‘ఉచిత’ నాటకం! ఇసుక పేరుకే ఫ్రీ.. డబ్బులు సమర్పించుకోవాల్సిందే | Chandrababu TDP Govt Free Sand Is Fake Its a illusion | Sakshi
Sakshi News home page

‘ఉచిత’ నాటకం! ఇసుక పేరుకే ఫ్రీ.. డబ్బులు సమర్పించుకోవాల్సిందే

Published Tue, Jul 9 2024 4:25 AM | Last Updated on Tue, Jul 9 2024 5:01 AM

విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఇసుక ఉచితం.. కానీ టన్ను ధర రూ.1,394 అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఇసుక ఉచితం.. కానీ టన్ను ధర రూ.1,394 అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

కూటమి సర్కారు తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇదీ

పన్నుల మోత, రవాణా చార్జీలు, నిర్వహణ ఫీజులు తడిసిమోపెడు

ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చ నేతలదే.. రవాణా ముసుగులో బయటకు తరలించి సొమ్ము చేసుకునే యత్నాలు

దాదాపు 40 లక్షల టన్నులు గత 40 రోజుల్లో మాయం

స్టాక్‌ పాయింట్ల వద్ద సగం నిల్వలను కొల్లగొట్టిన టీడీపీ నేతలు 

వర్షాకాలం అవసరాలకు ముందుగా నిల్వ చేసిన గత ప్రభుత్వం 

జగన్‌ హయాంలో ఏటా ఖజానాకు రూ.780 కోట్ల ఆదాయం

ఇప్పుడు ఉచితమంటూ జనం నుంచే ముక్కుపిండి వసూలు

ఉసూరుమంటూ ఖాళీగా తిరిగి వెళ్తున్న వినియోగదారులు

వర్షాకాలం ముగిసిన తరువాతే తాపీగా కొత్త విధానం

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపో­యింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్‌ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్‌ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు. వర్షాకాలంలో కొరత లేకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటికే స్టాక్‌ పాయింట్లలో పెద్దఎత్తున ఇసుక నిల్వలు ఉంచింది. 

తాజాగా టీడీపీ సర్కారు దీన్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పినా అన్నిచోట్లా టన్నుకి నిర్దేశిత ధర చెల్లించాలని తేల్చి చెప్పడంతో ఇసుక కోసం వచ్చిన వారు కంగు తిన్నారు. చీరాల సమీపంలోని వేటపాలెం స్టాక్‌యార్డులో టన్ను ఇసుక రూ.675గా బోర్డు పెట్టారు. దీంతో ఉచితంగా ఇసుక తీసుకెళదామని ట్రాక్టర్లతో వచ్చిన పలువురు మోసపోయామని గ్రహించి వెనుతిరిగారు. అన్ని స్టాక్‌ యార్డుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలకు ఎలాంటి మేలు చేయని.. ఖజానాకు ఆదాయం సమకూరని తాత్కాలిక కొత్త విధానాన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది. 

దీనిల్ల అటు ప్రజలు, ఇటు ఖజానాకు నష్టం వాటిల్లుతుండగా టీడీపీ నేతలు మాత్రం జేబులు నింపుకునేందుకు మార్గం సుగమం అయింది. పేరుకు ఉచిత ఇసుక అని ప్రకటించినా ప్రజలు మాత్రం డబ్బులు కట్టాల్సిందే. ఇదే ఉచిత ఇసుక విధానంలోని ప్రత్యేకత. ఉచిత ఇసుక విధానం పేరుతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్‌ సోమవారం జీవో ఎంఎస్‌ నెంబర్‌ 43 జారీ చేశారు. గత సర్కారు హయాంలో అమలైన విధానం స్థానంలో తాత్కాలికంగా ఉచిత విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 

వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా ఇసుక విక్రయాల ద్వారా ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.780 కోట్ల ఆదాయం సమకూరగా ప్రజలకు సులభంగా, అందుబాటు ధరలో లభ్యమయ్యేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఖజానాకు ఒక్క రూపాయి ఆదాయం రాదు. మరోవైపు ప్రజలు డబ్బులిచ్చి మరీ ఉచిత ఇసుకను కొనుగోలు చేయాల్సిన ఆగత్యం దాపురించింది!

ఇదీ కొత్త విధానం..
జిల్లా స్థాయిలో కమిటీలు ఆయా రీచ్‌ల్లో ఇసుక ధరలను నిర్ణయిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఎస్పీ, జేసీ, ఆర్డీఓ తదితర అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఏర్పాటైన ఇసుక కమిటీలు తమ పరిధిలోని ఇసుక స్టాక్‌ యార్డులను స్వాధీనంలోకి తీసుకుని ధరలు నిర్ణయించాయి. సీనరేజి ఫీజు, ఇతర పన్నులు, తవ్వకం, లోడింగ్, రవాణా, ర్యాంపు నిర్వహణ, పరిపాలనాపరమైన ఖర్చులన్నీ లెక్కించి టన్ను ఇసుక ధరను నిర్ణయించారు. యార్డులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లేదా వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇన్‌ఛార్జీలుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వినియోగదారులు స్టాక్‌ పాయింట్ల వద్ద నేరుగా ఇసుక కొనుగోలు చేయవచ్చని, తరలించేందుకు వారే లారీలు తెచ్చుకోవాలని సూచించారు. స్టాక్‌ పాయింట్లలో నగదు లావాదేవీలు కాకుండా డిజిటల్‌గా మాత్రమే డబ్బులు స్వీకరించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. త్వరలో ఇసుక కొనుగోలుకు సంబంధించి ఆన్‌లైన్‌లో పర్మిట్లు జారీ చేసే విధానం రూపొందిస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో ఇసుక ఆపరేషన్స్‌ పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్, రాష్ట్ర స్థాయిలో మైనింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఒక వ్యక్తి ఒక రోజుకు 20 టన్నుల ఇసుక మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశం ఇస్తామన్నారు.

సగం ‘స్టాక్‌’ స్వాహా
అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఇసుక స్టాక్‌ పాయింట్లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న టీడీపీ నేతలు ఇష్టానుసారం విక్రయించేశారు. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నుల వరకూ ఇసుకను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచింది. గత నెల 4వ తేదీ నుంచి అధికారం అండతో టీడీపీ నేతలు ఇసుక యార్డులను దౌర్జన్యంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా ప్రతినిధులను బెదిరించి తరిమేశారు. 

ఇప్పటికే చాలా వరకూ ఇసుకను అమ్మేశారు. సుమారు 40 లక్షల టన్నుల ఇసుకను విక్రయించేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 40 లక్షల టన్నుల ఇసుక మాత్రమే స్టాక్‌ యార్డుల్లో ఉందని గనుల శాఖ చెబుతోంది. అంటే మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు నెలరోజుల్లోనే మింగేసినట్లు స్పష్టమవుతోంది.

ఉసూరుమంటూ..
ఉచితంగా ఇసుక దొరుకుతుందని భావించిన నిర్మాణదారులు ఉదయాన్నే ట్రాక్టర్లలో స్టాక్‌ పాయింట్ల వద్దకు వచ్చి బారులు తీరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల బోర్డులు చూసి విస్తుపోయారు. ఉచితంగా ఇసుక అందిస్తామని ఊరించి టన్నుల లెక్కన డబ్బులు కట్టాలని బోర్డులు ఏర్పాటు చేయటాన్ని చూసి ఉసూరుమంటూ వెళ్లిపోయారు. 

కొత్త ఇసుక విధానంలో బాపట్ల జిల్లా చీరాలలో ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుక కొనుగోలు చేయాలంటే రూ.3,034 అవుతుంది. ఒక్కో ట్రాక్టర్‌లో 4.50 టన్నులు లోడింగ్‌ చేయవచ్చు. దీనికి రవాణా ఛార్జీలు మరో రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా ట్రక్కు ఇసుక రూ.4 వేలు సమర్పించుకుని కొనుగోలు చేయాల్సిన పరిíస్థితి నెలకొంది.

తిరిగి వెళ్లిపోతున్న వినియోగదారులు..
స్టాక్‌ పాయింట్ల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీతో రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా ఇసుక అని పేర్కొంటూ షరతులు వర్తిస్తాయి అనే మాదిరిగా టన్ను ఇసుక రూ.675 అని బోర్డులు పెట్టారు. అక్కడకు వచ్చిన వారంతా బోర్డులు చూసి ఈ ధరలకు కొనలేమని తిరిగి వెళ్లిపోతున్నారు. వేటపాలెం స్టాక్‌ పాయింట్‌కి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 20 ట్రాక్టర్లు రాగా అన్నీ ఖాళీగా తిరిగి వెళ్లిపోయాయి. ఒక్కరూ కూడా ఇసుక కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. 

మోసపోయాం..
టీవీలు, పేపర్లలో ఇసుక ఉచితంగా అందిస్తామని, కేవలం రూ.88కే అని ప్రకటించారు. ఇసుక అమ్మకాలు ప్రారంభించారని స్టాక్‌ పాయింట్‌కి వచ్చాం. ఇక్కడ బోర్డు పెట్టి టన్ను రూ.575, ట్రాక్టర్‌ ఇసుక రూ. 3,038 అని చెప్పారు. మోసపోయామని గ్రహించి కొనుగోలు చేయకుండా తిరిగి వెళ్లిపోయాం. 
– నాగార్జున, వేటపాలెం

30 కి.మీ. నుంచి వచ్చా..
ఇసుక ఉచితంగా ఇస్తున్నారని టీవీలు, పేపర్లలో చూసి పూనూరు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి వేటపాలెం స్టాక్‌ పాయింట్‌ వద్దకు ట్రాక్టర్‌తో వచ్చా. ఇక్కడ సచివాలయ సిబ్బంది ఇసుక ట్రాక్టర్‌ రూ.3,038 అని చెబుతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వం అదే ధరకు విక్రయించాలని చెప్పిందంటున్నారు. చేసేది లేక ఖాళీ ట్రాక్టర్‌తో తిరిగి వెళ్తున్నాం. 
– శ్రీనివాస్‌నాయక్, పూనూరు, యద్దనపూడి మండలం

రవాణా ముసుగులో దోపిడీకి స్కెచ్‌!
ఇసుకపై కొత్త విధానంలో ఉచితం అనేది ఒక మాయ కాగా రవాణా అనేది మరో సరికొత్త దోపిడీకి స్కెచ్‌గా కనిపిస్తోంది. రవాణా ముసుగులో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇసుకను తామే రవాణా చేస్తామనడం వెనుక ఉద్దేశం అదేనని భావిస్తున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరతను అధిగమించేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా స్టాక్‌ పాయింట్లలో నిల్వ చేసిన ఇసుకను అధికారం మారగానే కూటమి సర్కారు మాయం చేసింది. 

దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను గత 40 రోజుల్లో లెక్కాపత్రం లేకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అమ్మేసుకున్నారు. అదే తరహాలో రవాణా పేరుతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొత్త విధానానికి రూపకల్పన చేశారు. పేరుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ఇసుక కమిటీలు  అమ్మకాలను పర్యవేక్షిస్తాయని చెబుతున్నా స్థానిక టీడీపీ నేతలే ఇసుక వ్యవహారాలను నియంత్రించే పరిస్థితి నెలకొంది. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు హల్‌చల్‌ చేయడమే ఇందుకు ఉదాహరణ. 

ఉచితంగా ఇసుకను అందిస్తున్నామంటూ బ్యానర్లతో స్టాక్‌ పాయింట్లు వద్ద ర్యాలీలు నిర్వహిస్తూ హడావుడి చేశారు. దీన్నిబట్టి స్టాక్‌ యార్డులు ఎవరి చేతుల్లో ఉన్నాయో అర్థమవుతోంది. ఇప్పటివరకు జిల్లా ఇసుక కమిటీలు స్టాక్‌ పాయింట్ల వద్ద పూర్తిస్థాయిలో ఇన్‌చార్జీలను కూడా నియమించలేదు. యార్డుల్లో ఎంత ఇసుక ఉందో కచ్చితమైన సమాచారం అధికారుల వద్ద లేదు. వర్షాకాలం సీజన్‌ వరకు ఉచిత ఇసుక పేరుతో దోపిడీని కొనసాగించి ఆ తర్వాత పూర్తిస్థాయి విధానాన్ని తెచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

30 కి.మీ. నుంచి వచ్చా..
ఇసుక ఉచితంగా ఇస్తున్నా­రని టీవీలు, పేపర్లలో చూసి పూనూరు నుంచి 30 కిలో­మీటర్లు ప్రయా­ణించి వేట­పాలెం స్టాక్‌ పాయింట్‌ వద్ద­కు ట్రాక్టర్‌తో వచ్చా. ఇక్కడ సచి­వాలయ సిబ్బంది ఇసుక ట్రాక్టర్‌ రూ.3,038 అని చెబుతు­న్నారు. అదేమని అడిగితే ప్రభు­త్వం అదే ధరకు విక్రయించాలని చెప్పిందంటున్నారు. చేసేది లేక ఖాళీ ట్రాక్టర్‌తో తిరిగి వెళ్తున్నాం. 
– శ్రీనివాస్‌నాయక్, పూనూరు, బాపట్ల జిల్లా 

యథేచ్ఛగా తరలింపు
కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే టీడీపీ నేతలు ఇసుక స్టాక్‌ యార్డుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యార్డులో ఇసుక నిల్వల లెక్కలకు, గతంలో కాంట్రాక్టర్‌ నిల్వ చేసిన ఇసుకకు పొంతనలేకపోవడం దీనికి బలం చేకూర్చుతోంది. విజయనగరం జిల్లాలో ఇసుక రీచ్‌లు లేకపోవడంతో డెంకాడ మండలం పెదతాడివాడ, బొబ్బిలి గ్రోత్‌ సెంటర్, కొత్తవలస వద్ద ఇసుక స్టాక్‌ యార్డులను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని స్టాక్‌యార్డ్‌ నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుక 

ఇక్కడ నుంచి ప్రభుత్వ ధరలకు ఇసుకను సరఫరా చేసేది. బొబ్బిలిలో లక్షా14వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వలు ఉండగా, ఇప్పుడు అధికారుల లెక్కల ప్రకారం 72,466 మెట్రిక్‌ టన్నులు ఉన్నట్టు తేలింది. కొత్తవలసలో 11,805 మెట్రిక్‌ టన్నులు, డెంకాడలో 9,756 మెట్రిక్‌ టన్నులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నా... ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుకను టీడీపీ నాయకులు అక్రమంగా తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి.

వందలాది వాహనాలతో..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సార్వ­త్రిక ఎన్నికల ముందు నాటికి ఎనిమిది చోట్ల ఇసుక డంపింగ్‌ యార్డులు ఉన్నాయి. ఒక్కొక్క డంపింగ్‌ యార్డులో 5 లక్షల నుంచి 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు అప్పటి యార్డుల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రధానంగా మర్రిపాడు యార్డులో 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలు ఉండగా ఎన్నికల కౌంటింగ్‌ అయిన రాత్రి నుంచి టీడీపీ నేతలు వందలాది వాహనాలతో ఇసుకను ఖాళీ చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కాగులపాడుకు చెందిన ఓ వ్యక్తి (ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనాయణరెడ్డి అనుచరుడు) ఇసుక డంప్‌ను రూ.2 కోట్లకు కొనేసి.. చెన్నై, బెంగళూరు తదితర మహా నగరాలకు తరలించడం బహిరంగ విషయమే. 

నెల్లూరు జిల్లాలోని పొట్టేపాళెంలో డంపింగ్‌ యార్డులో 8 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలు పూర్తిగా ఖాళీ చేశారు. అయితే తాజాగా జిల్లా అధికారులు ప్రకటించిన విధంగా జిల్లాలోని మూడు స్టాక్‌ యార్డుల్లో ప్రస్తుతం 1,75,301 మెట్రిక్‌ టన్నుల ఇసుక మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. మర్రిపాడు యార్డులో 1,25,211 మెట్రిక్‌ టన్నులు, మినగల్లులో 41,885 మెట్రిక్‌ టన్నులు, పల్లిపాడులో 8,205 మెట్రిక్‌ టన్నులు ఉందన్నారు. కావలి, కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాలకు సంబంధించిన యార్డుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే నాటికి తవ్వి నిల్వ చేసిన ఇసుకను అధికారులు ప్రకటించకపోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement