‘సాక్షి’ కథనాలతో ఉలిక్కిపడ్డ సర్కార్
భీమిలి బిల్డింగ్ హౌస్ సొసైటీ అక్రమ తవ్వకాలపై షోకాజ్ నోటీసులు జారీ
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తున్న వైనంపై గనుల శాఖలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఎర్రమట్టి దిబ్బల్లో ఈనెల రెండో వారంలో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలను వెలుగులోకి తెస్తూ ‘సాక్షి’లో జూలై 17న ‘మట్టి దిబ్బలు మటాష్.!’ శీర్షికతో ప్రచురితమైన కథనంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. హుటాహుటిన జిల్లా యంత్రాంగాన్ని పంపి, మట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేసింది. తెరవెనుక సూత్రధారులను వదిలేసి, నిడిగట్టు సచివాలయం ఇన్‌చార్జ్ ప్లానింగ్ సెక్రటరీని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకోవాలని చూసింది. దీనిపై మరోసారి జూలై 18న ‘చిరుద్యోగిని సస్పెండ్ చేసి.. అక్రమాలపై ‘మట్టి’ కప్పి..’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ఇక గనుల శాఖ ఊపిరి పీల్చుకోలేకపోయింది.
ఎట్టకేలకు రంగంలోకి దిగింది. ఎర్రమట్టి దిబ్బలను తవ్విన ప్రదేశం తీరప్రాంత క్రమబదీ్ధకరణ మండలి సీఆర్‌జెడ్ జోన్–1 సునిశితమైన పరిధిలోకి వస్తుందని గనుల శాఖ ప్రాథమికంగా అంచనావేస్తూ.. దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నేరళ్ల వలస గ్రామం సర్వే నం.:118/5ఏ (పాత సర్వే నెం :49/1)లో ది భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ బిల్డింగు సొసైటీ (బిల్డింగ్ హౌస్ సొసైటీ)లోని 278.95 ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు నిర్వహించినట్లు గనుల శాఖ అధికారులు నిర్థారించారు.
అక్రమ లేఔట్ పనుల్లో భాగంగా రోడ్ల నిర్మాణం కోసం ఎర్రమట్టి దిబ్బల్లో 39,454 క్యూబిక్ మీటర్ల కంకరతో కూడిన ఎర్రమట్టి ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్–1966ను ఉల్లంఘించారని నిర్థారించిన అధికారులు సొసైటీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 148 అడుగుల బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష నేతలు హడావుడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment