మన ఇసుకకు డిమాండ్‌ | Sand Has Huge Demand In Karimnagar | Sakshi
Sakshi News home page

మన ఇసుకకు డిమాండ్‌

Published Mon, Jul 15 2019 11:07 AM | Last Updated on Mon, Jul 15 2019 11:08 AM

Sand Has Huge Demand In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణాల్లో కీలకంగా వినియోగించే ఇసుకకు భారీ డిమాండ్‌ ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇసుక అందకుండా పోతోంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు సైతం ఇసుకను అందుబాటులోకి తీసుకుని రావానే ఉద్దేశంతో నూతన సాండ్‌ టాక్స్‌ పాలసీని ప్రవేశపెట్టింది.

అయితే అది విజయవంతం కాకపోవడంతో కొన్ని మార్పులు చేసి కొత్తగా ‘మన ఇసుక వాహనం’ పేరుతో కొత్తపాలసీని తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఎండీసీ) అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన నూతన విధానానికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. పది రోజుల్లోనే కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వానికి రూ.16 కోట్ల ఆదాయం సమకూరింది. 

అంతా ఆన్‌లైన్‌లో.. 
మన ఇసుక వాహనం పాలసీ ప్రకారం ఇసుక విక్రయాలన్నీ ఇక ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతాయి. ఇందుకోసం టీఎస్‌ఎండీసీ అధికారులు మన ఇసుక వాహనం పేరుతో వెబ్‌సైట్‌ కూడా రూపొందించారు. ఇసుక కావాల్సిన వారంతా ఈ వెబ్‌సైట్‌ ద్వారానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఇసుక తరలించే వాహనాలు కూడా ముందుగానే అధికారుల నమోదు చేసుకుంటున్నారు. నమోదు చేసిన వాహనాల్లో మా త్రమే ఇసుక తరలించేందుకు అనుమతి ఇస్తారు. 

ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌ షురు..
మన ఇసుక వాహనం విధానం ద్వారా ఇసుక లబ్ధిదారుడికి రవాణ చేయడానికి ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌ పక్రియ ఈనెలలోనే ప్రారంభించారు. ఇప్పటికే ఆయా మండలాల తహసీల్దార్లకు విధివిదాలను అందజేశారు. ట్రాక్టర్‌ను నమోదు చేసుకునే వారు ఆన్‌లైన్‌లో లేదా తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తులు నింపడంతోపాటు రూ.15 వేలు డీడీ తీసి దరఖాస్తుతోపాటు వాహనపత్రాలు, ఆధార్, బ్యాంక్‌ఖాతా, ఒప్పందం పత్రం ఇవ్వాలి. వాటిని కార్యాలయంలో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఒకవేళ ట్రాక్టర్‌ యాజమాని పాలసీ నుంచి తప్పుకుంటే డిపాజిట్‌ ఉంచిన రూ.15 వేలు తిరిగి చెల్లిస్తారు. మన ఇసుక వాహనం పద్ధతితో ట్రాక్టర్‌ యాజమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక రవాణ చేయవచ్చు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి 3,559 ట్రాక్టర్లు వారి వివరాలు నమోదు చేసుకున్నారు. 

ప్రభుత్వం నుంచే అద్దె..
ట్రాక్టర్‌ యాజమానులకు ఇసుక రావాణా చేసినందుకు అద్దెను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకు కిలోమీటర్‌కు రూ.65 చెల్లించాలని నిర్ణయించింది. ఇందులో డిజిల్‌కు రూ.15, ట్రాన్స్‌ఫొర్ట్‌ కింద రూ.50 ఉంటాయి. ఇవే కాకుండా ట్రాక్టర్‌లో ఇసుక నింపడానికి రూ.250,  5 కిలోమీటర్ల వరకు అన్ని పన్నులు కలుపుకుని రూ.వెయ్యి చెల్లిస్తుంది. ఇలా దూరాన్ని బట్టి రుసుం పెరుగుతుంది. నెల కాగానే యాజమానికి చెల్లించాల్సిన రుసుం వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తారు.

ఈ విధానంలో ఒక క్యూబిక్‌ మీటర్‌ ఇసుక రూ.900 నుంచి రూ.1000 వరకూ ధర పలుకుతుంది. ఒక ట్రాక్టర్‌లో సుమారు మూడు క్యూబిక్‌ మీటర్ల «ఇసుక పడుతుంది. మూడు క్యూబిక్‌ మీటర్ల ఇసుక ట్రాక్టర్‌కు సుమారు రూ.2800 వరకూ ధర ఉంటుంది. 

జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్‌లు ఇవే..
కరీంనగర్‌ జిల్లాలో స్థానిక అవసరాల కోసం ఏడు ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించారు. ఇందులో జమ్మికుంట మండలం తణుగుల, వీణవంక మండలం కురిక్యాల, కరీంనగర్‌ మండలం చేగుర్తి, మానకొండూరు మండలం లింగాపూర్, వెల్ది, తిమ్మాపూర్‌ మండలం నేదునూర్, కొత్తపల్లి మండలం ఐనవానిపల్లె గ్రామాల్లో ఇసుకరీచ్‌ను గుర్తించి సిద్ధం చేశారు. 

పక్కాగా అమలు..
గతేడాది అమల్లోకి తీసుకుని వచ్చిన సాండ్‌ టాక్స్‌ పాలసీ విజయవంతం కాలేదు. దీంతో మన ఇసుక వాహనం పాలసీని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా యంత్రంగం నిర్ణయిం చింది. ఇప్పటికే కలెక్టర్‌తోపాటు జేసీ, పలువురు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్‌ ఆదేశాలతో మైనింగ్, పోలీసులు, రెవెన్యూ, ఆర్టీఏ అధికారుల సహకారంతో పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ట్రాక్టర్‌ యాజమానులకు అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మన ఇసుక వాహనం పాలసీ అమల్లోకి వస్తే నాణ్య మైన ఇసుక తక్కువ ధరకే లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఇసుక ట్రాక్లర్ల ద్వారా నిర్భయంగా ఇసుక రవాణ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 

బుకింగ్‌ ప్రారంభం
మన ఇసుక వాహనం వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు 3,559  ట్రాక్టర్లు వారి వివరాలు నమోదు చేసుకున్నారు. 23,894 మంది ఇసుక కోసం బుకింగ్‌ చేసుకున్నారు. 22,202 మందికి ఇప్పటికే ఇసుక డెలివరీ చేశారు. 75,573 ట్రిప్పుల ఇసుక రవాణ చేయగా వీటిలో ట్రాక్టర్ల ద్వారా 70,995 ట్రిప్పులు రవాణ చేశారు. వీటి ద్వారా  ప్రభుత్వానికి సుమారు రూ.16.65 కోట్ల ఆదాయం వచ్చింది. 

బుకింగ్‌ ఇలా..
ఇసుక కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో మన ఇసుక వాహనం అనే వెబ్‌సైట్‌కు వెళ్లి క్లిక్‌ చేస్తే మన ఇసుక వాహనం మెనూ ఒపేన్‌ అవుతుంది. అందులో మొదట మన మొబైల్‌ నంబర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత సైట్‌లోకి వెళ్లి మన వివరాలు నమోదు చేసి ఎక్కడికి, ఎప్పుడు, ఎంత ఇసుక కావాలో వివరాలు నమోదు చేస్తే చివర ఎంత ధర చెల్లించాల్లో కనిపిస్తుంది. దానికి వివిధ పద్ధతులు నెట్‌ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్‌కార్డు, పేమెంట్‌ యాప్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

కావాల్సిన ఇసుక ట్రాక్టర్లకు చెల్లింపులు చేసిన తర్వాత మన మొబైల్‌కు ఒక ఓటీపీ నంబర్‌ వస్తుంది. దానిని భద్రపర్చుకోవాలి మన ఇసుక రవాణ చేసిన వ్యక్తికి ఆ ఓటీపీ నంబర్‌ చేబితే ట్రాక్టర్, లారీ డ్రైవర్‌ తన వద్ద ఉన్న వివరాలతో సరిపోల్చుకుని ఓటీపీని ఎంటర్‌ చేస్తే రవాణ పూర్తవుతుంది. ఒక వేళ ఓటీపీ చెప్పకపోతే మనకు ఇసుక రవాణ చేయనట్టే భావిస్తారు. ఈ వెబ్‌సైట్‌ నిర్వహణను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెస్‌(సీజీజీ)కి అప్పగించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement