
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ (టీఎస్‌ఎండీసీ)మరింత విస్తృతపరుచుకోవడంతో పాటు, కార్యకలాపాలను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టీఎస్‌ఎండీసీ ఇసుక తవ్వకాలు, సరఫరాపైనే కాకుండా ఇతర గనుల తవ్వకాలు, అన్వేషణ, వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మాంగనీస్, మార్బుల్, సున్నపురాయి నిల్వలు ఇతర ఖనిజాల వాటి పైనా దృష్టి సారించాలన్నారు.
గ్రానైట్ వ్యాపారంలో టీఎస్‌ఎండీసీ సమగ్ర కార్యాచరణను నెలలో రూపొందించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గ్రానైట్ లీజులను టీఎస్‌ఎండీసీ ఇవ్వడానికి ప్రాధాన్యమివ్వాలని గనుల శాఖ డైరెక్టర్‌కు సూచించారు. రాష్ట్రంలో సున్నపురాయి నిక్షేపాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా తవ్వకాలు జరపాలని, ఇందుకు కావాల్సిన సాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇసుక లభ్యత, సరఫరా, పంపిణీపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. రంగారెడ్డి, మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఇసుక డిపోలు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలు అన్వేషించి కేటాయించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment