గోదావరి నది కోత ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ తొలి రోజు సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం 6.24 గంటలకు హెలికాప్టర్‌లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు.
బాధితులకు అండగా..
హెలిపాడ్ నుంచి గెస్ట్ హౌస్‌కు వచ్చే మార్గంలో సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రోడ్లకు ఇరువైపులా నిలుచొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం జగన్ వారికి అభివాదం చేశారు. దారిలో ఇద్దరు అనారోగ్య బాధితులను పలకరించారు. వారి సమస్య విని తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ మాధవిలతను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందజేశారు.
కోనసీమ జిల్లాలో పర్యటన ఇలా..
సీఎం జగన్ మంగళవారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. 9.10కి ఆర్ట్స్ కళాశాల వద్ద హెలికాప్టర్‌లో బయలుదేరి 9.40కి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజపులంక చేరుకుంటారు. 10.25 వరకు గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.
10.35కు రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, 11.10 వరకు రామాలయపేటలో వరద బాధితులతో మాట్లాడతారు. 11.10 గంటలకు అక్కడి నుంచి అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. 11.20 నుంచి 11.50 గంటల వరకు అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. 11.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి 12.15 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తాడేపల్లికి వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment