ఇసుకపై టీఎస్‌ఎండీసీ పర్యవేక్షణ | tsmdc Monitoring on sand | Sakshi
Sakshi News home page

ఇసుకపై టీఎస్‌ఎండీసీ పర్యవేక్షణ

Published Sat, Dec 13 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

tsmdc Monitoring on sand

సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన ఇసుకను సులభమైన పద్ధతిలో ప్రజలకు చేరవేసేలా కొత్త విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు ఇసుక, గనులపై నూతన పాలసీని ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఈ పాలసీ ప్రకారం ఇకపై స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను విక్రయిస్తారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహిస్తారు. ఇసుక రీచ్‌లను ప్రభుత్వం ఐదు కేటగిరీలుగా వర్గీకరించింది. మొదటి విభాగం లో వాగులు, వంకలను చేర్చింది. వీటిపై అధికారాన్ని పంచాయతీలకే కట్టబెట్టింది. స్థానిక గృహా వసరాలకు, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు సీనరేజీ ఫీజు లేకుండానే ఇక్కడి ఇసుకను వినియోగించుకోవచ్చు. ఇసుక తోడేందుకు, రవాణాకు యంత్రాలను వినియోగించకూడదు. అలాగే ఆ గ్రామ పరిధి దాటి ఇసుకను రవాణా చేయకూడదు. ఐదో విభాగంలో కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులను చేర్చారు.
 
 ఇసుక లభ్యమయ్యే రీచ్‌లను ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సహకారంతో గనులు, భూగర్భ వనరుల శాఖ గుర్తిస్తుంది. ప్రాథమికంగా గుర్తించిన తర్వాత సాధ్యాసాధ్యాల నివేదికను జాయింట్ కలెక్టర్ సారథ్యంలోని జిల్లా స్థాయి కమిటీ సిద్ధం చేస్తుం ది. సాధ్యమయ్యే రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, నియంత్రణ, రవాణాను టీఎస్‌ఎండీసీ పర్యవేక్షిస్తుంది. నీటి పారుదల విభాగం సూచనల మేర కు పూడిక పేరుకుపోయిన రిజర్వాయర్లలో లభ్యమయ్యే ఇసుకను సైతం తవ్వి తోడేందుకు అవకాశముంది. ఈ ఇసుకను టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలోని స్టాక్ యార్డులకు తరలించాల్సి ఉం టుంది. రీచ్‌కు దగ్గరలో గానీ పట్టణ ప్రాంతాలు, కార్పొరేషన్ల శివార్లలోగానీ ఈ యార్డులను ఏర్పా టుచేస్తారు. యార్డుల్లో ఇసుక విక్రయాలను సీసీ టీవీల ద్వారా పర్యవేక్షిస్తారు. ఇసుక రవాణా చేసేందుకు స్టాంపు, తేదీతో పాటు సెక్యూరిటీ సీల్‌తో ఉన్న వేబిల్లులను టీఎస్‌ఎండీసీ జారీ చేస్తుంది. ఇసుక రవాణా చేసే వాహనాలను జీపీఎస్ విధానంలో పర్యవేక్షిస్తారు. పట్టా భూముల్లోనూ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతివ్వనుంది. తవ్వకాల సమయంలో సరిహద్దులు మీరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. సీనరేజీ ఫీజు ఇబ్బడి ముబ్బడిగా విధించకుండా టీఎస్‌ఎండీసీ నిర్ణయించిన రేటు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు రాతి ఇసుక వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాతి ఇసుక వాడకం పెరిగితే సాధారణ ఇసుకకు డిమాండ్ తగ్గిపోతుందని అంచనా వేసింది. అందుకే రాతి ఇసుక యూనిట్లను పరిశ్రమల కేటగిరీలో చేర్చి.. వాటిని స్థాపించేందుకు వాట్ మినహాయింపు, విద్యుత్తు సబ్సిడీ తదితర రాయితీలు కల్పిస్తామని ప్రకటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement