వడ్డించే వాడు మనవాడైతే చాలు... ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న చందంగా ఉంది అధికారుల తీరు. తమవారికి ఇసుక టెండర్ కట్టబెట్టేందుకు ఇష్టమొచ్చినట్లుగా నిబంధనలు మార్చేశారు ఖనిజ అభివృద్ధి సంస్థ అధికారులు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి మూడేళ్లలో రూ.14కోట్ల మేర నష్టం జరగనుంది.
కరీంనగర్ రూరల్ : ఇసుక తవ్వకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీ తీసుకువచ్చింది. ఇసుక రీచ్‌లను గుర్తించి, క్యూబిక్ మీటర్‌కు ఇంత చొప్పున ఇంటివద్దకే ఇసుక తీసుకువచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది. నూతన పాలసీలో భాగంగా కరీంనగర్ మండలం ఖాజీపూర్ మానేరువాగులో ఇసుక క్వారీ నిర్వహణకు రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనవరి 30న టెండర్లు ఆహ్వానించారు. టెండర్లలో పాల్గొనేందుకు వ్యక్తిగానీ, కంపెనీగానీ మూడేళ్లలో రూ.5 కోట్ల విలువైన ఒక పని నిర్వహించి ఉండాలని నిబంధన విధించారు.
ఈ నిబంధనతో పార్టనర్‌షిప్ ఫర్మ్‌లు, రెండు, మూడు పనులు కలిపి రూ.5 కోట్ల మేర పనులు చేసిన వ్యక్తులు, కంపెనీలు అర్హత కోల్పోరుు టెండర్ దాఖలు చేయలేదు. కేవలం మూడు కంపెనీలు మాత్రమే టెండర్ దాఖలు చేశారుు. క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకం, తరలించడానికి రూ.135కు కోడ్ చేసి టెండర్ దక్కించుకున్నారు. సిండికేట్‌గా ఏర్పడి ఎక్కువ మొత్తానికి టెండర్ పొందినట్లు ఆరోపణలున్నారుు. ఈ వ్యవహారంలో వరంగల్ జిల్లాకు చెందిన ఇసుక వ్యాపారి కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మంత్రుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలను తమకు అనుకూలంగా మార్పించుకుని క్వారీ టెండర్ పొందారనే ఆరోపణలున్నాయి.
కొత్తపల్లికి కొత్త నిబంధనలు
ఖాజీపూర్ ఇసుక క్వారీ టెండర్ పూర్తరుున 11 రోజుల వ్యవధిలోనే తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి మోయతుమ్మెద వాగులో ఇసుక క్వారీకి అధికారులు టెండర్లు పిలిచారు. కానీ, ఇంతలోనే నిబంధనలు సడలించారు. టెండర్లలో పాల్గొనేందుకు వ్యక్తి లేదా పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్, కంపెనీలు మూడేళ్లలో రూ.5 కోట్ల విలువకు తగ్గకుండా పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. పార్టనర్‌షిప్ ఫర్మ్‌కు అవకాశం కల్పించడంతోపాటు మూడేళ్లలో ఎన్ని పనులైనా కలిపి రూ.5 కోట్లు చేసినట్లయితే టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. దీంతో పలువురు టెండర్లలో పాల్గొనడంతో పోటీ నెలకొనగా క్యూబిక్ మీటర్‌కు రూ.87కు కోట్ చేసిన జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు టెండర్ దక్కింది.
రూ.14 కోట్లు నష్టం
అధికారుల మాయాజాలంతో ఖాజీపూర్ ఇసుక క్వారీ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి మూడేళ్లలో రూ.14 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఏడాదికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున మూడేళ్లలో 28 లక్షల 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను వాగులోనుంచి తవ్వి విక్రయకేంద్రానికి తరలించాల్సి ఉంటుంది. ఖాజీపూర్‌లో ఒక్క క్యూబిక్ మీటర్‌కు రూ.135 కాగా కొత్తపల్లిలో రూ.87 మాత్రమే ఉంది. మూడేళ్లలో క్యూబిక్ మీటర్‌కు అదనంగా రూ.48 చొప్పున మొత్తం 28 లక్షల 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపులో రూ.13 కోట్ల 72 లక్షల 80 వేలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లనుంది.
జెడ్పీటీసీ ఫిర్యాదు
ఖాజీపూర్ ఇసుక క్వారీ టెండర్లలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్ధ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌కు కరీంనగర్ జెడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న క్వారీ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖాజీపూర్ క్వారీ టెండర్ నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మూడేళ్లలో రూ.14 కోట్లు నష్టం
Published Tue, Mar 17 2015 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM
Advertisement
Advertisement