ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక: సీఎం రేవంత్‌ | Telangana CM Revanth Reddy Says Free Sand For Indiramma Houses, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక: సీఎం రేవంత్‌

Published Tue, Feb 11 2025 5:10 AM | Last Updated on Tue, Feb 11 2025 11:38 AM

CM Revanth Reddy says Free sand for Indiramma houses

సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే లభించేలా చర్యలు 

గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు చేపట్టనుంది. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. 

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపాలని, ఇసుక రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తాను కూడా స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని తెలిపారు. కాంట్రాక్టు సంస్థలకు పెండింగ్‌ బిల్లులు చెల్లించడంతోపాటు బ్లాక్‌ మార్కెట్‌ దందాను అరికట్టాలని సూచించారు. 

బుక్‌ చేసిన 48 గంటల్లో ఇసుక: ఇసుక బుక్‌ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏరియాల వారీగా సమీప ఇసుక రీచ్‌ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా వ్యవస్థ ఉండాలన్నారు. ఇసుక వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేసి సత్వర పరిష్కారం జరిగేలా చూడాలని ఆదేశించారు. ‘‘నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయండి. 

ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానంలో అనేక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఆఫీస్‌ టైమింగ్స్‌లో బుకింగ్‌ చేసుకునేలా బుకింగ్‌ వేళల్లో మార్పు చేయాలి. ఇసుక వెలికితీత, విక్రయాల్లో అక్రమాలకు తావు లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పర్మినెంట్‌ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలి’’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్‌తోపాటు గనులు, ఖనిజాభివృద్ధి శాఖ, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.  

అక్రమ రవాణాకు ‘హైడ్రా’తో అడ్డుకట్ట
ఇసుక రవాణా పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించి.. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ‘‘హైదరాబాద్‌ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగిస్తున్నాం. 

ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘా ఏర్పాటు చేయాలి. ప్రతి ఇసుక రీచ్‌ వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్‌ లైట్స్‌ ఏర్పాటు చేయాలి. ఇసుక స్టాక్‌ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌తోపాటు ఎంట్రీ, ఎగ్జిట్‌లు ఉండేలా చూడాలి’’ అని ఆదేశించారు. ఇసుక రవాణాకు సంబంధించిన రిజిస్టర్డ్‌ లారీలను ఎంప్యానెల్‌ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement