ఇసుక ధరలకు రెక్కలు  | Huge hike for sand prices | Sakshi
Sakshi News home page

ఇసుక ధరలకు రెక్కలు 

Aug 6 2019 2:59 AM | Updated on Aug 6 2019 2:59 AM

Huge hike for sand prices - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వారం రోజులుగా గోదావరి నదికి వరద పోటెత్తుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లు మూతపడ్డాయి. రీచ్‌లకు వెళ్లే రహదారులు బురదమయం కావడంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో ఆన్‌లైన్‌ విధానంలో ఇసుక విక్రయాలను టీఎస్‌ఎండీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. డిమాండ్‌కు అనుగుణంగా ఇసుక సరఫరా లేకపోవడాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటుండటంతో బహిరంగ మార్కెట్‌లో ఇసుక ధర అమాంతం పెరిగింది. గోదావరికి వరద ఉధృతి తగ్గి కొత్త రీచ్‌లు అందుబాటులోకి వస్తేనే ఇసుక సరఫరా మెరుగవుతుందని టీఎస్‌ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. 

మూతపడిన రీచ్‌లు... 
రాష్ట్రంలో సుమారు 30 రీచ్‌ల ద్వారా టీఎస్‌ఎండీసీ ఇసుకను వెలికితీస్తూ సగటున రోజుకు 30 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. టీఎస్‌ఎండీసీ వెలికితీస్తున్న ఇసుకలో 96 శాతం గోదావరి తీరంలోని పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని రీచ్‌ల నుంచే వస్తోంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుండటంతో రీచ్‌లు మూత పడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆరు రీచ్‌లే పనిచేస్తున్నాయని టీఎస్‌ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వాహనాలకు మాత్రం ఇసుకను లోడ్‌ చేస్తున్నారు.  

అమాంతం పెరిగిన ధరలు... 
ఆన్‌లైన్‌లో టన్ను ఇసుకను రూ. 600 చొప్పున టీఎస్‌ఎండీసీ విక్రయిస్తుండగా రవాణా, ఇతరచార్జీలు కలుపుకొని సీజన్‌లో రూ. 1,250 నుంచి రూ. 1,500 వరకు ధర పలికింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయాలు నిలిచిపోవడంతో కొరతను దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యమైన ఇసుక ధర బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం టన్నుకు రూ. 2,200కుపైనే పలుకుతోంది. ముడి ఇసుక (కోర్‌ శాండ్‌) టన్నుకు రూ. 1,400 చొప్పున లభిస్తున్నా వినియోగదారులు ఫైన్‌ శాండ్‌ కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫైన్‌ శాండ్‌కు రాష్ట్రంలో ఉన్న కొరతను దళారీలు ఆసరాగా తీసుకుని ధరలు అమాంతం పెంచేశారు. గతేడాది అక్టోబర్‌లో ఆఫ్‌ సీజన్‌లో టన్ను ఇసుక రూ. 3వేలకుపైగా పలికిన విషయాన్ని వినియోగదారులు గుర్తుచేస్తున్నారు. 

స్టాక్‌ పాయింట్ల వద్ద నిండుకుంటున్న నిల్వలు
వర్షాకాలం దృష్ట్యా టీఎస్‌ఎండీసీ స్టాక్‌ పాయింట్ల వద్ద కనీసం కోటి క్యూబిక్‌ మీటర్ల ఇసుకను నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్‌ పరిధిలో ఉన్న ఇసుక డిమాండ్‌ నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్, భౌరంపేట, వట్టినాగులపల్లిలో సబ్‌ స్టాక్‌ పాయింట్లు ఏర్పా టు చేసింది. అయితే ప్రస్తుతం స్టాక్‌ పాయింట్ల వద్ద కేవలం రెండు లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలే ఉన్నాయి. అయితే మరో 2, 3 రోజుల్లో రీచ్‌ల సంఖ్య పెరగడంతోపాటు ములుగు, భద్రాచలం జిల్లాల్లో కొత్తరీచ్‌లు అందుబాటు లోకి వచ్చే అవకాశముందని టీఎస్‌ఎండీసీ వర్గా లు వెల్లడించాయి. ఇసుక రీచ్‌లు అందుబాటు లోకి వచ్చాకే అన్‌లైన్‌ విధానంలో ఇసుక విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement