సాక్షి, అమరావతి: ఒక నిజాన్ని అబద్ధం చేసేందుకు పదేపదే దాన్ని అబద్ధమని ప్రచారం చేయాలన్న గోబెల్స్ సిద్ధాంతాన్నే రాజగురువు రామోజీరావు నమ్ముకున్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై పదేపదే ప్రయోగిస్తున్నారు. ఇసుక తవ్వకాల్లో లేని అక్రమాలను ఉన్నట్లు చూపించేందుకు నిత్యం దానిపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్రమ తవ్వకాలు జరిగిపోతున్నాయంటూ దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి లింకు పెట్టి, ప్రజలను నమ్మించేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ‘ఇసుకలో కొత్త తోడు దొంగలు’ పేరుతో కొత్త తప్పుడు ప్రచారాన్ని ఈనాడు అందుకుంది. బోడి గుండుకు మోకాలికి లింకు పెట్టినట్లు ఇసుక తవ్వకాలకు, సీఎం సోదరుడికి లింకు పెట్టి మరీ అబద్ధాలు అచ్చేసింది.
పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారంటూ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో అర్థం లేని రాతలు రాసింది. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న ఎంఎస్‌టీసీ ద్వారా గనుల శాఖ టెండర్లు నిర్వహించింది. అందులో ప్రతిమ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ప్యాకేజీ –1, ప్యాకేజీ–3 లోని 18 జిల్లాలకు, జీసీకేసీ ప్రాజెక్ట్స్–వర్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యాకేజీ–2 లోని 8 జిల్లాల్లో ఇసుక ఆపరేషన్స్‌కు విజయవంతమైన బిడ్డర్లుగా ఎంపికయ్యాయి. నిబంధనల ప్రకారం ఆ రెండు సంస్థలు పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్‌లలో ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించాయి.
సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్టింగ్ జరుగుతోంది. వాస్తవాలు ఇలా ఉంటే సీఎంవో పేరుని వాడుకుని తవ్వకాలు జరుపుతున్నారని, అంతా సీఎం సోదరుడి ఆధ్వర్యంలోనే జరుగుతోందని అభూత కల్పనల్ని ఈనాడు ప్రచారం చేస్తోంది. ఒకవైపు టెండర్ల ద్వారా ఎంపికైన సంస్థలు ఇసుక ఆపరేషన్లు చేపడితే బయట వ్యక్తులు ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలకు దిగింది. సీఎం సోదరుడికి, మరో వ్యక్తికి ఇసుక ఆపరేషన్లతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఉన్నట్లు చిత్రీకరించేందుకు శత విధాలుగా అబద్ధాలు వల్లెవేస్తోంది. కావాలని ఇసుక ఆపరేషన్లను రాజకీయం చేయాలని దురుద్దేశంతో ఈ కథనం రాసినట్లు స్పష్టమవుతోంది.
టీడీపీ హయాంలో చంద్రబాబు ఇంటి వెనకాలే అక్రమ తవ్వకాలు
చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా కరాళ నృత్యం చేసినా రామోజీ పట్టించుకోలేదు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. పెద్దఎత్తున ఇసుకను లారీల్లో తరలించారు. ఇక్కడే.. చంద్రబాబు ఇంటి పక్కనే జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఆనాడు ఇసుక అక్రమాలను అడ్డుకున్న అధికారులపైనా టీడీపీ నేతలు దాడులు చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన సంగతి రాష్ట్ర ప్రజలంతా చూశారు.
ఫోటోలు, వీడియోలతో సహా ఆధారాలు దొరికినా చంద్రబాబు దానికి కారకులైన వారిని శిక్షించలేదు. పంచాయతీ చేసి, ఒక మహిళా అధికారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఇసుక విధానం అంటూ లేకుండా చేశారు. మొదట డ్వాక్రా మహిళలకు అని చెప్పి వారి పేరుతో ఇసుకను దోచేశారు. తర్వాత ఉచితం అంటూ దోపిడీకి గేట్లు ఎత్తేశారు. ఒక్క ఇసుక విధానంపైనే 19 జీవోలు తీసుకువచ్చారు. ప్రజల్లో అయోమయం సృష్టించి, చక్కగా దోపిడీకి పాల్పడ్డాడు. ఆనాడు కళ్లుండీ కబోదిలా వ్యవహరించిన రామోజీరావు ఇప్పుడు లేని అక్రమాలను ఉన్నట్లు చూపించేందుకు తన పాత్రికేయాన్ని ఉపయోగిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో అక్రమాలు జరుగుతుంటే కళ్లు మూసుకున్నారు. ఉచిత ఇసుక ముసుగులో వేల కోట్లు కొల్లగొట్టినా సక్రమమే అయింది. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై దాడిని మరిచిపోయారు. బాబు ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలను ఎన్జీటీ నిర్థారించిన విషయాన్నీ మరచిపోయారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ అంతా పారదర్శకంగా, పకడ్బందీగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే, సహించలేక విషం చిమ్ముతున్నారు.
మాఫియాకు సీఎం జగన్ చెక్
వాస్తవానికి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఇసుక మాఫియాకు చెక్ పెట్టారు. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చారు. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.780 కోట్లు ఆదాయం వస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.4 వేల కోట్ల ఆదాయం. చంద్రబాబు పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? చంద్రబాబు హయాంలో ఏ నియోజకవర్గంలోనైనా ఇసుక ఉచితంగా ప్రజలకు అందిందా? ఉచిత ఇసుక పేరుతో ఎక్కువ రేటుకు వినియోగదారులు కొనుక్కోవాల్సిన పరిస్థితి కల్పించారు.
అవాస్తవాలు పదేపదే రాస్తే నిజాలైపోవు..
గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి
ఉచిత ఇసుక విధానం పేరుతో గతంలో జరిగిన దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సీఎం వైఎస్ జగన్ అత్యంత పారదర్శక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక ఆపరేషన్స్‌కు ఏజెన్సీలను ఖరారు చేశాం. ఆపరేషన్స్ కూడా ప్రారంభించాం. ఈనాడు పత్రిక ఓర్వలేనితనంతో అభూతకల్పనలను, అవాస్తవాలను పోగు చేసి పదేపదే ఇసుకపై అవాస్తవాలతో కూడిన కథనాలను ప్రచురిస్తోంది. ఇసుక అక్రమాలు జరగకుండా నిఘా కోసం ఎస్‌ఈబీని ఏర్పాటు చేశాం.
జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా గనుల శాఖలో పనిచేస్తోంది. రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్‌లు నిర్వహిస్తున్నాం. ఈ విభాగాల పనితీరును కూడా ఈనాడు ఆక్షేపించడం దారుణం. అక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని, దాడులకు సంబంధించిన సమాచారం ముందే లీక్ చేస్తున్నారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలు రాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment