుల్లో నిర్ధేశించిన వ్యర్థాలను ఆస్పత్రి సిబ్బంది వేసేలా ఇప్పటికే అవగాహన కల్పించారు. పసుపు బ్యాగుల్లో మానవ శరీర సంబంధమైన వ్యర్థాలు, జంతు శరీర సంబంధమైన వ్యర్థాలు, మాయ, కలుషిత దూది, డ్రెస్సింగ్ క్లాత్, విషపూరిత వ్యర్థాలు, గడువు ముగిసిన మందులు, మాస్‌్కలు వేస్తారు. వీటిని కంపెనీకి తరలించి 1,200 డిగ్రీల వద్ద నిర్వీర్యం చేస్తారు. ఎరుపు బ్యాగుల్లో సిరంజీలు, ఐవీ సెట్, కాథెటర్, గ్లౌజులు, బ్లడ్ బ్యాగ్స్, యూరిన్ బ్యాగ్స్, డయాలసిస్ కిట్, ఐవీ బాటిల్స్ వేసేలా ఏర్పాట్లు చేశారు. తెలుపు బ్యాగ్స్‌లో సూదులు, స్థిర సూదులు, సిరంజిలు, బ్లేడ్లు, శస్త్ర చికిత్స బ్లేడ్లు వేస్తారు. బ్లూ బ్యాగ్స్ గ్లాసుతో చేసిన ఇంజెక్షన్ బాటిల్స్, గాజు సీసాలు, ల్యాబ్ స్లైడ్స్, ఇంప్లాంట్స్, కత్తెరలు వేసేలా అవగాహన కల్పించారు. అవగాహన కలిగిస్తున్నాం ప్రతి ఆస్పత్రిలో వ్యర్థాలను నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఆధారంగా వేరు చేయాలని యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యర్థాల తరలింపు, నిర్వీర్యం వంటి వాటిపై నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. – పి.శ్రీనివాసరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి -
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్‌లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్‌లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్‌కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్‌పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్‌గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
చిన్న క్లిప్పులా ఉంటుంది.. కానీ పనితీరు అమోఘం
పాతకాలం నాటి పాదరసం బీపీ మానిటర్లు ఇప్పటికీ చాలాచోట్ల వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన డిజిటల్ బీపీ మానిటర్లు కూడా విరివిగా వాడుకలో ఉన్నాయి. ఇవేవి వాడాలన్నా, చేతికి పట్టీని చుట్టి నానా ప్రయాస పడాల్సి ఉంటుంది. అమెరికాకు చెందిన బయోమెట్రిక్ టెక్నాలజీ కంపెనీ ‘వాలెన్సెల్’ ఇటీవల ఎలాంటి పట్టీలు లేని, అతిచిన్న కఫ్లెస్ బీపీ మానిటర్‌ను రూపొందించింది. ఇది చూడటానికి పల్సాక్సి మీటర్లాగానే చిన్న క్లిప్పులా ఉంటుంది. ఇందులో వేలుపెడితే చాలు. దీని పైభాగంలో ఉన్న మానిటర్ మీద కచ్చితంగా బీపీ ఎంత ఉందో కనిపిస్తుంది. దీనిని ఈ ఏడాది జరిగిన సీఈఎస్–2023 ప్రదర్శనలో ‘వాలెన్సెల్’ ప్రదర్శించింది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది విరివిగా అందుబాటులోకి వస్తే, బీపీ మానిటర్‌ను ఇంచక్కా జేబులో వేసుకుని వెళ్లొచ్చు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ బీపీని తెలుసుకోవచ్చు. -
మార్చిలో 3 నెలల గరిష్టానికి ‘నిరుద్యోగం’
ముంబై: దేశంలో నిరుద్యోగ సమస్య మార్చిలో తీవ్రమైంది. మూడు నెలల గరిష్ట స్థాయిలో 7.8 శాతంగా నమోదయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2022లో డిసెంబర్లో 8.30 శాతానికి పెరిగి న నిరుద్యోగితా రేటు జనవరిలో 7.14 శాతానికి తగ్గింది. అయితే మరుసటి రెండు నెలల్లో మళ్లీ పెరుగుదల ప్రారంమైంది. ఫిబ్రవరిలో 7.5 శాతం అన్ఎంప్లాయ్మెంట్ రేటు నమోదయితే, మార్చితో మరింత పెరిగి 7.8 శాతానికి ఎగసింది. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.4 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదయ్యింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► మార్చిలో నిరుద్యోగం విషయంలో హర్యానా 26.8%తో అగ్ర స్థానంలో ఉంది. రాజస్తాన్ (26.4%), జమ్మూ, కశ్మీర్ (23.1%), సిక్కిం (20.7%), బీహార్ (17.6%), జార్ఖండ్ (17.5%) తరువాతి స్థానాల్లో నిలిచాయి. ► తక్కువ నిరుద్యోగితా రేటు (0.8 శాతం) ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్‌లో నమోదయితే, అటుపైన పుదుచ్చేరి (1.5 శాతం), గుజరాత్ (1.8 శాతం), కర్ణాటక (2.3 శాతం), మేఘాలయ, ఒడిస్సా (2.6 శాతం) ఉన్నాయి. పండుగ సీజన్ తర్వాత డౌన్ అక్టోబర్–జనవరి పండుగ సీజన్ తర్వాత రిటైల్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ రంగాల్లో ఉపాధి తగ్గింది. ఐటీ, టెక్నాలజీ, స్టార్టప్‌ల్లో క్రియాశీలత తగ్గింది. ఇది తాజా నియామకాలలో మందగమనానికి దారితీసింది. ఇక మార్చి ఆర్థిక సంవత్సరాంతము, పరీక్షల నెల కావడంతో ప్రమాణాలు, పర్యాటకం, వినోదం, ఆతిథ్య రంగాల్లో అధిక డిమాండ్ కనిపించ లేదు.ఇది నిరుద్యోగితా శాతం పెరుగుదలకు దారితీసింది. తయారీ, ఇంజనీరింగ్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే ఉంది. ఆయా అంశాలు ఉద్యోగ మార్కెట్ వేగాన్ని తగ్గించాయి. అయితే ఏప్రిల్‌లో పురోగమనం ఉంటుందని భావిస్తున్నాం. – ఆదిత్య మిశ్రా, సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ, డైరెక్టర్ తాత్కాలికమే కావచ్చు... నిరుద్యోగ డేటా ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణానికి అద్దం పడుతోంది. భారత్ కార్పొరేట్ రంగం వ్యయాల విషయంలో చాలా విచక్షణతో వ్యవహరిస్తోంది. ప్రతి అడుగును జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్‌నూ ప్రభావం చూస్తుంది కాబట్టి, దేశంలో కార్కొరేట్ రంగం నియామకాలను తాత్కాలికంగా తగ్గించింది. అయితే భారత్ సవాళ్లను అధిగమించే పరిస్థితిలో ఉంది కాబట్టి, తాజా నిరుద్యోగ సమస్య తాత్కాలికమే అని నేను భావిస్తున్నాను. – రితుపర్ణ చక్రవర్తి, టీమ్‌లీజ్ సర్వీసెస్ కో–ఫౌండర్ -
ఆన్లైన్ గేమింగ్‌కు ఎస్ఆర్వో ఏర్పాటు చేస్తాం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై పర్యవేక్షణకు సంబంధించి స్వీయ నియంత్రణ సంస్థను (ఎస్ఆర్వో) ఏర్పాటు చేసేందుకు పరిశ్రమ సమాఖ్య ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఐఏఎంఏఐ ముందుకొచ్చింది. ఇందుకు అవసరమైన సామరŠాధ్యలు, అనుభవం తమకు ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. నైపుణ్యాల ఆధారిత పలు ఆన్లైన్ గేమింగ్ సంస్థలకు ఐఏఎంఏఐలో సభ్యత్వం ఉండటం కూడా ఇందుకు తోడ్పడగలదని పేర్కొంది. ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్దేశించినట్లుగా ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ కంపెనీస్ మొదలైన వాటికి సంబంధించిన ఎస్ఆర్వోలను నిర్వహిస్తున్నామని తెలిపింది. సమాజంపై ప్రభావం చూపే ఆన్లైన్ గేమింగ్‌పై కేంద్రం తగు విధానాలు లేదా కొత్త చట్టం తీసుకువస్తుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో ఐఏఎంఏఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
CMIE: నవంబర్‌లో మూడు నెలల గరిష్టానికి నిరుద్యోగం!
ముంబై: దేశంలో నిరుద్యోగం రేటు నవంబర్‌లో మూడు నెలల గరిష్టం ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం– పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.96 శాతానికి చేరితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 7.55 శాతంగా ఉంది. అక్టోబర్‌లో దేశంలో నిరుద్యోగం రేటు 7.77 శాతం. పట్టణ ప్రాంతాల్లో ఇది 7.21 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.04 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌లో నిరుద్యోగిత రేటు 6.43 శాతంగా ఉంది. నవంబర్‌లో 30.6 శాతంతో హర్యానా నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో రాజస్తాన్ (24.5 శాతం), జమ్మూ,కశ్మీర్ (23.9 శాతం) బీహార్ (17.3 శాతం), త్రిపుర (14.5)లు ఉన్నాయి. అతి తక్కువ నిరుద్యోగం రేటు విషయంలో చత్తీస్‌గఢ్ (0.1 శాతం), ఉత్తరాఖండ్ (1.2 శాతం), ఒడిస్సా (1.6 శాతం), కర్ణాటక (1.8 శాతం), మేఘాలయ (2.1 శాతం)లు ఉన్నాయి. -
చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో అంతర్జాతీయ పార్కులో వదిలిన చీతాల పర్యవేక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్క్‌తోపాటు సమీప ఇతర అనువైన నిర్దేశిత ప్రాంతాల్లో చీతాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. మధ్యప్రదేశ్ అటవీ, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఈ తొమ్మిది మంది సభ్యుల బృందానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సహకరిస్తుంది. కొత్త ప్రాంతాన్ని చీతాలు ఏ మేరకు సొంతస్థలంగా భావిస్తాయి, చీతా ఆరోగ్య స్థితి సమీక్షించడం, వేట నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. బృందం చేపట్టాల్సిన ఇతరత్రా పనులను మంత్రిత్వశాఖ నిర్ధేశించింది. రెండేళ్లపాటు టాస్క్‌ఫోర్స్ ఈ ప్రత్యేక విధుల్లో నిమగ్నమై ఉంటుంది. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్‌లైన్ -
సీఎం జగన్ ఆలోచనలకు కార్యరూపం.. ఆస్పత్రుల పర్యవేక్షణకు యాప్
సాక్షి, అమరావతి: ప్రజలకు ఆస్పత్రుల్లో మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆస్పత్రుల నిర్వహణను నిత్యం పర్యవేక్షించి, సమస్యలను పరిష్కరించడం, సౌకర్యాలను మెరుగు పరచడం ద్వారా నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, బయోమెడికల్ పరికరాల నిర్వహణ, ఈ–హెచ్ఆర్ తదితర అంశాలపై పర్యవేక్షణకు ఏపీ వైద్య విధాన పరిషత్ ఈ యాప్‌ను రూపొందించింది. వైద్య విధాన పరిషత్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 175 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), 53 ప్రాంతీయ (ఏరియా) ఆస్పత్రులు, 17 జిల్లా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్, ఒక చెస్ట్ డిసీజెస్ ఆస్పత్రి ఉన్నాయి. వీటిలో 16,340 పడకల సామర్థ్యం ఉంది. ఈ ఆస్పత్రుల నిర్వహణ, సౌకర్యాల పర్యవేక్షణకు ‘ఏపీ హెల్త్ సెకండరీ కేర్’ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌లో ప్రతి ఆస్పత్రికి ఒక లాగిన్‌ను కేటాయించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ లేదా ఆర్ఎంవో ఈ యాప్‌లో లాగిన్ అయి అందులోని మాడ్యూల్స్ ఆధారంగా వివరాలను నమోదు చేయాలి. ఆస్పత్రిలో సెక్యూరిటీ విధానం, సెక్యూరిటీకి స్కోరింగ్, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ తదితర అంశాలపై స్కోరింగ్ ఇవ్వాలి. అనుబంధ ప్రశ్నలకు ఎస్/నో రూపంలో సమాధానాలివ్వాలి. వాటికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు ఆస్పత్రిలో రోగుల రక్షణకు సంబంధించిన సెక్యూరిటీ విజిట్ మాడ్యూల్లో.. సెక్యూరిటీ గార్డ్ 24 గంటలు అందుబాటులో ఉంటున్నాడా... అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. గార్డ్ అందుబాటులో ఉన్నాడని ‘ఎస్’ అని పెడితే వెంటనే లైవ్ ఫొటో అప్లోడ్ చేయాలని యాప్ అడుగుతుంది. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ లైవ్ ఫొటోను అప్లోడ్ చేయాలి. ఎన్ఏబీహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా యాప్ నేషనల్ అక్రిడిటేషన్ ఫర్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్) ప్రమాణాలకు అనుగుణంగా యాప్‌లో ప్రశ్నావళిని రూపొందించాం. యాప్‌పై సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలకు శిక్షణ ఇచ్చాం. యాప్‌లో ఉండే వివరాలన్నీ రాష్ట్ర డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశాం. ఎక్కడైనా సెక్యూరిటీ, శానిటేషన్ ఇతర అంశాల నిర్వహణలో లోపాలున్నట్లు యాప్‌లో నమోదు చేస్తే డ్యాష్ బోర్డులో కనిపిస్తుంది. దాని ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తాం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా యాప్‌ను తీసుకువచ్చాం. – డాక్టర్ వినోద్‌కుమార్, కమిషనర్, ఏపీ వైద్య విధాన పరిషత్ -
AP: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ అధిక ప్రా«ధాన్యతనిస్తోంది. ప్రసవం సమయంలో తల్లి, బిడ్డ మరణాలకు ప్రధాన కారణమైన హైరిస్క్ ప్రెగ్నెన్సీలను (ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు) నియంత్రించేందుకు చర్యలు చేపడుతోంది. ఇటువంటి వారిపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక పర్యవేక్షణను కొనసాగిస్తోంది. ఎలాగంటే.. ►గర్భం దాల్చిన 10–12 వారాల్లో మహిళ వివరాలను ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ►వైద్య పరీక్షలు నిర్వహించి గతంలో అబార్షన్, సిజేరియన్లు జరిగి ఉండటం, రక్తహీనత, రక్తపోటు, మధుమేహం సహా 12 రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రారంభ దశలోనే గర్భిణుల్లో హైరిస్్కను గుర్తిస్తున్నారు. ►ఇలా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8,04,226 మంది గర్భిణులు రిజిస్ట్రర్ కాగా వీరిలో 15 శాతం అంటే 1,23,839 మంది హైరిస్క్‌లో ఉన్నట్లు తేలింది. ►వీరందరి పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హెల్త్ సూపర్వైజర్లకు అప్పగించారు. ► ప్రసవం అయ్యేవరకూ హైరిస్క్ గర్భిణుల వెంట ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించడం వీరి బాధ్యత. ప్రతినెలా వైద్య పరీక్షలు ప్రసవానికి ముందు గర్భిణులకు నాలుగు యాంటినేటల్ చెకప్స్ (ఏఎన్సీ), ప్రసవానంతరం ఒక పోస్ట్‌నేటల్ చెకప్ (పీఎస్సీ) వైద్య శాఖ నిర్వహిస్తుంది. అయితే, హైరిస్్కగా గుర్తించిన నాటి నుంచి సంబంధిత మహిళకు ప్రసవానికి ముందు ప్రతినెలా వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. గైనకాలజిస్ట్లు అందుబాటులో ఉండే సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లోనే వీరికి వైద్య పరీక్షలు చేపడుతున్నారు. వీరు నెలనెలా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలను హెల్త్ సూపర్వైజర్, ఆశా, ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. అదే విధంగా ఏ ఆస్పత్రిలో వీరికి ప్రసవాన్ని నిర్వహించాలి అని ముందే ప్రణాళిక సిద్ధంచేసుకుంటున్నారు. సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉండే ఆసుపత్రికే నేరుగా తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ప్రసూతి, శిశు మరణాల కట్టడికి కృషిచేస్తున్నారు. దేశంలోనే తొలి స్థానంలో ఏపీ గర్భిణుల్లో హైరిస్క్కు ప్రధాన కారణం రక్తహీనత. తర్వాతి స్థానాల్లో 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం, 18 ఏళ్ల కంటే ముందే గర్భం దాల్చడం వంటి ఇతర కారణాలూ ఉంటాయి. రక్తహీనతను నియంత్రించడంలో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో ఉంటోంది. ఈ విషయం ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రక్తహీనత నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 91.9% మంది గర్భిణులు, 80.9% మంది పాలిచ్చే తల్లులకు 2021–22 ఏడాదిలో వైద్య శాఖ ఫోలిక్ యాసిడ్ (ఐరన్) మాత్రలను పంపిణీ చేసింది. అదే విధంగా 6 నుంచి 59 నెలల చిన్నారులకు 86.1%, 5–9 ఏళ్ల పిల్లలకు 76.1%, 10–19 ఏళ్ల పిల్లలు, యువతకు 79.3% ఐరన్ సిరప్, మాత్రలు పంపిణీ చేపట్టారు. ఇలా అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ దేశంలోనే తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. సేవలు వినియోగించుకోవాలి గర్భిణులు, బాలింతల సంరక్షణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా హైరిస్క్ గర్భిణులకు ప్రసవం సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సేవలను గర్భిణులు వినియోగించుకోవాలి. ఎక్కడైనా సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురైతే మాకు తెలియజేయాలి. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ (ఎంసీహెచ్) -
ఆగస్టులో 16 లక్షల మంది ఉపాధి గల్లంతు
సాక్షి, న్యూఢిల్లీ: ఆగస్టులో దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో నిరుద్యోగిత రేటు 8.32 శాతంగా ఉందని వివరించింది. గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.64 శాతం ఉండగా, పట్టణ నిరుద్యోగిత రేటు 9.78 శాతం ఉంది. జులైలో ఉపాధి పొందిన వారి సంఖ్య 399.38 మిలియన్లు ఉండగా.. ఆగస్టు నాటికి 397.78 మిలియన్లకు తగ్గింది. అంటే 16 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అత్యధికంగా హరియాణాలో 35.7 శాతం నిరుద్యోగిత రేటు నమోదైంది. తరువాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్ (26.7 శాతం), జార్ఖండ్ (16 శాతం), త్రిపుర (15.6 శాతం), బిహార్ (13.6 శాతం) నిలిచాయి. -
కరోనా యాప్ రాబోతుంది
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ప్రభుత్వం సూచనలు విస్మరిస్తున్న వారిని నిలవరించేందుకు పోలీస్ యంత్రాంగం ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ప్రధానంగా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో అనుమానితులను క్వారంటైన్ చేసినప్పటికీ పలువురు నిర్దేశిత ఇంటిని, ఆసుపత్రిని దాటి వచ్చేస్తున్నారు. తప్పించుకుని పారిపోయిన సంఘటనలూ వెలుగులోకి వచ్చాయి. అలాంటి వారిని గుర్తించి తిరిగి క్వారంటైన్ చేయాల్సి వస్తోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీన్ని కట్టడి చేయడానికి కరోనా యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు గుంటూరు ఐజీ ప్రభాకరరావు చెప్పారు. (కరోనా సోకిందేమోనని దంపతుల ఆత్మహత్య) అనుసంధానం ఇలా.. క్వారంటైన్ ఉన్న వారి ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసి జీపీఎస్‌తో అనుసంధానం చేస్తారు. నిరీ్ణత ప్రాంతాన్ని అధిగమించగానే సంబంధిత పోలీస్ ఉన్నతాధికారికి అలర్ట్ మెసేజ్ వస్తుంది. తక్షణం ఆ ప్రాంత బాధ్యులైన అధికారికి సూచనలు పంపి క్వారంటైన్‌ను కొనసాగింపజేయడానికి వీలవుతుంది. తొలుత పది మీటర్ల పరిధిలోనే ఉంచాలని భావించినప్పటికీ దాన్ని యాభై లేదా వంద మీటర్ల పరిధి వరకు విస్తరించాలనే ఆలోచన చేస్తున్నారు. ఐ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేయడానికి కూడా పరిశీలనలు చేస్తున్నారు ఏదైనా నిర్దేశిత ప్రాంతం వరకే ప్రత్యేకంగా మెసేజ్ (గ్రూప్ మెసేజ్ తరహాలో) పంపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఓల్డ్ గుంటూరులో 5000 మందికి అలెర్ట్ మెసేజ్‌లు పంపాలనుకుంటే అక్కడికే పరిమితమయ్యేలా డేటా మైగ్రేషన్ ద్వారా పరిశీలిస్తున్నారు. కరోనా సమాచారమే కాకుండా ప్రజలకు నిత్యం అవసరమైన సమాచారాన్ని కూడా పంపాలనేది ఆలోచనగా ఉంది. గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించినట్లు ఐజీ తెలిపారు. వాట్సాప్‌లలో తప్పుడు సమాచారంతో మెసేజ్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకునేలా వ్యవస్థ ఏర్పాటవుతోందన్నారు. క్వారంటైన్లో ఉండకుండా బయటకు వచ్చిన వారిపైన, విదేశాల నుంచి ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమాచారం ఇవ్వకుండా దాచినట్లయితే వారిపైన కేసులు నమోదు చేయనున్నామన్నారు. వైద్య పరిరక్షణలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఐపీసీ 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయని ఐజీ ప్రభాకరరావు వివరించారు. -
ప్రాణవాయువుపైనా సాయి ప్రాభవం
ఏ దైవానికి సంబంధించిన ఒక లీలని (మహిమని చూడగల ఒక సంఘటన) విన్నా, ఏ భక్తునికి సంబంధించిన ఒక అనుభవాన్ని తెలుసుకున్నా వాటిని ‘అవి ఎవరికో జరిగినవి’ అనుకోకూడదు. ‘మనకి కూడా ఆ దైవానుగ్రహం గనుక ఉంటే ఇలాంటి సంఘటనలే జరిగే అవకాశముందన్నమాట’ అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి అవగాహన కలగాలంటే సద్గురువు (నిస్వార్థంగా జ్ఞానబోధని చేసి కళ్లు తెరిపించేవాడు) లభించాలి. ఓ చిన్న ఉదాహరణని గమనించుకుని లోపలికి వెళ్తాం! చిలుక ఉంది. అది చక్కగా మాట్లాడుతోంది. అందంగా.. ఆకర్షణీయంగా.. ఉందనే ఆలోచనతో మనం దాన్ని తెచ్చి ఓ పంజరంలో ఉంచి, దానికి కావలసినవన్నీ సకాలంలో పెడుతూ ఉంటాం. అది కూడా వాటిని తింటూ.. మనతో ఆడుకుంటూ.. మనల్ని ఆనందపరుస్తూ ఉంటుంది. ఎక్కడికీ ఎగరాల్సిన అవసరం లేకుండా తనకి ఇష్టమైన పళ్లూ తినుబండారాలూ తన దగ్గరికే వస్తున్నాయని మహా ఆనందపడిపోతూ ‘ఈ జీవితం ఇలాగే జరిగిపోతే చాలునురా భగవంతుడా!’ అనుకుంటుంది. ఎవరో ఒక పిల్లవాడో లేక ఇంట్లో ఎవరో ఆ చిలుకకి ఆహారాన్ని పెట్టి పొరపాటున పంజరపు తలుపుని వేయకుండా ఉన్నారనుకుందాం! ఆ చిలుక కాస్త ఎగిరి ఆ చెట్టు మీదా ఈ చెట్టు మీదా వాలుతూ విశాలవిశ్వాన్ని తన ఆటస్థలంగా భావిస్తూ తన రెక్కల సత్తువ కొద్ది దూరదూరాలు వెళ్తూ విన్యాసాలు చేసుకుంటూ తన జాతి చిలుకలతో ఆడుతూ పాడుతూ గంతులేస్తూ అడవులకీ తోటలకీ వెళ్తూ అనుకుంటుంది ‘అయ్యో! ఎంత జీవితకాలాన్ని నష్టపోయాను. ఆ పంజరంలో బంధింపబడి ఇంత విశాలవిశ్వముంటే నేను ఓ చిన్న పంజరంలోనే ఉంటూ.. దాన్నే గొప్పగా భావిస్తూ.. అందరూ నన్ను ఆదరిస్తున్నారనుకున్నాను గానీ ఇంత స్వతంత్రతనీ, ఇంతటి ఆనందాన్నీ కోల్పోయానా ఇంతవరకూ!?’ అని తీవ్రంగా బాధపడుతుంది. ‘ఇప్పటివరకూ నన్ను చూడదలిచినవారి ఇష్టాలకి అనుగుణంగా ఉంటూ దానికి అలవాటుపడి అదే నిజమైన ప్రపంచం అనేసుకున్నానా? నిజమైన ఆనందమంటే.. ఎవరి సంతోషానికో నేను అనుగుణంగా ఉండటం కాదు. నా ఆనందాన్ని నేను పొందడానికి అనుగుణంగా నేనెలా ఉండాలో, ఉంటే బాగుంటుందో అలా ఉండటం మాత్రమే!’ఇదంతా ఎందుకంటే జీవుడు (ప్రతివ్యక్తీ) కూడా అంతే! ఈ కోరికలు, ఆ కోరికలు, ఆ ధనం, ఈ ఐశ్వర్యం (ఈశ్వరస్య భావరి – అధికారం హోదా అనేది సరైన అర్థం), సంతానం, సౌకర్యాలూ... అనే ఈ పంజరంలో బంధింపబడి ఎంతగొప్పగా ఉన్నాను అనుకుంటాడు. పై ఉదాహరణలో పంజరపు తలుపుని ఎవరో తీస్తే బాహ్య ప్రపంచాన్ని చూసి తానెంత నష్టపోయిందో ఆ చిలుక గమనించినట్లే ఇక్కడ కూడా జీవునికి సరైన గురువు (సద్గురువు) గాని దొరికితే నిజమైన మానసిక ఆనందాన్ని (హ్లాదం అంటారు. అలాంటి హ్లాదం యొక్క అతీతస్థితే ప్రహ్లాదం. అది కలిగినవాడే ప్రహ్లాదుడు) పొందుతూ జీవితాన్ని ఎంత నష్టపోయిందీ, నష్టపోగొట్టుకుందీ తెలుసుకోగలుగుతాడు. అలా హ్లాదాన్ని పొందిన సాయి భక్తులందరికీ సాయి తన జీవితాలని ఎలా రక్షించి ఒడ్డున పడేసిందీ స్పష్టంగా తెలుసు. ఉదాహరణతో చూద్దాం! ప్రాణవాయువు మీద ఆధిపత్యం మన శరీరంలో (పిండ అండంలో) 5 వాయువులున్నాయి. వాటిలో మొదటిది మన ప్రాణాలని నిలిపి ఉంచే వాయువు. అదే ప్రాణవాయువు. ‘హృదిప్రాణః’ అన్నారు కాబట్టి ఈ ప్రాణవాయువు ప్రతి జీవునిలోనూ (జీవించి ఉన్నవారు) హృదయంలో ఉంటుంది. ఆ హృదయం నుండి ప్రాణవాయువు తొలిగిపోయిన క్షణంలో ఆ జీవుడు నిర్జీవుడు అవుతాడు. ఆ ప్రాణం– సామాన్యులమైన మన అందరి భావనలోనూ ఎప్పుడుపోతుందో – తెలియదు. అయితే సాయికి స్పష్టంగా తెలుసు ఎవరి ప్రాణం ఎప్పటికి గతిస్తుందో! అందుకే ఫలానవాని ప్రాణాలు నిలిచి ఉండాలని తనకి అనిపించినప్పుడు ఆ పోబోయే ప్రాణవాయువుని కూడా పోకుండా ఆపుచేసి ఆ జీవుడ్ని మరికొంతకాలం జీవింపజేశాడు. ఇలా ప్రాణవాయువుని ఆపి ఉంచగలిగాడంటే తనకి ప్రాణవాయువు మీద ఆధిపత్యం ఉన్నట్లే కదా! శ్యామాని పాము కరిచింది! పైన అనుకున్న చిలుక కథలోని చిలుకలా పంజరం నుంచి బయటపడి సద్గురువు పర్యవేక్షణలో స్వతంత్ర జీవనాన్నీ హ్లాదాన్ని పొందుతున్న వాడు శ్యామా(మాధవరావు శ్యామా అనేది పూర్తి పేరు). బాబాకి నీడలాగా ఉంటూ ఉండేవాడు. సాయి కూడా శ్యామాని అంతగానూ దగ్గరగా ఉంచుకుని చూసుకుంటూ ఉండేవాడు. సాయి నిత్యం చేసే అగ్నిహోత్ర కార్యక్రమం (ధుని) కోసం కట్టెలని తేవాలనే ఉద్దేశ్యంతో శ్యామా కట్టెలన్నీ పెద్ద ఎత్తున ఉండే ఆ ప్రదేశానికి వెళ్లి కట్టెల్ని లాగుతూ ఉంటే ఆ పెద్ద ఎత్తు మోపులా ఉండే కట్టెల సమూహం నుండి ఓ పొడవాటి పాము(మరాఠీలో బవా అంటారు) శ్యామా చిటికెనవేలి మీద బలంగా పడగ ఎత్తి మరీ కాటేసింది. క్షణాల్లో శ్యామా చిటికెన వేలంతా విషాగ్నితో నిండిపోయి తీవ్రమైన మంటనీ నొప్పినీ కలుగజేసాయి శ్యామాకి. ఎప్పుడూ అలాంటి పాముకాటు అనుభవం లేని కారణంగానూ, తాను ఒంటరిగా వచ్చి ఉన్న కారణంగానూ శ్యామా భయాందోళనలతో వణికిపోసాగాడు. బాధా భయమూ ఆందోళనా నిస్సహాయతా వంటివి ఆవరించినప్పుడు దైవాన్ని స్మరించుకోవాలనే విషయాన్ని అందరూ చెప్పే మాట నిజమే గాని, ఆ బాధలో ఆందోళనలో అంతటి సాయి భక్తునికీ నిరంతరం సాయితో మెలిగేవానికీ కూడా సాయి గుర్తు రానూ లేదు. సాయి జపం చేయాలనే ఆలోచన కలగనూ లేదు. ఇది సర్వసాధారణం. ఒకవేళ ఏ ధ్యానమో చేద్దామని ఏ క్షణంలోనో అనిపించినా అది సాధ్యమయ్యే విషయమేనా ఆ బాధలో ఆందోళనలో ప్రాణభయంలో ఉన్న సమయంలో? పెద్దగా అరిచిన అరుపులకి దగ్గరగా ఉన్న బంధువులూ కొందరు మిత్రులూ అతని వద్ద కొచ్చారు. శరీరమంతా క్రమంగా ఎర్రని రంగుతో నిండిపోతూ కనిపిస్తోంది. అతని ప్రాణాలు ఇక పోతాయేమోననే భయం శ్యామాతో పాటు అందరికీ దాదాపుగా కలిగింది. ఆ ఎర్రగా మారుతున్న శరీరపు రంగూ, విషబాధతో శ్యామా మెలికలు తిరిగిపోతున్న దృశ్యమూ చూడగానే. షిర్డీలో పాముల సంచారం ఎక్కువనే చెప్పాలి. ఓ సారి సాయిని భక్తులు కొందరు ‘బాబా! పాముల సంచారం ఎక్కువగా ఉంటోంది. దీనికి ఏదైనా నివారణోపాయం – పరిష్కారమార్గం నువ్వే చెప్పాలి’ అనడిగితే ఆయన నవ్వి.. ‘షిర్డీ ఒక అడవి ప్రాంతం. అడవి అనేది పాములు స్వేచ్ఛగా భయం లేకుండా తిరిగే ప్రదేశం. మనం మెల్లిగా ఇక్కడి కొచ్చి ఇళ్లు కట్టుకున్నాం. ఉంటున్నాం. అంటే ఏమన్నమాట? అవి ఉన్న ప్రదేశానికి మనం వచ్చాం గానీ, మనమున్న ప్రదేశానికి అవి రావడం లేదు. ఆ కారణంగా వాటిని చంపకూడదు’ అన్నారు. అంచేత ఎవరైనా పాములు కనిపించినా దూరంగా తొలిగిపోతూ ఉండేవారు. ఎప్పుడైనా ఎవరికైనా పాము కాటు సంభవిస్తే షిర్డీలోనే విఠోబా మందిరం (అది ఒక శివాలయానికున్న పేరు) అని ఒకటుంది. అక్కడికి తీసుకెళ్లేవారు బాధితుడ్ని. అక్కడ ఉండే ఒక అర్చకుడు మంత్రాన్ని వేస్తే బతుకుతూ ఉండేవారు సాధారణంగా. అలాగే గడుస్తూ ఉండేవి రోజులు. షిర్డీ వాసులకి పాముల విషయంలో ధైర్యం ఉండటానికీ, రాత్రయినా తెల్లవారుజామైనా ఎక్కడికైనా వెళ్తూ ప్రజలుండగలగడానికీ ఆ విఠోబా మందిరముందనే నమ్మకమే కారణం. ఆ ధైర్యాన్నిచ్చే విఠోబా మందిరానికి తీసుకెళ్లబోతుంటే శ్యామా స్నేహితుడు ‘నిమోణ్కర్’ అనే ఆయన ‘ఇదంతా ఎందుకు? ముందు బాబా దగ్గర కెళ్లి ఆయనిచ్చే ఊదీ (ధునిలో కట్టెలు మండగా వచ్చిన బూడిద– విభూతి అన్నమాట) తీసుకో: అని సూచించాడు. ఆ మాటని వింటూనే శ్యామా ఆ సాయి ఉండే మందిరానికి పరుగులాంటి నడకతో ఎలాగో ఓపిక కూడగట్టుకుని వెళ్లాడు. ఫో! ఫో! మేడమీద బాబా ఉన్నాడని తెలిసిన శ్యామా.. ఆ బాబా సన్నిధికి వెళ్లి పామువిషం దిగిపోయి తాను బతకగలననే ధైర్యంతో విశ్వాసంతో ఉన్నాడో లేదో ఆ సమయంలో బాబా ఈ శ్యామాని చూస్తూనే తీవ్రకోపంతో ... భతుర్ధ్యా(హేయమైన ప్రవర్తన అథమనీచ లక్షణాలు కలిగిన బ్రాహ్మణుడా!) మేడమెట్లు ఎక్కావో ఊరుకోను! పైకెక్కావో జాగ్రత్త! దిగిఫో! ఫో! ఫో!’ అంటూ పెద్ద గొంతుతో అరిచాడు. శ్యామాకే కాదు అతడ్ని అనుసరించి వెళ్లిన అందరికీ ఆశ్చర్యమనిపించింది! విడ్డూరంగా సాయి అలా అనడమేమి? అనే సంశయంతో భక్తులందరూ ఆలోచనలో పడిపోయారు. శ్యామాకయితే మతిపోయింది. ఏం చేయాలో ఆలోచించగల స్థితిలో తన బుద్ధి లేనే లేదు. తీవ్ర శారీరక బాధా, దానికి తోడు సాయిబాబా కంఠస్వరం దాని నిండుగా నిందలూ తిట్లూ కారణం! ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో శారీరకంగానూ మానసికంగానూ కుంగిపోయి నిరాశతో కుప్పకూలిపోయిన శ్యామా గట్టిగా ఎగశ్వాస పీల్చసాగాడు. బలంగా గాలిని పీల్చడమంటే విష తీవ్రత ఊపిరితిత్తుల దాకా వెళ్లి గాలిని సుఖంగా పీల్చుకోలేని స్థితికి రోగిని తీసుకెళ్తోందన్నమాట. సాయి భక్తులందరూ ఈ పరిస్థితిని ఏ తీరుగానూ విశ్లేషించుకోలేక ఉంటూ ఉంటే, కన్నబిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తూ కూడా పోతే పోనీ! అన్నట్లుగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలి? అనే తీరు నిరాశా నిస్పృహలతో ఆ సాయి మందిరాన్ని వెర్రివానిలా చూస్తూ ఉండిపోయాడు. ఈ మసీదు(ద్వారకామాయి) నా పుట్టిల్లు. నేను సాయి కన్నబిడ్డని. సాయి దర్శనానికొచ్చే అందరూ నా సోదరసమానులు. ఏనాడూ అధర్మంగా ప్రవర్తించి ఎరుగను... అనుకుంటూ గుండెనిండుగా దుఃఖాన్ని అనుభవిస్తూ మౌనంగా లోలోపలే కుతకుతలుడికిపోయాడు శ్యామా. బతికే ఆశని వదులుకుని తన జీవితం ముగియబోతోందని గ్రహించుకుని మెల్లగా మేడ దిగేసాడు శ్యామా. ఎప్పుడైతే తాను మేడ దిగేసి సాయికి కనిపించకుండా ఉన్నాడో అప్పుడు సాయి గొంతు అరవడం మానింది. ఆయన శాంతించినట్లుగా శ్యామాకి తోచింది. ప్రాణాలు పోతే పోనీ! అదేదో సాయి సన్నిధిలోనే సాగనీ! తన జీవిత సర్వస్వమూ సాయే అయ్యున్నప్పుడు ఈ మేడ కింద శరీరాన్ని త్యజించడమెందుకు? అనుకుంటూ ఓపిక కూడగట్టుకుని మళ్లీ మేడపైకి వెళ్లాడు. సాయికి కనిపిస్తూ ఆయన దర్శనాన్నే చేస్తూ కింద కూర్చున్నాడు. సాయినే చూస్తూ ఉండిపోయాడు. సాయి శ్యామాని చూస్తూ .. ‘ఈ ఫకీరు నిన్ను రక్షిస్తాడు! ధైర్యంగా ఉండు! నా మీద నమ్మకం ఉంచుకో! ప్రశాంతంగా ఉండు! నీకేమీ కాదు! కలవరపడకు! ఇంటికి వెళ్లు! ఇంటి బయటికి మాత్రం వెళ్లకు!’ అన్నాడు మెత్తని కంఠ స్వరంతో అనుగ్రహిస్తున్నాడనే నమ్మకాన్ని అదే కంఠస్వరంతో కలిగిస్తూ. శ్యామా బాబామాటనే విశ్వసిస్తూ త్రోవలో’ పాముకాటుకి గురైన బాధితులు వెళ్లే విఠోబా మందిరం మీదుగానే వెళ్తూ కూడా ఆ మందిరానికి వెళ్లకుండా తన ఇంటికే చేరాడు. శ్యామా తన ఇల్లు చేరాడో లేదో ‘తాత్యా’ అనే భక్తుడు ఇంటి వద్ద కనిపించాడు శ్యామాకి. ‘శ్యామా! సాయే నన్ను పంపిస్తే వచ్చాను! నిన్ను నిద్రపోవద్దని చెప్పాడు. నీకు నిద్ర రాబోతే నిద్రపోనీయకుండా చూడాల్సిందిగా చుట్టూ ఉన్నవారిని చూడవలసిందన్నాడు. తిండి విషయమా? ఇష్టమైన వేటినైనా సరే తినమన్నాడు! ఒక వేళ నిద్రమత్తుగాని వస్తే పచార్లు చేయవలసిందే తప్ప నిద్ర పోనే పోరాదన్నాడు’ అని చెప్పాడు బాబా మాటలని. కాకా(కాకా సాహెబ్ దీక్షిత్)ని ధైర్యం కోసం రక్షణకోసం ఉండవలసిందని సాయే చెప్తే వచ్చాడు! గమనించు! అని కూడా చెప్పాడు ‘తాత్యా’. సాయి చెప్పినట్లు నచ్చినది తిని – నిద్ర వస్తున్నా కూడా నిద్రపోకుండా నిద్ర వస్తోందన్న అనుమానం వస్తే ‘కాకా’ సహాయంతో పచార్లు చేస్తూ ఎలాగో రాత్రిని నిద్రలేకుండా నిద్రరాకుండా చూసుకుని గడిపేసాడు శ్యామా.తెల్లారేసరికి అతని బాధ తగ్గిపోయింది గానీ ఆ పాము కరిచినచోట మాత్రం కొద్దిగా మంట ఉంది. అప్పుడప్పుడు చురుక్కుమంటూ తానున్నానంటోంది. కొంత పొద్దెక్కేసరికే పూర్తిగా తగ్గిపోయింది. ఎలా తగ్గింది? ఏ మందూ మాకూ వాడలేదు. పైగా బాబానే నమ్ముకున్న శ్యామాని బాబా ఆదరించలేదు సరికదా బిగ్గరగా అరుస్తూ ‘దిగిఫో!’ అన్నాడు కూడా. విఠోబా మందిరంలో ప్రవేశించలేదు కూడా. ఎలా తగ్గినట్టు? బాబా ప్రవర్తనకి లో అర్థమేమిటి?బాబా తన వద్దకొచ్చిన శ్యామాని తిట్టలేదు. ‘భతుర్ధ్యా!’ ‘దిగిఫో’ అన్నాడు. పాముల్లో నాలుగు వర్ణాలు ఉంటాయి. ఏదో తప్పు చేసిన కారణంగా ఓ బ్రాహ్మణునికి మహర్షి ఎవరో ఇచ్చిన శాపం కారణంగా పాముగా జన్మనెత్తిన ఆ పాము ఈ రోజున శ్యామాని కరిచింది. జన్మజన్మల సంబంధాన్ని తెలుసుకోగల జ్ఞాని బాబా. ఈ విషయం రాబోయే కొన్ని భాగాల్లో ఓ భాగంలో ఉదాహరణ పూర్వకంగా తెలుసుకోబోతున్నాం. అందుకని ఓ బ్రాహ్మణ సర్పమా! అప్పుడు తప్పు చేసి పాముగా అయి మళ్లీ నీచకార్యాన్ని (శ్యామాని కరవటం) చేస్తావా? విషరూపంగా ఉన్న నువ్వు దిగిఫో! అని ఆ పాముని మందలించాడు సాయి. ఇది వినడానికీ చదువుకోవడానికీ బాగుండచ్చేమో గానీ నమ్మవీలులేనిదిగా ఉందనిపించవచ్చు. మరి అదే నిజమైతే ‘భతుర్ధ్యా!’ అని ఎందుకు సంబోధించాడు సాయి? మళ్లీ ఆ సాయే శ్యామా మేడమీదికి రాగానే తగ్గిపోతుందనీ శాంతపడతావనీ నిద్రపోవద్దనీ ఎందుకన్నాడు శాంతస్వరంతో. పైగా దీక్షిత్‌ని శ్యామా ఇంటికెందుకు పంపాడు? అందరూ తన నుంచి వెళ్లిపో యేలా చేసుకునీ చూసుకునీ ‘అల్లాహ్(అల్లా అనే పేరుండి విశ్వమంతా నిండిన) హో(అతడు మాత్రమే) మాలిక్! (నాకు సర్వస్వం) అనే తన మంత్రాన్ని శ్యామా కోసం మననం చేస్తూ ఉండిపోయాడు సాయి. వాక్కుకి ఓ శక్తి అనేది రావాలంటే తాను నమ్మిన మంత్రాన్ని మననం చేసినప్పుడే అది సాధ్యం. అంతకుముందే ఉన్న మంత్రశక్తితో శ్యామాకున్న ప్రాణవాయువుని పోకుండా నిరోధించి, తాను చేస్తున్న మంత్ర మనన శక్తితో శ్యామా బాధనీ ఆందోళననీ విషతీవ్రతనీ తగ్గించాడు సాయి. అందుకే సాయికి ఈ విషతీవ్రతని నిరోధించడానికి ఓ రాత్రి రాత్రంతా పట్టింది. వాక్కులో మంత్ర మననశక్తి ప్రవేశిస్తే అది అనుగ్రహం కారణంగా వరంగా ఆగ్రహం కారణంగా శాపంగా మారుతుంది. అందుకే తమ సంతానాన్ని ఆశీర్వదించవలసిన అవసరం వచ్చినప్పుడు తల్లులు కొంతసేపైనా మంత్రమననాన్ని చేసి ‘బాగా పరీక్షలు వ్రాయి!’ సుఖంగా ప్రయాణం సాగాలి! అంటూ ఇలా ఆశీర్వదిస్తే అవి నెరవేరతాయి. ఒట్టిగా ‘విష్యూ ఆల్ ది బెస్ట్’ వంటి మాటలు గాలిలో కలిసి ఏ ప్రయోజనాన్ని కలిగించవు. ప్రాణవాయువు మీద ఆధిపత్యమున్న సాయి కొందరి ప్రాణవాయువుని తొలగించిన సందర్భాలనీ చూద్దాం! –సశేషం -
‘సామాజిక’ ప్రభావంపై ఈసీ విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో సామాజిక మాధ్యమాలకు ఎన్నికల ఫివర్ పట్టుకుంది. ఫేస్బుక్, ట్వీట్టర్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఎన్నికల ప్రచారం, ప్రత్యర్థులపై ఆరోపణలు ప్రత్యారోపణల కోసం అధికార, విపక్ష పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీల ఐటీ విభాగాలు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఈ మాధ్యమాల వాడకం భారీగా పెరిగి ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని విశ్లేషించేందుకు వాటి ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా సోషల్ మీడియా పర్యవేక్షణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో భాగంగా సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ విభాగం ఏర్పాటైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న ఈ విభాగం ఈ మాధ్యమాల్లో ఎన్నికల ప్రచార సరళిని విశ్లేషించి రోజువారీ నివేదికలు అందజేస్తుంది. సమాచార విశ్లేషణ (డేటా అనలిటిక్స్) టెక్నాలజీ రంగంలో నైపుణ్యం కలిగిన ఓ ప్రైవేట్ ఐటీ కన్సల్టెన్సీకి ఈసీ ఈ బాధ్యతను అప్పగించింది. 15 రోజుల నివేదిక సమర్పణ... ఎన్నికల ప్రచార విశ్లేషణలో భాగంగా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మంత్రులు, 31 జిల్లాల కలెక్టర్లకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలపై సైతం ఈ విభాగం దృష్టి పెట్టింది. ఈ ఖాతాల ద్వారా జరుగుతున్న ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తున్న లైక్‌లు, షేర్ల సంఖ్య, కామెంట్ల ఆధారంగా ప్రచార సరళిని కన్సల్టెన్సీ రోజువారీగా విశ్లేషిస్తోంది. పార్టీల సామాన్య కార్యకర్తలు పెడుతున్న రాజకీయ పోస్టుల్లో కొన్నింటిని ప్రింట్ తీసి రోజువారీ నివేదికలతో జత చేసి సీఈఓ కార్యాలయానికి సమర్పిస్తోంది. గత నెల 27న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి 15 రోజుల వరకు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మాధ్యమాల వేదికగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సరళిపై ఇప్పటికే ఈ కన్సల్టెన్సీ నివేదికను సమర్పించింది. ప్రజలకు అవుతున్న చేరువ ఆధారంగా ఎన్నికలపై ట్విట్టర్ 60 శాతం, ఫేస్బుక్ 30 శాతం, యూట్యూబ్ 1 శాతం ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికలకు సంబంధించి ట్వీట్టర్, గూగుల్ ట్రెండ్స్‌లో రోజువారీగా ఏఏ అంశాలకు అధిక ప్రాచుర్యం లభిస్తోంది అన్న సమాచారాన్ని సేకరించి సీఈఓ కార్యాలయానికి సమర్పించే నివేదికల్లో పొందుపరుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార సరళిని విశ్లేషించడానికే ఈ విభాగం పని చేస్తోందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సామాజిక మాధ్యమాల్లో జరిగే అభ్యంతరకర, అసభ్యకర ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నింటినీ గుర్తించి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తెలిపాయి. ఇలాంటి పోస్టులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకోగలమని, ఫిర్యాదులపై సైబర్ పోలీస్ విభాగం దర్యాప్తు చేయనుందని ఓ అధికారి తెలిపారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్‌లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్‌లైన్‌లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్‌లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్‌లైన్‌లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : జిల్లాలోని రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. స్థానిక జెడ్పీ హాల్లో మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఏఓలు, ఏఈఓలకు రైతు బీమా పథకంపై మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఏదైని కారణంలో మరణిస్తే వారి కుటుంబాలకు ఉపశమనం కోసం బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 14వ తేదీ వర్తిస్తుందన్నారు. ఈ పథకం అమలులో వ్యవసాయ అధికారులు కీలకపాత్ర పోషించాలన్నారు. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ లేకుంటే జూలై 1వ తేదీగా నమోదు చేయాలన్నారు. రైతు కుటుంబ సభ్యుల పేర్లు, నామినీ పేర్లు నమోదు చేయాలన్నారు. నామినేషన్ వివరాలతో పాటు అర్హులైన రైతుల వివరాలు ఏఈఓలు నామినేషన్ ఫారంలో సేకరించాల్సి ఉంటుందన్నారు. డీఏఓ, ఏడీఏ, ఏఓల పర్యవేక్షణలో ఏఈఓ రైతుల వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో డీఏఓలు సుచరిత, గోవింద్‌నాయక్ పాల్గొన్నారు. -
ఇక స్మార్ట్ పాలన..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన కొత్త పుంతలు తొక్కనుంది. క్షేత్రస్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ‘స్మార్ట్’గా పరిపాలన నిర్వహించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శైలేంద్ర కుమార్ జోషి ఈ దిశగా సరికొత్త ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ తరహాలో సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసేందుకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, వాటి అమలు తీరును పర్యవేక్షించేందుకు వీలుగా ఈ కంట్రోల్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగా గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలు మొదలు రాష్ట్రస్థాయి వరకు ప్రతి సమాచారం అందుబాటులో ఉండేలా డేటాబేస్‌ను రూపొందిస్తున్నారు. తదుపరి ప్రక్రియలో గ్రామ, జిల్లాస్థాయి నుంచి ప్రజల సమస్యలు, క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును సచివాలయం నుంచే ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, పనుల పురోగతి, నీటి నిల్వలు, నీటి విడుదల తదితర వివరాలన్నీ సచివాలయం నుంచే పర్యవేక్షించే వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా డిజిటల్ మానిటరింగ్ విధానంలో జిల్లాల కలెక్టరేట్లు, జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలను సచివాలయం నుంచే అనుసంధానిస్తారు. ఇంటిగ్రేటేడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పేరుతో కొత్త పరిపాలన విధానానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. సిమ్ కార్డులు.. స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ పరిపాలనలో భాగంగా అధికారులందరికీ స్మార్ట్ఫోన్లు, శాశ్వత సిమ్ కార్డులు అందించనున్నారు. సీఎస్, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని విభాగాల హెచ్వోడీలు మొదలు కలెక్టర్లు, జిల్లాల్లో అన్ని విభాగాల అధికారులంద రూ ఒకే నెట్‌వర్క్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. అందరికీ ఐడియా సిమ్ కార్డులను అందజేయాలని నిర్ణయించారు. 711 సిరీస్‌తో ఈ నంబర్లు ప్రారంభమవుతాయి. అధికారులు బదిలీపై వెళ్లినా ఆ హోదాలో ఉన్న అధికారికి తిరిగి అదే నంబర్ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. దీంతో ప్రజలకు అధికారుల నంబర్లు తెలియడంతోపాటు ఎప్పటికప్పుడు సమాచారం పంచుకునే వీలుంటుందని భావిస్తున్నారు. వేగంగా సమాచార మార్పిడి జరిగేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొం దించాలని నిర్ణయించారు. స్మార్ట్ఫోన్లను సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. అత్యవసరమైతే నేరుగా సీఎస్ సంబంధిత అధికారితో వీడియో కాల్లో మాట్లాడేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. -
ప్రాణాలు పోతున్నా పట్టదా?
సాక్షి, హైదరాబాద్ :ప్రజల ప్రాణాలను తీసే ప్రమాదకర ఔషధ ప్రయోగాల (క్లినికల్ ట్రయల్స్)పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. పేద ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రయోగ కేంద్రాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా చేస్తున్న ఔషధ ప్రయోగాలతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఔషధ ప్రయోగాలపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రమాదకర ప్రయోగాల కారణంగా కొందరు మృత్యువాతపడటంతోపాటు పలువురు పేదలు తీవ్ర అనారోగ్యానికి గురైన సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూసినప్పటికీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కనీస మాత్రంగా స్పందించడంలేదనే విమర్శలు పెరుగుతున్నాయి. బాధితులకు చట్ట ప్రకారం అండగా నిలవాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ ఇవేమీ చేయడంలేదు. 2017 జూన్‌లో కరీంనగర్ జిల్లాలో ఔషధ ప్రయోగాల కారణంగా యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కలకలం సృష్టించాయి. అప్పట్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఔషధ ప్రయోగాలపై రాష్ట్ర స్థాయిలో నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించేందుకు 2017 జూలై 5న ఏడుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 30 రోజులలోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. కమిటీ ఏర్పాటై ఏడు నెలలు గడిచింది. అయితే కమిటీ ఇప్పటికీ నివేదిక రూపొందించలేదు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టడం ఇప్పట్లో జరిగే పనిగా కనిపించడంలేదని వైద్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఔషధ ప్రయోగాల బాధితులు పెరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ చర్యలకు వీలు.. ఔషధ ప్రయోగాల నియంత్రణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని పేర్కొంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలోని పలు విభాగాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర స్థాయిలోనూ ప్రయోగాలపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది. సహేతుక మార్గంలోనే ఔషధ ప్రయోగాలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రయోగాలకు అంగీకరిస్తున్నట్లుగా... ఆయా వ్యక్తులనుంచి రాత పూర్వకంగా, వీడియో రూపంలో సమ్మతిని తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రయోగాలకు అంగీకరించిన వ్యక్తుల పేర్లు, ఇతర వివరాలను కచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలి. జోనల్ కార్యాలయాల పరిధిలో ఔషధ ప్రయోగాలు నిర్వహించే కేంద్రాల వివరాలను నమోదు చేయాలి. ఉన్నత స్థాయి కమిటీలను నియమించి ప్రయోగాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ జనరల్ కార్యాలయం 2013 ఏప్రిల్ 26న అన్ని జోనల్ కార్యాలయాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో కూడా కేంద్ర ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ జోనల్ కార్యాలయం ఉంది. అయితే మన రాష్ట్రంలోనే అనుమతిలేని ఔషధ ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలా జరుగుతున్నాయా? లేక తెలిసీ అధికారులు పట్టించుకోవడంలేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు బేఖాతరు.. ఫార్మసీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ఔషధాలను తయారు చేసి వీటిని ప్రయోగించే కాంట్రాక్టును పరీక్ష కేంద్రాలకు ఇస్తుంటాయి. ఆయా పరీక్ష కేంద్రాలు వ్యక్తులపై వాటిని ప్రయోగించి తుది ఫలితాలను క్రోడీకరిస్తాయి. దేశ వ్యాప్తంగా 84 ప్రయోగ కేంద్రాలు ఉండగా, తెలంగాణలో తొమ్మిది ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉంది. ఔషధ ప్రయోగ కేంద్రాలు... డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (డీసీవో) నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ కేంద్రాలు అనేక సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, వయసు, ప్రయోగించే ఔషధానికి శరీరం తట్టుకుంటుందా లేదా అనే అంశాలను పట్టించుకోకుండానే ఇష్టారాజ్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. వ్యక్తుల వివరాలను నమోదు చేయకపోవడంతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా ఎవరు బాధితులో తెలియడంలేదు. రాష్ట్రంలో ఔషధ ప్రయోగాల బాధితులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.