
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి అవార్డు అందుకుంటున్న వెంకటరెడ్డి
సాక్షి, అమరావతి: మేజర్ మినరల్స్ మైనింగ్ లీజుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయస్థాయి అవార్డు లభించింది. భోపాల్‌లో మంగళవారం జరిగిన స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేతులు మీదుగా రాష్ట్ర గనుల శాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సమక్షంలో ‘అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్’ను వీజీ వెంకటరెడ్డికి ప్రహ్లాద్ జోషి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకువచ్చిన పలు సంస్కరణలను కేంద్ర మంత్రి అభినందించారు. మైనింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత పారదర్శకంగా అవలంభిస్తున్న విధానాల వల్ల అనతికాలంలోనే జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలవడం ప్రశంసనీయమని కొనియాడారు.
మొదటి స్థానం సాధించడమే లక్ష్యం: వీజీ వెంకటరెడ్డి
అవార్డును అందుకున్న సందర్భంగా గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనింగ్ రంగంలో సీఎం వైఎస్ జగన్ అనేక సంస్కరణలను తీసుకువచ్చారని చెప్పారు. గతంలో ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా లీజు జారీ చేసే విధానం ఉండేదని, దీనివల్ల అనేక ఇబ్బందులు రావడమే కాకుండా ఎక్కువ శాతం మైనింగ్ బ్లాక్‌ల్లో ఆపరేషన్స్ జరగకుండా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మైనింగ్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఆక్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. 2022–23లో 146 మైనర్ మినరల్ బ్లాక్ లకు, 2023–24లో ఇప్పటివరకు 134 మైనర్ మినరల్స్ బ్లాక్‌లకు ఆక్షన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment