Mines Department
-
ఉద్యోగం కావాలా.. లోకేశ్‌ను కలవండి!
సాక్షి, అమరావతి: బలవంతంగా సెలవుపై పంపిన గనుల శాఖాధికారులు లోకేశ్‌ను కలిస్తేనే ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంటుందంటూ మధ్యవర్తులు రాయబారాలు నడుపుతుండటం చర్చనీయాంశంగా మారింది. లేనిపోని ఆరోపణలు మోపి గనుల శాఖ అధికారులను సెలవుపై పంపి.. ఇప్పుడు లోకేశ్‌ను కలవాలంటూ ఒత్తిడి చేయడం ముడుపుల కోసమేననే ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వానికి దగ్గరగా పని చేశారనే ఆరోపణలు సృష్టించి 26 మంది అధికారులను రెండు నెలల క్రితం గనుల శాఖ డైరెక్టర్ బలవంతంగా సెలవుపై పంపారు. తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించినా.. అవన్నీ తమకు తెలియదని వెంటనే సెలవుపై వెళ్లిపోవాలని మౌఖికంగా ఆదేశించారు. గనుల శాఖ మంత్రి పేషీ నుంచి కూడా హెచ్చరికలు అందడంతో గత్యంతరం లేక వారంతా సెలవులో వెళ్లారు. వారిలో పలువురు డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర స్థాయిల్లో పనిచేసే అధికారులు ఉన్నారు. నిజానికి కొద్దినెలల క్రితమే వారికి టీడీపీ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆ పోస్టింగ్‌లు ఇవ్వడానికి భారీగా ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. లోకేశ్ తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తి ఈ బదిలీల్లో కీలకంగా మారి వేలం నిర్వహించి మరీ పోస్టింగ్‌లు ఇచ్చారు. పోస్టింగ్‌లకు ముందే వారితో బేరం కుదుర్చుకుని సొమ్ములు తీసుకున్నారు. అనంతరం ఆ పోస్టుల్లో చేరిన కొద్దిరోజుల తర్వాత రెండు విడతలుగా వారిని బెదిరించి బలవంతంగా సెలవు పెట్టించారు. చెప్పినట్టు చేస్తేనే తిరిగి ఉద్యోగం కొన్ని వారాల తర్వాత లోకేశ్‌కు మధ్యవర్తిగా పనిచేసే వ్యక్తి నుంచి వారికి సమాచారం ఓ అందింది. మళ్లీ విధుల్లో చేరాలంటే తాను చెప్పినట్టు చేయాలని ఆయన సూచించారు. వెళితే మళ్లీ భారీగా ముడుపులు ముట్టజెప్పాలనే భయంతో మొదట్లో ఎవరూ వెళ్లలేదని సమాచారం. దీంతో ఆ వ్యక్తే వారిని కలిసి గత ఐదేళ్లలో వారు పనిచేసిన స్థానాలు, అక్కడ ఎంత సంపాదించారు వంటి వివరాలు చెప్పి బెదిరింపులకు దిగారు. ఐదేళ్లలో అంత సంపాదించారు కాబట్టి అందులో కొంత ఇవ్వాలని స్పష్టం చేశారు. మీరు చెప్పినంత సంపాదన తమకు లేదని, రెండవసారి మళ్లీ డబ్బులు ఇచ్చుకోలేమని చెప్పినా కీలకమైన పోస్టుల్లో అన్ని సంవత్సరాలు పని చేశారు కాబట్టి తాము చెప్పినట్టు వినాల్సిందేనని ఒత్తిడి చేసినట్టు సమాచారం. కొన్నిరోజులుగా దీనిపై చర్చలు జరిగినా బేరం కుదరకపోవడంతో వారిని తిరిగి విధుల్లోకి చేరేందుకు అనుమతించడంలేదు.రెండవసారి ముడుపులు ఇచ్చుకోలేంబదిలీల సమయంలో పోస్టింగ్ ఇచ్చినందుకు ముడుపులు తీసుకుని ఆ తర్వాత సెలవుపై పంపడం అన్యాయని, ఇప్పుడు మళ్లీ డబ్బులు ఇస్తేనే విధుల్లో చేరాలనడం ఏమిటని అధికారులు వాపోతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక, ఉన్నతాధికారులతో మాట్లాడలేక సతమతమవుతున్నారు. గనుల శాఖలో బదిలీలన్నీ లోకేశ్ మనుషుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. లోకేశ్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆదేశాల ప్రకారమే గనుల శాఖ డైరెక్టర్ పని చేస్తున్నారు. గనుల శాఖ మంత్రి చెప్పినా పట్టించుకోకుండా కేవలం లోకేశ్, ఆయన సన్నిహితుడు చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నట్టు సమాచారం. లీజుల మంజూరు, బిల్లులు, ఇతర వ్యవహారాలు ఏమైనా తనకు లోకేశ్ చెప్పాల్సిందేనని స్పష్టం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సెలవుపై పంపిన అధికారులతో బేరాలు కుదరకపోవడంతో వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
గనుల శాఖలో మరో వింత!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గనుల శాఖలో రకరకాల వింతలు చోటు చేసుకుంటున్నాయి. జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీఎండీసీలో ఇద్దరు దళిత ఉన్నతాధికారులను సెలవుపై పంపారు. గనుల శాఖ డైరెక్టర్, ఏపీఎండీసీ కార్యాలయాలను 45 రోజులపాటు అనధికారికంగా మూసివేశారు. రాష్ట్రంలో లీజు పొందిన గనులన్నింటినీ అనధికారికంగా నిలిపివేశారు. పరిశ్రమను పూర్తిగా స్తంభింపజేశారు. గనుల యజమానులతో మామూళ్లకు ఒప్పందం కుదిరాకే కొన్నింటిని తెరవడానికి అంగీకరించారు. కొన్ని గనులు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. కొందరు అధికారులను కూడా గాల్లో పెట్టారు. ఆ తర్వాత బదిలీల్లో డబ్బులు గుంజి చాలామందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇప్పుడు బదిలీల్లో పోస్టింగులు ఇచ్చిన 12 మంది అధికారులను సెలవుపై వెళ్లాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలివ్వడం గనుల శాఖలో కలకలం రేపింది. కొత్త పోస్టింగుల్లో చేరి నెల తిరక్కుండానే వారిని సెలవుపై వెళ్లిపోవాలని చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెప్పినట్టల్లా చేశారనే ఆరోపణలు సృష్టించి మరీ వీరిని సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఇలా బలవంతంగా సెలవుపై పంపుతున్న వారిలో ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లు, ఐదుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు, నలుగురు ఇతర స్థాయి ఉద్యోగులున్నారు. సెలవుపై పంపే ఉద్దేశం ఉన్నప్పుడు బదిలీల్లో ఎందుకు పోస్టింగ్ ఇచ్చారో అర్థం కావడంలేదని ఉద్యోగులు అంటున్నారు. గనుల శాఖలో బదిలీలే అత్యంత రహస్యంగా చేపట్టారు. ముఖ్య నేత కుమారుడికి ప్రధాన అనుచరుడు, గనుల శాఖ మంత్రి ద్వారా ఈ బదిలీల్లో పెద్ద తంతే జరిగింది. కీలకమైన డీడీ, ఏడీ పోస్టులను వేలం వేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. భారీగా డబ్బులిచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీల జీవోలను అన్ని శాఖలు ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టినా గనుల శాఖ మాత్రం పెట్టకపోవడమే ఇందులో మతలబులకు అద్దం పడుతోంది.ఆ తర్వాత కూడా బదిలీల జీవోను వెంటనే బయటపెట్టలేదు. ఇంత చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన వారిలో కొందరిపై ఇప్పుడు వైఎస్సార్సీపీ ముద్ర వేసి సెలవుపై వెళ్లిపోవాలని ఆదేశించడం గమనార్హం. బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి మరింతగా డబ్బులు దండుకోవడానికే ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎర్రమట్టి దిబ్బ తవ్వకాలపై అధికారుల్లో కదలిక
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తున్న వైనంపై గనుల శాఖలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఎర్రమట్టి దిబ్బల్లో ఈనెల రెండో వారంలో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలను వెలుగులోకి తెస్తూ ‘సాక్షి’లో జూలై 17న ‘మట్టి దిబ్బలు మటాష్.!’ శీర్షికతో ప్రచురితమైన కథనంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. హుటాహుటిన జిల్లా యంత్రాంగాన్ని పంపి, మట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేసింది. తెరవెనుక సూత్రధారులను వదిలేసి, నిడిగట్టు సచివాలయం ఇన్చార్జ్ ప్లానింగ్ సెక్రటరీని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకోవాలని చూసింది. దీనిపై మరోసారి జూలై 18న ‘చిరుద్యోగిని సస్పెండ్ చేసి.. అక్రమాలపై ‘మట్టి’ కప్పి..’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ఇక గనుల శాఖ ఊపిరి పీల్చుకోలేకపోయింది. ఎట్టకేలకు రంగంలోకి దిగింది. ఎర్రమట్టి దిబ్బలను తవ్విన ప్రదేశం తీరప్రాంత క్రమబదీ్ధకరణ మండలి సీఆర్‌జెడ్ జోన్–1 సునిశితమైన పరిధిలోకి వస్తుందని గనుల శాఖ ప్రాథమికంగా అంచనావేస్తూ.. దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నేరళ్ల వలస గ్రామం సర్వే నం.:118/5ఏ (పాత సర్వే నెం :49/1)లో ది భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ బిల్డింగు సొసైటీ (బిల్డింగ్ హౌస్ సొసైటీ)లోని 278.95 ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు నిర్వహించినట్లు గనుల శాఖ అధికారులు నిర్థారించారు. అక్రమ లేఔట్ పనుల్లో భాగంగా రోడ్ల నిర్మాణం కోసం ఎర్రమట్టి దిబ్బల్లో 39,454 క్యూబిక్ మీటర్ల కంకరతో కూడిన ఎర్రమట్టి ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్–1966ను ఉల్లంఘించారని నిర్థారించిన అధికారులు సొసైటీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 148 అడుగుల బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష నేతలు హడావుడి చేశారు. -
‘ఉచిత’ నాటకం! ఇసుక పేరుకే ఫ్రీ.. డబ్బులు సమర్పించుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు. వర్షాకాలంలో కొరత లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే స్టాక్ పాయింట్లలో పెద్దఎత్తున ఇసుక నిల్వలు ఉంచింది. తాజాగా టీడీపీ సర్కారు దీన్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పినా అన్నిచోట్లా టన్నుకి నిర్దేశిత ధర చెల్లించాలని తేల్చి చెప్పడంతో ఇసుక కోసం వచ్చిన వారు కంగు తిన్నారు. చీరాల సమీపంలోని వేటపాలెం స్టాక్‌యార్డులో టన్ను ఇసుక రూ.675గా బోర్డు పెట్టారు. దీంతో ఉచితంగా ఇసుక తీసుకెళదామని ట్రాక్టర్లతో వచ్చిన పలువురు మోసపోయామని గ్రహించి వెనుతిరిగారు. అన్ని స్టాక్ యార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలకు ఎలాంటి మేలు చేయని.. ఖజానాకు ఆదాయం సమకూరని తాత్కాలిక కొత్త విధానాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది. దీనిల్ల అటు ప్రజలు, ఇటు ఖజానాకు నష్టం వాటిల్లుతుండగా టీడీపీ నేతలు మాత్రం జేబులు నింపుకునేందుకు మార్గం సుగమం అయింది. పేరుకు ఉచిత ఇసుక అని ప్రకటించినా ప్రజలు మాత్రం డబ్బులు కట్టాల్సిందే. ఇదే ఉచిత ఇసుక విధానంలోని ప్రత్యేకత. ఉచిత ఇసుక విధానం పేరుతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ సోమవారం జీవో ఎంఎస్ నెంబర్ 43 జారీ చేశారు. గత సర్కారు హయాంలో అమలైన విధానం స్థానంలో తాత్కాలికంగా ఉచిత విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా ఇసుక విక్రయాల ద్వారా ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.780 కోట్ల ఆదాయం సమకూరగా ప్రజలకు సులభంగా, అందుబాటు ధరలో లభ్యమయ్యేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఖజానాకు ఒక్క రూపాయి ఆదాయం రాదు. మరోవైపు ప్రజలు డబ్బులిచ్చి మరీ ఉచిత ఇసుకను కొనుగోలు చేయాల్సిన ఆగత్యం దాపురించింది!ఇదీ కొత్త విధానం..జిల్లా స్థాయిలో కమిటీలు ఆయా రీచ్‌ల్లో ఇసుక ధరలను నిర్ణయిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఎస్పీ, జేసీ, ఆర్డీఓ తదితర అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాటైన ఇసుక కమిటీలు తమ పరిధిలోని ఇసుక స్టాక్ యార్డులను స్వాధీనంలోకి తీసుకుని ధరలు నిర్ణయించాయి. సీనరేజి ఫీజు, ఇతర పన్నులు, తవ్వకం, లోడింగ్, రవాణా, ర్యాంపు నిర్వహణ, పరిపాలనాపరమైన ఖర్చులన్నీ లెక్కించి టన్ను ఇసుక ధరను నిర్ణయించారు. యార్డులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లేదా వీఆర్ఓ, వీఆర్ఏలను ఇన్ఛార్జీలుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వినియోగదారులు స్టాక్ పాయింట్ల వద్ద నేరుగా ఇసుక కొనుగోలు చేయవచ్చని, తరలించేందుకు వారే లారీలు తెచ్చుకోవాలని సూచించారు. స్టాక్ పాయింట్లలో నగదు లావాదేవీలు కాకుండా డిజిటల్‌గా మాత్రమే డబ్బులు స్వీకరించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. త్వరలో ఇసుక కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్లో పర్మిట్లు జారీ చేసే విధానం రూపొందిస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో ఇసుక ఆపరేషన్స్ పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్, రాష్ట్ర స్థాయిలో మైనింగ్ డైరెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహిస్తామని తెలిపారు. ఒక వ్యక్తి ఒక రోజుకు 20 టన్నుల ఇసుక మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశం ఇస్తామన్నారు.సగం ‘స్టాక్’ స్వాహాఅధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఇసుక స్టాక్ పాయింట్లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న టీడీపీ నేతలు ఇష్టానుసారం విక్రయించేశారు. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నుల వరకూ ఇసుకను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచింది. గత నెల 4వ తేదీ నుంచి అధికారం అండతో టీడీపీ నేతలు ఇసుక యార్డులను దౌర్జన్యంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా ప్రతినిధులను బెదిరించి తరిమేశారు. ఇప్పటికే చాలా వరకూ ఇసుకను అమ్మేశారు. సుమారు 40 లక్షల టన్నుల ఇసుకను విక్రయించేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 40 లక్షల టన్నుల ఇసుక మాత్రమే స్టాక్ యార్డుల్లో ఉందని గనుల శాఖ చెబుతోంది. అంటే మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు నెలరోజుల్లోనే మింగేసినట్లు స్పష్టమవుతోంది.ఉసూరుమంటూ..ఉచితంగా ఇసుక దొరుకుతుందని భావించిన నిర్మాణదారులు ఉదయాన్నే ట్రాక్టర్లలో స్టాక్ పాయింట్ల వద్దకు వచ్చి బారులు తీరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల బోర్డులు చూసి విస్తుపోయారు. ఉచితంగా ఇసుక అందిస్తామని ఊరించి టన్నుల లెక్కన డబ్బులు కట్టాలని బోర్డులు ఏర్పాటు చేయటాన్ని చూసి ఉసూరుమంటూ వెళ్లిపోయారు. కొత్త ఇసుక విధానంలో బాపట్ల జిల్లా చీరాలలో ట్రాక్టర్ ట్రక్కు ఇసుక కొనుగోలు చేయాలంటే రూ.3,034 అవుతుంది. ఒక్కో ట్రాక్టర్లో 4.50 టన్నులు లోడింగ్ చేయవచ్చు. దీనికి రవాణా ఛార్జీలు మరో రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా ట్రక్కు ఇసుక రూ.4 వేలు సమర్పించుకుని కొనుగోలు చేయాల్సిన పరిíస్థితి నెలకొంది.తిరిగి వెళ్లిపోతున్న వినియోగదారులు..స్టాక్ పాయింట్ల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీతో రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా ఇసుక అని పేర్కొంటూ షరతులు వర్తిస్తాయి అనే మాదిరిగా టన్ను ఇసుక రూ.675 అని బోర్డులు పెట్టారు. అక్కడకు వచ్చిన వారంతా బోర్డులు చూసి ఈ ధరలకు కొనలేమని తిరిగి వెళ్లిపోతున్నారు. వేటపాలెం స్టాక్ పాయింట్‌కి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 20 ట్రాక్టర్లు రాగా అన్నీ ఖాళీగా తిరిగి వెళ్లిపోయాయి. ఒక్కరూ కూడా ఇసుక కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. మోసపోయాం..టీవీలు, పేపర్లలో ఇసుక ఉచితంగా అందిస్తామని, కేవలం రూ.88కే అని ప్రకటించారు. ఇసుక అమ్మకాలు ప్రారంభించారని స్టాక్ పాయింట్‌కి వచ్చాం. ఇక్కడ బోర్డు పెట్టి టన్ను రూ.575, ట్రాక్టర్ ఇసుక రూ. 3,038 అని చెప్పారు. మోసపోయామని గ్రహించి కొనుగోలు చేయకుండా తిరిగి వెళ్లిపోయాం. – నాగార్జున, వేటపాలెం30 కి.మీ. నుంచి వచ్చా..ఇసుక ఉచితంగా ఇస్తున్నారని టీవీలు, పేపర్లలో చూసి పూనూరు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి వేటపాలెం స్టాక్ పాయింట్ వద్దకు ట్రాక్టర్‌తో వచ్చా. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇసుక ట్రాక్టర్ రూ.3,038 అని చెబుతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వం అదే ధరకు విక్రయించాలని చెప్పిందంటున్నారు. చేసేది లేక ఖాళీ ట్రాక్టర్‌తో తిరిగి వెళ్తున్నాం. – శ్రీనివాస్‌నాయక్, పూనూరు, యద్దనపూడి మండలంరవాణా ముసుగులో దోపిడీకి స్కెచ్!ఇసుకపై కొత్త విధానంలో ఉచితం అనేది ఒక మాయ కాగా రవాణా అనేది మరో సరికొత్త దోపిడీకి స్కెచ్‌గా కనిపిస్తోంది. రవాణా ముసుగులో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇసుకను తామే రవాణా చేస్తామనడం వెనుక ఉద్దేశం అదేనని భావిస్తున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరతను అధిగమించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన ఇసుకను అధికారం మారగానే కూటమి సర్కారు మాయం చేసింది. దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను గత 40 రోజుల్లో లెక్కాపత్రం లేకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అమ్మేసుకున్నారు. అదే తరహాలో రవాణా పేరుతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొత్త విధానానికి రూపకల్పన చేశారు. పేరుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ఇసుక కమిటీలు అమ్మకాలను పర్యవేక్షిస్తాయని చెబుతున్నా స్థానిక టీడీపీ నేతలే ఇసుక వ్యవహారాలను నియంత్రించే పరిస్థితి నెలకొంది. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు హల్చల్ చేయడమే ఇందుకు ఉదాహరణ. ఉచితంగా ఇసుకను అందిస్తున్నామంటూ బ్యానర్లతో స్టాక్ పాయింట్లు వద్ద ర్యాలీలు నిర్వహిస్తూ హడావుడి చేశారు. దీన్నిబట్టి స్టాక్ యార్డులు ఎవరి చేతుల్లో ఉన్నాయో అర్థమవుతోంది. ఇప్పటివరకు జిల్లా ఇసుక కమిటీలు స్టాక్ పాయింట్ల వద్ద పూర్తిస్థాయిలో ఇన్చార్జీలను కూడా నియమించలేదు. యార్డుల్లో ఎంత ఇసుక ఉందో కచ్చితమైన సమాచారం అధికారుల వద్ద లేదు. వర్షాకాలం సీజన్ వరకు ఉచిత ఇసుక పేరుతో దోపిడీని కొనసాగించి ఆ తర్వాత పూర్తిస్థాయి విధానాన్ని తెచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు స్పష్టమవుతోంది.30 కి.మీ. నుంచి వచ్చా..ఇసుక ఉచితంగా ఇస్తున్నారని టీవీలు, పేపర్లలో చూసి పూనూరు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి వేటపాలెం స్టాక్ పాయింట్ వద్దకు ట్రాక్టర్‌తో వచ్చా. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇసుక ట్రాక్టర్ రూ.3,038 అని చెబుతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వం అదే ధరకు విక్రయించాలని చెప్పిందంటున్నారు. చేసేది లేక ఖాళీ ట్రాక్టర్‌తో తిరిగి వెళ్తున్నాం. – శ్రీనివాస్‌నాయక్, పూనూరు, బాపట్ల జిల్లా యథేచ్ఛగా తరలింపుకూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే టీడీపీ నేతలు ఇసుక స్టాక్ యార్డుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యార్డులో ఇసుక నిల్వల లెక్కలకు, గతంలో కాంట్రాక్టర్ నిల్వ చేసిన ఇసుకకు పొంతనలేకపోవడం దీనికి బలం చేకూర్చుతోంది. విజయనగరం జిల్లాలో ఇసుక రీచ్‌లు లేకపోవడంతో డెంకాడ మండలం పెదతాడివాడ, బొబ్బిలి గ్రోత్ సెంటర్, కొత్తవలస వద్ద ఇసుక స్టాక్ యార్డులను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని స్టాక్‌యార్డ్ నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుక ఇక్కడ నుంచి ప్రభుత్వ ధరలకు ఇసుకను సరఫరా చేసేది. బొబ్బిలిలో లక్షా14వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉండగా, ఇప్పుడు అధికారుల లెక్కల ప్రకారం 72,466 మెట్రిక్ టన్నులు ఉన్నట్టు తేలింది. కొత్తవలసలో 11,805 మెట్రిక్ టన్నులు, డెంకాడలో 9,756 మెట్రిక్ టన్నులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నా... ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుకను టీడీపీ నాయకులు అక్రమంగా తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి.వందలాది వాహనాలతో..శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ముందు నాటికి ఎనిమిది చోట్ల ఇసుక డంపింగ్ యార్డులు ఉన్నాయి. ఒక్కొక్క డంపింగ్ యార్డులో 5 లక్షల నుంచి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు అప్పటి యార్డుల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రధానంగా మర్రిపాడు యార్డులో 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉండగా ఎన్నికల కౌంటింగ్ అయిన రాత్రి నుంచి టీడీపీ నేతలు వందలాది వాహనాలతో ఇసుకను ఖాళీ చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కాగులపాడుకు చెందిన ఓ వ్యక్తి (ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనాయణరెడ్డి అనుచరుడు) ఇసుక డంప్‌ను రూ.2 కోట్లకు కొనేసి.. చెన్నై, బెంగళూరు తదితర మహా నగరాలకు తరలించడం బహిరంగ విషయమే. నెల్లూరు జిల్లాలోని పొట్టేపాళెంలో డంపింగ్ యార్డులో 8 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు పూర్తిగా ఖాళీ చేశారు. అయితే తాజాగా జిల్లా అధికారులు ప్రకటించిన విధంగా జిల్లాలోని మూడు స్టాక్ యార్డుల్లో ప్రస్తుతం 1,75,301 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. మర్రిపాడు యార్డులో 1,25,211 మెట్రిక్ టన్నులు, మినగల్లులో 41,885 మెట్రిక్ టన్నులు, పల్లిపాడులో 8,205 మెట్రిక్ టన్నులు ఉందన్నారు. కావలి, కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన యార్డుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే నాటికి తవ్వి నిల్వ చేసిన ఇసుకను అధికారులు ప్రకటించకపోవడం గమనార్హం. -
‘ఉక్కు’పాతర.. విశాఖ స్టీల్ ఆస్తుల అమ్మకాలు షురూ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓ వైపు కేంద్ర గనుల శాఖ మంత్రి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని బాహాటంగా చెబుతుంటే.. మరోవైపు ప్లాంట్‌ని నిర్వీర్యంచేసే పనుల్ని చాపకింద నీరులా చేసుకుంటూపోతున్నారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆస్తులను అమ్మకానికి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే ఎన్డీఏ సర్కారు.. స్టీల్‌ప్లాంటుపై ‘ఉక్కు’పాదం మోపుతున్నట్టు తెలుస్తోంది. స్టీల్‌ప్లాంట్ ఆస్తులు విక్రయించి.. దివాలా సంస్థగా చూపించేందుకు కుయుక్తులు పన్నుతున్నట్లు పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది. మూలధన సంక్షోభాన్ని అధిగమించే పేరుతో ఆస్తుల వేలానికి ఏర్పాట్లు చేయడాన్ని గమనిస్తే ఈ అభిప్రాయం బలపడుతోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉన్న ఖరీదైన భవనాలు, స్టాక్‌యార్డుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎఎన్ఎల్) బోర్డు ఆమోదం తెలిపి... తూతూ మంత్రంగా తుది అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.మూలధన సంక్షోభం పేరుతో..స్టీల్‌ప్లాంట్ బయట నిరర్థకంగా ఉన్న ఆస్తుల అమ్మకానికి సంస్థ యాజమాన్యం రంగం సిద్ధంచేసుకుంటోంది. మూలధన సంక్షోభాన్ని అధిగమిస్తూ.. పూర్తిస్థాయి ప్లాంట్ నిర్వహణ కోసం సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకే ఆస్తుల వేలం ప్రక్రియ షురూ చేసింది. ఇటు ప్రజలు.. అటు ఉద్యోగుల ఆందోళనలు.. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్‌ప్లాంట్ విక్రయించేందుకు ఉన్న అవకాశాలపైనే దృష్టిసారించింది. రెండ్రోజుల క్రితం కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండబోదని స్పష్టంచేశారు. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వ చర్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉన్న ఆస్తులన్నింటినీ విక్రయించేసి.. ప్లాంట్ విలువను శూన్యం చేసేందుకు సిద్ధమవుతోంది. రైతులు, ప్రజలు త్యాగాలు చేసి.. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో పోరాడి సాధించుకున్న పరిశ్రమ ప్రైవేటీకరణకు శతవిధాలా యత్నిస్తోంది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ స్తబ్దుగా ఉన్నా.. తాజాగా విశాఖ ఉక్కు స్థలాల అమ్మకాల వ్యవహారాన్ని మళ్లీ వేగవంతం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ప్రైవేటీకరణకు కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గడంలేదు. నిజానికి.. పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించి, ఆర్థిక భరోసా కల్పించి కష్టాల నుంచి గట్టెక్కించొచ్చు. సెయిల్‌లో విలీనం చేయడం మరో పరిష్కారం అని తెలిసినా, కేంద్రం ఆ పని కూడా చేయడంలేదు. ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతూ ‘విశాఖ ఉక్కు’ ఊపిరి తీసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెరపైకి తెచ్చిన ఉక్కు స్థలాల అమ్మకం వ్యవహారాన్ని తాజాగా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎఎన్ఎల్ ఆస్తుల వేలానికి సిద్ధమవుతోంది.బోర్డు సమావేశంలో వేలం అంశం!ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఆస్తుల విక్రయంపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ మెటీరియల్స్ నిల్వచేయడానికి హైదరాబాద్, చెన్నైలలో స్టాక్‌యార్డుల ఏర్పాటుకోసం కొనుగోలు చేసిన భూములతో పాటు ముంబై, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాల్ని విక్రయించే అంశాలపై చర్చించినట్లు సమాచారం. దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల స్టీల్ వినియోగదారుల అవసరాల్ని మూడు దశాబ్దాల కాలంగా హైదరాబాద్, చెన్నైలోని స్టాక్‌యార్డులు తీరుస్తున్నాయి. ఇతర మెట్రో ప్రాంతాలతో పోలిస్తే.. ఈ స్టాక్ యార్డుల్లో హ్యాండ్లింగ్ చార్జీలు తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఇక్కడే విక్రయాలు జరిగేవి. వీటిని విక్రయిస్తే అటు స్టీల్‌ప్లాంట్‌కు, ఇటు వినియోగదారులకు నష్టాలే తప్ప ఎలాంటి ఉపయోగంలేదు. ఈ మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ.476.18 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కలు కట్టారు. నిరర్థక ఆస్తుల నెపంతో ఆస్తుల మానిటైజేషన్‌కు బోర్డు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మరోసారి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించేందుకు బోర్డు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.ఆదరిస్తే.., అద్భుతాలే కానీ..ఇటీవలే కొంతమేర లాభాలతో పాటు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తూ స్టీల్‌ప్లాంట్ దూసుకుపోతోంది. సొంత గనులు కేటాయించి మూలధన సాయంచేస్తే ఉక్కు కర్మాగారం ఉరకలు వేసే అవకాశాలున్నా.. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంటులో పూర్తి సామర్థ్యం మేరకు ఉక్కు ఉత్పత్తి చేయకుండా ఆస్తులను అమ్మడానికి ఆసక్తి చూపడంపైనా ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. స్థలాలు అమ్మితే విశాఖ ఉక్కు కష్టాలు తీరుతాయా అంటే ముడిసరుకు కొనుగోలు చేయడానికి, పేరుకుపోయిన అప్పులు తీర్చడానికి సైతం సరిపోవని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. జిందాల్ సంస్థతో ముడిసరుకు సరఫరాకు ఆర్థిక సాయానికి ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ మేరకు బీఎఫ్–3 ప్రారంభించినా, ముడిసరుకు సక్రమంగా అందక ఉత్పత్తి లక్ష్యం అందుకోలేకపోతోంది. నిత్యం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా 21 వేల టన్నులు ఉత్పత్తి చేసే అవకాశమున్నా, 14 వేల టన్నులకే పరిమితమవుతోంది. ఎన్ఎండీసీ ద్వారా ప్లాంటుకు ప్రతిరోజూ 6 రేక్‌ల ఇనుప ఖనిజం అందాలి. నాలుగు రేక్‌లకు మించి అందించడంలేదు. ఇప్పుడిస్తున్న ఇనుప ఖనిజం కేవలం రెండు ఫర్నేస్‌లకు మాత్రమే సరిపోతోంది. బీఎఫ్–3 పరిస్థితి ఏంటనే దానిపై ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టిసారించకుండా ఆస్తుల్ని విక్రయించేసి.. స్టీల్‌ప్లాంట్‌ని మోడువారేలా చేసి.. ప్రైవేటీకరణ చేయాలన్న లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయాలు తెలిసినా టీడీపీ, జనసేన పార్టీలు.. పొత్తు పార్టీ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంత వరకూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కదిలించేందుకు భయపడిన బీజేపీ.. ఇప్పుడు మాత్రం వేగంగా పావులు కదుపుతోంది. -
ఏపీ మైనింగ్‌కు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: మేజర్ మినరల్స్ మైనింగ్ లీజుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయస్థాయి అవార్డు లభించింది. భోపాల్‌లో మంగళవారం జరిగిన స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేతులు మీదుగా రాష్ట్ర గనుల శాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సమక్షంలో ‘అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్’ను వీజీ వెంకటరెడ్డికి ప్రహ్లాద్ జోషి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకువచ్చిన పలు సంస్కరణలను కేంద్ర మంత్రి అభినందించారు. మైనింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత పారదర్శకంగా అవలంభిస్తున్న విధానాల వల్ల అనతికాలంలోనే జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలవడం ప్రశంసనీయమని కొనియాడారు. మొదటి స్థానం సాధించడమే లక్ష్యం: వీజీ వెంకటరెడ్డి అవార్డును అందుకున్న సందర్భంగా గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనింగ్ రంగంలో సీఎం వైఎస్ జగన్ అనేక సంస్కరణలను తీసుకువచ్చారని చెప్పారు. గతంలో ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా లీజు జారీ చేసే విధానం ఉండేదని, దీనివల్ల అనేక ఇబ్బందులు రావడమే కాకుండా ఎక్కువ శాతం మైనింగ్ బ్లాక్‌ల్లో ఆపరేషన్స్ జరగకుండా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మైనింగ్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆక్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. 2022–23లో 146 మైనర్ మినరల్ బ్లాక్ లకు, 2023–24లో ఇప్పటివరకు 134 మైనర్ మినరల్స్ బ్లాక్‌లకు ఆక్షన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. -
కనీస జ్ఞానం లేకుండా రాస్తే ఎలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఇసుక గనులపై దురుద్దేశ్యంతో ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై ఆ పత్రిక ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంఓనా?’’ అంటూ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. అనుమతుల్లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థంలేని రాతలు రాయడంపై ఆయన మండిపడ్డారు. నిజానికి.. ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం ఒక పారదర్శక విధానాన్ని అమలుచేస్తోందని, దానిపై అపోహలు కలిగించేలా ఇసుక తవ్వకాలు చేసే వారు సీఎంఓ పేరు చెబుతున్నారంటూ పొంతనలేని అంశాలతో అసత్య కథనాన్ని వండివార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మళ్లీ టెండర్లు అయ్యేవరకూ జేపీనే.. గతంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు టెండర్లు నిర్వహించామని.. ఈ టెండర్లలో జేపీ సంస్థ సక్సెస్ఫుల్ బిడ్డర్‌గా ఎంపికైన విషయాన్ని వెంకటరెడ్డి గుర్తుచేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే గత రెండేళ్లుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహిస్తుందన్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని, అప్పటివరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయని, గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినా అవే తప్పుడు కథనాలను ప్రచురించడం ఈనాడు దురుద్దేశ్యాన్ని తెలియజేస్తోందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. అభూతకల్పనలతో రాయొచ్చా?.. ఇక వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయినందున ఎండాకాలంలో జేపి సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్‌లలో నిల్వచేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే, తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సిద్ధమవుతోందని, దీన్ని వక్రీకరిస్తూ బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంఓ నుంచి తమకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు అభూత కల్పనలతో కథనాన్ని ప్రచురించడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన ప్రశ్నించారు. ఇసుక ఆపరేషన్స్‌కు గనుల శాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయని.. మైనింగ్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తెలుసునన్నారు. అటువంటిది సీఎంఓ అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎవరైనా ఎలా చెబుతారని, ఒక్క ఈనాడుకు మాత్రమే ఇలా చెబుతున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక అంశంపై రాసే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అసత్య కథనాలను ప్రచురించడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలోని అక్రమాలు ఈనాడుకు కనిపించలేదా? గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్దఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకున్న రోజుల్లో ఈనాడుకు ఆ అక్రమాలు కనిపించలేదా అంటూ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చి, ప్రజలకు అందుబాటు ధరలో, వర్షాకాలంలోనూ ఇసుక కొరతలేకుండా ఇసుకను అందిస్తుంటే ఈనాడు తట్టుకోలేక తప్పుడు వార్తలను వండివారుస్తోందన్నారు. నిజానికి.. ఎలాంటి విమర్శలకు అవకాశంలేకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మినీరత్నగా గుర్తింపు పొందిన ఎంఎస్టీసీ ద్వారా ఇసుక టెండర్లు నిర్వహిస్తున్నామని.. ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశముందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలిలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయని.. జిల్లాకో ఇన్చార్జిని నియమించారంటూ ఈనాడు అబద్ధాలను పోగేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించిందన్నారు. ఇకనైనా ఇటువంటి తప్పుడు కథనాలను మానుకోకపోతే ఈనాడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఇసుకపై మసక రాతలు!
సాక్షి, అమరావతి: ఇసుక తవ్వకాలపై యథావిధిగా ‘ఈనాడు’ కట్టుకథలతో స్క్రీన్ ప్లేను రక్తి కట్టించింది. నిబంధనల ప్రకారం స్టాక్ యార్డు నుంచి రవాణా జరుగుతుంటే రీచ్‌ల నుంచి తరలిస్తున్నట్లు అందంగా అబద్ధాలను అల్లేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పేరిట ప్రభుత్వానికి రావాల్సిన రూ.4 వేల కోట్లకు గండికొట్టేసినా చిద్విలాసంగా గడిపేశారు రామోజీరావు. ఈ ప్రభుత్వ హయాంలో అదే ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం వస్తోంది. జనానికి మునుపటికన్నా ఎక్కువ అందుబాటులో ఉండి... అప్పటికన్నా తక్కువ ధరకే దొరుకుతోంది. అయినా సరే... తాము గతంలో ‘డీపీటీ’ పేరిట దోచుకో – పంచుకో– తినుకో అనే తరహాలో లాగించేసిన సొమ్ముకు గండిపడిందనే ఆక్రోశంతో నిత్యం కథనాలు రాస్తూనే ఉన్నారు. అన్నీ సక్రమంగానే సాగుతున్నా... తన రాజకోట నుంచి రోజుకో రాయి విసురుతూనే ఉన్నారు. ‘కోర్టుల్ని ధిక్కరించి మరీ తవ్వకాలు’ అంటూ బుధవారం అచ్చేసిన కథనం కూడా అలాంటిదే. ఖాళీ రీచ్‌లలో తవ్వకాలా? చిత్తూరు జిల్లా అరణియార్, స్వర్ణముఖి, నినా నదుల్లో 18 ఇసుక రీచ్‌లలో తవ్వకాలు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. దీనిపై జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఎన్జీటీ ఆదేశాలనే సమర్ధించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూ గనుల శాఖ ఆ 18 రీచ్‌లలో ఇసుక తవ్వకాలను నిలిపివేయడంతోపాటు అనుమతులను రద్దు చేసింది. పర్యావరణ శాఖ ద్వారా తాజాగా పూర్తిస్థాయి అనుమతులు పొందాలని, ఆ తరవాతే తవ్వకాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే 15 రీచ్‌లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ‘ఈనాడు’ ఓ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది. తవ్వకాలే లేని చోట యంత్రాలా? వర్షాకాలంలో భవన నిర్మాణ రంగం అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఓపెన్ రీచ్‌లకు సమీపంలో ప్రభుత్వం స్టాక్ యార్డ్‌లను నిర్వహిస్తోంది. స్టాక్ యార్డులలో ఇసుక నిల్వ చేస్తారు తప్ప... అదేమీ రీచ్ కాదు కనక అక్కడ తవ్వకాలు జరపరు. అలాంటి నిల్వ చేసిన ఇసుక కూడా అక్రమంగా తవ్వేపోసిందేనంటూ ‘ఈనాడు’ నిస్సిగ్గుగా అబద్ధాలాడుతోంది. రీచ్‌లలో తవ్వకాలే జరగని చోట భారీ యంత్రాలు ఎలా వస్తాయి? వాటి ద్వారా టిప్పర్లు, ట్రాక్టర్లలో ఎలా లోడ్ చేస్తారు? అసలు జరగని ఇసుక రవాణాకు స్లిప్‌లు ఎలా ఇస్తారు? ప్రతి రూపాయి ప్రజల కోసమే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీకి ఆలవాలంగా మారిన చంద్రబాబు హయాం నాటి ఇసుక విధానాన్ని రద్దు చేశారు. జాతీయ సంస్థల ద్వారా టెండర్లు పిలిచి ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పారదర్శకంగా విక్రయాలు చేపట్టారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిని తిరిగి ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి ఇసుక విషయంలో చూడాల్సిన ప్రధాన అంశాలు రెండే. ఒకటి ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయా? లేదా? కాంట్రాక్టరు ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తున్నారా? లేదా? అనేది. రెండోది ప్రజలకు అందుబాటులో ఉందా.. లేదా అనేది. అది కూడా నిర్దేశించిన ధరకు విక్రయించాలి. దీనికోసమే ప్రతి ఆదివారం ‘ఈనాడు’తో సహా ప్రధాన పత్రికల జిల్లా ఎడిషన్లలో ప్రభుత్వం ప్రకటనలిస్తోంది. అందులో ధరను నిర్దేశించటంతో పాటు... ఎవరికైనా ఆ ధరకు అందుబాటులోకి రాకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా నెంబరుతో సహా పేర్కొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) నెంబర్లు కూడా అందులో పొందు పరుస్తున్నారు. వాస్తవానికి ఇంతటి పారదర్శకమైన వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఎన్నడూ లేదు. కానీ ‘ఈనాడు’ ఒక్క అక్షరం కూడా రాసింది లేదు. తెలుగుదేశం నేతలు బరితెగించి మరీ.. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాకుండా దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) పద్ధతిలో చెలరేగిపోయినా... అడ్డువచ్చిన ఎమ్మార్వో వనజాక్షిని నాటి టీడీపీ ఎమ్మెల్యే అత్యంత పాశవికంగా ఈడ్చుకుంటూ మరీ కొట్టినా... చంద్రబాబు ఇంటి వెనకాల రాత్రీపగలూ తేడాలేకుండా లారీలకు లారీలు తరలించేసినా... రామోజీరావుది చిద్విలాసంతో కూడిన మౌనవ్రతమే తప్ప అక్షర యజ్ఞం ఊసే లేదు అప్పట్లో!!. చట్టపరమైన చర్యలు తప్పవు.. స్టాక్ పాయింట్లలో నిబంధనల ప్రకారం విక్రయాలు చేపడితే అక్రమ ఇసుక రవాణాగా చిత్రీకరించడం దారుణం. తవ్వకాలు రద్దు చేసిన రీచ్‌లలో అక్రమ ఇసుక దందా ఎలా సాధ్యపడుతుంది? గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సహజ వనరుల దోపిడీ జరిగింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇసుక మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏ పేదవాడికి ఉచితంగా ఇసుక దక్కలేదు. ఇప్పుడు నిబంధనల ప్రకారం ప్రభుత్వమే ఏజెన్సీ ద్వారా విక్రయిస్తోంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేస్తోంది. ‘ఈనాడు’ పదేపదే అబద్ధాలను ప్రచురించడం ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. ఇకపై ఇలాంటి అసత్య కథనాలు ప్రచురిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ అదే నిజమైతే ఫిర్యాదు ఏది? ఈనాడు బృందాలు చిత్తూరు జిల్లాలోని ఇసుక రీచ్‌లను పరిశీలించి ఫొటోలు తీసినట్లు కథనంలో రాసుకొచ్చారు. అక్రమాలు జరగడం నిజమే అయితే ప్రత్యక్ష సాక్షిగా ‘ఈనాడు’ బృందం కనీసం టోల్ ఫ్రీ నంబరుకు ఎందుకు కాల్ చెయ్యలేదు. పోనీ స్థానిక పోలీసులు, రెవెన్యూ, గనులశాఖ అధికారుల్లో ఏ ఒక్కరికైనా ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఆ రీచ్‌లలో ఎక్కడా తవ్వకాలు జరగడం లేదు. అదీ ‘ఈనాడు’ చెప్పని అసలు నిజం!! -
వేదాంతా – హిందుస్తాన్ జింక్ డీల్‌కు బ్రేక్!
న్యూఢిల్లీ: రుణ భారాలను తగ్గించుకోవాలని భావిస్తున్న బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అగర్వాల్ నియంత్రణలోని వేదాంతా తన అంతర్జాతీయ జింక్ వ్యాపారాన్ని (అసెట్స్) హిందుస్తాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్)కు 2.98 బిలియన్ డాలర్లకు విక్రయించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వ్యతిరేకించింది. విలువలకు సంబంధించి తలెత్తిన ఆందోళనలే దీనికి కారణం కావడం గమనార్హం. ఈ డీల్ ద్వారా తన దాదాపు 10 బిలియన్ డాలర్ల రుణ భారంలో కొంత తగ్గించుకోవాలన్న వేదాంతా ప్రయత్నానికి తాజా పరిణామం విఘాతంగా నిలుస్తోంది. చట్టపరమైన చర్యలకూ ప్రభుత్వం సిద్ధం ఆఫ్రికా ఆధారిత వ్యాపారాన్ని హిందుస్తాన్ జింక్‌కు విక్రయించడాన్ని నిలువరించడానికి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు హిందుస్తాన్ జింక్ లిమిటెడ్‌కు గనుల మంత్రిత్వశాఖ ఒక లేఖ రాస్తూ, ‘‘ఈ లావాదేవీకి సంబంధించి ప్రభుత్వం తన అసమ్మతిని పునరుద్ఘాటించాలనుకుంటోంది’’ అని పేర్కొంది. హిందుస్తాన్ జింక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఈ విషయాన్ని తెలిపింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి 29.54 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. మాతృ సంస్థ వేదాంతా నుంచి టీహెచ్ఎల్ జింక్ లిమిటెడ్ మారిషస్‌ను 2.98 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని హిందుస్తాన్ జింక్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతిపాదన ప్రకారం 18 నెలల్లో దశలవారీగా ఈ కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉంది. జింక్, సీసం, వెండి సమీకృత ఉత్పత్తిదారు.. హిందుస్తాన్ జింక్‌లో వేదాంతాకు 64.92 శాతం వాటా ఉంది. కాగా.. మైనింగ్ శాఖ లేఖను బోర్డు ముందు ఉంచనున్నట్లు హిందుస్తాన్ జింక్ తాజాగా వెల్లడించింది. వేదాంతా గ్రూప్లోకెల్లా భారీ డివిడెండ్ల ద్వారా హెచ్‌జెడ్‌ఎల్ సంపన్న సంస్థగా నిలుస్తూ వస్తోంది. హిందుస్తాన్ జింక్ షేర్ ధర సోమవారం 1% తగ్గి, రూ.321 వద్ద స్థిరపడగా, వేదాంతా షేర్ ధర కూడా అంతే శాతం తగ్గి, రూ.311 వద్ద ముగిసింది. -
బొగ్గు కొరత రానివ్వొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఇంధన, గనులు, ఖనిజాభివృద్ధి శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు దేశీయంగా లభిస్తున్న బొగ్గుతో పాటు విదేశాల నుంచి కూడా దిగుమతులు చేసుకుంటున్నామన్నారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) వంటి ప్రభుత్వరంగ సంస్థలు బొగ్గు రంగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశీయంగా లభించే బొగ్గును మన రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలు వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల నిర్వహణకు ఏపీఎండీసీ సిద్ధంగా ఉందని, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో సుల్యారీ గనిని నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని గనులను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును అందించేందుకు ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని.. ఇందుకు ఇంధన, గనుల శాఖాధికారులు సమన్వయం చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఇంధన శాఖ పునర్వ్యవస్థీకరణ ఇక ఇంధన శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఇంధన శాఖను కూడా పునర్వ్యవస్థీకరించాలని ఆయన సూచించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వడంలో జాప్యం చేయకూడదని సీఎం జగన్ ఆదేశాలిచ్చారని.. దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. అలాగే, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కూడా నిర్ణీత లక్ష్యంలోగా పూర్తిచేయాలని సూచించారు. పెండింగ్ కేసులపై దృష్టి ఇంధనశాఖ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించిన కోర్టు కేసులను సత్వరం పరిష్కరించే విషయంలో అధికారులు దృష్టిసారించాలని కూడా మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నెడ్‌క్యాప్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులపై రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, నెడ్‌క్యాప్ వీసీ–ఎండీ ఎస్.రమణారెడ్డి, ఏపీఎండీసీ వీసీ–ఎండీ వీజీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
AP: రాష్ట్రంలో గ్రానైట్ 'మెరుపులు'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయి. తన పాదయాత్రలో పలు ప్రాంతాల్లో గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకుల కష్టాలను విన్న వైఎస్ జగన్ ఆనాడు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు. ఆర్థిక మాంద్యం, ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాలతో మూతపడిన గ్రానైట్ పరిశ్రమలు మళ్ళీ పుంజుకొనేలా శ్లాబ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రాష్ట్ర గనుల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు శ్లాబ్ విధానాన్ని ప్రతిపాదించారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు మేలు చేసేలా శ్లాబ్‌లను నిర్ణయించాలని కోరారు. దానిపై స్పందించిన వైఎస్ఆర్ 2009లో ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ప్రతి కట్టర్‌కు రూ.14 వేల శ్లాబ్‌ను ఖరారు చేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఈ విధానం అమలు కాలేదు. 2016లో అప్పటి ప్రభుత్వం జీవో 97 ద్వారా శ్లాబ్ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఫలితంగా అప్పటికే ఆర్థిక మాంద్యంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న గ్రానైట్ కర్మాగారాలు మరింత ఇబ్బందుల్లో పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 వేల గ్రానైట్ కర్మాగారాల్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిపై ఆధారపడిన వేలాది కార్మికులు, రవాణా, మార్కెటింగ్ రంగాల వారు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను పలువురు గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన వారు కలిశారు. వారి కష్టాలను వివరించారు. గ్రానైట్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ పరిశ్రమలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన శ్లాబ్ విధానానికి చర్యలు ప్రారంభించారు. గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో గనుల శాఖ అధికారులు పలుసార్లు సమావేశమయ్యారు. స్లాబ్ విధానం, ప్రయోజనాలు, ఆచరణ యోగ్యమైన విధానాలపై చర్చించారు. ఎవరైతే ఈ విధానం పట్ల ఆసక్తి చూపుతారో, వారు స్వచ్ఛందంగా దీని పరిధిలోకి వచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, కోర్టు తుది తీర్పుకు లోబడి ఈ విధానం అమలవుతుందని జీవోలో పేర్కొన్నారు. సీనరేజికీ శ్లాబు విధానం స్టోన్ కటింగ్, క్వాలిటీ పరిశ్రమల్లో గ్రానైట్ బ్లాకులపై వసూలు చేసే సీనరేజి ఫీజుకు కూడా ప్రభుత్వం శ్లాబ్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలో సింగిల్ బ్లేడ్‌కి రూ.27 వేలు, మల్టీ బ్లేడ్‌కి రూ.54 వేలు రేటుగా నిర్ణయించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సింగిల్ బ్లేడ్‌కు రూ.22 వేలు, మల్టీ బ్లేడ్‌కు రూ.44 వేలు రేటుగా నిర్ణయించింది. తిరిగి తెరుచుకోనున్న పరిశ్రమలు ఇప్పటికే మూతపడిన పరిశ్రమలు శ్లాబ్ విధానంతో తిరిగి తెరుచుకుంటాయి. అంతే కాదు.. ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాకుండా రెండో రకంతో ఉన్న చిన్న సైజ్ గ్రానైట్ బ్లాక్‌లను కూడా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటివరకు వృధాగా వదిలేస్తున్న ఈ ఖనిజాన్ని కూడా దేశీయ అవసరాలకు అనుగుణంగా చిన్న సైజుల్లో తయారుచేసి, మార్కెట్ చేసుకోవచ్చు. దీనివల్ల దేశీయ మార్కెట్లో అన్ని వర్గాల వారికి వారి అవసరాలకు అనుగుణమైన గ్రానైట్ పలకలను అందించే వెసులుబాటు కలుగుతుంది. మరోవైపు గ్రానైట్ పరిశ్రమలు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో గ్రానైట్, కట్టింగ్, పాలిషింగ్, రవాణా, మార్కెటింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి లభిస్తుంది. -
ఏపీ గనుల శాఖకు ప్రశంసలు
-
ఏపీ గనుల శాఖ పని తీరు భేష్: సీఎం జగన్
-
మైనింగ్ లీజులన్నీ బాబు హయాంలోనే
తిరుపతి రూరల్: జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని ఉత్తమ పనితీరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు సాధించిన రాష్ట్ర గనుల శాఖపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శలు చేయడాన్ని గనులు, విద్యుత్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. విశాఖలో కొండలను కొల్లగొడుతున్నారంటూ చంద్రబాబు చెబుతున్న గాలి కబుర్లలో ఏమాత్రం నిజం లేదన్నారు. గురువారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్‌కుమార్, గనులశాఖ డీడీ ప్రసాదరావుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యావరణ అనుమతుల ప్రకారమే రుషికొండలో మట్టి తవ్వకాలు జరిగాయని, ప్రభుత్వానికి ఆ సంస్థ రూ.6 కోట్ల రాయల్టీ కూడా చెల్లించిందని వివరించారు. చంద్రబాబు చెబుతున్న మైనింగ్ లీజులన్నీ కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే ఇచ్చారని గుర్తు చేశారు. కుప్పంలో రౌడీయిజం సంస్కృతి చంద్రబాబుదేనని, తమకు ఆ అలవాటు ఉంటే ఆయన అక్కడ గెలిచేవారు కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉండగా అటవీ ప్రాంతంలో జరిగిన దొంగచాటు మైనింగ్‌ను తాము రాగానే నిలుపుదల చేసినట్లు చెప్పారు. పది రోజుల్లో నివేదిక.. కుప్పం నియోజకవర్గంలో 102 మైనింగ్ లీజులున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కేవలం రెండు లీజులు మాత్రమే ఇచ్చాం. మిగిలినవి టీడీపీ, కాంగ్రెస్ హయాంలో ఇచ్చినవే. ఇందులో 71 లీజులకు సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి రూ.114 కోట్ల పెనాల్టీ వేశాం. వర్కింగ్‌లో ఉన్న 31 లీజులపై పూర్తి స్థాయిలో విచారించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించాం. అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తేలితే వాటిపై కూడా చర్యలు తీసుకుంటాం. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాం. ఇంగిత జ్ఞానం లేకుండా.. సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక లేటరైట్ పేరుతో బురద చల్లాలనే దుస్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. భారతీ సిమెంట్‌కు రోజూ 1,000 లారీల లేటరైట్ తరలిస్తున్నారనే ఆరోపణలు అర్థరహితం. సిమెంట్ తయారీలో కేవలం 3 శాతం మాత్రమే లేటరైట్ వినియోగిస్తారు. వేల లారీల ఖనిజాన్ని సిమెంట్ కంపెనీలు ఏం చేసుకుంటాయి? ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనం. రూ.100 కోట్ల జరిమానా మరిచావా? చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా పట్టించుకోలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించిన సంగతి చంద్రబాబు మరిచిపోయారా? మా ప్రభుత్వం వచ్చాక ఇసుక మాఫియాకు చెక్ పెట్టి అత్యంత పారదర్శక విధానాన్ని తెచ్చాం. కేంద్ర సంస్థల ద్వారా ఇసుక టెండర్లు నిర్వహించాం. వనరులపై కాగ్ పర్యవేక్షణ.. మైనింగ్, ఇసుక అక్రమాలు, అక్రమ తవ్వకాలను నిరోధిస్తూ ప్రతి జిల్లాలో విజిలెన్స్ స్క్వాడ్‌ను నియమించాం. రీజినల్ స్క్వాడ్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కాగ్ సహజ వనరులపై ఎప్పటికప్పుడు శాటిలైట్ ఇమేజింగ్ సిస్టం ద్వారా పర్యవేక్షిస్తోంది. ఎక్కడైనా అక్రమాలను గుర్తిస్తే కాగ్ వెంటనే రాష్ట్రాలను ప్రశ్నిస్తోంది. మన రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఇప్పటివరకు కాగ్ నుంచి ఫిర్యాదులు లేవు. గనులశాఖ సమర్థతకు ఇది నిదర్శనం. అందుకే కేంద్ర ప్రభుత్వం మన గనుల శాఖకు జాతీయ స్థాయి అవార్డు ఇచ్చింది. రూ.2.40 కోట్ల ప్రోత్సాహకాలను అందించింది. మైనింగ్ శాఖలో తెచ్చిన సంస్కరణల వల్ల ఆదాయం పెరిగింది. సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని అనుభవించిన చంద్రబాబుకు ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా లేదు. శాటిలైట్ సిస్టమ్ గురించి తొలుత ఆయన తెలుసుకోవాలి. -
గనుల శాఖకు ఘన పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్ర గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గనులశాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. రానున్న రెండేళ్లకుగానూ రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద రూ.2.40 కోట్లు ప్రోత్సాహకంగా ప్రకటించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మైన్స్ అండ్ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనులు శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అవార్డు అందుకున్నారు. రెండేళ్లుగా పారదర్శకంగా లీజులు.. దేశంలో ప్రధాన ఖనిజాల మైనింగ్‌పై ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర గనుల శాఖ ఏటా అవార్డులను ప్రదానం చేస్తోంది. రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద ప్రోత్సాహకాలు అందిస్తోంది. గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది రకాల ప్రధాన ఖనిజాలకు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యక్రమాల పర్యవేక్షణలో పారదర్శకంగా వ్యవహరిస్తూ అత్యంత వేగంగా లీజులు జారీ చేస్తోంది. వేగంగా మైనింగ్ కార్యక్రమాలను చేపట్టేలా అత్యుత్తమ విధానాలను అనుసరిస్తోంది. దీనికి గుర్తింపుగా కేంద్రం అవార్డులను ప్రకటించింది. మైనింగ్ బ్లాకుల నిర్వహణను సమర్థంగా చేపట్టినందుకు అభినందిస్తూ 2022–23లో బాక్సైట్, ఐరన్ ఓర్ ఐదు కొత్త మినరల్స్ బ్లాక్‌లకు సంబంధించి జియోలాజికల్ నివేదికలను రాష్ట్రానికి కేంద్రం అందజేసింది. సీఎం తెచ్చిన సంస్కరణల ఫలితం.. మైనింగ్ రంగంలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకమని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు మైనింగ్ రంగంలో సృజనాత్మక పనులతోపాటు పలు సంస్కరణలు తెచ్చినట్లు వెల్లడించారు. కొత్త మినరల్ బ్లాకులకు సంబంధించి త్వరలోనే ఖనిజ అన్వేషణ, వేలం, మైనింగ్ ఆపరేషన్ ప్రక్రియలను పూర్తి చేస్తామని వీజీ వెంకటరెడ్డి తెలిపారు. మైనింగ్ రంగంలో సీఎం జగన్ తెచ్చిన సంస్కరణలు, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించామన్నారు. భారతి సిమెంట్స్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ నేషనల్ కాంక్లేవ్‌లో భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం పట్ల సంస్థ యాజమాన్యాన్ని ద్వివేది, వెంకటరెడ్డి అభినందించారు. వరుసగా మూడేళ్లు సస్టెయినబుల్ మేనేజ్మెంట్ విధానాలను అవలంబించిన భారతి సిమెంట్స్‌కు ఈ గౌరవం దక్కడం అభినందనీయమన్నారు. -
మైనింగ్ లీజుల విషయంలో పారదర్శక విధానం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ప్రభుత్వానికి ఖనిజ ఆధారిత ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇప్పటికే గనులశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు సంస్కరణలను తీసుకువచ్చామన్నారు. మైనింగ్ లీజుల విషయంలో అత్యంత పారదర్శకతను అమలులోకి తీసుకువస్తూ ఈ-ఆక్షన్ విధానంను ప్రవేశపెట్టామని అన్నారు. సచివాలయంలోని మూడోబ్లాక్‌లో బుధవారం గనులు, అటవీ, పర్యావరణశాఖ అధికారులతో మైనింగ్ లీజులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గనులశాఖ ద్వారా ఈ-ఆక్షన్ లో మైనింగ్ అనుమతులను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించామని, దీనివల్ల ఔత్సాహికులు పలువురు మైనింగ్ రంగంలోకి వస్తున్నారని అన్నారు. ఇదే క్రమంలో గతంలో మైనింగ్ లీజులకు దరఖాస్తులు చేసుకుని, పర్యావరణ, అటవీ అనుమతులు లేక మైనింగ్ చేపట్టకుండా ఉన్న లీజులపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. చదవండి: మేల్కొని.. కలగంటున్న రామోజీ పర్యావరణ, అటవీ, గనులశాఖల మధ్య సమన్వయం ఉంటేనే పెండింగ్ లీజుల విషయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. గనుల శాఖ నుంచి లీజులు పొందినప్పటికీ అటు పర్యావరణ, అటవీ శాఖల నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారని, వారికి ఎదురవుతున్న ప్రతిబంధకాలను పరిశీలించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న లీజుల్లో మైనింగ్ ప్రారంభించినట్లయితే అటు ప్రభుత్వానికి రెవెన్యూ లభిస్తుందని, ఇటు పర్యావరణ శాఖకు కూడా సిఎఫ్ఓ, సిఎఫ్ఇల ద్వారా ఫీజు రూపంలో ఆదాయం లభిస్తుందని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5146 మైనర్ మినరల్ మైనింగ్ లీజులు ఉన్నాయని తెలిపారు. వీటిల్లో 2276 లీజులకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయన్నారు. మరో 277 లీజులకు సంబంధించి 133 లీజులకు అనుమతులు పొందే అవకాశం ఉందని, మిగిలిన 144 లీజులకు సంబంధించి అనుమతుల విషయంలో సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. నాన్ వర్కింగ్ లీజుల్లో అధికారుల చొరవతో 83 లీజుల్లో మైనింగ్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇదే స్పూర్తితో మిగిలిన లీజుదారులతోనూ సంప్రదించి అన్ని చోట్ల మైనింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం గనులశాఖ నుంచి లైజనింగ్ అధికారులనుకూడా నియమిస్తామని తెలిపారు. పర్యావరణ అనుమతుల విషయంలో నిర్ధిష్ట కాల వ్యవధిలోనే అన్ని నిబంధనలను పరిశీలించి, అర్హత ఉన్న లీజులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే అటవీశాఖకు సంబంధించిన భూముల్లో మైనింగ్ కోసం వచ్చిన దరఖాస్తుల విషయంలో ప్రత్యామ్నాయంగా పచ్చదనాన్ని పెంచే భూములను కేటాయించడంపై కూడా ఎవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న క్వారీల నుంచి వచ్చే వ్యర్థాలను అటవీభూముల్లో వదిలేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధానాలను ఎటువంటి స్థితిలోనూ సహించకూడదని, దీనిపై లీజుదారులకు నిర్ధిష్టమైన సూచనలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండే టెక్నాలజీ), గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్ సెక్రటరీ (మైన్స్), స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటర్రామరెడ్డి, ప్రదీప్ కుమార్ (పిసిసిఎఫ్, హెచ్ ఓ ఎఫ్ ఎఫ్ అటవీశాఖ), విజి వెంకటరెడ్డి, డైరెక్టర్ మైన్స్ & జియాలజీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సాక్షి ఎఫెక్ట్: అవినీతి అధికారిపై వేటు
సాక్షిప్రతినిధి విజయనగరం: రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. అక్రమాలు నిరంతరం సాగవు. ఎవరూ చూడటం లేదనీ... ఏమైనా చేసేయొచ్చనీ... సొంత నిర్ణయాలు తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. అవినీతిని ఏమాత్రం సహించబోమని అధికారంలోకి వచ్చిన వెంటనే స్పష్టంచేసిన సీఎం అందుకోసం ఏకంగా ఓ టోల్‌ఫ్రీ నంబర్ కూడా పెట్టారు. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. పట్టుబడిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.వి.వి.ఎస్.చౌదరిపై సస్పెన్షన్ వేటు వేశారు. విజయనగరం రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ అధికారిగా, విశాఖపట్నం మైన్స్ అండ్ జియాలజీ ఇన్చార్జ్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న చౌదరిని విధుల నుంచి తప్పిస్తూ జీఓ నెం.344ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఊరుదాటి వెళ్లకూడదంటూ ఆదేశించింది. డీడీకీ అదనపు బాధ్యతలు రీజనల్ విజిలెన్స్ స్కాడ్ ఇన్చార్జ్ బాధ్యతలను విజయనగరం గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.పూర్ణచంద్రరావుకు అప్పగించింది. గనుల శాఖ అధికారులు కొందరు మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత నెల 20వ తేదీన ‘అక్రమార్కులకు అండ’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఆ కథనంపై వెంటనే స్పందించిన గనులశాఖ మంత్రి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా పేషీ అధికారులను ఆదేశించారు. వారు అన్ని వివరాలను సేకరించి చౌదరి, మరికొందరు అధికారుల చిట్టాలను సేకరించి మంత్రికి అందజేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కొందరు వ్యక్తులు, కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక పరి్మట్లను చౌదరి ఇచ్చినట్లు తేలడంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. మరికొందరు అవినీతి అధికారులపైనా చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. -
నిత్యం 45 వేల టన్నుల ఇసుక సరఫరా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిరోజూ 45 వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నట్టు గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మైనింగ్ శాఖ కార్యదర్శి రామ్ గోపాల్‌తో కలిసి ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల్లో నెలల తరబడి వరద ప్రవాహం కొనసాగుతుండడం వల్ల ప్రధానమైన రీచ్‌ల నుంచి అనుకున్నంత ఇసుక సరఫరా జరగడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. దీన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇసుక రీచ్‌లను గుర్తిస్తున్నామని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే... ‘‘గత పదేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరిలో 40 రోజులుగా వరద కొనసాగుతుంది. నదుల్లో రీచ్‌లు వరదతో నిండిపోతే ఇసుకను తవ్వితీయడం ఎలా సాధ్యం? దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి వాడుకోవడం సమంజసం కాదు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో 5 వేల టన్నుల ఇసుక సరఫరాకు అవకాశం ఉండగా, దాన్ని ఇప్పుడు 45 వేల టన్నులకు పెంచగలిగాం. వరద ప్రవాహం వల్ల నదులు, వాగుల్లో ఇసుక తవ్వే అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను సేకరిస్తున్నాం. ఇందుకోసం టన్నుకు రూ.100 చొప్పున చెల్లిస్తామని భూయజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇప్పటికే 82 మంది పట్టా భూముల యజమానులు ఇసుక తవ్వకాల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. 10 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి కూడా ఇచ్చాం. మరో 15 రోజుల్లో ఇసుక కొరత లేకుండా అడిగిన వారందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ‘క్రెడాయ్’కి 50 వేల టన్నుల ఇసుక అందించాం కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత గత 30–40 రోజుల్లో ఇసుక కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారికి 6 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సరఫరా చేశాం. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) ప్రతినిధులతో మాట్లాడి, వారి అవసరాలకు మరో 50 వేల టన్నుల ఇసుక అందించాం. నిర్మాణ రంగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వారి అవసరాలు ఎంత, ఏ మేరకు ఇసుకను అందించాలి అనేదానిపై అవగాహనకు వచ్చాం. ఆదాయం పోయిందనే అక్కసుతోనే... నదుల్లోని ఇసుకను యథేచ్ఛగా దోచుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు అధికారం, ఆదాయం పోయిందనే అక్కసుతోనే ఇసుక లభ్యతపై రాజకీయం చేస్తున్నారు. సాధారణంగానే వర్షాకాలంలో భవన నిర్మాణ రంగంలో పనులు నెమ్మదిస్తాయి. నదుల్లోని ఇసుకను టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దోచుకున్న ఫలితంగా కృష్ణా నదిలో ఇసుక గోతుల్లో ఓ బోటు మునిగి చాలామంది మరణించారు. ఇసుక దోపిడీపై గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా కూడా విధించింది. అలాంటి తప్పుడు విధానాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. ఎంశాండ్ యూనిట్లకు ప్రోత్సాహం రాష్ట్రంలో ఇసుకకు ప్రత్యామ్నాయంగా కంకర నుంచి తయారుచేసే ఎంశాండ్ యూనిట్లకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న మెటల్ క్వారీల్లో ఎంశాండ్ యూనిట్లు నెలకొల్పే వారికి పావలా వడ్డీకి రుణాలు అందించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలిస్తున్నారు’’ అని మంత్రి వివరించారు. భవిష్యత్తులో ఇసుక కొరతే రాదు తాజా వరదల కారణంగా నదుల్లో దాదాపు 10 కోట్ల టన్నుల ఇసుక చేరింది. సాధారణంగా రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే మరో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో భవిష్యత్తులో ఇక ఇసుక కొరతే ఉండదు. మరో పదిహేను రోజుల్లో వరదలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. వరద నీరు తగ్గగానే రీచ్‌ల నుంచి కావాల్సినంత ఇసుకను వినియోగదారులకు అందజేస్తాం. -
ఖనిజాన్వేషణపై దృష్టి పెట్టండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ (టీఎస్ఎండీసీ)మరింత విస్తృతపరుచుకోవడంతో పాటు, కార్యకలాపాలను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టీఎస్ఎండీసీ ఇసుక తవ్వకాలు, సరఫరాపైనే కాకుండా ఇతర గనుల తవ్వకాలు, అన్వేషణ, వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మాంగనీస్, మార్బుల్, సున్నపురాయి నిల్వలు ఇతర ఖనిజాల వాటి పైనా దృష్టి సారించాలన్నారు. గ్రానైట్ వ్యాపారంలో టీఎస్ఎండీసీ సమగ్ర కార్యాచరణను నెలలో రూపొందించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గ్రానైట్ లీజులను టీఎస్ఎండీసీ ఇవ్వడానికి ప్రాధాన్యమివ్వాలని గనుల శాఖ డైరెక్టర్‌కు సూచించారు. రాష్ట్రంలో సున్నపురాయి నిక్షేపాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా తవ్వకాలు జరపాలని, ఇందుకు కావాల్సిన సాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇసుక లభ్యత, సరఫరా, పంపిణీపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల్లో ఇసుక డిపోలు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలు అన్వేషించి కేటాయించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. -
ప్రభుత్వంతో ‘బెనిటా గ్రానైట్స్’ ఎంవోయూ
రూ. 250 కోట్లతో విశాఖలో పరిశ్రమ.. 600 మందికి ఉపాధి సాక్షి, విశాఖపట్నం: గ్రానైట్, కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను విశాఖలో ఏర్పాటుకు బెనిటా గ్రానైట్ లిమిటెడ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ. 250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వల్ల 600 మందికి ఉపాధి దొరుకుతుందని సంస్థ ప్రభు త్వానికి తెలిపింది. విశాఖలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో శనివారం బెనిటా గ్రానైట్స్ ఎండీ సతీష్ తాటి, గనుల శాఖ కార్య దర్శి బి.శ్రీధర్ ఎంవోయూపై సంతకాలు చేశారు. మినరల్స్‌లో మన్నాతో: విశాఖ జిల్లాలో రూ. 350 కోట్ల పెట్టుబడితో మన్నా ఇండస్ట్రీస్ తమ యూని ట్ను ఏర్పాటు కు ప్రభుత్వంతో ఎంవోయూ కదుర్చుకుంది. క్యాల్సైట్, అనుబంధ మినరల్స్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల వెయ్యి మందికి ఉపా ధి లభిస్తుందని సంస్థ డైరెక్టర్ డి.కిషన్ ప్రసాద్ తెలిపారు. ఈ గ్రూప్ సంస్థల చైర్మన్ యు.కొండల రావు మాట్లాడుతూ యూనిట్ ఏర్పాటుకు, ముడి సరుకు అందజేసే లీజుదార్లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. -
మొక్కల పెంపకంతో కాలుష్య నివారణ
కమ్మర్పల్లి : కంకర మిషన్ ప్రాంగణాల్లో మొక్కలు నాటి. కాలుష్యాన్ని నివారించాలని గనుల శాఖ (మైన్స్) డిప్యూటీ డైరెక్టర్ కె.యాదగిరి సూచించారు. హరితహారంలో భాగంగా శనివారం మండల కేంద్ర శివారులోని కంకర మిషన్ వద్ద ఆయన మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మైన్స్ ఏడీ సైదులు, టెక్నికల్ అసిస్టెంట్ నర్సింగ్ రమేశ్, సాయిరాం, సీనియర్ అసిస్టెంట్ గోవర్ధన్, జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్, కంకర మిషన్ నిర్వాహకుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.