పోస్టింగ్‌లు ఇచ్చి సెలవుపై వెళ్లాలని పలువురు ఉన్నతాధికారులకు ఆదేశాలు
వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేశారన్న సాకు.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడానికేనని ప్రచారం
ఏపీఎండీసీలోనూ మొదట్లో పలువురు అధికారులను సెలవుపై పంపిన వైనం
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గనుల శాఖలో రకరకాల వింతలు చోటు చేసుకుంటున్నాయి. జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీఎండీసీలో ఇద్దరు దళిత ఉన్నతాధికారులను సెలవుపై పంపారు. గనుల శాఖ డైరెక్టర్, ఏపీఎండీసీ కార్యాలయాలను 45 రోజులపాటు అనధికారికంగా మూసివేశారు. రాష్ట్రంలో లీజు పొందిన గనులన్నింటినీ అనధికారికంగా నిలిపివేశారు. పరిశ్రమను పూర్తిగా స్తంభింపజేశారు. గనుల యజమానులతో మామూళ్లకు ఒప్పందం కుదిరాకే కొన్నింటిని తెరవడానికి అంగీకరించారు. కొన్ని గనులు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. కొందరు అధికారులను కూడా గాల్లో పెట్టారు.
ఆ తర్వాత బదిలీల్లో డబ్బులు గుంజి చాలామందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇప్పుడు బదిలీల్లో పోస్టింగులు ఇచ్చిన 12 మంది అధికారులను సెలవుపై వెళ్లాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలివ్వడం గనుల శాఖలో కలకలం రేపింది. కొత్త పోస్టింగుల్లో చేరి నెల తిరక్కుండానే వారిని సెలవుపై వెళ్లిపోవాలని చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెప్పినట్టల్లా చేశారనే ఆరోపణలు సృష్టించి మరీ వీరిని సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఇలా బలవంతంగా సెలవుపై పంపుతున్న వారిలో ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లు, ఐదుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు, నలుగురు ఇతర స్థాయి ఉద్యోగులున్నారు.
సెలవుపై పంపే ఉద్దేశం ఉన్నప్పుడు బదిలీల్లో ఎందుకు పోస్టింగ్ ఇచ్చారో అర్థం కావడంలేదని ఉద్యోగులు అంటున్నారు. గనుల శాఖలో బదిలీలే అత్యంత రహస్యంగా చేపట్టారు. ముఖ్య నేత కుమారుడికి ప్రధాన అనుచరుడు, గనుల శాఖ మంత్రి ద్వారా ఈ బదిలీల్లో పెద్ద తంతే జరిగింది. కీలకమైన డీడీ, ఏడీ పోస్టులను వేలం వేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. భారీగా డబ్బులిచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీల జీవోలను అన్ని శాఖలు ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టినా గనుల శాఖ మాత్రం పెట్టకపోవడమే ఇందులో మతలబులకు అద్దం పడుతోంది.
ఆ తర్వాత కూడా బదిలీల జీవోను వెంటనే బయటపెట్టలేదు. ఇంత చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన వారిలో కొందరిపై ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి సెలవుపై వెళ్లిపోవాలని ఆదేశించడం గమనార్హం. బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి మరింతగా డబ్బులు దండుకోవడానికే ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment