ఇసుక రవాణాకు పచ్చ జెండా | Government Allowed The Transportation Of Sand | Sakshi
Sakshi News home page

ఇసుక రవాణాకు పచ్చ జెండా

Published Wed, Oct 9 2019 8:23 AM | Last Updated on Wed, Oct 9 2019 8:23 AM

Government Allowed The Transportation Of Sand - Sakshi

సాక్షి, ఒంగోలు సిటీ: ఇసుక కొరత తీరనుంది. మధ్యలో ఆగిన కట్టడాలకు మంచి కాలం. ఇసుక లేదని ఒత్తిడికి గురవ్వాల్సిన పని లేదు. భవన నిర్మాణ రంగానికి కొత్త ఊపు రానుంది. గృహ నిర్మాణాలకు నెమ్మది నెమ్మదిగా కదలిక. ప్రభుత్వ పథకాలకు కావాల్సినంత ఇసుక.  జిల్లాలోని కందుకూరు కేంద్రంగా సుమారు ఐదు లక్షల టన్నుల వరకు తవ్వుకోవచ్చు.  ఇక స్థానిక అవసరాలకు తగినంత వాడుకోవచ్చు. ఒకటి రెండు రోజుల్లోనే ఇసుక రవాణాకు జిల్లా కమిటీ పచ్చజెండా ఊపింది. జిల్లాలోని పాలేరు బిట్రగుంట (పీబీ చానెల్‌) పరిధిలోని జిల్లెళ్లమూడి గ్రామం వద్ద ఇసుక రేవులో సుమారు మూడు మీటర్ల వరకు ఇసుక మేట వేసింది. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించి వాల్టా చట్టం కింద దిగువ ఉన్న రైతులకు ప్రాజెక్టు నుంచి నీరు అందే పరిస్థితి లేనందున ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని పిటీషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తవ్వకాలు నిలిచాయి. కొద్ది నెలల పాటు హైకోర్టులో వాజ్యం జరిగింది. జిల్లా అధికారులు పాలేరు బిట్రగుంట చానెల్‌లో ఇసుక మేట బాగా పెరిగినందున తవ్వకాలకు అనుమతించాలని కోర్టుకు నివేదించారు. 

దీని వల్ల గ్రామస్తులకు ఉన్న ఇబ్బందులను కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల కిందట హైకోర్టు పాలేరు బిట్రగుంట చానెల్‌ జిల్లెళ్లమూడి ఇసుక రేవు నుంచి ఇసుక తవ్వకాలను కొనసాగించవచ్చని అనుమతించింది. జిల్లా అధికారులు జిల్లెళ్లమూడి ఇసుక రేవును పరిశీలించి తవ్వకానికి అనుమతులు కోరుతూ జిల్లా ఇసుక తవ్వకాల అనుమతుల కమిటీకి నివేదించారు. కమిటీ అధికారుల నుంచి నివేదిక పరిశీలించింది. పాలేరు బిట్రగుంట ఛానెల్‌ జిల్లెళ్లమూడి వద్ద సుమారు 3.08 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉన్నట్లుగా నివేదిక ఆధారంగా సమాచారం తీసుకున్నారు. పీబీ చానెల్‌ పరిధిలో 7318 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. పీబీ చానెల్‌లో 0.759 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే విధంగా డిజైన్‌ చేశారు. అయితే ఇసుక మూడు మీటర్ల ఎత్తులో మేట వేసినందున డిజైన్‌ చేసిన విధంగా 0.759 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం లేదని, ఎగువ నుంచి నీరు వచ్చినప్పుడు ఈ పీబీ ఛానెల్‌లో నిల్వ  సామర్ధ్యం లేక నీటిని వినియోగించుకోలేరని, నీటిని దిగువకు విడిచిపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలోనే మేట వేసిన ఇసుక తవ్వకాలను అనుమతించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు.  

సమావేశమైన కమిటీ 
జిల్లా ఇసుక కమిటీ ప్రతినిధుల సమావేశం కలెక్టర్‌ పోల భాస్కర్‌ అధ్యక్షతన జరిగింది. ఏపీఎండీసీ, గనుల శాఖ, ఇరిగేషన్‌ తదితర శాఖల అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. శనివారం జిల్లా స్థాయి కమిటీ సమావేశమై 3.08 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులను ఇచ్చింది. ఒకటి రెండు రోజుల్లో తవ్వకాలకు సంభందించిన అన్ని చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. కొత్తగా మరో రెండు డంపింగ్‌యార్డులు ఇసుక లావాదేవీలన్నీ ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్ధ ద్వారానే జరగాలి. జిల్లాలోని కందుకూరు మండలం జిలెళ్లమూడి గ్రామంలో రేవు నుంచి ఇసుక తవ్వకాలకు ఏపీఎండీసీ కాంట్రాక్టులను ఇవ్వడానికి చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఒంగోలులోని పాత జిల్లా పరిషతఖ సమావేశం మందిరం, కనిగిరి మార్కెట్‌ యార్డు, మార్కాపురం మార్కెట్‌ యార్డులో ఇసుక డంపింగ్‌యార్డులు ఉన్నాయి. కొత్తగా కందుకూరు మార్కెట్‌ యార్డు, పొదిలి కేంద్రంగా ఇసుక డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేయడానికి  చర్యలు తీసుకున్నారు. 

కొత్తగా ఏర్పాటైన డంపింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ఇసుక తూకాలు వేయడానికి వసతులు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దసరా పండుగ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్‌యార్డులను ప్రారంభించనున్నారు. ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఆన్‌లైన్‌లో ఇప్పటికే ఐదు వేల టన్నుల వరకు ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి తక్షణం కొత్త రేవు నుంచి ఇసుక ఇవ్వనున్నారు. ప్రభుత్వ పథకాలకు, ఇతర పనులకు కూడా జిల్లా నుంచే ఇసుక ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఇసుక అవసరాలకు కడప, నెల్లూరు జిల్లాల పై ఆధారపడి ఇసుక తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక ఈ తరహా ఇబ్బంది లేదు. నేరుగా జిల్లాలో ఉన్న ఇసుక రేవు నుంచే కావాల్సినంత ఇసుక తీసుకొనే వెసులుబాటు కలిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement