న్యూఢిల్లీ: రుణ భారాలను తగ్గించుకోవాలని భావిస్తున్న బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అగర్వాల్ నియంత్రణలోని వేదాంతా తన అంతర్జాతీయ జింక్ వ్యాపారాన్ని (అసెట్స్) హిందుస్తాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్)కు 2.98 బిలియన్ డాలర్లకు విక్రయించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వ్యతిరేకించింది. విలువలకు సంబంధించి తలెత్తిన ఆందోళనలే దీనికి కారణం కావడం గమనార్హం. ఈ డీల్ ద్వారా తన దాదాపు 10 బిలియన్ డాలర్ల రుణ భారంలో కొంత తగ్గించుకోవాలన్న వేదాంతా ప్రయత్నానికి తాజా పరిణామం విఘాతంగా నిలుస్తోంది.
చట్టపరమైన చర్యలకూ ప్రభుత్వం సిద్ధం
ఆఫ్రికా ఆధారిత వ్యాపారాన్ని హిందుస్తాన్ జింక్‌కు విక్రయించడాన్ని నిలువరించడానికి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు హిందుస్తాన్ జింక్ లిమిటెడ్‌కు గనుల మంత్రిత్వశాఖ ఒక లేఖ రాస్తూ, ‘‘ఈ లావాదేవీకి సంబంధించి ప్రభుత్వం తన అసమ్మతిని పునరుద్ఘాటించాలనుకుంటోంది’’ అని పేర్కొంది. హిందుస్తాన్ జింక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఈ విషయాన్ని తెలిపింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి 29.54 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే.
మాతృ సంస్థ వేదాంతా నుంచి టీహెచ్‌ఎల్ జింక్ లిమిటెడ్ మారిషస్‌ను 2.98 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని హిందుస్తాన్ జింక్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతిపాదన ప్రకారం 18 నెలల్లో దశలవారీగా ఈ కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉంది. జింక్, సీసం, వెండి సమీకృత ఉత్పత్తిదారు.. హిందుస్తాన్ జింక్‌లో వేదాంతాకు 64.92 శాతం వాటా ఉంది. కాగా.. మైనింగ్ శాఖ లేఖను బోర్డు ముందు ఉంచనున్నట్లు హిందుస్తాన్ జింక్ తాజాగా వెల్లడించింది. వేదాంతా గ్రూప్‌లోకెల్లా భారీ డివిడెండ్ల ద్వారా హెచ్‌జెడ్‌ఎల్ సంపన్న సంస్థగా నిలుస్తూ వస్తోంది.
హిందుస్తాన్ జింక్ షేర్ ధర సోమవారం 1% తగ్గి, రూ.321 వద్ద స్థిరపడగా, వేదాంతా షేర్ ధర కూడా అంతే శాతం తగ్గి, రూ.311 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment