సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల పేరిట నదులు, వాగుల నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ దందాలో తవ్వేకొద్దీ అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. ఇసుక దోపిడీపై ‘మారీచులు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన పరిశోధనాత్మక కథనానికి స్పందించిన టీఎస్‌ఎండీసీ నిబంధనల మేరకే తవ్వకాలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చింది. కానీ అటు టీఎస్‌ఎండీసీ, ఇటు జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ఉండే ఇసుక వనరులన్నీ అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి.
స్థానిక అవసరాల కోసం ఒకటి, రెండు, మూడో కేటగిరీ వనరుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్న జిల్లా యంత్రాంగం.. అక్రమ రవాణాను పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల ప్రజాప్రతినిధులే ఇసుక అక్రమ రవాణా దందా సాగిస్తుండగా.. ప్రభుత్వ శాఖల సిబ్బంది చూసీ చూడనట్టు ఉంటున్నారు. ముఖ్యంగా కొందరు కిందిస్థాయి పోలీసు, రెవెన్యూ అధికారులు అక్రమ వ్యాపారానికి అండగా నిలుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది పోస్టింగుల్లో కొందరు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నట్టు ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
రీచ్‌ల నుంచి మొదలుకుని..
టీఎస్‌ఎండీసీ 4, 5 కేటగిరీ క్వారీల ద్వారా ఇసుకను వెలికితీస్తూ.. ‘శాండ్ సేల్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ ద్వారా విక్రయిస్తోంది. ఆన్ లైన్ చెల్లింపులు, అనుమతులు జారీ చేస్తున్నా స్టాక్ పాయింట్లు, వేబ్రిడ్జీల వద్ద కొందరు సిబ్బంది.. ఈ వ్యవస్థ లోని లోపాలను అనువుగా మల్చుకుం టున్నారు. రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద ప్రాజెక్టు అధికారులు (పీవోలు) ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వసూళ్లు సాగిస్తున్నారు.
బినామీల చేతుల్లో సొసైటీలు, రీచ్‌లు
అన్ని కేటగిరీలకు చెందిన ఇసుక రీచ్‌లు కూడా ప్రజాప్రతినిధులు లేదా వారి బినామీల కనుసన్నల్లోనే కొనసాగుతున్నట్టు ‘సాక్షి’ పరిశోధనలో వెల్లడైంది. గిరిజన సహకార సొసైటీల పేరిట కొన్ని ప్రైవేటు నిర్మాణ సంస్థలు ఇసుకను లూటీ చేస్తున్నాయి. అంతేకాదు గిరిజన సొసైటీలకు కేటాయించిన రీచ్‌లలో యంత్రాలను వినియోగించకూడదన్న నిబంధన కూడా అమలు కావడం లేదు.
జియో కోఆర్డినేట్స్ ప్రకారమే తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నా.. ప్రభుత్వపరంగా తవ్వకాలపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. చాలాచోట్ల రీచ్‌ల వద్ద ప్రైవేటు వ్యక్తులు కాపలాగా ఉంటూ అటువైపు ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అటువైపు వెళ్లినవారిపై దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారులు.. తమను అడ్డుకున్న వారిని వాహనాలతో ఢీకొట్టించి, చంపారన్న ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలు నామ్‌కేవాస్తేనే..
- స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని టీఎస్‌ఎండీసీ చెప్తోంది. కానీ చాలాచోట్ల సీసీ కెమెరాల వ్యవస్థ నామ్‌కే వాస్తేగా మారింది.
- పీవోలు లారీలు, ట్రాక్టర్లలో అదనపు బకెట్లు ఇసుక నింపడం, సీరియల్ నంబర్ ముందు వచ్చేలా చూడటం ద్వారా జేబులు నింపుకొంటున్నారు. అనుమతి పొందిన పరిణామం కంటే ఎక్కువ ఇసుక నింపడం ద్వారా రూ.2 వేల వరకు, సీరియల్ నంబర్ త్వరగా వచ్చేందుకు రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు.
- తగిన సంఖ్యలో టీఎస్‌ఎండీసీ అధికారిక వేబ్రిడ్జిలు లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. ఒకే నంబరు కలిగిన లారీలు, నకిలీ వేబిల్లుల ద్వారా రవాణా వంటి ఘటనలపై ములుగు, మహదేవపూర్, కాటారం, స్టేషన్ ఘనపూర్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి.
- ప్రభుత్వ ప్రాజెక్టుల పేరిట తరలివెళ్తున్న ఇసుక గమ్యస్థానానికి చేరుతుందో, లేదో తెలుసుకునే పటిష్ట పర్యవేక్షక వ్యవస్థ కొరవడింది. మైనింగ్, రెవెన్యూ, పోలీసు, రవాణా అధికారుల నడుమ సమన్వయ లోపం అక్రమార్కులకు అనుకూలంగా మారింది.
చదవండి:కేపీహెచ్‌బీ–హైటెక్‌సిటీ ఆర్‌యూబీని ప్రారంభించిన కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment