సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలోని బెరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ ఖనిజం కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తాజాగా నిర్వహించిన ఈ–ఆక్షన్‌లో రికార్డు స్థాయి రేట్లు నమోదయ్యాయి. ఏకంగా 50 శాతం అధిక రేట్లను బిడ్డర్లు కోట్ చేశారు. ఈ ఖనిజం విక్రయాల ద్వారా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.925 కోట్లు ఆదాయం వస్తుంది. తాజా రేట్లతో అదనంగా రూ.260 కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు.
బెరైటీస్ ఉత్పత్తిలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏపీఎండీసీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తోంది. అత్యంత పారదర్శక విధానాలు అవలంబిస్తోంది. అధునాతన పద్ధతుల్లో నాణ్యమైన ఖనిజాన్ని వెలికితీస్తోంది. దీంతో అంతర్జాతీయంగా బిడ్డర్లు పోటీపడుతున్నారు. తాజాగా ఎ, బి, సి, డి గ్రేడ్‌ల ఖనిజం విక్రయం కోసం ఏపీఎండీసీ ఈ–ఆక్షన్ నిర్వహించింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ’ఎ’ గ్రేడ్ ఖనిజం, 3 లక్షల మెట్రిక్ టన్నుల ’బి’ గ్రేడ్, 20 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజానికి ఆక్షన్ నిర్వహించింది. ’ఎ’ గ్రేడ్ ఖనిజాన్ని మెట్రిక్ టన్నుకు అత్యధికంగా రూ.6,691కి బిడ్డర్లు కోట్ చేశారు. గతంలో దీని ధర రూ.4,625 కాగా ఇప్పుడు రూ.2,066 ఎక్కువ రేటు వచ్చింది. అలాగే టన్ను ’బి’ గ్రేడ్ రూ.5,225 పలికింది. గతంలో ఇదే ’బి’ గ్రేడ్ మెట్రిక్ టన్ను రూ.3,350 కాగా ఇప్పుడు రూ.1,875 ఎక్కువ లభించింది. సి, డి గ్రేడ్ ఖనిజం ధరల్లోనూ స్వల్ప పెరుగుదల నమోదయింది.
సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు
మైనింగ్ రంగంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మంగంపేట బెరైటీస్‌కు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడానికి, రికార్డు స్థాయిలో రేటు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణం. మైనింగ్ రంగంలో పారదర్శకత, ఏపీఎండీసీని ప్రోత్సహించడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీఎండీసీపై పలుమార్లు సమీక్షలు నిర్వహించి, తగిన సూచనలిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దారు. బెరైటీస్‌తో పాటు బొగ్గు, గ్రానైట్, బీచ్ శాండ్, కాల్సైట్, గ్రాఫైట్, లెడ్, జింక్, ఐరన్ ఓర్ వంటి ఖనిజాలను కూడా వెలికితీయడం ద్వారా ఏపీఎండీసీ మైనింగ్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది. లాభాల బాటలో పయనిస్తోంది. మున్ముందు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్నిస్తుంది.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ మంత్రి
నాణ్యత ప్రమాణాలతో సంస్థకు గుర్తింపు
ప్రపంచంలోనే అత్యధికంగా బెరైటీస్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏపీఎండీసీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యత ప్రమాణాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ, సమర్థవంతమైన మైనింగ్ ఆపరేషన్స్ దాని సొంతం. గతేడాది రాయలసీమలో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ, రికార్డు స్థాయిలో పెద్దమొత్తంలో బెరైటీస్‌ను వెలికితీసింది. ప్రతికూల వాతావరణంలోనూ ఖనిజాన్ని అందించడం వల్ల అంతర్జాతీయంగా పేరొచ్చింది. ప్రాజెక్ట్‌లో ఉన్న 74 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజాన్ని కూడా విక్రయించేందుకు కొనుగోలుదారులతో మాట్లాడుతున్నాం..
– ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment