న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్ జింక్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 30 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,584 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,815 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటం, ఇతర వ్యయాలు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు.
తరుగుదల అధికంగా ఉండటం, ఎబిటా తగ్గడం వల్ల కూడా నికర లాభం తగ్గిందని, అయితే పన్ను రేటు తగ్గడం కొంత ఊరటనిచ్చిందని వివరించారు. మొత్తం ఆదాయం రూ.5,779 కోట్ల నుంచి రూ.5,171 కోట్లకు తగ్గింది. మొత్తం వ్యయాలు రూ.2,694 కోట్ల నుంచి రూ.2,897 కోట్లకు పెరిగాయి. ఎబిటా 23 శాతం తగ్గి రూ.2,334 కోట్లకు చేరిందని, ఎబిటా మార్జిన్ 48.9 శాతానికి తగ్గిందని అగర్వాల్ వివరించారు.
డివిడెండ్ జోరు...: ఒక్కో ఈక్విటీ షేర్‌కు వెయ్యి శాతం ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని అగర్వాల్ వెల్లడించారు. అంటే రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.20 (వెయ్యి శాతం) ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తారు. దీనికి రికార్డ్ తేదీ ఈ నెల 31. మొత్తం డివిడెండ్ రూపంలో రూ.10,168 కోట్లు చెల్లించనున్నట్లు అగర్వాల్ తెలియజేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ వద్ద నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.23,304 కోట్లు ఉన్నాయని తెలిపారు. జింక్ ఉత్పత్తి 16 శాతం (సీక్వెన్షియల్‌గా చూస్తే 5 శాతం) క్షీణించి 1.62 లక్షల టన్నులు తగ్గిందని అగర్వాల్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో జింక్ ఉత్పత్తి చెప్పుకోదగిన స్థాయిలో పెరగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేవారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ 1.1 శాతం నష్టంతో రూ.283 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment