సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై రామోజీరావు వక్రరాతలు మానడంలేదు. నిత్యం తన ఈనాడు పత్రికలో ఇసుకపై బురద వార్తలు రాస్తూనే ఉన్నారు. తన గలీజుతనాన్ని బయటపెట్టుకుంటూనే ఉన్నారు. ఇసుక తవ్వకాల్లో లేని అక్రమాలను ఉన్నట్లు చూపించేందుకు రామోజీరావు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) తనకు చెప్పినట్లే కథనాలు అల్లేస్తున్నారు. వాటిని చూసి ప్రజలు నమ్మేస్తారని అపోహ పడుతున్నారు.
చంద్రబాబు హయాంలో గతంలో ఎప్పుడూ లేనంత పెద్దఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజలకు సులభంగా ఇసుక అందుతున్నా కూడా ప్రభుత్వంపై దు్రష్పచారానికి ఒడిగడుతున్నారు. నిజానికి ఇసుక తవ్వకాల్లో ఎన్జీటీ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 110 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు ఉన్నా.. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలతో వాటిల్లో తవ్వకాలను నిలిపివేసింది.
తర్వాత ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా తిరిగి అన్ని అనుమతుల కోసం గనుల శాఖ దరఖాస్తు చేసింది. అందులో భాగంగా ఇప్పటివరకు 61 ఓపెన్ రీచ్‌లకు అనుమతులు లభించాయి. మిగిలిన వాటికి మరో వారం రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్న డీసిల్టింగ్ పాయింట్లలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయినా ‘ఉల్లంఘనలు నిజం’ అంటూ పతాక శీర్షికతో పచ్చి అబద్ధాలను ఈనాడు అచ్చేసింది.
ఎన్జీటీకి 3 నెలలకోసారి నివేదిక ఇచ్చేలా చర్యలు
ఇసుక విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. ఎన్జీటీ నుంచి వచ్చిన సూచనలు, మార్గదర్శకాలతో దీన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు గనుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇసుక తవ్వకాలపై సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ఇంత బాధ్యతతో వ్యవహరిస్తోంది.
న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం తనిఖీలు
న్యాయస్థానాల ఆదేశాలతో జిల్లాల కలెక్టర్లతో కూడిన బృందాలు రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఇటీవల పరిశీలించాయి. ఆయా రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా అనే అంశాలను రికార్డు చేశాయి. ఈ నివేదికలను న్యాయస్థానాలకు సమర్పించారు. ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ తీసుకున్న చర్యల కారణంగా అనుమతి లేని రీచ్‌ల్లో తవ్వకాలు నిలిచిపోయాయి.
ఇదే అంశాన్ని కలెక్టర్లు కూడా తమ నివేదికలో స్పష్టం చేశారు. ఈనాడు మాత్రం కలెక్టర్లు వచ్చి వెళ్లిన తరువాత ఇసుక తవ్వకాలు మళ్లీ జరుగుతున్నాయంటూ అడ్డగోలుగా అబద్ధాలు ప్రచురించింది. అదికూడా భారీ యంత్రాలను రీచ్‌లకు తరలించి వెంటనే తవ్వకాలు ప్రారంభించారంటూ నిస్సిగ్గుగా రాసింది.
ఒకవైపు ఇసుక రీచ్‌ల్లో అధికారిక తనిఖీలు జరుగుతూ ఉంటే, మరోవైపు ఎవరైనా భారీ యంత్రాలను రీచ్‌లకు తరలిస్తారా? అసలు తవ్వకాలే జరగడం లేదని అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేసి నివేదిక ఇస్తే, రోజుకు రెండు వేల టన్నుల ఇసుక తవ్వుతున్నారంటూ, కంప్యూటరైజ్డ్ వే బిల్లులు లేకుండానే ఆ ఇసుకను రవాణా చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసింది.
పాత ఫోటోలతో ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నం చేసింది. జరగని రవాణాకు జీపీఎస్ ట్రాకింగ్ లేదంటూ, రీచ్‌ల్లో సీసీ కెమేరాలు లేవని, అడుగడుగునా ఉల్లంఘనలే జరుగుతున్నాయని గగ్గోలు పెట్టడం రామోజీ వక్రబుద్ధికి నిదర్శనం.
ఆ పత్రికకు నిబద్ధత ఎక్కడిది?
గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వర్షాల వల్ల ఇసుక తవ్వకాలు రీచ్‌ల్లో జరగలేదు. వేసవికాలంలో ముందుజాగ్రత్తగా సిద్ధం చేసిన ఇసుక డిపోల నుంచే ప్రజలకు విక్రయాలు జరిగాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ ఈనాడు పత్రిక దానిని అక్రమ ఇసుక తవ్వకాలు కిందనే నిర్ధారించడం ఆ పత్రికకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. బాధ్యతారహితంగా ఈనాడు ప్రచురించే ఇటువంటి కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, మైనింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment