sand Reach
-
ఇసుక రవాణా చార్జీలకు ఆరు శ్లాబ్‌లు
సాక్షి, అమరావతి: ఒకవైపు ఉచిత ఇసుక అంటూనే... మరోవైపు రకరకాల చార్జీలను ప్రజలపై మోపుతోంది టీడీపీ ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానంలో రవాణా చార్జీలు రాష్ట్రమంతా ఒకేలా ఉండేలా జీవో జారీ చేసింది. కిలో మీటర్ల ప్రకారం ఆరు శ్లాబులుగా రవాణా చార్జీలను నిర్ణయించింది. ఇసుక సరఫరా పాయింట్ నుంచి వినియోగదారునికి చేరే వరకు ఉన్న దూరాన్ని బట్టి శ్లాబు ఉంటుంది. ఈ శ్లాబుల ప్రకారం వాహనాల్లోని ఇసుక పరిమాణం, కిలోమీటర్ల దూరాన్ని లెక్కించి రవాణా చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని ఒప్పందం చేసుకుని ఇసుక రవాణా చేసే వాహనాల యజమానులతో అగ్రిమెంట్లు చేసుకోవాలని, సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటూనే ఇలా రవాణా చార్జీలను ప్రకటించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తవ్వకం, లోడింగ్ చార్జీలను కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఇక అది ఇసుక విధానం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ముందస్తు చర్యలు..మస్తుగా ఇసుక నిల్వలు
సాక్షి ప్రతినిధి, కడప : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని నదులు పొంగి పొర్లాయి. దీంతో ఇసుక రీచ్‌లు దాదాపు మూతపడ్డాయి. అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా డిపోల్లో లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుకను సిద్ధంగా ఉంచడంతో ప్రస్తుతానికి కొరత లేకుండా పోయింది. అవసరమైన వినియోగదారులకు ఇసుక డిపోల నుంచే తరలిస్తున్నారు. వరద ప్రభావం తగ్గుముఖం పట్టిన వెంటనే అన్ని రీచ్‌ల ద్వారా 12,98,835 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది. ∙ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వైఎస్సార్ జిల్లాలో పెన్నా, చిత్రావతి, కుందూ, పాపాఘ్ని నదులు పొంగి ప్రవహించాయి. వీటి పరిధిలో జిల్లాలో 18 ఇసుక రీచ్‌లు ఉండగా, వరద ప్రభావంతో ప్రస్తుతం 15 మూతపడ్డాయి. జిల్లాలోని వెంకాయ కాలువ, ఏటూరు, గడ్డంవారిపల్లె రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. మొత్తం 18 రీచ్‌ల పరిధిలో 88.722 హెక్టార్ల పరిధిలో 8,43,765 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉండేది. అయితే ఈ రీచ్‌లు మూతపడడంతో ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రభుత్వం ముందస్తు చర్యగా జిల్లాలోని బద్వేలు, చిన్నచౌకు, పోరుమామిళ్ల, మైదుకూరు, పగడాలపల్లె, కమలాపురం, నందిపల్లె, పులివెందుల, కె.వెంకటాపురం, పి.అనంతపురం, నంగనూరుపల్లె డిపోలలో 5,07,476 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచింది. అన్నమయ్య జిల్లాలో చెయ్యేరు, బాహుదా, మాండవ్యలు పొంగి ప్రవహించాయి. దీంతో ఆ జిల్లా పరిధిలోని 13 ఇసుక రీచ్‌ల్లో 11 మూతపడ్డాయి. కేవలం మందరం, గంగిరెడ్డిపల్లె రీచ్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి. మొత్తం 13 రీచ్‌ల పరిధిలో 53.427 హెక్టార్లలోని రీచ్‌ల ద్వారా 4,55,070 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉండేది. అయితే రీచ్‌లు మూతపడడంతో ప్రస్తుతం అక్కడి నుంచి ఇసుక తరలించడం నిలిచిపోయింది.జిల్లాలోని మంగంపేట, వెంకటరాజుపేట, రాయచోటి, మందపల్లె, టంగుటూరు, పీలేరు ఇసుక డిపోల పరిధిలో 1,77,395 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. నదుల్లో నీరు తగ్గాక రీచ్‌లను పునరుద్ధరిస్తాం వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని నదుల్లో నీరు పారుతుండడంతో 90 శాతానికి పైగా ఇసుక రీచ్‌లు మూతపడ్డాయి. అయితే వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 19 ఇసుక డిపోల పరిధిలో ప్రస్తుతం 6,84,873 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇసుక అందుబాటులో లేదన్న ఫిర్యాదులు మాకు లేవు. నదుల్లో నీరు తగ్గిన వెంటనే రీచ్‌లను పునరుద్ధరిస్తాం. – పి.వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భగనులశాఖ, కడప రెండు జిల్లాల పరిధిలో ప్రస్తుతం 19 ఇసుక డిపోల్లో 6,84,873 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. దీంతో అవసరమైన వినియోగదారులకు డిపోల నుంచి ప్రభుత్వం ఇసుకను తరలిస్తోంది. వరద ప్రవాహం తగ్గిన వెంటనే రెండు జిల్లాల్లోని 31 రీచ్‌ల పరిధిలో 142.149 హెక్టార్లలో 12,98,835 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది. -
ఇసుక నిల్వకు భూమిని లీజుకివ్వడంపై పిల్
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో పూడిక తీసిన ఇసుకను నిల్వ చేసేందుకు రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో ఉన్న 10 ఎకరాల భూమిని ‘రీచ్ డ్రెడ్జింగ్ లిమిటెడ్’కు మూడు నెలల పాటు లీజుకివ్వడాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతుల పరిరక్షణ సమితి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలను తమ ముందుంచాలని అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, లీజుకిచ్చిన ప్రాంతం కృష్ణానదిని ఆనుకుని ఉందన్నారు. ఇది పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతమని, ఇలాంటి చోట ఇసుక నిల్వలకు అనుమతినివ్వడం సీఆర్డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. వర్షాల వల్ల నిల్వ చేసిన ఇసుక మొత్తం తిరిగి నదిలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. ఏఎంఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, కేవలం మూడు నెలల కాలానికే ఆ ప్రాంతంలో భూమిని లీజుకివ్వడం జరిగిందన్నారు. ఇక్కడ నిల్వ చేసిన ఇసుక కొంత ఎండిన తరువాత ఇతర అవసరాలకు, ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఇసుకను ఇక్కడ శాశ్వతంగా నిల్వ చేయడం లేదని తెలిపారు. తగిన గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని చెప్పారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఇసుక నిల్వ చేస్తున్న ప్రాంతం కృష్ణానదికి ఎంత దూరంలో ఉంది? కొంత ఎండిన తరువాత నిల్వ చేసిన ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారు? తదితర వివరాలను తమ ముందుంచాలని ఏఎంఆర్డీఏను ఆదేశించింది. -
ఇసుక తవ్వకాలకూ ఈ–పర్మిట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు ఇకపై ఈ పర్మిట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానం వర్తింప చేస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే క్రమంలో టెండర్లను దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్‌తో జరిగిన అగ్రిమెంట్లోనే ఈ మేరకు అంగీకారం కుదిరిందన్నారు. ఇసుకకు ఈ పర్మిట్ కోసం మైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమలులోకి తీసుకు వస్తున్నామని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థ రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఆన్లైన్లో ఈ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయా రీచ్‌ల పరిధిలోని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలించి, ఎటువంటి జాప్యం లేకుండా డీఎంజీ కార్యాలయం నుంచి ఈ పర్మిట్‌ను జారీ చేస్తామని పేర్కొన్నారు. తద్వారా ఏ రీచ్‌లో ఎంత మేరకు మైనింగ్ జరిగిందనేది కచ్చితంగా తెలుస్తుందని, మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని తెలిపారు. -
జేపీ పవర్‌కు ఇసుక తవ్వకం పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకం, నిల్వ, అమ్మకం టెండర్లను ఢిల్లీకి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీ పవర్) సొంతం చేసుకుంది. ఈ సంస్థ దేశంలోనే అతిపెద్దదైన హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ ఉత్పత్తి కేందాన్ని నిర్వహిస్తోంది. మూడు ప్యాకేజీలకు జేపీ పవర్ ఎక్కువ ధర కోట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) దానికే టెండర్లు ఖరారు చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.765 కోట్ల ఆదాయం లభిస్తుంది. గతేడాది కంటే ఇది 20 శాతం అధికం. పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ఇసుక తవ్వకాలు, నిల్వ, అమ్మకాలు జరిపేందుకు అర్హత గల సంస్థను ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర గనుల శాఖ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకు అప్పగించింది. ఎంఎస్టీసీ ఈ–టెండర్లు ఆహ్వానించగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, జయప్రకాష్ పవర్ వెంచర్స్, ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. మూడు సంస్థల సాంకేతిక, ఆర్థిక అర్హతలను పరిశీలించి ఎక్కువ ధర కోట్ చేసిన జయప్రకాష్ పవర్ వెంచర్స్‌కు టెండర్‌ను కట్టబెట్టారు. ఈ సంస్థ ఒకటో ప్యాకేజీకి రూ.477.50 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.745.50 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.305.60 కోట్లను కోట్ చేయగా మిగిలిన రెండు సంస్థలు అంతకంటే తక్కువ ధర కోట్ చేశాయి. రెండేళ్లపాటు జేపీ పవర్ ఇసుక తవ్వకాలను నిర్వహించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానంలో ప్రభుత్వానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.161.30 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు రూ.380.00 కోట్ల నికర ఆదాయం లభించింది. కాగా టెండర్‌ను దక్కించుకున్న జేపీ గ్రూప్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ప్రముఖ ప్రైవేటు సంస్థగా ఉంది. విద్యుత్ రంగంలోనే కాకుండా సివిల్ ఇంజనీరింగ్, నిర్మాణం, సిమెంట్, రోడ్ల నిర్మాణం, ఆతిథ్యం, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ, క్రీడా, విద్యా రంగాల్లోనూ ఈ సంస్థ పనిచేస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు అవసరం లేదు.. ► రీచ్‌ల వద్దే స్టాక్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నేరుగా ర్యాంపుల దగ్గర ఇసుక నాణ్యతను పరిశీలించి నచ్చిన రీచ్‌లో డబ్బు కట్టి రసీదు తీసుకోవచ్చు. అక్కడ కావాల్సినంత ఇసుకను తెచ్చుకున్న వాహనంలో తీసుకెళ్లవచ్చు. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రీచ్ వద్ద ఒకే ధర ఉంటుంది. దూరం ఆధారంగా, ప్రాంతాల వారీగా అప్పర్ సీలింగ్‌తో ఒక ధర నిర్ణయిస్తారు. ► ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. ఫిర్యాదులపై కఠిన చర్యలుంటాయి. ► ఇసుక అమ్మకాల్లో సిఫార్సులకు ఏమాత్రం అవకాశం ఉండదు. ► ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ► ఇసుక సరఫరాలో రవాణా కాంట్రాక్టర్, దళారీల ప్రమేయం ఉండదు. ► ఇకపై పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు అనుమతించరు. ► ఓపెన్ రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలను అనుమతించడం వల్ల నాణ్యమైన ఇసుక దొరుకుతుంది. -
ఇసుక తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, కొవ్వూరు: జిల్లాలో ఇసుక తవ్వకాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేవలం నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ పథకం పనులకు మాత్రమే ఇసుక సరఫరా చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని డోర్ డెలివరీ పథకానికి ప్రస్తుతానికి అనుమతి లేదని అధికారులు చెప్పారు. ముందస్తుగా స్టాకు యార్డులకు ఇసుక తరలించి నిల్వ చేయడం ద్వారా వర్షకాలంలో ఇసుక కష్టాలను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ర్యాంపులను తెరిచి ఇసుకను స్టాక్ యార్డులకు తరలిస్తున్నారు. గండేపల్లి, జగ్గంపేటలతో పాటు జిల్లాలోని తాడేపల్లిగూడెం స్టాకు యార్డుకి ఇసుక చేరవేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా గత నెల 22 నుంచి నిలిచిన తవ్వకాలు మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఇసుక ర్యాంపుల్లో పడవ యాజమానులతో కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. వాడపల్లి, ఔరంగబాద్, ఏరినమ్మ, కొవ్వూరు, దండగుండరేవు, ఆరికిరేవుల, దండగుండ రేవు, కొవ్వూరు–1 ర్యాంపుల నిర్వహణ సొసైటీలతో సమీక్షించారు. ర్యాంపులో సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం వంటి నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు. కాగా జిల్లాలో పోలవరం, తాడిపూడి, ప్రక్కిలంక, గుటాల ర్యాంపులు వారం రోజుల క్రితమే తెరిచారు. నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సరఫరా చేస్తున్నారు. జ స్టాకు యార్డుల ఏర్పాటు జిల్లాలో తాడేపల్లిగూడెం స్టాకుయార్డుకి తూర్పు గోదావరి జిల్లా నుంచి మూడు రోజుల్లో 35 వేల టన్నుల ఇసుక తరలించారు. సోమవారం నుంచి ఐ.పంగిడిలో నూతనంగా స్టాకు యార్డు ప్రారంభం కానుంది. రానున్న రోజుల్లో భీమవరం, ఉండి, కాపవరం వంటి స్టాకు యార్డులకు ఇసుక తరలిస్తాం. –కె.మనోరంజన్ రెడ్డి, ఏపీఎండీసీ జిల్లా ఇన్చార్జ్ -
చంద్రబాబు మాయలపకీర్
సాక్షి, నెల్లూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ మాయల ఫకీర్ అని, దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుక బకాసురులకు రారాజు చంద్రబాబునాయుడని ఎద్దేవా చేశారు. మండలంలోని జొన్నవాడ ఇసుకస్టాక్ యార్డు వద్ద గురువారం ఆయన ఇసుక వారోత్సవాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు బాగా కురవడంతో నదులు, రిజర్వాయర్లు నిండి జలకళ సంతరించుకుందన్నారు. ఈ నేపథ్యంలో నదుల్లో ఇసుక తీయడం కష్టతరంగా మారిందన్నారు. ఈ క్రమంలో ఇసుక రవాణాలో జాప్యం జరిగిందని తెలిపారు. కనీసం ఈ మాత్రం జ్ఞానం లేని చంద్రబాబునాయుడు ఇసుకదీక్ష పేరిట డ్రామా ఆడడం ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. టీడీపీ హయాంలో జరిగినంత ఇసుకదోపిడీ ఎన్నడూ జరగలేదన్నారు. చంద్రబాబునాయుడి ఇంటి పక్కనే అనుమతులు లేకుండా ఇసుకను లారీల్లో తరలించారన్నారు. చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ వ్యాపారం జరిగిందన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిని అక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన దారుణంపై చంద్రబాబునాయుడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అటువంటి నీచమైన చరిత్ర ఉన్న చంద్రబాబునాయుడు నేడు ఇసుకదీక్ష పేరిట కొత్తనాటకానికి తెరలేపాడని ఎద్దేవా చేశారు. రాజకీయ ఓటమిని తట్టుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించినా చంద్రబాబునాయుడికి సిగ్గురాలేదన్నారు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు కార్మికులపై లేనిపోని ప్రేమ ఒలకబోయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికులకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన నీచమైన సంస్కృతి అచ్చెన్నాయుడిదన్నారు. అటువంటి వ్యక్తి నేడు కార్మికుల విషయంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కార్మికశాఖా మంత్రిగా అచ్చెనాయుడు ఏం ఉద్దరించాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబునాయుడి దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పిచ్చిప్రేలాపనులు మానుకోవాలని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలు 151 మందిని విమర్శించే స్థాయి నీకెక్కడిదని ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. 2014 నుంచి నేటి వరకు పవన్‌కల్యాణ్ చంద్రబాబు వద్ద సూట్‌కేసులు తీసుకుని ఇతర పార్టీలను విమర్శించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. గత ఐదేళ్లలో జరిగిన ఇసుక దందాలు, అవినీతిపై ఎందుకు ప్రశ్నించలేదని ఆయన పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల పవన్‌కల్యాణ్‌ను చిత్తుగా ఓడించినా సిగ్గురాలేదన్నారు. చిరంజీవి గొప్ప వ్యక్తి అని, పవన్‌కల్యాణ్ చిరంజీవిని చూసి మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. టీడీపీ చార్జిషీట్ అంతా బోగస్ ఇసుక అక్రమ రవాణా విషయంలో టీడీపీ నేతలు విడుదల చేసి చార్జిషీట్ అంతా బోగస్ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. తమ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, కొండూరు వెంకటసుబ్బారెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి పేర్లు పెట్టారని వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. సూరా శ్రీనివాసులురెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లు రీచ్‌కు సంబంధించి భాగం ఉన్నది వాస్తవమేనన్నారు. అయితే ఇక్కడ గుప్పెడు ఇసుక కూడా అక్రమ రవాణా జరగడం లేదనే విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇసుక అక్రమ రవాణా విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారన్నారు. పట్టుబడితే రూ.2లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. సీఎం ఆదేశానుసారం నాయకులందరూ ఆయన మాటలను పాటిస్తున్నామని, టీడీపీ నేతలు రాజకీయ ఓటమిని ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, అధికారం పోయిందని ఇష్టానుసారం మాట్లాడితే సహించరని ఆయన తెలిపారు. ఆర్డీఓ డి. హుస్సేన్ బాషా మాట్లాడుతూ ఇసుక ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోమని ఆదేశించిందన్నారు. ఇసుక ఉత్పాదకత రోజుకు 2500 మెట్రిక్ టన్నులు ప్రస్తుతం ఉందన్నారు. వారోత్సవాల సందర్భంగా దానిని 5వేల మెట్రిక్ టన్నులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో 188 చిన్న ఇసుకరీచ్‌లను సిద్ధంగా చేస్తున్నామని తెలిపారు. మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లురెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 12 ఇసుకరీచ్‌లకు గాను 8 రీచ్‌లు పనిచేస్తున్నాయన్నారు. గతంలో ఇసుకను బయట జిల్లాలకు సరఫరా జరిగేదని, నేడు జిల్లా ప్రజలకే పరిమితం చేశారని తెలిపారు. ఏపీఎండీసీ డీజీఎం వెంకటరమణ మాట్లాడుతూ గతంలో ఇసుక సరఫరా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేదని, నేడు రాత్రి 10 గంటల వరకు రవాణా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ సురేష్‌బాబు, ఎస్సై జిలానీబాషా, ఎంపీడీఓ డీవీ నరసింహారావు, డిప్యూటీ తహసీల్దార్ తులసీమాల, ఐకేపీ ఏపీఎం లలిత, వైఎస్సార్సీపీ నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఇప్పగుంట విజయ్‌భాస్కర్‌రెడ్డి, చెర్లో సతీష్‌రెడ్డి, గుమ్మా సుధాకరయ్య, మోహన్ మురళీకృష్ణ, సుధాకరయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఇసుక కొరత లేదు
-
ఇసుక రవాణాకు పచ్చ జెండా
సాక్షి, ఒంగోలు సిటీ: ఇసుక కొరత తీరనుంది. మధ్యలో ఆగిన కట్టడాలకు మంచి కాలం. ఇసుక లేదని ఒత్తిడికి గురవ్వాల్సిన పని లేదు. భవన నిర్మాణ రంగానికి కొత్త ఊపు రానుంది. గృహ నిర్మాణాలకు నెమ్మది నెమ్మదిగా కదలిక. ప్రభుత్వ పథకాలకు కావాల్సినంత ఇసుక. జిల్లాలోని కందుకూరు కేంద్రంగా సుమారు ఐదు లక్షల టన్నుల వరకు తవ్వుకోవచ్చు. ఇక స్థానిక అవసరాలకు తగినంత వాడుకోవచ్చు. ఒకటి రెండు రోజుల్లోనే ఇసుక రవాణాకు జిల్లా కమిటీ పచ్చజెండా ఊపింది. జిల్లాలోని పాలేరు బిట్రగుంట (పీబీ చానెల్) పరిధిలోని జిల్లెళ్లమూడి గ్రామం వద్ద ఇసుక రేవులో సుమారు మూడు మీటర్ల వరకు ఇసుక మేట వేసింది. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించి వాల్టా చట్టం కింద దిగువ ఉన్న రైతులకు ప్రాజెక్టు నుంచి నీరు అందే పరిస్థితి లేనందున ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తవ్వకాలు నిలిచాయి. కొద్ది నెలల పాటు హైకోర్టులో వాజ్యం జరిగింది. జిల్లా అధికారులు పాలేరు బిట్రగుంట చానెల్లో ఇసుక మేట బాగా పెరిగినందున తవ్వకాలకు అనుమతించాలని కోర్టుకు నివేదించారు. దీని వల్ల గ్రామస్తులకు ఉన్న ఇబ్బందులను కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల కిందట హైకోర్టు పాలేరు బిట్రగుంట చానెల్ జిల్లెళ్లమూడి ఇసుక రేవు నుంచి ఇసుక తవ్వకాలను కొనసాగించవచ్చని అనుమతించింది. జిల్లా అధికారులు జిల్లెళ్లమూడి ఇసుక రేవును పరిశీలించి తవ్వకానికి అనుమతులు కోరుతూ జిల్లా ఇసుక తవ్వకాల అనుమతుల కమిటీకి నివేదించారు. కమిటీ అధికారుల నుంచి నివేదిక పరిశీలించింది. పాలేరు బిట్రగుంట ఛానెల్ జిల్లెళ్లమూడి వద్ద సుమారు 3.08 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లుగా నివేదిక ఆధారంగా సమాచారం తీసుకున్నారు. పీబీ చానెల్ పరిధిలో 7318 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. పీబీ చానెల్లో 0.759 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే విధంగా డిజైన్ చేశారు. అయితే ఇసుక మూడు మీటర్ల ఎత్తులో మేట వేసినందున డిజైన్ చేసిన విధంగా 0.759 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం లేదని, ఎగువ నుంచి నీరు వచ్చినప్పుడు ఈ పీబీ ఛానెల్లో నిల్వ సామర్ధ్యం లేక నీటిని వినియోగించుకోలేరని, నీటిని దిగువకు విడిచిపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలోనే మేట వేసిన ఇసుక తవ్వకాలను అనుమతించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. సమావేశమైన కమిటీ జిల్లా ఇసుక కమిటీ ప్రతినిధుల సమావేశం కలెక్టర్ పోల భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఏపీఎండీసీ, గనుల శాఖ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. శనివారం జిల్లా స్థాయి కమిటీ సమావేశమై 3.08 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులను ఇచ్చింది. ఒకటి రెండు రోజుల్లో తవ్వకాలకు సంభందించిన అన్ని చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. కొత్తగా మరో రెండు డంపింగ్‌యార్డులు ఇసుక లావాదేవీలన్నీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్ధ ద్వారానే జరగాలి. జిల్లాలోని కందుకూరు మండలం జిలెళ్లమూడి గ్రామంలో రేవు నుంచి ఇసుక తవ్వకాలకు ఏపీఎండీసీ కాంట్రాక్టులను ఇవ్వడానికి చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఒంగోలులోని పాత జిల్లా పరిషతఖ సమావేశం మందిరం, కనిగిరి మార్కెట్ యార్డు, మార్కాపురం మార్కెట్ యార్డులో ఇసుక డంపింగ్‌యార్డులు ఉన్నాయి. కొత్తగా కందుకూరు మార్కెట్ యార్డు, పొదిలి కేంద్రంగా ఇసుక డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటైన డంపింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ఇసుక తూకాలు వేయడానికి వసతులు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దసరా పండుగ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్‌యార్డులను ప్రారంభించనున్నారు. ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఆన్లైన్లో ఇప్పటికే ఐదు వేల టన్నుల వరకు ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి తక్షణం కొత్త రేవు నుంచి ఇసుక ఇవ్వనున్నారు. ప్రభుత్వ పథకాలకు, ఇతర పనులకు కూడా జిల్లా నుంచే ఇసుక ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఇసుక అవసరాలకు కడప, నెల్లూరు జిల్లాల పై ఆధారపడి ఇసుక తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక ఈ తరహా ఇబ్బంది లేదు. నేరుగా జిల్లాలో ఉన్న ఇసుక రేవు నుంచే కావాల్సినంత ఇసుక తీసుకొనే వెసులుబాటు కలిగింది. -
ఇసుక కొరతకు ఇక చెల్లు!
ఇసుక ఇక సామాన్యునికి అందుబాటులోకి రానుంది. కోరిన వెంటనే అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పారదర్శకత కోసం కొత్త ఇసుక విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే దీనికోసం కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో ఇసుక నిల్వలున్నట్టు గుర్తించారు. వాటిని స్టాక్ చేసేందుకు సాలూరు, బొబ్బిలిలో రెండు పాయింట్లు గుర్తించి పదెకరాల స్థలాన్ని కేటాయించారు. కొద్దిరోజులుగా ఇసుక కొరతను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్న వారి నోళ్లకు ఇక తాళాలు పడనున్నాయి. సాక్షి, బొబ్బిలి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టనున్న ఇసుక కొత్త పాలసీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చే నెల 5 నాటికి ఇసుక సరఫరాను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇసుక విధానం అమలు చేసేందుకు సంబంధిత శాఖల కమిటీ ఇప్పటికే జిల్లాలోని రీచ్‌లను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ప్రభుత్వం ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇందుకోసం జిల్లాలో 62 ఇసుక రీచ్‌లు ఉండగా ఇందులో 55 ప్రాంతాల్లో ఇసుక నిల్వలను సంబంధిత శాఖాధికారులు గుర్తించారు. ఈ ఇసుక నిల్వలు ఎంత మేరకు తవ్వాల్సి ఉంటుందన్నది ఇప్పుడు చర్చిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఈ కొత్త ఇసుక పాలసీని నిర్ణీత సమయానికి ప్రారంభించేందుకు ఆయా శాఖలు పనిలో పడ్డాయి. ఒక్కో స్టాక్‌పాయింట్‌కు ఐదు ఎకరాలు.. జిల్లాలో ఇసుకను ఇతర ప్రాంతాల్లోని రీచ్‌లనుంచి తీసుకువచ్చి స్టాక్‌పాయింట్ల వద్ద నిల్వ చేస్తారు. ఈ పాయింట్ల నుంచి లబ్ధిదారులకు ఇసుకను తరలించేందుకు అనుమతులు జారీ చేస్తారు. జిల్లాలో సాలూరు, బొబ్బిలిలోని గొర్లె సీతారామపురం వద్ద గల ఐదేసి ఎకరాల వంతున స్థలాలను ఆయా తహసీల్దార్లు సిద్ధం చేసి చూపించారు. వీటిని సబ్ కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని ఏయే రీచ్‌ల నుంచయినా ఈ పాయింట్ల వద్దకు ఇసుకను లారీలతో తరలించి డంప్ చేస్తారు. ఇసుక లభ్యతను బట్టి త్వరలోనే స్టాక్‌పాయింట్లను పెంచే అవకాశం ఉంది. విజయనగరంలో ఇంకా గుర్తించాల్సి ఉంది. బ్యాంకులో డీడీ తీసి స్టాక్ పాయింట్‌కు వెళితే సరి.. జిల్లాలో గుర్తించిన స్టాక్‌పాయింట్ల నుంచి ఇసుకను తరలించేందుకు బ్యాంకులో డీడీలు తీయాల్సి ఉంటుంది. ఈ డీడీలను అందజేసిన వెంటనే వారికి కూపన్లు వస్తాయి. వాటిని తీసుకుని స్టాక్‌పాయింట్‌కు వెళితే అక్కడ ఇసుకను ఆయా వాహనాలకు పరిమాణాన్ని అనుసరించి అందజేస్తారు. వ్యాపారులకు, సాధారణ వినియోగదారులకు వేర్వేరు ధరలు.. జిల్లాలోని ఇసుక వినియోగదారులను రెండు రకాలుగా అధికారులు విభజిస్తున్నారు. ఒకటి సాధారణ లబ్ధిదారులు, రెండోది కాంట్రాక్టర్లు. యూనిట్ ధరను కాంట్రాక్టర్లకు, సాధారణ వినియోగదారులకు వేర్వేరుగా నిర్ణయించే ప్రక్రియ సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఓ యాప్ సిద్ధం చేసి ఆ యాప్ ద్వారా నమోదు చేసుకుని ఇసుకను తరలించుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పట్లో యాప్ విధానాన్ని అమలు పరిచే అవకాశం లేదు. శ్రీకాకుళం జిల్లా రీచ్‌లను ఇవ్వాలని లేఖ: జిల్లాలో ఇసుక కొరత ఉంది. నదులు, గెడ్డలు, వాగుల్లో ఇప్పటికే ఇసుకను పెద్ద ఎత్తున తరలించేశారు. ఒక మీటరు ఇసుకను తీసుకోవాలంటే 5 మీటర్ల లోతున ఇసుక నిల్వలుండాలి. అలాగే రెండు మీటర్ల లోతున ఇసుకను తవ్వాలంటే 8 మీటర్ల లోతు ఇసుక ఉండాలి. కానీ జిల్లాలో ఇప్పటికే మీటరు లోతున్న ఇసుకను కూడా పూర్తిగా తవ్వేశారు. దీనివల్ల జిల్లాలో ఇసుక కొరత తీవ్ర రూపం దాల్చింది. ఈ కొరతను అధిగమించేందుకు శ్రీకాకుళం జిల్లాలోని సంకిలి సమీపంలోని గోపాలపురం, అన్నవరం ప్రాంతాల్లో ఇసుక లభ్యత బాగానే ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఈ ఇసుక రీచ్‌లను విజయనగరం జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖరాశారు. ఇవి గాకుండా ఈ జిల్లాలోని కొమరాడ, జియ్యమ్మవలసల్లో అత్యధికంగా ఇసుక నిల్వ లున్నాయి. వీటి నుంచి ప్రభుత్వం ఇసుకను రెండు స్టాక్పాయింట్లకు తరలించి ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటోంది. విక్రయ బాధ్యత ఏపీఎండీసీకే.. జిల్లాలో గుర్తించిన వివిధ రీచ్‌లనుంచి ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలించాక వాటిని విక్రయించడం, నిర్వహణ బాధ్యతలను ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించనున్నారు. స్టాక్ పాయింట్ స్థలాలను అప్పగించాక వాటికి ప్రహరీగానీ కంచెగానీ ఏర్పాటు చేసుకోవడం పొక్లెయిన్, వాహనాలు, కంప్యూటర్లు, సిబ్బందిని కేటాయించి వారికి పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు. వచ్చే నెల 5 నుంచి ఇసుక సరఫరా.. జిల్లాలో వచ్చే నెల 5 నుంచి ఇసుక సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సంబంధిత శాఖలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటికే రెండు చోట్ల స్టాక్‌పాయింట్లు గుర్తించాం. జిల్లాలో ఇసుకను యథేచ్ఛగా తోడేశారు. నిల్వలు తక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు రీచ్‌ల కోసం ప్రభుత్వానికి లేఖ రాశాం. ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఇసుక కొరతను తీర్చే ప్రయత్నాల్లో ఉన్నాం. – డాక్టర్ ఎస్.వి.రమణారావు, మైన్స్ ఏడీ, విజయనగరం -
ఇసుక ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా గోదావరి నదికి వరద పోటెత్తుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లు మూతపడ్డాయి. రీచ్‌లకు వెళ్లే రహదారులు బురదమయం కావడంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో ఆన్లైన్ విధానంలో ఇసుక విక్రయాలను టీఎస్ఎండీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. డిమాండ్‌కు అనుగుణంగా ఇసుక సరఫరా లేకపోవడాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటుండటంతో బహిరంగ మార్కెట్లో ఇసుక ధర అమాంతం పెరిగింది. గోదావరికి వరద ఉధృతి తగ్గి కొత్త రీచ్‌లు అందుబాటులోకి వస్తేనే ఇసుక సరఫరా మెరుగవుతుందని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. మూతపడిన రీచ్‌లు... రాష్ట్రంలో సుమారు 30 రీచ్‌ల ద్వారా టీఎస్ఎండీసీ ఇసుకను వెలికితీస్తూ సగటున రోజుకు 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఆన్లైన్లో విక్రయిస్తోంది. టీఎస్ఎండీసీ వెలికితీస్తున్న ఇసుకలో 96 శాతం గోదావరి తీరంలోని పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని రీచ్‌ల నుంచే వస్తోంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుండటంతో రీచ్‌లు మూత పడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆరు రీచ్‌లే పనిచేస్తున్నాయని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు మాత్రం ఇసుకను లోడ్ చేస్తున్నారు. అమాంతం పెరిగిన ధరలు... ఆన్లైన్లో టన్ను ఇసుకను రూ. 600 చొప్పున టీఎస్ఎండీసీ విక్రయిస్తుండగా రవాణా, ఇతరచార్జీలు కలుపుకొని సీజన్లో రూ. 1,250 నుంచి రూ. 1,500 వరకు ధర పలికింది. ప్రస్తుతం ఆన్లైన్లో ఇసుక విక్రయాలు నిలిచిపోవడంతో కొరతను దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యమైన ఇసుక ధర బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం టన్నుకు రూ. 2,200కుపైనే పలుకుతోంది. ముడి ఇసుక (కోర్ శాండ్) టన్నుకు రూ. 1,400 చొప్పున లభిస్తున్నా వినియోగదారులు ఫైన్ శాండ్ కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫైన్ శాండ్‌కు రాష్ట్రంలో ఉన్న కొరతను దళారీలు ఆసరాగా తీసుకుని ధరలు అమాంతం పెంచేశారు. గతేడాది అక్టోబర్‌లో ఆఫ్ సీజన్లో టన్ను ఇసుక రూ. 3వేలకుపైగా పలికిన విషయాన్ని వినియోగదారులు గుర్తుచేస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద నిండుకుంటున్న నిల్వలు వర్షాకాలం దృష్ట్యా టీఎస్ఎండీసీ స్టాక్ పాయింట్ల వద్ద కనీసం కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇసుక డిమాండ్ నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్, భౌరంపేట, వట్టినాగులపల్లిలో సబ్ స్టాక్ పాయింట్లు ఏర్పా టు చేసింది. అయితే ప్రస్తుతం స్టాక్ పాయింట్ల వద్ద కేవలం రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలే ఉన్నాయి. అయితే మరో 2, 3 రోజుల్లో రీచ్‌ల సంఖ్య పెరగడంతోపాటు ములుగు, భద్రాచలం జిల్లాల్లో కొత్తరీచ్‌లు అందుబాటు లోకి వచ్చే అవకాశముందని టీఎస్ఎండీసీ వర్గా లు వెల్లడించాయి. ఇసుక రీచ్‌లు అందుబాటు లోకి వచ్చాకే అన్లైన్ విధానంలో ఇసుక విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది. -
క్వారీ..సర్కారు మారినా స్వారీ
సాక్షి, ప్రొద్దుటూరు: నిన్న మొన్నటి వరకూ ఇసుకతో కోట్లు కొల్లగొట్టిన ఓ టీడీపీ నేతకు కొత్త ప్రభుత్వం రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలాగైనా ఇసుక క్వారీని తన గుప్పిట్లోనే ఉంచుకోవాలని ఇప్పటికీ వ్యూహాలు పన్నుతున్నాడు. పెన్నానదీ తీరంలో 50 ఎకరాలను ఆధీనంలోనే పెట్టుకుని కొత్త నాటకాలకు తెర లేపుతున్నాడు. ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడొకరు ఇసుక డాన్‌గా గత ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయాడు. ఇతను మాజీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు. దీంతో అతను ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగింది. అధికారులూ మిన్నకుండిపోయారు. యథేచ్ఛగా ఇసుకను రాశులుగా పోసి ఇతర ప్రాంతాలకు భారీగా తరలిస్తూ అక్రమార్జన చేస్తున్నా ఏమీ చేయలేకపోయారు. క్వారీలో జేసీబీ, ట్రాక్టర్లను ఈ ప్రాంతంలో ఇందుకు వినియోగించుకునేవాడు. అడ్డుపడిన తహసీల్దార్లను అంతు చూస్తానని బహిరంగంగా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకాలం అతని ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడంతో ఇతడు కంగు తిన్నాడు. ఇసుక పెత్తనానికి ఎక్కడ ఆటంకం కలుగుతుందోనని భయంతో ఇప్పుడు కొత్త ప్రణాలికలు రచిస్తున్నాడు. అధికారుల కళ్లు గప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. 50 ఎకరాలకుపైగా సాగు రామాపురానికి చెందిన ఇసుక డాన్ టీడీపీ ప్రభుత్వ హయాంలో పెన్నానది తీరాన సుమారు 50 ఎకరాల్లో ఇసుక క్వారీని ఆక్రమించాడు. సమయాన్ని బట్టి క్వారీ లేదా పక్కనే నదిలో ఉన్న ఇసుకను తరలించేవాడు. ఆయన ప్రొద్దుటూరులో ఈ కార్యకలాపాల నిర్వహణకు ఏకంగా ఓ కార్యాలయాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. కొత్త ప్రభుత్వంలో న ఆగడాలు చెల్లవని గ్రహించాడు. అందుకే తన ఆధీనంలోని ఇసుక క్వారీని సాగుభూమిగా మారుస్తున్నాడు. ట్రాక్టర్ల ద్వారా మట్టిని తెచ్చి ఇసుకను కప్పేశాడు. మొక్కలు కూడా పెంచుతున్నాడు. సుమారు 5 అడుగుల మేర ఇప్పటికీ ఇక్కడ ఇసుక నిల్వలున్నాయి. ప్రభుత్వం క్వారీని ఇక్కడి నుంచి ప్రారంభిస్తే కొన్నేళ్లపాటు ఈ నిల్వలు సరిపోతాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల రూరల్ ఎస్ఐ సునీల్‌కుమార్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి ఇసుక రవాణా చేయకుండా పెన్నానదిలో గోతులు తవ్వించారు. తహసీల్దార్ పి.చెండ్రాయుడును సాక్షి వివరణ కోరగా ప్రభుత్వం కొత్తగా ప్రొద్దుటూరు ప్రాంతంలో ఇసుక క్వారీని మంజూరు చేసిందని తెలిపారు. మైనింగ్ అధికారులు సర్వే చేసి క్వారీ ప్రదేశాన్ని నిర్ణయిస్తారన్నారు. ఇసుక డాన్ పెన్నానది భూమిని ఆక్రమించడంతోపాటు సమీపంలో అటవీభూమిని కూడా సాగు చేస్తున్నాడు. బోరు వేసి సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. -
జమ్మిపాళెలం ఇసుకరీచ్‌లో ఉద్రిక్తత
కోవూరు : మండలంలోని జమ్మిపాళెం ఇసుకరీచ్‌లో ఇరువర్గాలకు చెందిన కూలీల మధ్య వివాదం చోటుచేసుకుని ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలు.. రీచ్‌లో గత కొంతకాలంగా జమ్మిపాళెంకు చెందిన కూలీలు మాత్రమే ఇసుకను లోడ్ చేస్తున్నారు. సమీప గ్రామాలకు చెందిన వారు మంగళవారం రీచ్ వద్దకు చేరుకుని తమకు కూడా రీచ్‌లో పనికల్పించాలని కోరారు. దీంతో ఇరువర్గాలకు చెందిన కూలీల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై వెంకట్రావ్ సంఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. -
ఉచితం మేటలేస్తోంది!
► ఇసుక పాలసీ అపహాస్యం ► ఓ ప్రైవేట్ కంపెనీ ఇష్టారాజ్యం ► గుట్టలుగా ఇసుక డంప్ ► సరఫరా బాధ్యత అధికార పార్టీ నేతకు.. ► వాగులు, వంకలన్నీ ఖాళీ ► నోరు మెదపని అధికారులు ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. అవసరానికి మాత్రమే ఇసుక తవ్వుకోవాలి. అంతకు మించి డంప్ చేస్తే సొంత పార్టీ వారున్నా వదిలిపెట్టొదు. జిల్లాలో ఏం జరుగుతోందంటే.. కళ్లెదుటే గుట్టలుగా ఇసుక మేటలు. అయినా అధికారుల మౌనం. ఎందుకంటే ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న వ్యవహారం కావడమే. ►ఆస్పరి సమీపంలో పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న ఓ ప్రైవేటు కంపెనీ ఆవరణలో ఇసుక దిబ్బ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉచిత ఇసుక పాలసీ అపహాస్యమవుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి హెచ్చరించినా తమ్ముళ్లు పెడచెవిన పెడుతున్నారు. రీచ్‌ల్లో పెత్తనం చెలాయిస్తూ దోపిడీకి తెరతీస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక డంప్ చేస్తూ దోచుకుంటున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరికి సమీపంలో పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న ఒక ప్రైవేటు కంపెనీ గుట్టలు గుట్టలుగా ఇసుకను డంప్ చేస్తోంది. ఈ ప్లాంటుకు ఇసుకను సరఫరా చేస్తోంది అధికారపార్టీ నేత కావడంతో అధికారులు కూడా కిమ్మనడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రైవేటు కంపెనీ చేస్తున్న వ్యవహారంతో చుట్టుపక్కల వాగులు, వంకలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఇది అంతిమంగా భూగర్భజలాలు ఇంకిపోయి సమీపంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యకు కారణమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వాగులు, వంకలు ఖాళీ వాస్తవానికి ఆస్పరికి సమీపంలో ప్రభుత్వం గుర్తించిన అధికారిక ఇసుక రీచ్‌లు లేవు. గతంలో హొళగుంద వద్ద అధికారిక ఇసుక రీచ్ ఉండేది. అయితే, ఇది కూడా తాజాగా రద్దయింది. జిల్లాలో ప్రస్తుతం నాలుగు ఇసుక రీచ్‌లు మాత్రమే అధికారికంగా నడుస్తున్నాయి. అవి.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గురజాల, కర్నూలు మండలంలోని ఆర్.కొంతలపాడు, దేవమాడ-పడిదెంపాడు, పత్తికొండ నియోజకవర్గంలోని కనకదిన్నె. ఇక వాగులు, వంకలల్లో ఇసుక తవ్వకాలను చేపట్టవచ్చననేది ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీగా ఉంది. దీనిని ఆసరా చేసుకుని సమీపంలోని వాగులు, వంకలన్నింటినీ సదరు ప్రైవేటు కంపెనీ అవసరాల కోసం ఇసుకను ఖాళీ చేస్తున్నారు. ఈ ఇసుక సరఫరా కాంట్రాక్టు కాస్తా అధికార పార్టీ నేతకు ఇవ్వడంతో మొత్తం వ్యవహారాన్ని సాఫీగా సాగిస్తున్నారని సమాచారం. అందుకే అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది. ఇసుక దందాలో.. వాస్తవానికి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రకటించిది. దీంతో ఏ పనికైనా అవసరం మేరకు ఉచిత ఇసుకను తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే, ఇందుకు భిన్నంగా ఆస్పరి సమీపంలోని ప్రైవేటు కంపెనీ.. గుట్టలు గుట్టలుగా ఇసుకను పొగేసుకుంటోంది. తమ పని సాఫీగా సాగేందుకు వీలుగా అధికార పార్టీ నేతలకు ఇసుక సరఫరా కాంట్రాక్టును అప్పగించింది. దీంతో అడ్డూఅదుపు లేకుండా రాత్రి, పగలు ఇసుకను తోడేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఏ మాత్రం అడ్డుచెప్పని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కలగజేసుకుని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.