‘ఉక్కు’పాతర.. విశాఖ స్టీల్‌ ఆస్తుల అమ్మకాలు షురూ | Sales Of Visakhapatnam Steel Plant Assets Started, More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఉక్కు’పాతర.. విశాఖ స్టీల్‌ ఆస్తుల అమ్మకాలు షురూ

Published Fri, Jun 21 2024 3:24 AM | Last Updated on Fri, Jun 21 2024 1:36 PM

Sales of Visakha Steel Plant assets started

విశాఖ స్టీల్‌ ఆస్తుల అమ్మకాలు షురూ

అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే బుద్ధిచూపించిన ఎన్‌డీఏ సర్కార్‌

ప్లాంట్‌ను దివాలా సంస్థగా ముద్రవేసే ప్రయత్నం

గత మార్చి 31కి రూ.4,979.15 కోట్ల ప్రతికూల నికర విలువ ఉన్నట్లు వెల్లడి

మూలధనం సంక్షోభాన్ని అధిగమించే పేరుతో ఆస్తుల వేలానికి ఏర్పాట్లు

ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలలో ఖరీదైన ఆఫీస్‌ భవనాలు, స్టాక్‌ యార్డులు

వాటి మార్కెట్‌ విలువ రూ.476.18 కోట్లు ఉంటుందని లెక్కలు

నిరర్థక ఆస్తుల నెపంతో ఆస్తుల మానిటైజేషన్‌కు ఆర్‌ఐఎన్‌ఎల్‌ బోర్డు ఆమోదం

తుది అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓ వైపు కేంద్ర గనుల శాఖ మంత్రి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని బాహాటంగా చెబుతుంటే.. మరోవైపు ప్లాంట్‌ని నిర్వీర్యంచేసే పనుల్ని చాపకింద నీరులా చేసుకుంటూపోతున్నారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆస్తులను అమ్మకానికి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే ఎన్‌డీఏ సర్కారు.. స్టీల్‌ప్లాంటుపై ‘ఉక్కు’పాదం మోపుతున్నట్టు తెలుస్తోంది. 

స్టీల్‌ప్లాంట్‌ ఆస్తులు విక్రయించి.. దివాలా సంస్థగా చూపించేందుకు కుయుక్తులు పన్నుతు­న్నట్లు  పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది. మూలధన సంక్షోభాన్ని అధిగమించే పేరుతో ఆస్తుల వేలానికి ఏర్పాట్లు చేయడాన్ని గమనిస్తే ఈ అభిప్రాయం బలపడుతోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉన్న ఖరీదైన భవనాలు, స్టాక్‌యార్డుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఎన్‌ఎల్‌) బోర్డు ఆమోదం తెలిపి... తూతూ మంత్రంగా తుది అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.

మూలధన సంక్షోభం పేరుతో..
స్టీల్‌ప్లాంట్‌ బయట నిరర్థకంగా ఉన్న ఆస్తుల అమ్మకానికి సంస్థ యాజమాన్యం రంగం సిద్ధంచేసుకుంటోంది. మూలధన సంక్షోభాన్ని అధిగమిస్తూ.. పూర్తిస్థాయి ప్లాంట్‌ నిర్వహణ కోసం సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకే ఆస్తుల వేలం ప్రక్రియ షురూ చేసింది. ఇటు ప్రజలు.. అటు ఉద్యోగుల ఆందోళనలు.. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ఎన్‌డీఏ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్‌ప్లాంట్‌ విక్రయించేందుకు ఉన్న అవకాశాలపైనే దృష్టిసారించింది. 

రెండ్రోజుల క్రితం కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండబోదని స్పష్టంచేశారు. అయినప్పటికీ ఎన్‌డీఏ ప్రభుత్వ చర్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉన్న ఆస్తులన్నింటినీ విక్రయించేసి.. ప్లాంట్‌ విలువను శూన్యం చేసేందుకు సిద్ధమవుతోంది. రైతులు, ప్రజలు త్యాగాలు చేసి.. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో పోరాడి సాధించుకున్న పరిశ్రమ ప్రైవేటీకరణకు శతవిధాలా యత్నిస్తోంది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ స్తబ్దుగా ఉన్నా.. తాజాగా విశాఖ ఉక్కు స్థలాల అమ్మకాల వ్యవహారాన్ని మళ్లీ వేగవంతం చేశారు. 



గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ప్రైవేటీకరణకు కొంత బ్రేక్‌ పడింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గడంలేదు. నిజానికి.. పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించి, ఆర్థిక భరోసా కల్పించి కష్టాల నుంచి గట్టెక్కించొచ్చు. సెయిల్‌లో విలీనం చేయడం మరో పరిష్కారం అని తెలిసినా, కేంద్రం ఆ పని కూడా చేయడంలేదు. ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతూ ‘విశాఖ ఉక్కు’ ఊపిరి తీసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెరపైకి తెచ్చిన ఉక్కు స్థలాల అమ్మకం వ్యవహారాన్ని తాజాగా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌ఎఎన్‌ఎల్‌ ఆస్తుల వేలానికి సిద్ధమవుతోంది.

బోర్డు సమావేశంలో వేలం అంశం!
ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఆస్తుల విక్రయంపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ స్టీల్‌ మెటీరియల్స్‌ నిల్వచేయడానికి హైదరాబాద్, చెన్నైలలో స్టాక్‌యార్డుల ఏర్పాటుకోసం కొనుగోలు చేసిన భూములతో పాటు ముంబై, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాల్ని విక్రయించే అంశాలపై చర్చించినట్లు సమాచారం. దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల స్టీల్‌ వినియోగదారుల అవసరాల్ని మూడు దశాబ్దాల కాలంగా హైదరాబాద్, చెన్నైలోని స్టాక్‌యార్డులు తీరుస్తున్నాయి. 

ఇతర మెట్రో ప్రాంతాలతో పోలిస్తే.. ఈ స్టాక్‌ యార్డుల్లో హ్యాండ్లింగ్‌ చార్జీలు తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఇక్కడే విక్రయాలు జరిగేవి. వీటిని విక్రయిస్తే అటు స్టీల్‌ప్లాంట్‌కు, ఇటు వినియోగదారులకు నష్టాలే తప్ప ఎలాంటి ఉపయోగంలేదు. ఈ మొత్తం ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.476.18 కోట్లు ఉంటుందని అధికారులు  లెక్కలు కట్టారు. నిరర్థక ఆస్తుల నెపంతో ఆస్తుల మానిటైజేషన్‌కు బోర్డు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మరోసారి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించేందుకు బోర్డు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

ఆదరిస్తే.., అద్భుతాలే కానీ..
ఇటీవలే కొంతమేర లాభాలతో పాటు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తూ స్టీల్‌ప్లాంట్‌ దూసుకుపోతోంది. సొంత గనులు కేటాయించి మూలధన సాయంచేస్తే ఉక్కు కర్మాగారం ఉరకలు వేసే అవకాశాలున్నా.. ఎన్‌డీఏ ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంటులో పూర్తి సామర్థ్యం మేరకు ఉక్కు ఉత్పత్తి చేయకుండా ఆస్తులను అమ్మడానికి ఆసక్తి చూపడంపైనా ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. 

స్థలాలు అమ్మితే విశాఖ ఉక్కు కష్టాలు తీరుతాయా అంటే ముడిసరుకు కొనుగోలు చేయడానికి, పేరుకుపోయిన అప్పులు తీర్చడానికి సైతం సరిపోవని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. జిందాల్‌ సంస్థతో ముడిసరుకు సరఫరాకు ఆర్థిక సాయానికి ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ మేరకు బీఎఫ్‌–3 ప్రారంభించినా, ముడిసరుకు సక్రమంగా అందక ఉత్పత్తి లక్ష్యం అందుకోలేకపోతోంది. నిత్యం మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారా 21 వేల టన్నులు ఉత్పత్తి చేసే అవకాశమున్నా, 14 వేల టన్నులకే పరిమితమవుతోంది. 

ఎన్‌ఎండీసీ ద్వారా ప్లాంటుకు ప్రతిరోజూ 6 రేక్‌ల ఇనుప ఖనిజం అందాలి. నాలుగు రేక్‌లకు మించి అందించడంలేదు. ఇప్పుడిస్తున్న ఇనుప ఖనిజం కేవలం రెండు ఫర్నేస్‌లకు మాత్రమే సరిపోతోంది. బీఎఫ్‌–3 పరిస్థితి ఏంటనే దానిపై ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టిసారించకుండా ఆస్తుల్ని విక్రయించేసి.. స్టీల్‌ప్లాంట్‌ని మోడువారేలా చేసి.. ప్రైవేటీకరణ చేయాలన్న లక్ష్యంతోనే ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయాలు తెలిసినా టీడీపీ, జనసేన పార్టీలు.. పొత్తు పార్టీ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నంత వరకూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని కదిలించేందుకు భయపడిన బీజేపీ.. ఇప్పుడు మాత్రం వేగంగా పావులు కదుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement