mineral development
-
ఉద్యోగులకు ఉద్వాసన
సాక్షి, అమరావతి: యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులపై పగబట్టి భారీగా తొలగింపుల పర్వానికి తెరలేపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో ఇప్పటివరకు విడతల వారీగా 400 మందికిపైగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. గడచిన మూడు రోజుల్లోనే సుమారు 200 మందిని ఉన్నట్టుండి తొలగిస్తూ ఎండీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాలిచ్చారు.ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, అన్నమయ్య జిల్లాలోని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసే చిరుద్యోగులపై రాజకీయ ముద్రవేసి మరీ ప్రభుత్వం పక్కనపెట్టింది. 20వ తేదీన సుమారు 90 మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు అవసరం లేదని ఎండీ ఆదేశాలిచ్చారు. అంతకుముందు 18వ తేదీన సుమారు వంద మందికిపైగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిలో ఎక్కువమంది మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.ఆ తర్వాత విజయవాడలోని ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ప్రాజెక్టులో పనిచేసేవారు ఉన్నారు. గత ప్రభుత్వంలో నియమించారనే కారణం చూపి వారందరినీ ఉన్న ఫళాన వెళ్లగొట్టారు. అంతకుముందు మరో 200 మందిలో సగం మందికి కాంట్రాక్టు ముగియడంతో పొడిగించకుండా బయటకు పంపారు. కాంట్రాక్టు ఇంకా మిగిలి ఉన్న వారిని సైతం ఏదో ఒక సాకు చూపి తొలగించారు. తొలగింపునకు గురైన వారిలో ఎక్కువ మంది అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు ఉన్నారు. విజయవాడ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో డీఈఓలు, డీపీఓలు, ఇతర క్యాడర్ ఉద్యోగులున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన వారే కాకుండా పదేళ్ల నుంచి పనిచేస్తున్న వారిని కూడా అన్యాయంగా తొలగించినట్టు తెలుస్తోంది.నిబంధనలకు విరుద్ధంఅవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏ కారణం లేకుండా తొలగించకూడదనే నిబంధనలు ఉన్నా ఉన్నతాధికారులు లెక్క చేయలేదు. వారందరినీ నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చి, ఇంటర్వ్యూ నిర్వహించి నియమించారు. కార్యాలయంలోనూ, సంబంధిత ప్రాజెక్టుల్లోనూ అవసరాన్ని బట్టి ఈ నియామకాలు జరిపినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. కానీ సహేతుకమైన కారణం లేకుండానే రాజకీయ కోణంలో అందరినీ ఒకేసారి పక్కనపెట్టేయడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం తీసేస్తే తమ కుటుంబాలు ఏం కావాలని వాపోతున్నారు. -
Supreme Court: ‘రాయల్టీ’ రాష్ట్రాలదే
న్యూఢిల్లీ: ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఖనిజాలపై చెల్లించే రాయల్టీ పన్ను కాదని న్యాయస్థానం తేలి్చచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బే. గనుల, ఖనిజాల అభివృద్ధిపై కేంద్రం నియంత్రణకు వీలు కలి్పస్తున్న రాజ్యాంగంలోని జాబితా–1లో పేర్కొన్న ఎంట్రీ 54 ప్రకారం.. ఖనిజ హక్కులపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు లేదని తేల్చిచెప్పింది. అయితే ఖనిజ హక్కులపై రాయల్టీ విధించే రాష్ట్రాల అధికారాన్ని ఏ స్థాయికైనా పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాలు అధికంగా ఉన్న జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఈ తీర్పుతో లబ్ధి చేకూరనుంది. తమ ప్రాంతంలో ఉన్న గనులు, ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వసూలు చేసిన రూ.వేల కోట్ల పన్నులను తిరిగి తమకు ఇప్పించాలని ఆయా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. తీర్పును అమల్లోకి తీసుకురావాలని కోరాయి. రాష్ట్రాల విజ్ఞప్తిని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ వ్యతిరేకించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ అంశంపై లిఖితపూర్వకంగా స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పన్నులను రాష్ట్రాలకు తిరిగి ఇచ్చే విషయంలో ఈ నెల 31న తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. 1989 నాటి తీర్పును తోసిపుచ్చిన ధర్మాసనం గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకే ఉందంటూ తమ తీర్పును జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్వయంగా చదివి వినిపించారు. ధర్మాసనంలోని 8 మంది సభ్యులు రాష్ట్రాల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. జస్టిస్ నాగరత్న ఒక్కరే వ్యతిరేకిస్తూ భిన్నమైన తీర్పు వెలువరించారు. రాజ్యాంగంలో జాబితా–2లోని ఎంట్రీ 50 కింద గనులు, ఖనిజాలపై పన్నులు విధించే అధికారం పార్లమెంట్‌కు లేదని జస్టిస్ చంద్రచూడ్ తమ తీర్పులో చెప్పారు. రాయల్టీ అంటే పన్ను అని తేల్చేస్తూ 1989లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచి్చన తీర్పు సరైంది కాదని పేర్కొన్నారు. ఆæ తీర్పును తోసిపుచ్చారు.రాష్ట్రాల అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయవచ్చు ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నప్పటికీ.. దేశంలో ఖనిజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల అధికారాన్ని పరిమితం చేసే హక్కు మాత్రం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘ఖనిజాభివృద్ధి ఆటంకం కలగకుండా ఉండటానికి రాష్ట్రాల రాయల్టీ అధికారాన్ని పార్లమెంటు పరిమితం చేయగలదు. ఆ మేరకు పార్లమెంటు ఏదైనా చట్టాన్ని చేస్తే రాష్ట్రాలు దానికి కట్టుబడి ఉండాలి’ అని స్పష్టం చేసింది. -
మంగంపేట బెరైటీస్ బంగారం.. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలోని బెరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ ఖనిజం కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తాజాగా నిర్వహించిన ఈ–ఆక్షన్‌లో రికార్డు స్థాయి రేట్లు నమోదయ్యాయి. ఏకంగా 50 శాతం అధిక రేట్లను బిడ్డర్లు కోట్ చేశారు. ఈ ఖనిజం విక్రయాల ద్వారా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.925 కోట్లు ఆదాయం వస్తుంది. తాజా రేట్లతో అదనంగా రూ.260 కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తిలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏపీఎండీసీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తోంది. అత్యంత పారదర్శక విధానాలు అవలంబిస్తోంది. అధునాతన పద్ధతుల్లో నాణ్యమైన ఖనిజాన్ని వెలికితీస్తోంది. దీంతో అంతర్జాతీయంగా బిడ్డర్లు పోటీపడుతున్నారు. తాజాగా ఎ, బి, సి, డి గ్రేడ్ల ఖనిజం విక్రయం కోసం ఏపీఎండీసీ ఈ–ఆక్షన్ నిర్వహించింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ’ఎ’ గ్రేడ్ ఖనిజం, 3 లక్షల మెట్రిక్ టన్నుల ’బి’ గ్రేడ్, 20 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజానికి ఆక్షన్ నిర్వహించింది. ’ఎ’ గ్రేడ్ ఖనిజాన్ని మెట్రిక్ టన్నుకు అత్యధికంగా రూ.6,691కి బిడ్డర్లు కోట్ చేశారు. గతంలో దీని ధర రూ.4,625 కాగా ఇప్పుడు రూ.2,066 ఎక్కువ రేటు వచ్చింది. అలాగే టన్ను ’బి’ గ్రేడ్ రూ.5,225 పలికింది. గతంలో ఇదే ’బి’ గ్రేడ్ మెట్రిక్ టన్ను రూ.3,350 కాగా ఇప్పుడు రూ.1,875 ఎక్కువ లభించింది. సి, డి గ్రేడ్ ఖనిజం ధరల్లోనూ స్వల్ప పెరుగుదల నమోదయింది. సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు మైనింగ్ రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మంగంపేట బెరైటీస్‌కు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడానికి, రికార్డు స్థాయిలో రేటు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణం. మైనింగ్ రంగంలో పారదర్శకత, ఏపీఎండీసీని ప్రోత్సహించడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీఎండీసీపై పలుమార్లు సమీక్షలు నిర్వహించి, తగిన సూచనలిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దారు. బెరైటీస్‌తో పాటు బొగ్గు, గ్రానైట్, బీచ్ శాండ్, కాల్సైట్, గ్రాఫైట్, లెడ్, జింక్, ఐరన్ ఓర్ వంటి ఖనిజాలను కూడా వెలికితీయడం ద్వారా ఏపీఎండీసీ మైనింగ్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది. లాభాల బాటలో పయనిస్తోంది. మున్ముందు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్నిస్తుంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ మంత్రి నాణ్యత ప్రమాణాలతో సంస్థకు గుర్తింపు ప్రపంచంలోనే అత్యధికంగా బెరైటీస్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏపీఎండీసీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యత ప్రమాణాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ, సమర్థవంతమైన మైనింగ్ ఆపరేషన్స్ దాని సొంతం. గతేడాది రాయలసీమలో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ, రికార్డు స్థాయిలో పెద్దమొత్తంలో బెరైటీస్‌ను వెలికితీసింది. ప్రతికూల వాతావరణంలోనూ ఖనిజాన్ని అందించడం వల్ల అంతర్జాతీయంగా పేరొచ్చింది. ప్రాజెక్ట్‌లో ఉన్న 74 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజాన్ని కూడా విక్రయించేందుకు కొనుగోలుదారులతో మాట్లాడుతున్నాం.. – ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి -
ఇసుక రవాణాకు పచ్చ జెండా
సాక్షి, ఒంగోలు సిటీ: ఇసుక కొరత తీరనుంది. మధ్యలో ఆగిన కట్టడాలకు మంచి కాలం. ఇసుక లేదని ఒత్తిడికి గురవ్వాల్సిన పని లేదు. భవన నిర్మాణ రంగానికి కొత్త ఊపు రానుంది. గృహ నిర్మాణాలకు నెమ్మది నెమ్మదిగా కదలిక. ప్రభుత్వ పథకాలకు కావాల్సినంత ఇసుక. జిల్లాలోని కందుకూరు కేంద్రంగా సుమారు ఐదు లక్షల టన్నుల వరకు తవ్వుకోవచ్చు. ఇక స్థానిక అవసరాలకు తగినంత వాడుకోవచ్చు. ఒకటి రెండు రోజుల్లోనే ఇసుక రవాణాకు జిల్లా కమిటీ పచ్చజెండా ఊపింది. జిల్లాలోని పాలేరు బిట్రగుంట (పీబీ చానెల్) పరిధిలోని జిల్లెళ్లమూడి గ్రామం వద్ద ఇసుక రేవులో సుమారు మూడు మీటర్ల వరకు ఇసుక మేట వేసింది. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించి వాల్టా చట్టం కింద దిగువ ఉన్న రైతులకు ప్రాజెక్టు నుంచి నీరు అందే పరిస్థితి లేనందున ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తవ్వకాలు నిలిచాయి. కొద్ది నెలల పాటు హైకోర్టులో వాజ్యం జరిగింది. జిల్లా అధికారులు పాలేరు బిట్రగుంట చానెల్లో ఇసుక మేట బాగా పెరిగినందున తవ్వకాలకు అనుమతించాలని కోర్టుకు నివేదించారు. దీని వల్ల గ్రామస్తులకు ఉన్న ఇబ్బందులను కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల కిందట హైకోర్టు పాలేరు బిట్రగుంట చానెల్ జిల్లెళ్లమూడి ఇసుక రేవు నుంచి ఇసుక తవ్వకాలను కొనసాగించవచ్చని అనుమతించింది. జిల్లా అధికారులు జిల్లెళ్లమూడి ఇసుక రేవును పరిశీలించి తవ్వకానికి అనుమతులు కోరుతూ జిల్లా ఇసుక తవ్వకాల అనుమతుల కమిటీకి నివేదించారు. కమిటీ అధికారుల నుంచి నివేదిక పరిశీలించింది. పాలేరు బిట్రగుంట ఛానెల్ జిల్లెళ్లమూడి వద్ద సుమారు 3.08 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లుగా నివేదిక ఆధారంగా సమాచారం తీసుకున్నారు. పీబీ చానెల్ పరిధిలో 7318 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. పీబీ చానెల్లో 0.759 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే విధంగా డిజైన్ చేశారు. అయితే ఇసుక మూడు మీటర్ల ఎత్తులో మేట వేసినందున డిజైన్ చేసిన విధంగా 0.759 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం లేదని, ఎగువ నుంచి నీరు వచ్చినప్పుడు ఈ పీబీ ఛానెల్లో నిల్వ సామర్ధ్యం లేక నీటిని వినియోగించుకోలేరని, నీటిని దిగువకు విడిచిపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలోనే మేట వేసిన ఇసుక తవ్వకాలను అనుమతించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. సమావేశమైన కమిటీ జిల్లా ఇసుక కమిటీ ప్రతినిధుల సమావేశం కలెక్టర్ పోల భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఏపీఎండీసీ, గనుల శాఖ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. శనివారం జిల్లా స్థాయి కమిటీ సమావేశమై 3.08 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులను ఇచ్చింది. ఒకటి రెండు రోజుల్లో తవ్వకాలకు సంభందించిన అన్ని చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. కొత్తగా మరో రెండు డంపింగ్‌యార్డులు ఇసుక లావాదేవీలన్నీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్ధ ద్వారానే జరగాలి. జిల్లాలోని కందుకూరు మండలం జిలెళ్లమూడి గ్రామంలో రేవు నుంచి ఇసుక తవ్వకాలకు ఏపీఎండీసీ కాంట్రాక్టులను ఇవ్వడానికి చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఒంగోలులోని పాత జిల్లా పరిషతఖ సమావేశం మందిరం, కనిగిరి మార్కెట్ యార్డు, మార్కాపురం మార్కెట్ యార్డులో ఇసుక డంపింగ్‌యార్డులు ఉన్నాయి. కొత్తగా కందుకూరు మార్కెట్ యార్డు, పొదిలి కేంద్రంగా ఇసుక డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటైన డంపింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ఇసుక తూకాలు వేయడానికి వసతులు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దసరా పండుగ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్‌యార్డులను ప్రారంభించనున్నారు. ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఆన్లైన్లో ఇప్పటికే ఐదు వేల టన్నుల వరకు ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి తక్షణం కొత్త రేవు నుంచి ఇసుక ఇవ్వనున్నారు. ప్రభుత్వ పథకాలకు, ఇతర పనులకు కూడా జిల్లా నుంచే ఇసుక ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఇసుక అవసరాలకు కడప, నెల్లూరు జిల్లాల పై ఆధారపడి ఇసుక తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక ఈ తరహా ఇబ్బంది లేదు. నేరుగా జిల్లాలో ఉన్న ఇసుక రేవు నుంచే కావాల్సినంత ఇసుక తీసుకొనే వెసులుబాటు కలిగింది. -
నాలుగున్నరేళ్లలో రూ.2,160 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత నాలుగున్నరేళ్లలో ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా రూ.2,160 కోట్లు ఆదాయం లభించిందని, 2018 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు రూ.610 కోట్ల ఆదాయం లభించిందని ఆ సంస్థ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రంలో నిక్షిప్తమై ఉన్న నూతన ఖనిజాలను వెలికి తీసి ఆదాయం సమకూర్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రాష్ట్రాలకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, గనులశాఖ డైరెక్టర్ సుశీల్‌కుమార్, టీఎస్ ఎండీసీ డైరెక్టర్ మల్సూర్, పరిశ్రమల శాఖ డిప్యూటీ సెక్రటరీ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
మూడేళ్లలో రూ.14 కోట్లు నష్టం
వడ్డించే వాడు మనవాడైతే చాలు... ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న చందంగా ఉంది అధికారుల తీరు. తమవారికి ఇసుక టెండర్ కట్టబెట్టేందుకు ఇష్టమొచ్చినట్లుగా నిబంధనలు మార్చేశారు ఖనిజ అభివృద్ధి సంస్థ అధికారులు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి మూడేళ్లలో రూ.14కోట్ల మేర నష్టం జరగనుంది. కరీంనగర్ రూరల్ : ఇసుక తవ్వకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీ తీసుకువచ్చింది. ఇసుక రీచ్‌లను గుర్తించి, క్యూబిక్ మీటర్‌కు ఇంత చొప్పున ఇంటివద్దకే ఇసుక తీసుకువచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది. నూతన పాలసీలో భాగంగా కరీంనగర్ మండలం ఖాజీపూర్ మానేరువాగులో ఇసుక క్వారీ నిర్వహణకు రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనవరి 30న టెండర్లు ఆహ్వానించారు. టెండర్లలో పాల్గొనేందుకు వ్యక్తిగానీ, కంపెనీగానీ మూడేళ్లలో రూ.5 కోట్ల విలువైన ఒక పని నిర్వహించి ఉండాలని నిబంధన విధించారు. ఈ నిబంధనతో పార్టనర్షిప్ ఫర్మ్‌లు, రెండు, మూడు పనులు కలిపి రూ.5 కోట్ల మేర పనులు చేసిన వ్యక్తులు, కంపెనీలు అర్హత కోల్పోరుు టెండర్ దాఖలు చేయలేదు. కేవలం మూడు కంపెనీలు మాత్రమే టెండర్ దాఖలు చేశారుు. క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకం, తరలించడానికి రూ.135కు కోడ్ చేసి టెండర్ దక్కించుకున్నారు. సిండికేట్‌గా ఏర్పడి ఎక్కువ మొత్తానికి టెండర్ పొందినట్లు ఆరోపణలున్నారుు. ఈ వ్యవహారంలో వరంగల్ జిల్లాకు చెందిన ఇసుక వ్యాపారి కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మంత్రుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలను తమకు అనుకూలంగా మార్పించుకుని క్వారీ టెండర్ పొందారనే ఆరోపణలున్నాయి. కొత్తపల్లికి కొత్త నిబంధనలు ఖాజీపూర్ ఇసుక క్వారీ టెండర్ పూర్తరుున 11 రోజుల వ్యవధిలోనే తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి మోయతుమ్మెద వాగులో ఇసుక క్వారీకి అధికారులు టెండర్లు పిలిచారు. కానీ, ఇంతలోనే నిబంధనలు సడలించారు. టెండర్లలో పాల్గొనేందుకు వ్యక్తి లేదా పార్ట్నర్షిప్ ఫర్మ్, కంపెనీలు మూడేళ్లలో రూ.5 కోట్ల విలువకు తగ్గకుండా పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. పార్టనర్షిప్ ఫర్మ్‌కు అవకాశం కల్పించడంతోపాటు మూడేళ్లలో ఎన్ని పనులైనా కలిపి రూ.5 కోట్లు చేసినట్లయితే టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. దీంతో పలువురు టెండర్లలో పాల్గొనడంతో పోటీ నెలకొనగా క్యూబిక్ మీటర్‌కు రూ.87కు కోట్ చేసిన జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు టెండర్ దక్కింది. రూ.14 కోట్లు నష్టం అధికారుల మాయాజాలంతో ఖాజీపూర్ ఇసుక క్వారీ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి మూడేళ్లలో రూ.14 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఏడాదికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున మూడేళ్లలో 28 లక్షల 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను వాగులోనుంచి తవ్వి విక్రయకేంద్రానికి తరలించాల్సి ఉంటుంది. ఖాజీపూర్‌లో ఒక్క క్యూబిక్ మీటర్‌కు రూ.135 కాగా కొత్తపల్లిలో రూ.87 మాత్రమే ఉంది. మూడేళ్లలో క్యూబిక్ మీటర్‌కు అదనంగా రూ.48 చొప్పున మొత్తం 28 లక్షల 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపులో రూ.13 కోట్ల 72 లక్షల 80 వేలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లనుంది. జెడ్పీటీసీ ఫిర్యాదు ఖాజీపూర్ ఇసుక క్వారీ టెండర్లలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్ధ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌కు కరీంనగర్ జెడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న క్వారీ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖాజీపూర్ క్వారీ టెండర్ నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.