సోమిరెడ్డి సొల్లు..ఇసుక దందా ఫుల్లు | Former Minister Somireddy Chandramohan Reddy Sand Mining | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డి సొల్లు..ఇసుక దందా ఫుల్లు

Published Sun, Feb 23 2025 5:36 AM | Last Updated on Sun, Feb 23 2025 5:36 AM

Former Minister Somireddy Chandramohan Reddy Sand Mining

గురివింద నేత అక్రమ ఇసుక బండారం బట్టబయలు

సర్వేపల్లి నియోజకవర్గంలో యథేచ్చగా ఇసుక దోపిడీ 

అడ్డంగా దొరికిపోయిన ఆయన అనుచరుల యంత్రాలు, లారీలు 

స్వయంగా వెల్లడించిన నెల్లూరు మైనింగ్‌ డీడీ 

ఉచిత ఇసుక ముసుగులో రూ.కోట్లు కొల్లగొడుతున్న వైనం 

పొదలకూరు మండలం విరువూరు, సూరాయపాళెంలో అక్రమ తవ్వకాలు 

అడ్డుకున్న అధికారులను బెదిరించి లారీల తరలింపు 

పేరుకు రెండు లారీలు, హిటాచీలు మాత్రమే అప్పగింత 

నిత్యం వందలాది లారీల్లో ఇసుక అక్రమ రవాణా  

రూ.వంద కోట్లకు పైనే జేబులో వేసుకున్న టీడీపీ నేత

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నిత్యం నీతి కబుర్లు చెబుతూ జనాన్ని మాయ చేసే సర్వేపల్లి ఎ­మ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర­మో­హ­న్‌­రె­డ్డి అసలు రంగు బయటపడింది. సొంత నియో­జక­వర్గంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతూ ఆయ­న మనుషులు అడ్డంగా దొరికిపోయారు. ఈ దందా­ను చూసి గనుల శాఖాధికారులే నివ్వెర­పోయారు. అనుమతి లేని పెన్నా నది ఇసుక రీచుల్లో అంత భారీ స్థాయిలో తవ్వకాలు, రవాణా జరు­పుతున్నారంటే ఏ స్థాయి అవినీతి జరుగుతుందో­నని బెంబేలెత్తిపోయారు. 

ఈ అక్రమ తవ్వకాల విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా సర్వేç­³ల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండ­లం విరువూరు, సూరాయపాళెం రీచుల్లో అక్రమ తవ్వ­కాలు సాగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ఈ రీచుల్లో ఇసుకను యంత్రాలతో తోడే­స్తున్నారు. 16 టైర్ల లారీలు, టిప్పర్లలో యథేచ్ఛగా ఇ­తర ప్రాంతాలకు తరలించి అమ్ముతున్నారు. 

ఈ క్ర­మంలో సాధారణ తనిఖీల్లో భాగంగా నెల్లూరు జి­ల్లా గనుల శాఖ ఇన్‌ఛార్జి డిప్యూటీ డైరెక్టర్‌ బాలాజీ నాయ­క్‌ తన సిబ్బందితో రోడ్డుపై వెళుతున్న కొన్ని లా­రీలను ఆపి చూసి ఆశ్చర్యపోయారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిపోతున్నట్లు గుర్తించారు. 

అయితే సోమిరెడ్డివని చెబుతూ చాలా లా­రీ­లు ఆగకుండానే వెళ్లిపోయాయి. వారు అ­డ్డుకునే ప్రయత్నం చేసినా, వారిని బెదిరించి బలవంతంగా ఆ వాహనాలను తరలించు­కుపో­యారు. ఈ లారీలు విరువూరు, సూరా­య­పా­ళెం రీచుల నుంచి వస్తున్నాయని తెలుసుకుని అధికా­రులు అక్కడికి బయలుదేరారు. అక్రమా­ర్కు­లు ఈ విషయం తెలుసుకుని లోడైన వందలాది లారీ­లను ఇతర మార్గాల్లో మళ్లించారు.

పై నుంచి ఒత్తిడి.. చేతులెత్తేసిన అధికారులు
తనిఖీలు చేస్తున్న అధికారులకు ఫోన్లలో పైనుంచి ఒత్తిడి పెరగడంతో మిగిలిన అక్రమ ఇసుక లారీ­లను పట్టుకోకుండా వదిలేసినట్లు తెలిసింది. తాను చెప్పినట్లు వినకపోతే బదిలీ చేయిస్తానని సోమిరెడ్డి హెచ్చరించడంతోనే అధికారులు మిన్నకుండిపో­యినట్లు సమాచారం. ఇంత భారీ అక్రమ రవా­ణాను అడ్డుకుని ఏమీ పట్టుకోకపోతే తమకు ఇబ్బంది వస్తుందని బతిమిలాడడంతో కేవలం రెండు లారీ­లు, ఒక టిప్పర్, రెండు హిటాచి ఎక్సవేటర్లను వారికి అప్పగించారు. 

నిజానికి రెండు లారీలు, ఒక టిప్పర్‌ కోసం రెండు భారీ హిటాచి ఎస్కవేటర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ వంద­లాది లారీల్లో ఇసుక తరలి పోతున్నట్లు తేలింది. నిజానికి పక్కన పొదల్లోనే మరో 4 హిటాచీ ఎస్క­వేటర్లను దాచినట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం ఆరు ఎస్కవేటర్లతో పెన్నా నదిలో ఇసుకను అక్ర­మంగా తవ్వి నిత్యం వందల లారీలు, టిప్ప­ర్లలో తరలించి అమ్ముకుంటున్నారు. 

ఈ విషయం తెలిసినా ఎమ్మెల్యే సోమిరెడ్డి బెదిరింపులతో అధికా­రులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దొరికిన యంత్రాలు, టిప్పర్లలోనూ కొన్నింటిని వదిలేసి వెళ్లిపోవడంతో అధికారుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎమ్మెల్యే ఫోన్‌.. మాట్లాడండి..
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్‌ అధికారి జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌కు వివరిస్తున్న సమయంలో స్థానిక టీడీపీ నేత ఒకరు.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫోన్‌ చేస్తున్నాడని అధికారికి ఇవ్వబోగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘నేను జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతుంటే ఎమ్మెల్యే ఫోన్‌ చేస్తున్నారంటూ ఎలా ఇస్తావ్‌.. ఇకపై ఇల్లీగల్‌ బిజినెస్‌ చేస్తే ఒప్పుకోం’ అంటూ టీడీపీ నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. 

విరువూరు రీచ్‌ వద్ద భారీగా ఆగి ఉన్న లారీలను ఆపేందుకు పోలీసుల సహాయం కోరినా వారి నుంచి కనీస స్పందన కూడా లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా విరువూరు, సూరాయపాళెంలో రీచ్‌ల్లో 16 టైర్ల లారీ లోడింగ్‌కు టీడీపీ నేతలు రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా వందలాది వాహనాల నుంచి దండుకుంటున్నారు. పెన్నా బ్యారేజ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రైతులు లబోదిబోమంటున్నా పట్టించుకోవడం లేదు.  

అనుమతి లేని రీచ్‌ల్లో తవ్వకాలు 
ఆకస్మికంగా ఇసుక రీచ్‌లను తనిఖీ చేయడం కోసం పోతిరెడ్డిపాడు, సంగం, సూరాయపాలెంలో ఉన్న ఇసుక రీచ్‌లు, డంప్‌ యార్డులను చూసి తిరిగి నెల్లూరు వెళుతుండగా కొన్ని లారీలు. విరువూరు రీచ్‌ నుంచి వస్తున్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లాం. అక్కడ రీచ్‌పై కోర్టు స్టే ఉంది. 

అయినా ఇక్కడి నుంచి ఇసుక అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని గమనించాం. రెండు టాటా హిటాచీలు, రెండు లారీలు, ఒక టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చాం. – బాలాజీ నాయక్, ఇన్‌ఛార్జి డిప్యూటీ డైరెక్టర్, గనుల శాఖ, నెల్లూరు 

సోమిరెడ్డి టార్గెట్‌ రూ.100 కోట్లు  
ఇసుక రీచ్‌ల ద్వారా ఎమ్మెల్యే సోమిరెడ్డి టార్కెట్‌ రూ.100 కోట్లు పైనే అని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. అధికారుల కళ్ల ముందే ఇసుక లారీలు వెళుతున్నా పట్టించుకోవడం లేదు. సోమిరెడ్డి కనుసన్నల్లో దందా జరుగుతుండటం వల్లే ఇలా బరితెగించారు. 

గనుల అధికారి సూరాయపాళెం, విరువూరు రీచ్‌ల వద్దకు వెళుతున్నారని వందలాది లారీలను అక్కడి నుంచి పంపించేశారు. ఇదీ సోమిరెడ్డి నీతి, నిజాయితీ. ఇసుకను అక్రమంగా తప్వుకోమని సీఎం చంద్రబాబు సోమిరెడ్డికి అనుమతి ఇచ్చినట్టుంది.– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్