
విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓ కార్మికుడు మృతి చెందిన ఘటనపై అతని బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కోక్ అవెన్ డిపార్ట్ మెంట్ లో సూర్య వెంకట రమణ అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతదేహాన్ని ప్రధాన గేటు వద్దే అంబులెన్స్ సిబ్బంది వదిలేసి వెళ్లిపోయారు. ఇది కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. మృతదేహంతో బంధువులు స్టీల్ ప్లాంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు.

సూర్య వెంకట రమణ కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు మృతిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కనీసం ఫోన్, పర్స్ లాంటి ఏవీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు సమాచారం వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని, ఫోన్ స్విచ్చాప్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. గుండె పోటుతో మరణించినట్లు చెబుతున్నారన్నారు.

అయితే కార్మికుడు సూర్య వెంకట రమణ.. అరటి చెట్టు కింద కూర్చొని చనిపోయాడని కొందరు చెబుతుంటే, గోడకు జారబడి చనిపోయాడని మరికొందరు చెబుతున్నారన్నారు. ట్రాక్టర్ మీద పడిపోయి ఉన్నారని వేరే వాళ్లు చెప్పారన్నారు. నోటి నుంచి బ్లడ్ వచ్చి చనిపోయినట్లు తమకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. డబ్బున్న వాళ్లకే ప్లాంట్ లో న్యాయం జరుగుద్దనీ, తమ లాంటి పేదలకు న్యాయం జరగదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment