మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) తాజాగా అనుమతించింది. దీంతో పాటు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాబోయే రోజుల్లో ఈ దిశగా తగు చర్యలు ప్రకటిస్తుందని వివరించాయి. అలాగే బీపీసీఎల్‌లో వాటాల విక్రయం అంశం కూడా పరిశీలనలోనే ఉందని, ప్రభుత్వం కొత్తగా బిడ్లను ఆహ్వానించనుందని పేర్కొన్నాయి. బరిలో ఒకే బిడ్డరు మిగలడంతో వాటాల విక్రయాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇక కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాన్‌కోర్) వ్యూహాత్మక విక్రయ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, అవి పరిష్కారమయ్యాక ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపాయి. ప్రైవేటీకరించబోయే రెండు పీఎస్‌బీల జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రతిపాదనలకు సంబంధించిన సిఫార్సులకు ప్రధాని నేతృత్వం లోని క్యాబినెట్ తుది ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. మరో వైపు, బీపీసీఎల్‌లో తనకున్న మొత్తం 52.98% వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2020 మార్చిలో బిడ్లను ఆహ్వానించగా నవంబర్ నాటికి మూడు బిడ్లు వచ్చాయి. రెండు సంస్థలు వెనక్కి పోవడంతో చివరికి ప్రస్తుతం ఒక్క కంపెనీ బరిలో నిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment