TSMDC
-
ఇసుక దోపిడీ రూ.100 కోట్లు.. పట్టించుకోని టీఎస్ఎండీసీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో నకిలీ వే బిల్లులతో రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ మార్గంలో తరలిపోతోందని వరంగల్ కమిషనరేట్ పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా మూలంగా రెండున్నరేళ్లలో సుమారు రూ.100 కోట్లకుపైగా ఆదాయం పక్క దారి పట్టినట్లు తెలుస్తోంది. టీఎస్ఎండీసీ పర్యవేక్షణలోనే నకిలీ వే బిల్లుల దందా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం. కొందరు ఇసుక రవాణాదారులు, టీఎస్ఎండీసీ అధికారులు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ములుగు నుంచి తీగలాగితే... రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 34 యాక్టివ్ ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. ఇసుక లభ్యత ఉన్నచోట స్థానికులకు భాగస్వామ్యం కల్పించి టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో క్వారీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ములుగు జిల్లాలోని మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో 6 ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి నిత్యం 300 నుంచి 600 లారీలు లోడింగ్ అవుతున్నాయి. 15 రోజుల క్రితం ములుగు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇసుక లారీని వరంగల్‌లో పోలీసులు తనిఖీ చేశారు. నకిలీ వేబిల్లులతో తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా.. యజమానికి 8 లారీలు ఉన్నాయని, ఏటూరునాగారం, వాజేడు ప్రాంతాల్లో యజమాని చెప్పిన చోటుకు వెళ్లి లోడింగ్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. దీంతో స్లాట్ బుకింగ్ చేసుకోకుండా నేరుగా లోడింగ్ చేసుకోవడం,, డబ్బులు చెల్లించడమేంటని పోలీసులకు అనుమానం వచ్చి టాస్‌్కఫోర్స్ అధికారులకు కేసును అప్పగించారు. రూపాయి చెల్లించకుండా 30 టన్నుల ఇసుక ములుగు, ఏటూరు ప్రాంతంనుంచి వచ్చే ఇసుక లారీలపై పోలీసులు నిఘా పెట్టారు. వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జనగాం తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి దాదాపు 40 లారీలను స్వాదీనం చేసుకున్నారు. 12 టైర్ల లారీలో 26 టన్నుల ఇసుక నింపుకుంటే రూ.10,500 చెల్లించాల్సిన కొందరు లారీ యజమానులు నకిలీ వేబిల్లులతో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా 26 నుంచి 30 టన్నులు తీసుకెళ్లినట్లు తేలింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి వారినుంచి 16 లారీలు, 65 నకిలీ వే బిల్లులు, 16 టీఎస్ఎండీసీ స్టాంపులు, 1 లాప్ టాప్, 11 సెల్ఫోన్లు, రూ. 41,000ల నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక కొందరు టీఎస్ఎండీసీ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతి క్వారీ వద్ద టీఎస్ఎండీసీకి చెందిన సూపర్వైజర్ ఉంటారు. వీరి ప్రమేయం లేకుండా ఇసుక లారీ బయటకు వెళ్లే ప్రసక్తే ఉండదు. కొందరు అధికారులు, క్వారీ నిర్వాహకులు, లారీల యజమానులు కలిసే అక్రమ దందా కొనసాగిస్తున్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 3 నెలల్లో 1800 లారీల ఇసుక అక్రమ తరలింపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచే మూడు నెలల్లో 1800 లారీల ఇసుక ఎలాంటి సొమ్ము చెల్లించకుండా తరలినట్లు పోలీ సు విచారణలో తేలగా, రెండున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 యాక్టివ్ రీచ్‌ల నుంచి రూ.100 కోట్లకు పైగా వి లువచేసే ఇసుక తరలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఇసుక రీచ్‌లు అక్రమ రవాణాకు అడ్డా..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల పేరిట నదులు, వాగుల నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ దందాలో తవ్వేకొద్దీ అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. ఇసుక దోపిడీపై ‘మారీచులు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన పరిశోధనాత్మక కథనానికి స్పందించిన టీఎస్ఎండీసీ నిబంధనల మేరకే తవ్వకాలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చింది. కానీ అటు టీఎస్ఎండీసీ, ఇటు జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ఉండే ఇసుక వనరులన్నీ అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి. స్థానిక అవసరాల కోసం ఒకటి, రెండు, మూడో కేటగిరీ వనరుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్న జిల్లా యంత్రాంగం.. అక్రమ రవాణాను పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల ప్రజాప్రతినిధులే ఇసుక అక్రమ రవాణా దందా సాగిస్తుండగా.. ప్రభుత్వ శాఖల సిబ్బంది చూసీ చూడనట్టు ఉంటున్నారు. ముఖ్యంగా కొందరు కిందిస్థాయి పోలీసు, రెవెన్యూ అధికారులు అక్రమ వ్యాపారానికి అండగా నిలుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది పోస్టింగుల్లో కొందరు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నట్టు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. రీచ్‌ల నుంచి మొదలుకుని.. టీఎస్ఎండీసీ 4, 5 కేటగిరీ క్వారీల ద్వారా ఇసుకను వెలికితీస్తూ.. ‘శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ ద్వారా విక్రయిస్తోంది. ఆన్ లైన్ చెల్లింపులు, అనుమతులు జారీ చేస్తున్నా స్టాక్ పాయింట్లు, వేబ్రిడ్జీల వద్ద కొందరు సిబ్బంది.. ఈ వ్యవస్థ లోని లోపాలను అనువుగా మల్చుకుం టున్నారు. రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద ప్రాజెక్టు అధికారులు (పీవోలు) ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వసూళ్లు సాగిస్తున్నారు. బినామీల చేతుల్లో సొసైటీలు, రీచ్‌లు అన్ని కేటగిరీలకు చెందిన ఇసుక రీచ్‌లు కూడా ప్రజాప్రతినిధులు లేదా వారి బినామీల కనుసన్నల్లోనే కొనసాగుతున్నట్టు ‘సాక్షి’ పరిశోధనలో వెల్లడైంది. గిరిజన సహకార సొసైటీల పేరిట కొన్ని ప్రైవేటు నిర్మాణ సంస్థలు ఇసుకను లూటీ చేస్తున్నాయి. అంతేకాదు గిరిజన సొసైటీలకు కేటాయించిన రీచ్‌లలో యంత్రాలను వినియోగించకూడదన్న నిబంధన కూడా అమలు కావడం లేదు. జియో కోఆర్డినేట్స్ ప్రకారమే తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నా.. ప్రభుత్వపరంగా తవ్వకాలపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. చాలాచోట్ల రీచ్‌ల వద్ద ప్రైవేటు వ్యక్తులు కాపలాగా ఉంటూ అటువైపు ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అటువైపు వెళ్లినవారిపై దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారులు.. తమను అడ్డుకున్న వారిని వాహనాలతో ఢీకొట్టించి, చంపారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు నామ్కేవాస్తేనే.. స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని టీఎస్ఎండీసీ చెప్తోంది. కానీ చాలాచోట్ల సీసీ కెమెరాల వ్యవస్థ నామ్‌కే వాస్తేగా మారింది. పీవోలు లారీలు, ట్రాక్టర్లలో అదనపు బకెట్లు ఇసుక నింపడం, సీరియల్ నంబర్ ముందు వచ్చేలా చూడటం ద్వారా జేబులు నింపుకొంటున్నారు. అనుమతి పొందిన పరిణామం కంటే ఎక్కువ ఇసుక నింపడం ద్వారా రూ.2 వేల వరకు, సీరియల్ నంబర్ త్వరగా వచ్చేందుకు రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. తగిన సంఖ్యలో టీఎస్ఎండీసీ అధికారిక వేబ్రిడ్జిలు లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. ఒకే నంబరు కలిగిన లారీలు, నకిలీ వేబిల్లుల ద్వారా రవాణా వంటి ఘటనలపై ములుగు, మహదేవపూర్, కాటారం, స్టేషన్ ఘనపూర్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ప్రాజెక్టుల పేరిట తరలివెళ్తున్న ఇసుక గమ్యస్థానానికి చేరుతుందో, లేదో తెలుసుకునే పటిష్ట పర్యవేక్షక వ్యవస్థ కొరవడింది. మైనింగ్, రెవెన్యూ, పోలీసు, రవాణా అధికారుల నడుమ సమన్వయ లోపం అక్రమార్కులకు అనుకూలంగా మారింది. చదవండి:కేపీహెచ్‌బీ–హైటెక్‌సిటీ ఆర్యూబీని ప్రారంభించిన కేటీఆర్ -
పేట్రేగిన ఇసుక మాఫియా.. అడ్డంగా దోచేస్తున్నారు!
రాష్ట్రవ్యాప్తంగా చిన్న వాగులు, వంకలు మొదలు నదుల్లోని పెద్ద రీచ్‌ల వరకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. చిన్న ఇల్లు కట్టుకునే వారికి ఒక లారీ ఇసుక దొరకడమే కష్టమైతే.. మరోవైపు అక్రమార్కులు రాత్రీపగలూ తేడా లేకుండా వేలకొద్దీ లారీల్లో, ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. పేరుకు ఏదో ప్రభుత్వ పథకానికో, మరేదో స్కీమ్కో అని అనుమతులు తీసుకోవడం..లారీలు, ట్రాక్టర్లలో పరిమితికి మించి ఇసుక నింపి తరలించడం.. తీసుకెళ్లి బహిరంగ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముకోవడం పరిపాటి అయిపోయింది. యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాపై ‘సాక్షి’ ప్రత్యేకంగా పరిశీలన చేపట్టింది. అడ్డగోలుగా ఇసుక ఎలా తరలిపోతోంది, ఎక్కడెక్కడ, ఎలా అక్రమాలు జరుగుతున్నాయి, ఇసుక పాలసీలో లోపాలను ఎలా వాడుకుంటున్నారన్నది నిశితంగా పరిశీలించింది. అందులో గుర్తించిన అంశాలతో పరిశోధనాత్మక కథనం.. కల్వల మల్లికార్జున్ రెడ్డి, సాక్షి నెట్వర్క్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి సమీపంలోని బిక్కేరు వాగు నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్లు ఇవి. బిక్కేరు వాగు కేంద్రంగా నాగారం, అర్వపల్లి, తిరుమలగిరి మండలాల్లో ప్రభుత్వ పథకాల పేరిట అనుమతులు తీసుకుని ఇసుకను ప్రైవేటు మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ.3500 నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా రాత్రివేళ కూడా ఇష్టమొచ్చినట్టు ఇసుక తవ్వేస్తున్నారు. ఇసుక తరలించే కొన్ని ట్రాక్టర్లు, ట్రాలీలకు నంబర్లు కూడా లేకపోవడం గమనార్హం. ఈయన ఓ రైతు... అక్కడా, ఇక్కడా డబ్బులు కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటున్నాడు. పునాది, పిల్లర్లు వేశాడు. శ్లాబ్ పని మొదలైంది. కానీ సమయానికి ఇసుక దొరక్క నిర్మాణం లేటవుతోంది. ఆన్లైన్లో బుక్ చేసుకుందామనుకుంటే.. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దొరకడం లేదు. తప్పనిసరిగా అడ్డగోలు రేటు పెట్టి బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వం నిర్ణయించిన రేటు లెక్కన అయితే.. ఒక లారీ ఇసుక (18 టన్నులు) సుమారు రూ. పది వేల వరకు ఉంటుంది. కానీ బ్లాక్‌లో ఏకంగా రూ.40 వేల దాకా చెల్లించి తీసుకోవాల్సి వస్తోంది. అది కూడా సమయానికి దొరకడం లేదు. ఇటు ఖర్చు పెరిగిపోయి, అటు నిర్మాణం ఆలస్యమై.. ఆయన ఉసూరుమంటున్నాడు. జరగాల్సిందేంటి.. ప్రస్తుతం రాష్ట్రంలో 37 రీచ్‌ల నుంచి రోజూ సగటున 50వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. వెలికి తీసిన ఇసుకను సమీపంలోని స్టాక్ పాయింట్లకు తరలించి ఆన్లైన్ బుకింగ్ ద్వారా అమ్ముతోంది. ఈ విధానంలో ట్రాక్టర్‌కు 3.5 టన్నులు, 10 టైర్ల లారీకి (12 క్యూబిక్ మీటర్లు, 18 టన్నులు), 12 టైర్ల లారీకి (16 క్యూ.మీ, 26 టన్నులు), 14 టైర్ల లారీకి (20 క్యూ.మీ, 32 టన్నులు), 16 టైర్ల లారీకి (22 క్యూ.మీ, 35 టన్నులు) ఇసుక పరిమితి ఉంటుంది. ఒక్కో టన్నుకు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. జరుగుతున్నది ఇదీ... స్లాట్ బుకింగ్‌తోనే మొదలు... ఆన్లైన్లో కొద్దిరోజుల పాటుతవ్వే ఇసుకకు సంబంధించిన స్లాట్ బుకింగ్ కేవలం ఐదు, పది నిమిషాల వ్యవధిలోనే ముగుస్తోంది. స్లాట్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై సాధారణ వినియోగదారుడికి అవగాహన లేకపోవడం దళారులకు వరంగా మారింది. దళారులు, మరికొందరితో కలిసి వినియోగదారుల మాదిరిగా ఇసుకను బుక్ చేస్తున్నారు. దానిని బహిరంగ మార్కెట్‌కు తరలించి అమ్ముకుం టున్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బందికి వాటాలు ముట్ట జెప్తున్నారు. ఇక మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు కూడా స్లాట్ బుకింగ్ వరంగా మారింది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌తోపాటు డబ్బులను కూడా వారే చెల్లించి.. డిమాండును బట్టి ఒక్కో డీడీకి రూ.3వేల నుంచి రూ.7వేల వరకు అదనంగా వసూలు చేసుకుంటున్నారు. తవ్వేది ఎక్కువ..చూపేది తక్కువ రీచ్‌లలో అనుమతుల మేరకు తవ్వకాలు, ఆన్లైన్లో బుక్ చేసిన పరిమాణాన్ని మాత్రమే లారీలు, ట్రాక్టర్లలో నింపడం, వరుస క్రమాన్ని పాటించడం టీఎస్ఎండీసీ పర్యవేక్షణలో జరగాలి. రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద పర్యవేక్షణ కోసం టీఎస్ఎండీసీ ప్రాజెక్టు అధికారులను (పీఓ) నియమించింది. రీచ్‌లలో ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాలను బట్టి ఇసుక తరలింపు పరిమితి ఉంటుంది. కానీ ఇష్టమొచ్చినట్టుగా టన్నుల కొద్దీ అదనంగా ఇసుక నింపి తరలిస్తున్నారు. ఇలా రోజూ వేలాది లారీల్లో అదనంగా ఇసుక తరలుతుండటంతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇక.. స్టాక్ పాయింట్ల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సినప్పుడు సీరియల్ నంబర్ త్వరగా వచ్చేందుకు ఒక్కో లారీకి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒకే పర్మిషన్తో, ఒకే నంబర్.. పదుల ట్రిప్పుల్లో ఇసుక కేవలం ఒకే పర్మిషన్తో, ఒకే నంబర్ఉన్న వేర్వేరు లారీలతో పదుల సంఖ్యలో ఇసుక తరలించి సొమ్ము చేసుకుం టున్నారు. ఇందుకు కొందరు సిబ్బంది సహకరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఇప్పటికే పలుమార్లు లారీలు పట్టుబడ్డాయి కూడా. ‘వే బ్రిడ్జి’లలో బరువు మారుస్తూ.. అదనంగా నింపుకున్న ఇసుకతో బయలుదేరే లారీలకు దొంగ వేబిల్లులు తీసుకుంటున్నారు. పరిమితి మేరకే లోడ్ ఉన్నట్టుగా చూపుతున్నారు. కొందరు వేబిల్లుల నిర్వాహకులు సహకరిస్తూ తప్పుడు తూకాలు నమోదు చేస్తున్నారు. టీఎస్ఎండీసీ ద్వారా రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద వేబ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి. కానీ 13 చోట్ల మాత్రమే పనిచేస్తున్నాయి. గిరిజన సహకార సొసైటీల ముసుగులో.. 1998 నాటి పంచాయతీరాజ్ చట్టం నిబంధనల ప్రకారం.. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే మైనింగ్ లీజు ఇవ్వాలని నిబంధనలు చెప్తున్నాయి. నదీ సంరక్షణ నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాల్లో యంత్రాలను వినియోగించకూడదు. అయితే కొన్ని ఇన్ఫ్రా కంపెనీలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టుల రూపంలో గిరిజనులకు కేటాయించిన ఇసుక క్వారీలను చేజిక్కించుకుంటున్నారు. ములుగు జిల్లాలోని పలు గిరిజన సొసైటీల్లో జరుగుతున్న ఈ తరహా అక్రమాలపై గతంలో టీఎస్ఎండీసీకి ఫిర్యాదులు కూడా అందాయి. మణుగూరు ప్రాంతంలోని నాలుగు గిరిజన సొసైటీల లైసెన్సులు కూడా ఇతరుల చేతుల్లోనే ఉన్నాయి. ఇక.. రీచ్‌లలో ఎంత విస్తీర్ణంలో ఎంత పరిమాణంలో ఇసుక వెలికి తీశారనే లెక్కల్లోనూ తేడాలు ఉన్నట్టు తెలిసింది. మారీచులు! ఇసుక విధానంలో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ‘ఇసుక మాఫియా’ చెలరేగుతోంది. ప్రభుత్వ ఖజానాకు కాసులు కురిపించాల్సిన ఇసుక తవ్వకాలు అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. డబ్బుల కక్కుర్తితో ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్టు ఉంటుండటంతో అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. ఓవైపు ప్రభుత్వ పథకాల పేరిట వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వేస్తుంటే.. కృష్ణా, గోదావరి, ఇతర నదులు కేంద్రంగా సాగుతున్న ఆన్లైన్ ఇసుక విక్రయాల్లోనూ భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. రీచ్‌లలో తవ్వకాలు మొదలుకుని స్టాక్ పాయింట్లకు తరలింపు, విక్రయాలు, తూకం వంటివాటిలో లొసుగులు ఇసుక వ్యాపారులకు వరంగా మారాయి. ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణ లోపం ఓవైపు, కొందరు అధికారులు, సిబ్బంది అక్రమాల్లో భాగస్వాములు కావడం మరోవైపు అక్రమార్కులకు కలిసి వస్తోంది. అంతేకాదు ఈ ఇసుక దందా అంతా కొందరు రాజకీయ నాయకుల పర్యవేక్షణలోనే కొనసాగుతోందని.. దాంతో చాలాచోట్ల అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉందని అంటున్నారు. ‘రీచ్’లలో అక్రమార్కులతో కలిసి.. ఇసుక విక్రయాల్లో పారదర్శకత పాటించడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘శాండ్ మైనింగ్ పాలసీ–2014’ను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర అవతరణకు ముందు ఇసుక రీచ్‌లను లాటరీ పద్దతిలో కేటాయించగా.. కొత్త పాలసీ కింద టెండర్ విధానంలో అప్పగిస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) జిల్లాస్థాయి కమిటీల ద్వారా రీచ్‌లను గుర్తించి.. కాంట్రాక్టరుకు తవ్వకాల బాధ్యత ఇస్తోంది. కాంట్రాక్టర్లు ఇసుకను తోడి సమీపంలోని స్టాక్ యార్డుకు తరలిస్తారు. ఈ ఇసుకను ఆన్లైన్లో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎండీసీ ద్వారా ‘శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఎస్ఎస్ఎంఎంఎస్)’ను ప్రవేశ పెట్టింది. ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకున్న వారికి టన్నుకు రూ.600 చొప్పున డీడీల రూపంలో తీసుకుని ఇసుకను విక్రయిస్తుంది. కానీ అక్రమార్కులు, దళారులు ఈ విధానంలోని లోపాలను ఆధారంగా చేసుకుని వినియోగదారుల ముసుగులో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ‘లోకల్’గా అభివృద్ధి పనుల పేరిట.. సాధారణంగా ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు స్థానికంగా ఉన్న వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఇస్తారు. కొందరు అక్రమార్కులు, అధికారులు కుమ్మక్కై.. ప్రభుత్వ అభివృద్ధి పథకాల పేరిట ఇసుక తవ్వుతూ అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో నిర్మాణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటివాటి ముసుగులో ఇసుక తవ్వుతూ.. బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. స్థానికంగా జరిగే అభివృద్ధి పనులకు అవసరమయ్యే ఇసుక కోసం పంచాయతీరాజ్ లేదా సంబంధిత ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం అధికారులు రిక్విజిషన్ ఇస్తారు. ఆ రిక్విజిషన్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ ఇసుకను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఇసుకను తవ్వి, తరలించే కాంట్రాక్టర్.. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.330 చొప్పున జిల్లా కలెక్టర్ పేరిట డీడీ, రూ.120 చొప్పున స్థానిక తహసీల్దార్ పేరిట చలానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ట్రాక్టర్లో మూడు నుంచి మూడున్నర టన్నుల మేర ఇసుక రవాణా చేయడానికి వీలుంటుంది. కానీ ఈ తవ్వకాలు, పరిమాణం, రవాణాపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతను వీఆర్ఏలకు అప్పగించినా.. వారిలో చాలా మంది దళారులతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒకేసారి అనుమతి తీసుకున్న ‘వే బిల్లుల’పై రోజుల తరబడి ఇసుక తవ్వుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇలా తరలిస్తున్న ఇసుకను ఒక్కో ట్రాక్టరుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. చాలా చోట్ల ప్రజాప్రతినిధులే ఈ దందాలో భాగస్వాములుగా ఉండటంతో.. రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇసుక దందా జోరుగా సాగుతున్న ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలదే ప్రధాన పాత్రగా ఉంటోంది. అక్రమాల్లో మచ్చుకు కొన్ని! ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం టేకుల చెరువు పంచాయతీ పరిధిలోని దోమలవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఈ నెల 27న అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఫారెస్టు అధికారులపై అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారు దాడి చేయడంతో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ► ములుగు జిల్లా మల్యాల సమీపంలో జంపన్నవాగులో ఇసుక మేటలు వేయడంతో వాటిని తొలగించేందుకు ఇద్దరు వ్యక్తులు రైతుల పేరిట అనుమతులు తెచ్చుకున్నారు. ఆ ఇసుక మేటలను తొలగించడానికి ముందు కొండాయి గ్రామం చుట్టూ కరకట్ట నిర్మించాలని అధికారులు షరతు విధించారు. కానీ కరకట్ట నిర్మించకుండానే ఇసుకను తోడేశారు. దీంతో గతేడాది జంపన్నవాగు వరద కొండాయి, మల్యాల గ్రామాలను చుట్టుముట్టింది. అసలు ఇక్కడ క్వారీ నిర్వాహకులు, టీఎస్ఎండీసీ సిబ్బంది నకిలీ వే బిల్లులు సృష్టించి దందా నడిపించారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు హైదరాబాద్‌లో 12 మందిని అరెస్టు చేశారు. బాధ్యులైన టీఎస్‌ఎండీసి సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ► నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. అన్నారం నుంచి నిర్మల్‌లోని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఇçసుకను తీసుకెళ్లాల్సిన ఆ లారీ భైంసా వైపు వెళ్తూ పట్టుబడింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అక్రమ రవాణాపై పర్యవేక్షణఏదీ? గోదావరి, ఉప నదుల నుంచి నిత్యం వేలాది లారీల్లో ఇసుక రవాణా జరుగుతున్నా వాటిపై సంబంధిత శాఖల పర్యవేక్షణ సరిగా లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్ఎండీసీ, మైనింగ్, పోలీసు, రెవెన్యూ, ఆర్టీఏ విభాగాల పర్యవేక్షణ లోపంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, నకిలీ నంబరు ప్లేట్లు ఉన్న వాహనాలతో ఇసుక రవాణా జరుగుతున్నా.. ఆర్టీఏ అధికారులు పెద్దగా కేసులు నమోదు చేసిన దాఖలా లేదు. అప్పుడప్పుడు పోలీసు యంత్రాంగం మాత్రమే ఓవర్ లోడింగ్, అనుమతులు లేకపోవడం, నకిలీ నంబరు ప్లేట్లు వంటి ఘటనల్లో కేసులు నమోదు చేసింది. భూపాలపల్లి, మహదేవపూర్, కాటారం పోలీసు స్టేషన్లలో గత ఏడాది ఈ తరహా కేసులు నమోదయ్యాయి. నేతల బినామీలే కాంట్రాక్టర్లు ఇసుక రీచ్‌ల కాంట్రాక్టుల్లో చాలా వరకు కొందరు నేతల బినామీల చేతుల్లోనే ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ నేతల కనుసన్నల్లోనే ఇసుక దందా సాగుతోందని అంటున్నారు. టీఎస్ఎండీసీ వ్యవహారాల్లో చక్రం తిప్పే ఓ ముఖ్య నేతతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఇటీవల జంట హత్యల వివాదంలో చిక్కుకున్న ఓ అధికార పార్టీ నేత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తన మిత్రుడిని ముందు పెట్టి కాంట్రాక్టులు చేస్తున్న ఓ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ములుగు జిల్లాలో ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఇలా అన్నిచోట్లా వివిధ పార్టీల నేతలు రీచ్‌ల వద్ద చక్రం తిప్పుతున్నారని చెప్తున్నారు. ఇతరులెవరైనా రీచ్‌లు దక్కించుకున్నా వారిని నయానో భయానో లొంగదీసుకుని తమ చెప్పుచేతుల్లో తవ్వకాలు, రవాణా జరిగేలా చూసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని జంపన్నవాగు (దయ్యాలవాగు) నుంచి రోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలివెళ్తోంది. ప్రభుత్వ పనుల కోసం అని చెప్తూ ప్రైవేటు నిర్మాణాలకు ఇసుకను తరలిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతులు పొందే ఇసుక ట్రాక్టర్ల యజమానులు.. బహిరంగ మార్కెట్లో ట్రాక్టర్‌కు రూ.1,800 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇసుకను ట్రాక్టర్లో లోడ్ చేసే కూలీలకు రూ.250 మాత్రం చెల్లించి, మిగతా సొమ్ము తాము మిగిలించుకుంటున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి వాగుల్లో ఎక్కడా మీటరు లోతు వరకు మాత్రమే ఇసుక తవ్వాలన్న నిబంధన ఉంది. కానీ ఇక్కడ రెండు మీటర్ల లోతు వరకు తవ్వుతుండటంతో జంపన్నవాగు ఎండిపోతోంది. కేటగిరీలుగా ఇసుక రీచ్‌లు రాష్ట్రంలోని వాగులు వంకలు, ఉప నదులు, నదులను ఐదు కేటగిరీలుగా మైనింగ్ విభాగం విభజించింది. ఇందులో ఒకటి, రెండు కేటగిరీలకు చెందిన స్థానిక వాగులు, చిన్న వంకల నుంచి స్థానిక అవసరాల కోసం ఇసుకను కేటాయిస్తారు. తవ్వకాలు, విక్రయం వంటి బాధ్యతలను తహసీల్దార్లు పర్యవేక్షిస్తారు. మూడు, నాలుగు, ఐదో కేటగిరీలో తుంగభద్ర ఎడమ గట్టు, కృష్ణా, గోదావరి నదీ తీరాలు, వాటి ఉపనదులు ఉన్నాయి. వీటి నుంచి ఇసుక వెలికితీసి విక్రయించే బాధ్యతను టీఎస్ఎండీసీ నిర్వహిస్తుంది. వీటితోపాటు ఇసుక మేట వేసిన వ్యవసాయ పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతులు, విక్రయాలను టీఎస్ఎండీసీ పర్యవేక్షిస్తుంది. -
ఇక ఇసుకకు ఇబ్బందుల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటు భవన నిర్మాణ రంగం పనులు తిరిగి ఊపందుకుంటున్నాయి. రెండు నెలల పాటు పనులు నిలిపేసిన నిర్మాణ సంస్థలు తిరిగి తమ కార్యకలాపాలను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో నిర్మాణ సామగ్రిలో అత్యంత కీలకమైన ఇసుకకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే కోవిడ్‌తో నష్టపోయిన నిర్మాణదారులు వానాకాలం ప్రారంభం కావడంతో రాబోయే రోజుల్లో ఇసుక కొరత తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వానాకాలంలోనూ ఇసుక సరఫరాలో అంతరాయం లేకుండా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతేడాది అనుభవంతో..! గతేడాది కూడా వానాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా టీఎస్ఎండీసీ ముందస్తుగా స్టాక్ యార్డుల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్లు నిల్వ చేయాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే ప్రణాళిక అమల్లో ఆలస్యంతో పాటు భారీ వర్షాల మూలంగా ఇబ్బందులు తలెత్తాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది 3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 19 జిల్లాల పరిధిలోని 52 స్టాక్ యార్డుల్లో 41.18 లక్షల క్యూబిక్ మీటర్లు ఇప్పటికే నిల్వ ఉండగా, 34 రీచ్‌ల్లో ఇంకా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు సరిహద్దు జిల్లాల్లోని నిర్మాణ రంగం కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని వట్టినాగులపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, భౌరంపేటలో టీఎస్ఎండీసీ సబ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసింది. సబ్ స్టాక్ యార్డుల్లోనూ వానాకాలం అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఎండీసీ పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేస్తోంది. అదనపు స్టాక్ యార్డులు.. కొత్త రీచ్‌లు వానాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా ఈ ఏడాది స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు పెంచడంతో పాటు, రీచ్‌లకు వెళ్లే మార్గాలను మెరుగు పరిచాం. మెరుగైన రోడ్డు వసతి ఉన్న చోట కొత్త స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో ఉన్న ఇసుక డిమాండును దృష్టిలో పెట్టుకుని సబ్ స్టాక్ యార్డుల్లోనూ నిల్వ చేస్తున్నాం. కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు లభించాయి. మరో 31 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాం. – జి.మల్సూర్, వీసీ అండ్ ఎండీ, టీఎస్ఐఐసీ -
వెతికేద్దాం.. వెలికితీద్దాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇసుకతోపాటు ఇతర ఖనిజాల ద్వారా రూ.2,868.95 కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో ఇసుక వాటా రూ.2,837.32 కోట్లు. అయితే, దీర్ఘకాలంలో ఇసుక వెలికితీత క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను టీఎస్ఎండీసీ అన్వేషిస్తోంది. టీఎస్ఎండీసీకి కేంద్రం ఇదివరకే జాతీయ ఖనిజాన్వేషణ సంస్థ హోదాను కల్పించింది. దీంతో సూర్యాపేట, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో సున్నపురాయి బ్లాక్‌లలో వెలికితీత పనులను టీఎస్ఎండీసీకి అప్పగిస్తూ ఖనిజాన్వేషణ కోసం రూ.29 కోట్లను జాతీయ ఖనిజాన్వేషణ ట్రస్టు కేటాయించింది. సున్నపురాయి అన్వేషణకు సంబంధించి ఇప్పటికే తొలిదశలో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన టీఎస్ఎండీసీ.. ప్రస్తుతం రెండోదశలో పూర్తి స్థాయిలో తనకు కేటాయించిన సున్నపురాయి బ్లాక్‌లలో అన్వేషణ ప్రారంభించింది. గ్రానైట్ వ్యాపారానికి మొగ్గు... నిర్మాణరంగంలో వినియోగించే గ్రానైట్‌కు స్థానికంగా, విదేశీ మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రానైట్ వ్యాపారంలోకి ప్రవేశించాలని టీఎస్ఎండీసీ భావిస్తోంది. దీని కోసం మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘బిజినెస్ డెవలప్మెంట్ సెల్’ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లోని 92.29 హెక్టార్లలో ప్రతీ ఏటా 36,400 క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను వెలికితీయవచ్చని టెక్నో, కమర్షియల్ ఫీజిబిలిటీ నివేదిక ఆధారంగా అంచనాకు వచ్చింది. వంతడుపుల, తాళ్లపూసపల్లె, ఇనుగుర్తి, నమిలిగొండ, కొత్తగట్టులోని రెండుచోట్ల గ్రానైట్ నిల్వలున్నట్లు టీఎస్ఎండీసీ గుర్తించింది. రోడ్ మెటల్ యూనిట్లు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణరంగం ఊపుమీద ఉండటంతో బండరాళ్ల తరలింపు నిర్మాణదారులకు సమస్యగా మారింది. సహజ ఇసుక వినియోగం పెరగడంతో తరచూ కొరత ఎదురవుతోంది. దీంతో సహజ వినియోగాన్ని తగ్గించేందుకు కృత్రిమ ఇసుక వైపుగా వినియోగదారులను మళ్లించేందుకు టీఎస్ఎండీసీ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ మెటల్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖానామెట్, బండరావిరాల, యాచారంలో ఏర్పాటయ్యే ఈ యూనిట్ల ద్వారా కంకర, కృత్రిమ ఇసుకను విక్రయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పర్యావరణ అనుమతుల కోసం జీహెచ్ఎంసీ, టీఎస్ఎండీసీ సంయుక్తంగా ప్రయ త్నాలు సాగిస్తున్నాయి. -
ఇసుక ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా గోదావరి నదికి వరద పోటెత్తుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లు మూతపడ్డాయి. రీచ్‌లకు వెళ్లే రహదారులు బురదమయం కావడంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో ఆన్లైన్ విధానంలో ఇసుక విక్రయాలను టీఎస్ఎండీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. డిమాండ్‌కు అనుగుణంగా ఇసుక సరఫరా లేకపోవడాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటుండటంతో బహిరంగ మార్కెట్లో ఇసుక ధర అమాంతం పెరిగింది. గోదావరికి వరద ఉధృతి తగ్గి కొత్త రీచ్‌లు అందుబాటులోకి వస్తేనే ఇసుక సరఫరా మెరుగవుతుందని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. మూతపడిన రీచ్‌లు... రాష్ట్రంలో సుమారు 30 రీచ్‌ల ద్వారా టీఎస్ఎండీసీ ఇసుకను వెలికితీస్తూ సగటున రోజుకు 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఆన్లైన్లో విక్రయిస్తోంది. టీఎస్ఎండీసీ వెలికితీస్తున్న ఇసుకలో 96 శాతం గోదావరి తీరంలోని పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని రీచ్‌ల నుంచే వస్తోంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుండటంతో రీచ్‌లు మూత పడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆరు రీచ్‌లే పనిచేస్తున్నాయని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు మాత్రం ఇసుకను లోడ్ చేస్తున్నారు. అమాంతం పెరిగిన ధరలు... ఆన్లైన్లో టన్ను ఇసుకను రూ. 600 చొప్పున టీఎస్ఎండీసీ విక్రయిస్తుండగా రవాణా, ఇతరచార్జీలు కలుపుకొని సీజన్లో రూ. 1,250 నుంచి రూ. 1,500 వరకు ధర పలికింది. ప్రస్తుతం ఆన్లైన్లో ఇసుక విక్రయాలు నిలిచిపోవడంతో కొరతను దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యమైన ఇసుక ధర బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం టన్నుకు రూ. 2,200కుపైనే పలుకుతోంది. ముడి ఇసుక (కోర్ శాండ్) టన్నుకు రూ. 1,400 చొప్పున లభిస్తున్నా వినియోగదారులు ఫైన్ శాండ్ కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫైన్ శాండ్‌కు రాష్ట్రంలో ఉన్న కొరతను దళారీలు ఆసరాగా తీసుకుని ధరలు అమాంతం పెంచేశారు. గతేడాది అక్టోబర్‌లో ఆఫ్ సీజన్లో టన్ను ఇసుక రూ. 3వేలకుపైగా పలికిన విషయాన్ని వినియోగదారులు గుర్తుచేస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద నిండుకుంటున్న నిల్వలు వర్షాకాలం దృష్ట్యా టీఎస్ఎండీసీ స్టాక్ పాయింట్ల వద్ద కనీసం కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇసుక డిమాండ్ నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్, భౌరంపేట, వట్టినాగులపల్లిలో సబ్ స్టాక్ పాయింట్లు ఏర్పా టు చేసింది. అయితే ప్రస్తుతం స్టాక్ పాయింట్ల వద్ద కేవలం రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలే ఉన్నాయి. అయితే మరో 2, 3 రోజుల్లో రీచ్‌ల సంఖ్య పెరగడంతోపాటు ములుగు, భద్రాచలం జిల్లాల్లో కొత్తరీచ్‌లు అందుబాటు లోకి వచ్చే అవకాశముందని టీఎస్ఎండీసీ వర్గా లు వెల్లడించాయి. ఇసుక రీచ్‌లు అందుబాటు లోకి వచ్చాకే అన్లైన్ విధానంలో ఇసుక విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది. -
మన ఇసుకకు డిమాండ్
సాక్షి, కరీంనగర్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణాల్లో కీలకంగా వినియోగించే ఇసుకకు భారీ డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇసుక అందకుండా పోతోంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు సైతం ఇసుకను అందుబాటులోకి తీసుకుని రావానే ఉద్దేశంతో నూతన సాండ్ టాక్స్ పాలసీని ప్రవేశపెట్టింది. అయితే అది విజయవంతం కాకపోవడంతో కొన్ని మార్పులు చేసి కొత్తగా ‘మన ఇసుక వాహనం’ పేరుతో కొత్తపాలసీని తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ) అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన నూతన విధానానికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. పది రోజుల్లోనే కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వానికి రూ.16 కోట్ల ఆదాయం సమకూరింది. అంతా ఆన్లైన్లో.. మన ఇసుక వాహనం పాలసీ ప్రకారం ఇసుక విక్రయాలన్నీ ఇక ఆన్లైన్ ద్వారా జరుగుతాయి. ఇందుకోసం టీఎస్ఎండీసీ అధికారులు మన ఇసుక వాహనం పేరుతో వెబ్సైట్ కూడా రూపొందించారు. ఇసుక కావాల్సిన వారంతా ఈ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఇసుక తరలించే వాహనాలు కూడా ముందుగానే అధికారుల నమోదు చేసుకుంటున్నారు. నమోదు చేసిన వాహనాల్లో మా త్రమే ఇసుక తరలించేందుకు అనుమతి ఇస్తారు. ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ షురు.. మన ఇసుక వాహనం విధానం ద్వారా ఇసుక లబ్ధిదారుడికి రవాణ చేయడానికి ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ పక్రియ ఈనెలలోనే ప్రారంభించారు. ఇప్పటికే ఆయా మండలాల తహసీల్దార్లకు విధివిదాలను అందజేశారు. ట్రాక్టర్‌ను నమోదు చేసుకునే వారు ఆన్లైన్లో లేదా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు నింపడంతోపాటు రూ.15 వేలు డీడీ తీసి దరఖాస్తుతోపాటు వాహనపత్రాలు, ఆధార్, బ్యాంక్‌ఖాతా, ఒప్పందం పత్రం ఇవ్వాలి. వాటిని కార్యాలయంలో ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఒకవేళ ట్రాక్టర్ యాజమాని పాలసీ నుంచి తప్పుకుంటే డిపాజిట్ ఉంచిన రూ.15 వేలు తిరిగి చెల్లిస్తారు. మన ఇసుక వాహనం పద్ధతితో ట్రాక్టర్ యాజమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక రవాణ చేయవచ్చు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి 3,559 ట్రాక్టర్లు వారి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచే అద్దె.. ట్రాక్టర్ యాజమానులకు ఇసుక రావాణా చేసినందుకు అద్దెను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకు కిలోమీటర్‌కు రూ.65 చెల్లించాలని నిర్ణయించింది. ఇందులో డిజిల్‌కు రూ.15, ట్రాన్స్‌ఫొర్ట్ కింద రూ.50 ఉంటాయి. ఇవే కాకుండా ట్రాక్టర్లో ఇసుక నింపడానికి రూ.250, 5 కిలోమీటర్ల వరకు అన్ని పన్నులు కలుపుకుని రూ.వెయ్యి చెల్లిస్తుంది. ఇలా దూరాన్ని బట్టి రుసుం పెరుగుతుంది. నెల కాగానే యాజమానికి చెల్లించాల్సిన రుసుం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ విధానంలో ఒక క్యూబిక్ మీటర్ ఇసుక రూ.900 నుంచి రూ.1000 వరకూ ధర పలుకుతుంది. ఒక ట్రాక్టర్లో సుమారు మూడు క్యూబిక్ మీటర్ల «ఇసుక పడుతుంది. మూడు క్యూబిక్ మీటర్ల ఇసుక ట్రాక్టర్‌కు సుమారు రూ.2800 వరకూ ధర ఉంటుంది. జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్‌లు ఇవే.. కరీంనగర్ జిల్లాలో స్థానిక అవసరాల కోసం ఏడు ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించారు. ఇందులో జమ్మికుంట మండలం తణుగుల, వీణవంక మండలం కురిక్యాల, కరీంనగర్ మండలం చేగుర్తి, మానకొండూరు మండలం లింగాపూర్, వెల్ది, తిమ్మాపూర్ మండలం నేదునూర్, కొత్తపల్లి మండలం ఐనవానిపల్లె గ్రామాల్లో ఇసుకరీచ్‌ను గుర్తించి సిద్ధం చేశారు. పక్కాగా అమలు.. గతేడాది అమల్లోకి తీసుకుని వచ్చిన సాండ్ టాక్స్ పాలసీ విజయవంతం కాలేదు. దీంతో మన ఇసుక వాహనం పాలసీని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా యంత్రంగం నిర్ణయిం చింది. ఇప్పటికే కలెక్టర్‌తోపాటు జేసీ, పలువురు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్, పోలీసులు, రెవెన్యూ, ఆర్టీఏ అధికారుల సహకారంతో పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ట్రాక్టర్ యాజమానులకు అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మన ఇసుక వాహనం పాలసీ అమల్లోకి వస్తే నాణ్య మైన ఇసుక తక్కువ ధరకే లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇసుక ట్రాక్లర్ల ద్వారా నిర్భయంగా ఇసుక రవాణ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. బుకింగ్ ప్రారంభం మన ఇసుక వాహనం వెబ్సైట్లో ఇప్పటి వరకు 3,559 ట్రాక్టర్లు వారి వివరాలు నమోదు చేసుకున్నారు. 23,894 మంది ఇసుక కోసం బుకింగ్ చేసుకున్నారు. 22,202 మందికి ఇప్పటికే ఇసుక డెలివరీ చేశారు. 75,573 ట్రిప్పుల ఇసుక రవాణ చేయగా వీటిలో ట్రాక్టర్ల ద్వారా 70,995 ట్రిప్పులు రవాణ చేశారు. వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.16.65 కోట్ల ఆదాయం వచ్చింది. బుకింగ్ ఇలా.. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్లో మన ఇసుక వాహనం అనే వెబ్‌సైట్‌కు వెళ్లి క్లిక్ చేస్తే మన ఇసుక వాహనం మెనూ ఒపేన్ అవుతుంది. అందులో మొదట మన మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత సైట్లోకి వెళ్లి మన వివరాలు నమోదు చేసి ఎక్కడికి, ఎప్పుడు, ఎంత ఇసుక కావాలో వివరాలు నమోదు చేస్తే చివర ఎంత ధర చెల్లించాల్లో కనిపిస్తుంది. దానికి వివిధ పద్ధతులు నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్‌కార్డు, పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. కావాల్సిన ఇసుక ట్రాక్టర్లకు చెల్లింపులు చేసిన తర్వాత మన మొబైల్‌కు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. దానిని భద్రపర్చుకోవాలి మన ఇసుక రవాణ చేసిన వ్యక్తికి ఆ ఓటీపీ నంబర్ చేబితే ట్రాక్టర్, లారీ డ్రైవర్ తన వద్ద ఉన్న వివరాలతో సరిపోల్చుకుని ఓటీపీని ఎంటర్ చేస్తే రవాణ పూర్తవుతుంది. ఒక వేళ ఓటీపీ చెప్పకపోతే మనకు ఇసుక రవాణ చేయనట్టే భావిస్తారు. ఈ వెబ్సైట్ నిర్వహణను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్(సీజీజీ)కి అప్పగించారు. -
గ్రానైట్ క్వారీయింగ్‌పై టీఎస్ఎండీసీ దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఖనిజాన్వేషణ, ఖనిజాల వెలికితీత, క్వారీ లీజుల ద్వారా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని క్వారీయింగ్‌కు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఇప్పటికే డైమెన్షనల్ మార్బుల్ డిపాజిట్లను గుర్తించింది. అయితే మార్బుల్ నిల్వలు ఉన్న ప్రాంతం షెడ్యూలు ఏరియాలో ఉండటంతో లీజు అనుమతుల్లో సాధ్యాసాధ్యాలపై టీఎస్ఎండీసీ అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నల్లగొండ, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, జనగామ, ఖమ్మం జిల్లాల్లో డైమన్షనల్ మార్బుల్ స్టోన్ నిల్వలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మార్బుల్ నిల్వల వెలికితీతను ప్రైవేటు సంస్థలకు లీజు విధానంలో అప్పగించారు. రాష్ట్రంలో గ్రానైట్, మార్బుల్‌కు రోజురోజుకూ డిమాండు పెరుగుతుండగా, భవన నిర్మాణదారులు ఎక్కువగా రాజస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంతోపాటు దక్షిణ భారతదేశంలో మార్బుల్, గ్రానైట్‌కు ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని గ్రానైట్, మార్బుల్ క్వారీయింగ్‌ను సొంతంగా చేపట్టాలని టీఎస్ఎండీసీ నిర్ణయించింది. ఈ మేరకు గ్రానైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఊట్కూరులో ఓ బ్లాక్‌ను కూడా గుర్తించింది. అయితే ఈ ప్రాంతం షెడ్యూలు ఏరియాలో ఉండటంతో క్వారీయింగ్ చేపట్టడంపై 1/70 చట్టం నిబంధనలు అడ్డు వస్తున్నాయి. డైమన్షనల్ స్టోన్ నిల్వలపైనా అధ్యయనం ఖమ్మం జిల్లాలో నాణ్యమైన బ్లాక్ గ్రానైట్, మార్బుల్ నిల్వలు ఉన్నట్లు 80వ దశకం ఆరంభంలోనే గనులు, భూగర్భ వనరుల శాఖ గుర్తించింది. 22 మైళ్ల పొడవు, 1.5 మైళ్ల వెడల్పు, 200 మీటర్ల లోతు కలిగిన నిల్వల నుంచి 92 లక్షల క్యూబిక్ మీటర్ల డైమన్షన్ స్టోన్ వెలికి తీయవచ్చని గతంలోనే అంచనా వేశారు. ఈ మేరకు కొందరికి లీజు అనుమతులు ఇచ్చినా, 1/70 చట్టం నిబంధనలతో వెలికితీత సాధ్యం కాలేదు. అయితే కేవలం ఇసుక తవ్వకాలకే పరిమితం కాకుండా, ఇతర ఆదాయ మార్గాలపైనా దృష్టి సారించాలని టీఎస్ఎండీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా గ్రానైట్ నిల్వలపై మరోమారు దృష్టి సారించింది. గత ఏడాది నమూనాలు సేకరించి ఫార్ములేషన్లు విశ్లేషించి, నాణ్యతను పరిశీలించారు. మార్బుల్, గ్రానైట్ (డైమన్షనల్ స్టోన్) క్వారీయింగ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే కొందరు ఔత్సాహికులు టీఎస్ఎండీసీకి దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం నుంచి నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీగా గుర్తింపు పొందిన టీఎస్ఎండీసీ ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో సున్నపు రాయి అన్వేషణలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆదాయం పెంచుకునేందుకే క్వారీయింగ్ వివిధ ఖనిజాల మైనింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. 2016–17లో రూ. 3,143 కోట్లు, 2017–18లో రూ.3,704 కోట్లు ఆదాయం రాగా, 2018–19లో సుమారు రూ.4వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే ఇందులో అత్యధికంగా ఇసుక విక్రయాల ద్వారానే రాష్ట్ర ఖజానాకు ఎక్కువగా ఆదాయం వస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇసుక విక్రయాల ద్వారా రూ. 2,415 కోట్లు ఖజానాకు సమకూరాయి. 2017–18లో రూ.678 కోట్లు, 2018–19లో రూ.886 కోట్లు ఇసుక విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ప్రస్తుతం గ్రానైట్ వెలికితీత ద్వారా కన్సిడరేషన్ రూపంలో రూ.50 లక్షల లోపు మాత్రమే టీఎస్ఎండీసీకి ఆదాయం వస్తోంది. గ్రానైట్ క్వారీయింగ్ ప్రణాళిక ఆచరణలోకి వస్తే టీఎస్ఎండీసీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
సున్నపురాయి నాణ్యతపై పరిశోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) రాష్ట్రంలో కొత్తగా అన్వేషించిన సున్నపురాయి నిల్వల నాణ్యతను తేల్చనుంది. ఈ మేరకు పల్నాడు, భీమా బేసిన్లో ఖనిజ అన్వేషణ సమయంలో సేకరించిన సున్నపురాయి, డోలోమైట్ శాంపిళ్ల విశ్లేషణ కోసం అనుభవం కలిగిన ప్రయోగశాలల మద్దతు తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ లేబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన ప్రయోగశాలలకు ఈ బాధ్యత అప్పగించేందుకు సన్నద్ధమవుతోంది. సున్నపురాయి, డోలోమైట్ శాంపిళ్ల విశ్లేషణలో అనుభవం కలిగిన పరిశోధన సంస్థలకు టెండర్ విధానంలో విశ్లేషణ బాధ్యత అప్పగించనుంది. టెండరు దాఖలుకు ఆసక్తి చూపుతున్న సంస్థలతో ఈ నెల 22న టీఎస్ఎండీసీ కేంద్ర కార్యాలయంలో ప్రిబిడ్ సమావేశం ఏర్పాటు చేసే యోచనలో టీఎస్ఎండీసీ అధికారులు ఉన్నారు. సున్నపురాయి అన్వేషణలో భాగంగా పల్నాడు బేసిన్‌లోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు, భీమా బేసిన్‌లోని వికారాబాద్ జిల్లాలో సున్నపురాయి, డోలోమైట్ నిల్వలను టీఎస్ఎండీసీ గుర్తించింది. సేకరించిన నమూనాల్లో ఇసుక, ఇతర ఖనిజాల శాతాన్ని తేల్చడంతోపాటు సున్నపురాయి నాణ్యతను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం టీఎస్ఎండీసీ వద్ద లేకపోవడంతో ప్రైవేటు ప్రయోగశాలలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రయోగశాలల నుంచి నాణ్యత నివేదికలు అందిన తర్వాత ఆయా బేసిన్ల పరిధిలో సర్వే జరిపి నిర్ధారణకు వస్తారు. నాణ్యత, పరిమాణంపై స్పష్టత వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ (ఎన్ఎండీఏ) నిబంధనల మేరకు వేలం విధానంలో సున్నపురాయి బ్లాక్‌లు కేటాయించే యోచనలో టీఎస్ఎండీసీ ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ సున్నపురాయి అన్వేషణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇసుక తవ్వకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు టీఎస్ఎండీసీ వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఇసుక విక్రయాల ద్వారా రూ.2,415 కోట్లు ఖజానాకు సమకూరాయి. 2017–18లో రూ.678 కోట్లు, 2018–19లో రూ.886 కోట్లు ఇసుక విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. కేవలం ఇసుక తవ్వకాలకే పరిమితం కాకుండా, ఇతర ఆదాయ మార్గాలపైనా టీఎస్ఎండీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని క్వారీయింగ్‌కు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు రాష్ట్రం బయట 17 బ్లాక్‌లలో సున్నపురాయి అన్వేషణపై దృష్టి పెట్టగా, ఇప్పటికే జార్ఖండ్, ఒడిశాలోని మూడు బ్లాక్‌ల్లో సున్నపురాయి అన్వేషణలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాల్సిందిగా కేంద్రం.. టీఎస్ఎండీసీని కోరింది. -
ఖనిజాన్వేషణపై దృష్టి పెట్టండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ (టీఎస్ఎండీసీ)మరింత విస్తృతపరుచుకోవడంతో పాటు, కార్యకలాపాలను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టీఎస్ఎండీసీ ఇసుక తవ్వకాలు, సరఫరాపైనే కాకుండా ఇతర గనుల తవ్వకాలు, అన్వేషణ, వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మాంగనీస్, మార్బుల్, సున్నపురాయి నిల్వలు ఇతర ఖనిజాల వాటి పైనా దృష్టి సారించాలన్నారు. గ్రానైట్ వ్యాపారంలో టీఎస్ఎండీసీ సమగ్ర కార్యాచరణను నెలలో రూపొందించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గ్రానైట్ లీజులను టీఎస్ఎండీసీ ఇవ్వడానికి ప్రాధాన్యమివ్వాలని గనుల శాఖ డైరెక్టర్‌కు సూచించారు. రాష్ట్రంలో సున్నపురాయి నిక్షేపాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా తవ్వకాలు జరపాలని, ఇందుకు కావాల్సిన సాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇసుక లభ్యత, సరఫరా, పంపిణీపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల్లో ఇసుక డిపోలు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలు అన్వేషించి కేటాయించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. -
ఇసుక మార్గం..ఇష్టారాజ్యం..!
రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక అక్రమ వ్యాపారం మూడు లారీలు.. ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది. కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల మిలాఖత్‌తో ఇసుక దందా కొత్తపుంతలు తొక్కుతోంది. తెల్లవారింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. దీన్ని నియంత్రించాల్సిన కొందరు అధికారులు కళ్లు మూసుకోవడంతో వేల టన్నుల ఇసుక పక్కదారి పడుతోంది. దోచుకునే వారికి దోచుకున్నంత అన్న చందంగా.. కళ్లముందే అక్రమ దందా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టార్గెట్ కోసం మొక్కుబడిగా కేసులు పెట్టి అధికారులు ‘మమ’అనిపిస్తున్నారు. ఫలితంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్రమార్కులకు ఇసుక కాసులు కురిపిస్తోంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ దందాపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ఇసుక మాఫియా అక్రమ దందాకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ముసుగు వేసి టన్నుల కొద్దీ ఇసుకను అక్రమమార్గం పట్టిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఏటా రూ.వందల కోట్ల ఆదాయం వస్తోందని ప్రభుత్వం చెబుతున్నా.. అంతకు నాలుగింతలు ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో గోదావరి, మంజీరా, కృష్టా నదీతీరాలు ఇసుక తవ్వకాలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వం గత వేసవిలో పాత ఏడు జిల్లాల్లోని 56 చోట్ల టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలకు అధికారికంగా అనుమతులు ఇచ్చింది. ఈ ఇసుకను తరలించేందుకు 289 స్టాకు పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇసుక అవసరం ఉన్నవాళ్లు మీసేవ, ఆన్లైన్ కేంద్రాల ద్వారా టీఎస్ఎండీసీ పేరిట డబ్బులు చెల్లించి రశీదులు పొందితే.. వారి అవసరాన్ని బట్టి లారీల్లో ఇసుక నింపాల్సి ఉంది. అయితే ఇదేమీ పట్టని కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లు రశీదులకు మించి ఒక్కో లారీలో రెండు నుంచి నాలుగు టన్నుల వరకు అధికంగా ఇసుక నింపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. అయితే తెలంగాణ జిల్లాల్లో ఈ విధానం గందరగోళంగా తయారైంది. సామాన్యుడు తమ అవసరాల కోసం తక్కువ ధరకే ఇసుకను పొందే సరళ విధానం ఇందులో లేదు. ఆన్లైన్ విధానం కొందరు స్వార్థపరులకు మాత్రమే ఉపయోగపడుతోంది. ఫలితంగా ఇసుక వ్యాపారం ద్వారా ప్రభుత్వానికి బాగానే ఆదాయం వస్తున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయి అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయడంతో ప్రభుత్వం ఉద్దేశం నీరుగారిపోతోంది. నిబంధనలకు మంగళం.. ఇసుక తవ్వకాలకు నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదల వల్ల రైతుల పంట పొలాల్లో వేసే ఇసుక మేటల తొలగింపు పేరిట వ్యవసాయ శాఖ ద్వారా అనుమతికి దరఖాస్తు చేస్తారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆయా జిల్లాల్లో జిల్లా స్థాయి శాండ్ కమిటీ(డీఎల్ఎస్సీ) దరఖాస్తులను పరిశీలించి వ్యవసాయ, గనులు, భూగర్భజల, రెవెన్యూ శాఖల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన మీదట.. ఆయా ప్రాంతాలను బట్టి ఎన్ని రోజులు? ఎంత లోతు? ఎన్ని క్యూబిక్ మీటర్లు? ఎలా ఇసుక తీయాలి (మాన్యువల్/యంత్రాలు)? అన్న మార్గదర్శకాలను సూచిస్తుంది. పట్టా భూములు కాకుండా ప్రభుత్వ అవసరాలకు కూడా నదీ పరీవాహక ప్రాంతాల్లో టెండర్ల ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ మేరకు సూచించిన మార్గదర్శకాల ప్రకారం తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా 1.5 మీటర్ల నుంచి 2.5 మీటర్ల లోతుకు మించి ఇసుక తవ్వకాలకు అనుమతి ఉండదు. ఒకచోట అనుమతులు తీసుకుని.. మరోచోట తవ్వకాలు చేపడుతున్న అక్రమార్కులు.. నిబంధనలకు విరు ద్ధంగా 5 మీటర్ల నుంచి 8 మీటర్ల వరకు ఇసుక తవ్వేస్తున్నారు. పట్టా భూములను వదిలి గోదావరి, మంజీరాల్లో సైతం తవ్వకాలు కానిచ్చేస్తున్నారు. ఉద యం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అదీ సీసీ కెమెరాల నీడలోనే ఇసుక తవ్వకాలు, రవా ణా చేయాలన్న నిబంధనలను పట్టించుకోకుండా సీసీ కెమెరాలు లేకుండా రాత్రింబవళ్లు తవ్వకాలు సాగిస్తున్నారు. ఇసుక మేటల తొలగింపునకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. ఇసుక నింపేందుకు సైతం నిబంధనలు పెట్టింది. 10 టన్నుల కెపాసిటీ గల లారీలో 6 క్యూబిక్ మీటర్ల ఇసుకను, 17 టన్నుల లారీలో పది క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే లోడింగ్ చేయాల్సి ఉంటుంది. పది టైర్ల లారీల్లో 20 టన్నులు(10.5 క్యూబిక్ మీటర్లు), 12 టైర్ల లారీలో 22.5 టన్నులు(13 క్యూబిక్ మీటర్లు), ఒక్కో వేబిల్లుపై లారీలో 21 టన్నులకు మించి(12 క్యూబిక్ మీటర్లు) ఇసుకను నింపకూడదు. ఇసుక మాఫియా 14 టైర్ల లారీల ద్వారా ఏకంగా 60 టన్నుల(37.50 క్యూబిక్ మీటర్లు) వరకు ఇసుకను నింపి నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఇసుక తవ్వకం, రవాణాలను పర్యవేక్షించాల్సిన వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు, గనులు, భూగర్భ జల, రవాణా శాఖలు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నాయి. ఈ ఇసుకకు ‘మహా’డిమాండ్.. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని పలుగుల 1, 2, 3 క్వారీలకు, ఇదే మండలంలోని కుంట్లం 1, 2, 3, కుదురుపల్లి, అన్నారం, మహదేవ్ పూర్ల్లో ఉన్న క్వారీల్లోని ఇసుకకు రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. టీఎస్ఎండీసీ ఆన్లైన్లో కూపన్లు ఓపెన్ చేసిన రెండు నిమిషాల్లోనే ఈ క్వారీ ల్లో ఇసుక కూపన్లు బుక్కయిపోతాయి. ఇక క్వారీల వద్ద ఒకే కూపన్‌పై రెండు మూడు లారీలను వదులు తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక అధిక లోడు షరా మామూలే. ఉదయం 6 గంటల నుంచి సాయ త్రం ఆరు గంటల వరకు లారీలను అనుమతిం చాల్సిన అధికారులు 24 గంటలు తిరుగుతున్నా మిన్నకుండిపోవడంతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. అధిక లోడ్ల కారణంగా ఈ ఏరియాల్లోని రోడ్లపై మోకాలిలోతు గుండలు ఏర్పడ్డాయి. ‘ఆన్లైన్’ బాగున్నా.. అక్రమాలు ఆగట్లేదు..! పాత ఏడు జిల్లాల్లో 56 చోట్ల టీఎస్ఎం డీసీ ద్వారా ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ఇసుకను తరలించేందుకు 289 స్టాకు పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇసుక అవసరం ఉన్నవాళ్లు మీ – సేవ, ఆన్లైన్ కేంద్రాల ద్వారా టీఎస్ఎండీసీ పేరిట డబ్బులు చెల్లించి రశీదులు పొందితే.. వారికి అవసరాన్ని బట్టి లారీల్లో నింపాల్సి ఉంది. ఇక్కడ పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. టీఎస్ఎండీసీ ఇసుక బుకింగ్‌లకు తెర తీసిన రెండు మూడు నిమిషాల్లోనే హైదరాబాద్ కేంద్రంగా దళారులు హైస్పీడ్ ఇంటర్నెట్ సిస్టం ద్వారా బుకింగ్ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్టర్లు, లారీ ఓనర్ల పాత్రే కీలకం. ఇలా స్పీడ్‌గా బుక్ చేసిన ఆపరేటర్‌కు ఒక్కో బుకింగ్‌కు రూ. వెయ్యి వరకు ముట్టచెబుతున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో సుమారు వంద మంది వరకు బ్రోకర్లు నిత్యం ఇదే పనిలో ఉంటున్నట్టు తెలిసింది. గతంలో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఉన్న నెట్ సెంటర్ల ద్వారా బుక్ చేసేవాళ్లు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగానే బుకింగ్ దందా కొనసాగుతోంది. హైదరాబాద్ వెలుపల నెట్ స్పీడ్ తక్కువ ఉండడంతో అక్కడ బుకింగ్‌లు కావడం లేదని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా ఇసుక మాఫియానే ఉపయోగించుకుంటుండటంతో సామాన్యు లకు ఇసుక కష్టాలు ‘షరామామూలు’గా మారాయి. ఇదిలాఉంటే మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే లారీలకు సంబంధించి సరైన వేబిల్లులు, టీఎస్ఎండీసీకి అంతర్రాష్ట్ర పన్ను చెల్లించి పొందే వేబిల్లులు చెక్‌పోస్టులలో విధిగా పరిశీలించాలి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ రశీదుల పేరిట పట్టించుకోకపోవడంతో ఇసుక అక్రమదందా ఈ తరహాలో కూడా ‘మామూలు’గా మారింది.. అన్ని జిల్లాల్లోనూ అక్రమాలే.. - కరీంనగర్ జిల్లా ఖాజీపూర్, కొత్తపల్లి ఇసుక క్వారీల నుంచి నిబంధన లకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కాంట్రాక్టర్లు రేయింబవళ్లు ఇసుక వ్యాపారం చేస్తు న్నారు. వీరికి రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల అధికారుల అండదండలు ఉంటున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ రెండు క్వారీల నుంచి రోజుకు వందలాది లారీలు, వేలాది ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక, కొడిముంజ క్వారీల్లో కూడా గతంలో ప్రభుత్వం టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు జరిపింది. అయితే ఇటీవల కొదురుపాక నుంచి ఇసుకను తరలిస్తున్న సమ యంలో నేరేళ్ల వద్ద ప్రమాదం జరిగి వివాదస్పదమైన నేప థ్యంలో తవ్వకాలను నిలిపివేశారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 38 చోట్ల నుంచి ఇసుక అక్రమ దందా సాగుతోంది. - పాత నిజామాబాద్ జిల్లాలో ఏడాది క్రితం 104 హెక్టార్ల నుంచి 14,27,400 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసేందుకు అనుమతులిచ్చారు. పాత జిల్లాలో 16 రీచ్‌లకు అనుమతి ఉండగా.. అనధికారికంగా మరో 8 నడుస్తున్నాయి. వాగులు, వంకలు కలిపితే 42 చోట్ల నుంచి ఇసుక అక్రమమార్గం పడుతోంది. దీనికి తోడు మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుగా ఉన్న మంజీరా నది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూరు, తగ్గెల్లి, కలుదుర్గి గ్రామాలు మంజీరా నదికి ఆంధ్ర సరిహద్దు గ్రామాలు ఉండగా గంజిగావ్, కార్ల, మసునూరు, హున్ కుందా, సగ్రోళి, బోలెగామ్, చెల్గాం, చౌరాలు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. గత కొంతకాలంగా మన సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక క్వారీలను నిషేధించినప్పటికీ.. ఇక్కడి నుంచి హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాలకు అక్రమంగా మాఫియా ఇసుకను తరలిస్తోంది. - మెదక్ జిల్లా రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండటంతో పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఇక్కడ ఇసుకకు డిమాండ్ పెరిగింది. మంజీరాతో పాటు వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా సరిపోవడంలేదు. మంజీరాతోపాటు పటాన్చెరు, గిన్నారం, సంగారెడ్డి మండలాల్లో నక్కవాగు, ఊడవెల్లి వాగుల్లో మట్టిని జల్లెడ పట్టి ఫిల్టర్ ఇసుకను తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. - పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేవు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ చొరవ కారణంగా శాండ్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా లోకల్‌గా ఏడు ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఈ రీచ్‌ల ద్వారా ఇసుక స్థానిక అవసరాలకు వినియోగించుకునేందుకు ‘పాలమూరు శాండ్’పేరిట ఆన్లైన్ విక్రయాలకు రూపకల్పన చేశారు. గత రెండు నెలలుగా ఆన్లైన్ ద్వారా ఇసుక అమ్మకాలను చేపడుతున్నారు. ఇసుక అమ్మకాలకుగానూ కేవలం ట్రాక్టర్ల ద్వారానే, వాటికి జీపీఎస్ అమర్చి నిర్వహిస్తున్నారు. అయితే నాగర్‌కర్నూల్ ప్రాంతంలోని సిర్సవాడ నుంచి మేడిపూర్, లక్ష్మాపూర్, మొల్గర, చారకొండ తదితర ప్రాంతాల నుంచి ఇసుకను నిరంతరం తరలిస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. -
ఇసుక తవ్వకాలపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో (ఎన్జీటీ) జరుగుతున్న విచారణ డిసెంబర్ 8కి వారుుదా పడింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలంటూ ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పేరిట అక్రమాలకు పాల్పడుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలోనూ పెద్ద పెద్ద యంత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సంజీవ్ కుమార్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ మినరల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ఆధీనంలో పూర్తి పాదర్శకంగా తవ్వకాలు చేపడుతోందని వివరించారు. ప్రభుత్వం ఆధీనంలో తవ్వకాలు చేపడితే అక్రమాలు జరగవా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
గనుల శాఖలో కాగిత రహిత పాలన !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థలో డిసెంబర్ 1 నుంచి కాగితంతో పనిలేకుండా పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి ఒక్క కార్యకలాపాలను ఆన్లైన్ (ఈ-ఆఫీస్) ద్వారానే కొనసాగించాలని తీర్మానించింది. ఈ అంశంపై మంగళవారం టీఎస్ఎండీసీ బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన టీఎస్ఎండీసీ చైర్మన్ శేరిసుభాష్రెడ్డిసహా అధికారులంతా ల్యాప్‌టాప్‌ల ద్వారా గనుల శాఖలో అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా కార్యకలాపాలు, ఇసుక కొరత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూంల ఇళ్ల నిర్మాణాలను చేపడుతుండటంతో అటు ప్రభుత్వ కార్యక్రమాలకు, ఇటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ శేరిసుభాష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమలు, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, టీఎస్ఎండీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సుశీల్‌కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
తుపాకులగూడెంలో ప్రారంభమైన ఇసుక క్వారీ
ఏటూరునాగారం : మండలంలోని తుపాకులగూడెం ఇసుక క్వారీ ఏడాది తర్వాత మళ్లీ ప్రారంభమైంది. తుపాకులగూడెం వద్ద గోదావరి నది నుంచి తోడిన సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ ఉంది. దాన్ని విక్రయిస్తేనే సొసైటీ సభ్యులకు లాభాలు వస్తాయని భావించిన టీఎస్ఎండీసీ అధికారులు క్వారీ నుంచి విక్రయాల అనుమతిని ఆన్లైన్లో పొందుపరిచారు. దీంతో సోమవారం నుంచి ఇసుక క్వారీ అమ్మకాలు ప్రారంభమయ్యారు. దీంతో స్థానిక గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏటూరు సొసైటీ క్వారీ మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీనిపై ఇసుక క్వారీల ప్రాజెక్టు అధికారి వెంకటరమణను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో క్వారీలో విక్రయాలు ప్రారంభించామన్నారు. గోదావరి నుంచి ఇసుకను తీయకుండా గతంలో నిల్వ చేసిన ఇసుకను విక్రయిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
సర్కారు ఇసుకకు సన్నాహాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఇసుక విక్రయాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వమే ఇసుక విక్రయించాలని నిర్ణయించిన విషయంవిధితమే. ఈ మేరకు ప్రత్యేక ఇసుక పాలసీని ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ద్వారా ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో తొలిసారిగా వేమనపల్లి మండల పరిధిలో ప్రవహించే నీల్వాయి నది నుంచి ఇసుక తవ్వకాలు జరుపనున్నారు. ఇక్కడి నుంచి ఇసుకను సమీపంలోని ఓ డంప్ యార్డుకు తరలించి విక్రయించేందుకు టీఎస్ఎండీసీ ఏర్పాట్లు చేస్తోంది. నీల్వాయి నది నుంచి డంప్ యార్డుకు ఇసుకను తరలించేందుకు టీఎస్ఎండీసీ ఇటీవల టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఇసుక డంప్ యార్డు కోసం ప్రభుత్వ భూమిని ఇవ్వాలని టీఎస్ఎండీసీ అధికారులు మంచిర్యాల ఆర్డీవోకు లేఖ రాశారు. నీల్వాయిలో ఇసుక నిల్వలపై సంయుక్త అధికారుల బృందం ఇటీవల సర్వే చేపట్టింది. ఇందులో సుమారు 1.92 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్లు తేల్చింది. దీన్ని డంప్ యార్డుకు తరలించి అక్కడి నుంచి విక్రయించనున్నారు. ఇసుక అవసరం ఉన్న వారు నిర్ణీత మొత్తాన్ని చెల్లించి, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే వారికి టీఎస్ఎండీసీనే ఇసుకను సరఫరా చేస్తుంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇసుక విక్రయ కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం జిల్లాలో కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది. మరో రెండు రీచ్‌ల గుర్తింపు.. జిల్లాలో ఇసుక లభ్యతపై జిల్లా ఉన్నతాధికారుల బృందం ప్రత్యేక సర్వే నిర్వహించింది. గనులు, భూగర్భ జలాలు, నీటి పారుదల, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సంయుక్త పరిశీలన చేపట్టారు. గోదావరి నదిలో 16 ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఇందులో 14 రీచ్‌లలో ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ లేనట్లు గుర్తించారు. రెండు రీచ్‌లు కోటపల్లి మండలం కోనంపేట్లో 2,500 క్యూబిక్ మీటర్లు, జైపూర్ మండలం వేలాలలో మరో 2,500 క్యూబిక్ మీటర్లు ఇసుక అందుబాటులో ఉంది. ఈ రెండు రీచ్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. వాల్టా చట్టం ప్రకారం నదిలో 500 మీటర్ల మధ్యలో తవ్వకాలు చేపట్టాలి. ఆరు మీటర్ల మేరకు ఇసుక పేరుకుపోతే కేవలం ఒక మీటరు మాత్రమే తవ్వాలి. ఎనిమిది మీటర్లు ఇసుక ఉంటే రెండు మీటర్లు తీయూలి. అయితే అధికారుల బృందం గుర్తించిన 14 రీచ్‌లలో ఈ పరిస్థితులు లేవు. -
ఇసుకపై టీఎస్ఎండీసీ పర్యవేక్షణ
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన ఇసుకను సులభమైన పద్ధతిలో ప్రజలకు చేరవేసేలా కొత్త విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు ఇసుక, గనులపై నూతన పాలసీని ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఈ పాలసీ ప్రకారం ఇకపై స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను విక్రయిస్తారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహిస్తారు. ఇసుక రీచ్‌లను ప్రభుత్వం ఐదు కేటగిరీలుగా వర్గీకరించింది. మొదటి విభాగం లో వాగులు, వంకలను చేర్చింది. వీటిపై అధికారాన్ని పంచాయతీలకే కట్టబెట్టింది. స్థానిక గృహా వసరాలకు, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు సీనరేజీ ఫీజు లేకుండానే ఇక్కడి ఇసుకను వినియోగించుకోవచ్చు. ఇసుక తోడేందుకు, రవాణాకు యంత్రాలను వినియోగించకూడదు. అలాగే ఆ గ్రామ పరిధి దాటి ఇసుకను రవాణా చేయకూడదు. ఐదో విభాగంలో కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులను చేర్చారు. ఇసుక లభ్యమయ్యే రీచ్‌లను ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సహకారంతో గనులు, భూగర్భ వనరుల శాఖ గుర్తిస్తుంది. ప్రాథమికంగా గుర్తించిన తర్వాత సాధ్యాసాధ్యాల నివేదికను జాయింట్ కలెక్టర్ సారథ్యంలోని జిల్లా స్థాయి కమిటీ సిద్ధం చేస్తుం ది. సాధ్యమయ్యే రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, నియంత్రణ, రవాణాను టీఎస్ఎండీసీ పర్యవేక్షిస్తుంది. నీటి పారుదల విభాగం సూచనల మేర కు పూడిక పేరుకుపోయిన రిజర్వాయర్లలో లభ్యమయ్యే ఇసుకను సైతం తవ్వి తోడేందుకు అవకాశముంది. ఈ ఇసుకను టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలోని స్టాక్ యార్డులకు తరలించాల్సి ఉం టుంది. రీచ్‌కు దగ్గరలో గానీ పట్టణ ప్రాంతాలు, కార్పొరేషన్ల శివార్లలోగానీ ఈ యార్డులను ఏర్పా టుచేస్తారు. యార్డుల్లో ఇసుక విక్రయాలను సీసీ టీవీల ద్వారా పర్యవేక్షిస్తారు. ఇసుక రవాణా చేసేందుకు స్టాంపు, తేదీతో పాటు సెక్యూరిటీ సీల్‌తో ఉన్న వేబిల్లులను టీఎస్ఎండీసీ జారీ చేస్తుంది. ఇసుక రవాణా చేసే వాహనాలను జీపీఎస్ విధానంలో పర్యవేక్షిస్తారు. పట్టా భూముల్లోనూ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతివ్వనుంది. తవ్వకాల సమయంలో సరిహద్దులు మీరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. సీనరేజీ ఫీజు ఇబ్బడి ముబ్బడిగా విధించకుండా టీఎస్ఎండీసీ నిర్ణయించిన రేటు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు రాతి ఇసుక వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాతి ఇసుక వాడకం పెరిగితే సాధారణ ఇసుకకు డిమాండ్ తగ్గిపోతుందని అంచనా వేసింది. అందుకే రాతి ఇసుక యూనిట్లను పరిశ్రమల కేటగిరీలో చేర్చి.. వాటిని స్థాపించేందుకు వాట్ మినహాయింపు, విద్యుత్తు సబ్సిడీ తదితర రాయితీలు కల్పిస్తామని ప్రకటించింది.