
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించగా.. మరికొందరిని తొలగించే యోచనలో ఉంది. నేటితో యాజమాన్యం కోరిన గడువు ముగియనుంది. నేడు రిజనల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో మరోసారి చర్చలు జరపనున్నారు. స్పష్టత ఇవ్వకపోతే రేపటి నుంచి సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉంది.
కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై సమావేశం కొనసాగుతోంది. యూనియన్ నేతలతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమావేశమైంది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై చర్చలు కొలిక్కి రాలేదు. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని... తొలగించిన వాటిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమనే హామీ ఇప్పటివరకు యాజమాన్యం నుంచి రాలేదని.. యాజమాన్యం చెబుతోంది ఒకటి, చేస్తోంది ఒకటని కార్మికులు మండిపడుతున్నారు.
స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అక్రమ తొలగింపులను ఆపకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులను తొలగింపును నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాతగాజువాకలో ఆదివారం మహాధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.
స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అందులో భాగంగా ప్రైవేట్ పెట్టుబడిదారులు కోరినట్టుగా ఇక్కడి కార్మికుల సంఖ్యను తగ్గిస్తోందన్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న నాయకులకు యాజమాన్యం షోకాజ్ నోటీసులను జారీ చేయడం దుర్మార్గమని సీపీఎం నేతలు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment