సెలవులో పంపిన గనుల శాఖాధికారులతో మధ్యవర్తుల రాయబేరాలు
ఆయన వద్దకు వెళితేనే పని అవుతుందంటూ బెదిరింపులు
ఆరోపణలు ఉన్నాయంటూ 26 మందిని బలవంతంగా సెలవుపై పంపిన గనుల శాఖ
సాక్షి, అమరావతి: బలవంతంగా సెలవుపై పంపిన గనుల శాఖాధికారులు లోకేశ్‌ను కలిస్తేనే ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంటుందంటూ మధ్యవర్తులు రాయబారాలు నడుపుతుండటం చర్చనీయాంశంగా మారింది. లేనిపోని ఆరోపణలు మోపి గనుల శాఖ అధికారులను సెలవుపై పంపి.. ఇప్పుడు లోకేశ్‌ను కలవాలంటూ ఒత్తిడి చేయడం ముడుపుల కోసమేననే ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వానికి దగ్గరగా పని చేశారనే ఆరోపణలు సృష్టించి 26 మంది అధికారులను రెండు నెలల క్రితం గనుల శాఖ డైరెక్టర్ బలవంతంగా సెలవుపై పంపారు.
తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించినా.. అవన్నీ తమకు తెలియదని వెంటనే సెలవుపై వెళ్లిపోవాలని మౌఖికంగా ఆదేశించారు. గనుల శాఖ మంత్రి పేషీ నుంచి కూడా హెచ్చరికలు అందడంతో గత్యంతరం లేక వారంతా సెలవులో వెళ్లారు. వారిలో పలువురు డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర స్థాయిల్లో పనిచేసే అధికారులు ఉన్నారు. నిజానికి కొద్దినెలల క్రితమే వారికి టీడీపీ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది.
ఆ పోస్టింగ్‌లు ఇవ్వడానికి భారీగా ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. లోకేశ్ తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తి ఈ బదిలీల్లో కీలకంగా మారి వేలం నిర్వహించి మరీ పోస్టింగ్‌లు ఇచ్చారు. పోస్టింగ్‌లకు ముందే వారితో బేరం కుదుర్చుకుని సొమ్ములు తీసుకున్నారు. అనంతరం ఆ పోస్టుల్లో చేరిన కొద్దిరోజుల తర్వాత రెండు విడతలుగా వారిని బెదిరించి బలవంతంగా సెలవు పెట్టించారు.
చెప్పినట్టు చేస్తేనే తిరిగి ఉద్యోగం
కొన్ని వారాల తర్వాత లోకేశ్‌కు మధ్యవర్తిగా పనిచేసే వ్యక్తి నుంచి వారికి సమాచారం ఓ అందింది. మళ్లీ విధుల్లో చేరాలంటే తాను చెప్పినట్టు చేయాలని ఆయన సూచించారు. వెళితే మళ్లీ భారీగా ముడుపులు ముట్టజెప్పాలనే భయంతో మొదట్లో ఎవరూ వెళ్లలేదని సమాచారం. దీంతో ఆ వ్యక్తే వారిని కలిసి గత ఐదేళ్లలో వారు పనిచేసిన స్థానాలు, అక్కడ ఎంత సంపాదించారు వంటి వివరాలు చెప్పి బెదిరింపులకు దిగారు.
ఐదేళ్లలో అంత సంపాదించారు కాబట్టి అందులో కొంత ఇవ్వాలని స్పష్టం చేశారు. మీరు చెప్పినంత సంపాదన తమకు లేదని, రెండవసారి మళ్లీ డబ్బులు ఇచ్చుకోలేమని చెప్పినా కీలకమైన పోస్టుల్లో అన్ని సంవత్సరాలు పని చేశారు కాబట్టి తాము చెప్పినట్టు వినాల్సిందేనని ఒత్తిడి చేసినట్టు సమాచారం. కొన్నిరోజులుగా దీనిపై చర్చలు జరిగినా బేరం కుదరకపోవడంతో వారిని తిరిగి విధుల్లోకి చేరేందుకు అనుమతించడంలేదు.
రెండవసారి ముడుపులు ఇచ్చుకోలేం
బదిలీల సమయంలో పోస్టింగ్ ఇచ్చినందుకు ముడుపులు తీసుకుని ఆ తర్వాత సెలవుపై పంపడం అన్యాయని, ఇప్పుడు మళ్లీ డబ్బులు ఇస్తేనే విధుల్లో చేరాలనడం ఏమిటని అధికారులు వాపోతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక, ఉన్నతాధికారులతో మాట్లాడలేక సతమతమవుతున్నారు. గనుల శాఖలో బదిలీలన్నీ లోకేశ్ మనుషుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. లోకేశ్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆదేశాల ప్రకారమే గనుల శాఖ డైరెక్టర్ పని చేస్తున్నారు.
గనుల శాఖ మంత్రి చెప్పినా పట్టించుకోకుండా కేవలం లోకేశ్, ఆయన సన్నిహితుడు చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నట్టు సమాచారం. లీజుల మంజూరు, బిల్లులు, ఇతర వ్యవహారాలు ఏమైనా తనకు లోకేశ్ చెప్పాల్సిందేనని స్పష్టం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సెలవుపై పంపిన అధికారులతో బేరాలు కుదరకపోవడంతో వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment