సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటు భవన నిర్మాణ రంగం పనులు తిరిగి ఊపందుకుంటున్నాయి. రెండు నెలల పాటు పనులు నిలిపేసిన నిర్మాణ సంస్థలు తిరిగి తమ కార్యకలాపాలను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో నిర్మాణ సామగ్రిలో అత్యంత కీలకమైన ఇసుకకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే కోవిడ్‌తో నష్టపోయిన నిర్మాణదారులు వానాకాలం ప్రారంభం కావడంతో రాబోయే రోజుల్లో ఇసుక కొరత తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వానాకాలంలోనూ ఇసుక సరఫరాలో అంతరాయం లేకుండా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
గతేడాది అనుభవంతో..!
గతేడాది కూడా వానాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా టీఎస్‌ఎండీసీ ముందస్తుగా స్టాక్ యార్డుల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్లు నిల్వ చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ప్రణాళిక అమల్లో ఆలస్యంతో పాటు భారీ వర్షాల మూలంగా ఇబ్బందులు తలెత్తాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది 3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 19 జిల్లాల పరిధిలోని 52 స్టాక్ యార్డుల్లో 41.18 లక్షల క్యూబిక్ మీటర్లు ఇప్పటికే నిల్వ ఉండగా, 34 రీచ్‌ల్లో ఇంకా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు సరిహద్దు జిల్లాల్లోని నిర్మాణ రంగం కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని వట్టినాగులపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, భౌరంపేటలో టీఎస్‌ఎండీసీ సబ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసింది. సబ్ స్టాక్ యార్డుల్లోనూ వానాకాలం అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఎండీసీ పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేస్తోంది.
అదనపు స్టాక్ యార్డులు.. కొత్త రీచ్‌లు
వానాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా ఈ ఏడాది స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు పెంచడంతో పాటు, రీచ్‌లకు వెళ్లే మార్గాలను మెరుగు పరిచాం. మెరుగైన రోడ్డు వసతి ఉన్న చోట కొత్త స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో ఉన్న ఇసుక డిమాండును దృష్టిలో పెట్టుకుని సబ్ స్టాక్ యార్డుల్లోనూ నిల్వ చేస్తున్నాం. కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు లభించాయి. మరో 31 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం. – జి.మల్సూర్, వీసీ అండ్ ఎండీ, టీఎస్‌ఐఐసీ
Comments
Please login to add a commentAdd a comment