Hindustan Zinc Ltd
-
వేదాంతా – హిందుస్తాన్ జింక్ డీల్‌కు బ్రేక్!
న్యూఢిల్లీ: రుణ భారాలను తగ్గించుకోవాలని భావిస్తున్న బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అగర్వాల్ నియంత్రణలోని వేదాంతా తన అంతర్జాతీయ జింక్ వ్యాపారాన్ని (అసెట్స్) హిందుస్తాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్)కు 2.98 బిలియన్ డాలర్లకు విక్రయించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వ్యతిరేకించింది. విలువలకు సంబంధించి తలెత్తిన ఆందోళనలే దీనికి కారణం కావడం గమనార్హం. ఈ డీల్ ద్వారా తన దాదాపు 10 బిలియన్ డాలర్ల రుణ భారంలో కొంత తగ్గించుకోవాలన్న వేదాంతా ప్రయత్నానికి తాజా పరిణామం విఘాతంగా నిలుస్తోంది. చట్టపరమైన చర్యలకూ ప్రభుత్వం సిద్ధం ఆఫ్రికా ఆధారిత వ్యాపారాన్ని హిందుస్తాన్ జింక్‌కు విక్రయించడాన్ని నిలువరించడానికి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు హిందుస్తాన్ జింక్ లిమిటెడ్‌కు గనుల మంత్రిత్వశాఖ ఒక లేఖ రాస్తూ, ‘‘ఈ లావాదేవీకి సంబంధించి ప్రభుత్వం తన అసమ్మతిని పునరుద్ఘాటించాలనుకుంటోంది’’ అని పేర్కొంది. హిందుస్తాన్ జింక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఈ విషయాన్ని తెలిపింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి 29.54 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. మాతృ సంస్థ వేదాంతా నుంచి టీహెచ్ఎల్ జింక్ లిమిటెడ్ మారిషస్‌ను 2.98 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలని హిందుస్తాన్ జింక్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతిపాదన ప్రకారం 18 నెలల్లో దశలవారీగా ఈ కొనుగోలు ప్రక్రియ జరగాల్సి ఉంది. జింక్, సీసం, వెండి సమీకృత ఉత్పత్తిదారు.. హిందుస్తాన్ జింక్‌లో వేదాంతాకు 64.92 శాతం వాటా ఉంది. కాగా.. మైనింగ్ శాఖ లేఖను బోర్డు ముందు ఉంచనున్నట్లు హిందుస్తాన్ జింక్ తాజాగా వెల్లడించింది. వేదాంతా గ్రూప్లోకెల్లా భారీ డివిడెండ్ల ద్వారా హెచ్‌జెడ్‌ఎల్ సంపన్న సంస్థగా నిలుస్తూ వస్తోంది. హిందుస్తాన్ జింక్ షేర్ ధర సోమవారం 1% తగ్గి, రూ.321 వద్ద స్థిరపడగా, వేదాంతా షేర్ ధర కూడా అంతే శాతం తగ్గి, రూ.311 వద్ద ముగిసింది. -
హిందుస్తాన్ జింక్ లాభం అప్
న్యూఢిల్లీ: వేదాంతా గ్రూప్ మెటల్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలతాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 33 శాతం ఎగసి రూ. 2,680 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 2,017 కోట్లు ఆర్జించింది. అధిక అమ్మకాల పరిమాణం, ధరలు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. కమోడిటీ ధరలు బలపడటంతో ముడివ్యయాలు పెరిగినప్పటికీ వ్యూహాత్మక హెడ్జింగ్, విదేశీ మారక లాభాలు ఆదుకున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ2లో మొత్తం ఆదాయం రూ. 5,958 కోట్ల నుంచి రూ. 8,127 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో మైన్డ్ మెటల్ ఉత్పత్తి దాదాపు 3 శాతం వృద్ధితో 2,55,000 టన్నులను తాకింది. దీంతో సమీకృత మెటల్ ఉత్పత్తి మరింత అధికంగా 17.5 శాతం మెరుగుపడి 2,460,000 టన్నులకు చేరింది. కంపెనీ దేశంలోనే జింక్, లెడ్, సిల్వర్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థగా నిలుస్తున్న విషయం విదితమే. ఫలితాల నేపథ్యంలో హిందుస్తాన్ జింక్ షేరు 0.7% లాభపడి రూ. 280 వద్ద ముగిసింది. -
తగ్గేదేలే! ఈ రెండు బ్యాంకులకు కేంద్రం మంగళం..అమ్మకానికి సర్వం సిద్ధం?
మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) తాజాగా అనుమతించింది. దీంతో పాటు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో ఈ దిశగా తగు చర్యలు ప్రకటిస్తుందని వివరించాయి. అలాగే బీపీసీఎల్‌లో వాటాల విక్రయం అంశం కూడా పరిశీలనలోనే ఉందని, ప్రభుత్వం కొత్తగా బిడ్లను ఆహ్వానించనుందని పేర్కొన్నాయి. బరిలో ఒకే బిడ్డరు మిగలడంతో వాటాల విక్రయాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాన్కోర్) వ్యూహాత్మక విక్రయ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, అవి పరిష్కారమయ్యాక ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపాయి. ప్రైవేటీకరించబోయే రెండు పీఎస్‌బీల జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన సిఫార్సులకు ప్రధాని నేతృత్వం లోని క్యాబినెట్ తుది ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. మరో వైపు, బీపీసీఎల్‌లో తనకున్న మొత్తం 52.98% వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2020 మార్చిలో బిడ్లను ఆహ్వానించగా నవంబర్ నాటికి మూడు బిడ్లు వచ్చాయి. రెండు సంస్థలు వెనక్కి పోవడంతో చివరికి ప్రస్తుతం ఒక్క కంపెనీ బరిలో నిల్చింది. -
హింద్ జింక్‌కు సర్కారు గుడ్‌బై
న్యూఢిల్లీ: మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) తాజాగా అనుమతించింది. హింద్ జింక్‌లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 38,000 కోట్లు సమకూరే అవకాశముంది. బుధవారం సమావేశమైన సీసీఈఏ ఇందుకు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు ఊపు లభించనున్నట్లు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లలో వాటాల వ్యూహాత్మక విక్రయం ద్వారా ఈ ఏడాది రూ. 65,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. రూ. 305 ధరలో..: బుధవారం ట్రేడింగ్‌లో హింద్ జింక్ షేరు బీఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 305 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 317ను అధిగమించింది. ప్రభుత్వం 29.5 శాతం వాటాకు సమానమైన దాదాపు 125 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తద్వారా సుమారు రూ. 38,000 కోట్లు లభించే వీలుంది. కాగా.. 2002 వరకూ హింద్ జింక్ ప్రభుత్వ రంగ సంస్థగా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం 26 శాతం వాటాను స్టెరిలైట్ అపార్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్‌కు విక్రయించింది.డీల్ విలువ రూ. 445 కోట్లుకాగా.. తద్వారా వేదాంతా గ్రూప్ యాజమాన్య నియంత్రణను చేపట్టింది. తదుపరి వేదాంతా గ్రూప్ ఓపెన్ మార్కెట్ ద్వారా 20 శాతం వాటాను సొంతం చేసుకుంది. అంతేకాకుండా 2003 నవంబర్‌లో ప్రభుత్వం నుంచి మరో 18.92 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఫలితంగా హెచ్‌జెడ్‌ఎల్‌లో వేదాంతా వాటా 64.92 శాతానికి ఎగసింది. కాగా.. హెచ్‌జెడ్‌ఎల్‌లో అదనంగా 5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఇటీవలే వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ పేర్కొనడం గమనార్హం! -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయాలపై...సీబీఐ విచారణకు లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్18వ తేదీన ఇచ్చిన ఉపసంహరించుకోవాలని దాఖలు చేసిన రికాల్ పిటిషన్‌ను కేంద్రం సోమవారం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అవసరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విభేదించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారన్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్ అంగీరిస్తూ, ‘డిస్మిస్డ్ విత్ విత్‌డ్రాన్’గా రూలింగ్ ఇచ్చింది. నేపథ్యం ఇదీ... గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్ క్లియర్ చేసింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యాఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటాలు ఇలా... ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) వద్ద హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ 64.92% వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5% వాటా ఉంది. ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ 4% పైగా పెరిగి రూ.334 వద్ద ముగిసింది. -
బిర్లాసాఫ్ట్- హింద్ జింక్.. రికార్డ్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఐటీ సేవల రంగ కంపెనీ బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇక మరోపక్క విదేశీ రీసెర్చ్ సంస్థ సిటీ బయ్ రేటింగ్ ప్రకటించిన నేపథ్యంలో మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ కౌంటర్‌కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ దాదాపు రూ. 56 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 35 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 18 శాతం పెరిగి రూ. 915 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత బిర్లాసాఫ్ట్ షేరు 18 శాతం దూసుకెళ్లి రూ. 149ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 16 శాతం జంప్‌చేసి రూ. 145 వద్ద ట్రేడవుతోంది. హిందుస్తాన్ జింక్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ హిందుస్తాన్ జింక్ కౌంటర్‌కు విదేశీ దిగ్గజం సిటీ బయ్ రేటింగ్‌ను ప్రకటించింది. టార్గెట్ ధరను సైతం గతంలో ఇచ్చిన రూ. 205 నుంచి రూ. 240కు పెంచింది. రానున్న రెండేళ్లలో ఈ షేరు 8 శాతం డివిడెండ్ ఈల్డ్‌ను అందించగలదని సిటీ తాజాగా అంచనా వేసింది. దీనికితోడు ఎల్‌ఎంఈలో జింక్, సిల్వర్ ధరలు బలపడుతుండటం కంపెనీకి లబ్దిని చేకూర్చగలదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత హిందుస్తాన్ జింక్ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 236ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.3 శాతం లాభంతో రూ. 230 వద్ద ట్రేడవుతోంది. -
హిందుస్తాన్ జింక్ 1000% స్పెషల్ డివిడెండ్
న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్ జింక్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 30 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,584 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,815 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటం, ఇతర వ్యయాలు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. తరుగుదల అధికంగా ఉండటం, ఎబిటా తగ్గడం వల్ల కూడా నికర లాభం తగ్గిందని, అయితే పన్ను రేటు తగ్గడం కొంత ఊరటనిచ్చిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.5,779 కోట్ల నుంచి రూ.5,171 కోట్లకు తగ్గింది. మొత్తం వ్యయాలు రూ.2,694 కోట్ల నుంచి రూ.2,897 కోట్లకు పెరిగాయి. ఎబిటా 23 శాతం తగ్గి రూ.2,334 కోట్లకు చేరిందని, ఎబిటా మార్జిన్ 48.9 శాతానికి తగ్గిందని అగర్వాల్ వివరించారు. డివిడెండ్ జోరు...: ఒక్కో ఈక్విటీ షేర్‌కు వెయ్యి శాతం ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని అగర్వాల్ వెల్లడించారు. అంటే రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.20 (వెయ్యి శాతం) ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తారు. దీనికి రికార్డ్ తేదీ ఈ నెల 31. మొత్తం డివిడెండ్ రూపంలో రూ.10,168 కోట్లు చెల్లించనున్నట్లు అగర్వాల్ తెలియజేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ వద్ద నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.23,304 కోట్లు ఉన్నాయని తెలిపారు. జింక్ ఉత్పత్తి 16 శాతం (సీక్వెన్షియల్‌గా చూస్తే 5 శాతం) క్షీణించి 1.62 లక్షల టన్నులు తగ్గిందని అగర్వాల్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో జింక్ ఉత్పత్తి చెప్పుకోదగిన స్థాయిలో పెరగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేవారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ 1.1 శాతం నష్టంతో రూ.283 వద్ద ముగిసింది. -
వేదాంత గ్రూప్ చైర్మన్‌పై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: హిందుస్థాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జడ్‌ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణలో అక్రమాలకు సంబంధించి వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌పై సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టనుంది. ఎన్డీఏ హయాంలో చోటుచేసుకున్న ఈ అక్రమాలతో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సీబీఐ భావిస్తోంది. అగర్వాల్‌తో పాటు హెచ్‌జడ్‌ఎల్ అధికారులు, డిజిన్వెస్ట్‌మెంట్, గనుల శాఖల ఆఫీసర్లపై విచారణ జరుగుతుందని సీబీఐ వర్గాలు సోమవారం వెల్లడించాయి. వేదాంత రిసోర్సెస్‌కు చెందిన స్టెరిలైట్ ఇండస్ట్రీస్... హెచ్‌జడ్‌ఎల్ వాటాలను తక్కువ ధరకు కొనుగోలు చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. స్టెరిలైట్ ఇండస్ట్రీస్ గత ఆగస్టులో సెసా గోవాలో విలీనమైంది. తర్వాత కంపెనీ పేరు సెసా స్టెరిలైట్‌గా మారింది. 2002లో నాటి ఎన్డీఏ సర్కారు చేపట్టిన హిందుస్థాన్ జింక్ డిజిన్వెస్ట్మెంట్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని సీబీఐ వర్గాలు తెలిపాయి. అగర్వాల్‌తో పాటు పెట్టుబడుల ఉపసంహరణ, గనుల శాఖల అధికారులకు త్వరలో నోటీసులు జారీ అవుతాయని పేర్కొన్నాయి. హెచ్‌జడ్‌ఎల్‌లో వాటాను స్టెరిలైట్‌కు విక్రయించడాన్ని నాటి డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ సమర్థించుకుంది. హెచ్‌జడ్‌ఎల్‌లో 26 శాతం వాటా అమ్మకానికి ఒక్కో షేరు రిజర్వు ధర రూ.32.15 (మొత్తం రూ.353.17 కోట్లు) కాగా ఇండోగల్ఫ్ కార్పొరేషన్, స్టెరిలైట్ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఇండోగల్ఫ్ కార్పొరేషన్ కంటే అధిక ధరను (ఒక్కో షేరుకు రూ.40.50 చొప్పున మొత్తం రూ.445 కోట్లు) ఆఫర్ చేసిన స్టెరిలైట్ బిడ్‌ను ఆమోదించినట్లు నాటి డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ పేర్కొంది.