సాక్షి, అమరావతి: ఇసుక తవ్వకాలపై యథావిధిగా ‘ఈనాడు’ కట్టుకథలతో స్క్రీన్ ప్లేను రక్తి కట్టించింది. నిబంధనల ప్రకారం స్టాక్ యార్డు నుంచి రవాణా జరుగుతుంటే రీచ్‌ల నుంచి తరలిస్తున్నట్లు అందంగా అబద్ధాలను అల్లేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పేరిట ప్రభుత్వానికి రావాల్సిన రూ.4 వేల కోట్లకు గండికొట్టేసినా చిద్విలాసంగా గడిపేశారు రామోజీరావు. ఈ ప్రభుత్వ హయాంలో అదే ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం వస్తోంది.
జనానికి మునుపటికన్నా ఎక్కువ అందుబాటులో ఉండి... అప్పటికన్నా తక్కువ ధరకే దొరుకుతోంది. అయినా సరే... తాము గతంలో ‘డీపీటీ’ పేరిట దోచుకో – పంచుకో– తినుకో అనే తరహాలో లాగించేసిన సొమ్ముకు గండిపడిందనే ఆక్రోశంతో నిత్యం కథనాలు రాస్తూనే ఉన్నారు. అన్నీ సక్రమంగానే సాగుతున్నా... తన రాజకోట నుంచి రోజుకో రాయి విసురుతూనే ఉన్నారు. ‘కోర్టుల్ని ధిక్కరించి మరీ తవ్వకాలు’ అంటూ బుధవారం అచ్చేసిన కథనం కూడా అలాంటిదే.
ఖాళీ రీచ్‌లలో తవ్వకాలా?
చిత్తూరు జిల్లా అరణియార్, స్వర్ణముఖి, నినా నదుల్లో 18 ఇసుక రీచ్‌లలో తవ్వకాలు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. దీనిపై జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఎన్జీటీ ఆదేశాలనే సమర్ధించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తూ గనుల శాఖ ఆ 18 రీచ్‌లలో ఇసుక తవ్వకాలను నిలిపివేయడంతోపాటు అనుమతులను రద్దు చేసింది. పర్యావరణ శాఖ ద్వారా తాజాగా పూర్తిస్థాయి అనుమతులు పొందాలని, ఆ తరవాతే తవ్వకాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే 15 రీచ్‌లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ‘ఈనాడు’ ఓ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది.
తవ్వకాలే లేని చోట యంత్రాలా?
వర్షాకాలంలో భవన నిర్మాణ రంగం అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఓపెన్ రీచ్‌లకు సమీపంలో ప్రభుత్వం స్టాక్ యార్డ్‌లను నిర్వహిస్తోంది. స్టాక్ యార్డులలో ఇసుక నిల్వ చేస్తారు తప్ప... అదేమీ రీచ్ కాదు కనక అక్కడ తవ్వకాలు జరపరు. అలాంటి నిల్వ చేసిన ఇసుక కూడా అక్రమంగా తవ్వేపోసిందేనంటూ ‘ఈనాడు’ నిస్సిగ్గుగా అబద్ధాలాడుతోంది. రీచ్‌లలో తవ్వకాలే జరగని చోట భారీ యంత్రాలు ఎలా వస్తాయి? వాటి ద్వారా టిప్పర్లు, ట్రాక్టర్లలో ఎలా లోడ్ చేస్తారు? అసలు జరగని ఇసుక రవాణాకు స్లిప్‌లు ఎలా ఇస్తారు?
ప్రతి రూపాయి ప్రజల కోసమే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీకి ఆలవాలంగా మారిన చంద్రబాబు హయాం నాటి ఇసుక విధానాన్ని రద్దు చేశారు. జాతీయ సంస్థల ద్వారా టెండర్లు పిలిచి ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పారదర్శకంగా విక్రయాలు చేపట్టారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిని తిరిగి ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నారు.
వాస్తవానికి ఇసుక విషయంలో చూడాల్సిన ప్రధాన అంశాలు రెండే. ఒకటి ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయా? లేదా? కాంట్రాక్టరు ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తున్నారా? లేదా? అనేది. రెండోది ప్రజలకు అందుబాటులో ఉందా.. లేదా అనేది. అది కూడా నిర్దేశించిన ధరకు విక్రయించాలి. దీనికోసమే ప్రతి ఆదివారం ‘ఈనాడు’తో సహా ప్రధాన పత్రికల జిల్లా ఎడిషన్లలో ప్రభుత్వం ప్రకటనలిస్తోంది.
అందులో ధరను నిర్దేశించటంతో పాటు... ఎవరికైనా ఆ ధరకు అందుబాటులోకి రాకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా నెంబరుతో సహా పేర్కొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) నెంబర్లు కూడా అందులో పొందు పరుస్తున్నారు. వాస్తవానికి ఇంతటి పారదర్శకమైన వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఎన్నడూ లేదు.
కానీ ‘ఈనాడు’ ఒక్క అక్షరం కూడా రాసింది లేదు. తెలుగుదేశం నేతలు బరితెగించి మరీ.. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాకుండా దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) పద్ధతిలో చెలరేగిపోయినా... అడ్డువచ్చిన ఎమ్మార్వో వనజాక్షిని నాటి టీడీపీ ఎమ్మెల్యే అత్యంత పాశవికంగా ఈడ్చుకుంటూ మరీ కొట్టినా... చంద్రబాబు ఇంటి వెనకాల రాత్రీపగలూ తేడాలేకుండా లారీలకు లారీలు తరలించేసినా... రామోజీరావుది చిద్విలాసంతో కూడిన మౌనవ్రతమే తప్ప అక్షర యజ్ఞం ఊసే లేదు అప్పట్లో!!.
చట్టపరమైన చర్యలు తప్పవు..
స్టాక్ పాయింట్లలో నిబంధనల ప్రకారం విక్రయాలు చేపడితే అక్రమ ఇసుక రవాణాగా చిత్రీకరించడం దారుణం. తవ్వకాలు రద్దు చేసిన రీచ్‌లలో అక్రమ ఇసుక దందా ఎలా సాధ్యపడుతుంది? గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సహజ వనరుల దోపిడీ జరిగింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇసుక మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏ పేదవాడికి ఉచితంగా ఇసుక దక్కలేదు.
ఇప్పుడు నిబంధనల ప్రకారం ప్రభుత్వమే ఏజెన్సీ ద్వారా విక్రయిస్తోంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేస్తోంది. ‘ఈనాడు’ పదేపదే అబద్ధాలను ప్రచురించడం ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. ఇకపై ఇలాంటి అసత్య కథనాలు ప్రచురిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– వీజీ వెంకటరెడ్డి, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్
అదే నిజమైతే ఫిర్యాదు ఏది?
ఈనాడు బృందాలు చిత్తూరు జిల్లాలోని ఇసుక రీచ్‌లను పరిశీలించి ఫొటోలు తీసినట్లు కథనంలో రాసుకొచ్చారు. అక్రమాలు జరగడం నిజమే అయితే ప్రత్యక్ష సాక్షిగా ‘ఈనాడు’ బృందం కనీసం టోల్ ఫ్రీ నంబరుకు ఎందుకు కాల్ చెయ్యలేదు. పోనీ స్థానిక పోలీసులు, రెవెన్యూ, గనులశాఖ అధికారుల్లో ఏ ఒక్కరికైనా ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఆ రీచ్‌లలో ఎక్కడా తవ్వకాలు జరగడం లేదు. అదీ ‘ఈనాడు’ చెప్పని అసలు నిజం!!
Comments
Please login to add a commentAdd a comment