Mining sector
-
పరిశ్రమ పరుగులు
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో 3.1 శాతం వృద్ధిని (2023 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఆగస్టు సూచీలో వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు సూచీని సమీక్షా నెల్లో వృద్ధి బాటన నిలబెట్టాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం... మైనింగ్ రంగం 0.2 శాతం పురోగమించింది. మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 3.9 శాతం వృద్ధిని సాధించింది.విద్యుత్ ఉత్పత్తి 0.5 శాతం ఎగసింది. ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.7 శాతం క్షీణించగా, తయారీ రంగం కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా తాజా సమీక్షా నెల్లో భారీ యంత్ర పరికరాల డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో 4 శాతం వృద్ధి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ 4 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. -
ఈ నెల 13 బంగారం గనుల అమ్మకం!
న్యూఢిల్లీ: దేశ స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) మైనింగ్ రంగం సహకారం మరింత పెరగడానికి వ్యూహ రచన చేస్తున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 13 బంగారు గనులను ఈ నెల్లో వేలం వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటిలో 10 ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, మరో మూడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 10 బ్లాకుల్లో ఐదు బ్లాకుల వేలం ఆగస్టు 26న జరగవచ్చని సమాచారం. మిగిలిన ఐదు బ్లాకులను ఆగస్టు 29న వేలం వేయవచ్చని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వేలం వేయనున్న బ్లాకుల్లో... రామగిరి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి సౌత్ బ్లాక్, జవాకుల–ఎ బ్లాక్, జవాకుల–బి బ్లాక్, జవాకుల–సి బ్లాక్, జవాకుల–డి బ్లాక్, జవాకుల–ఈ బ్లాక్, జవాకుల–ఎఫ్ బ్లాక్ ఉన్నాయి. వీటికి టెండర్లను ఆహ్వానిస్తూ, గత మార్చి నెల్లో నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్ బ్లాక్‌ల వేలం కూడా ఇదే నెల్లో జరిగే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. అయితే నిర్దిష్టంగా తెలియరాలేదు. ఈ రాష్ట్రంలోని మూడు పసిడి బ్లాక్స్‌లో రెండు.. సోనపహరి బ్లాక్, ధుర్వ–బియాదండ్ బ్లాక్ రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద జిల్లా సోనభద్రలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మూడు బ్లాక్‌ల వేలానికి టెండర్లను ఆహ్వానిస్తూ, మే 21న నోటీసులు జారీ అయ్యాయి. దేశాభివృద్ధికి దన్నుగా... దేశ ఎకానమీలో గనుల భాగస్వామ్యం పెరగడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు కేంద్రం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రాలు ఆగస్టు 4 నాటికి 199 మినరల్ బ్లాక్‌లను వేలం వేశాయి. 2015లో మైనింగ్ చట్టంలో సవరణ తర్వాత వేలం మార్గం ద్వారా ఖనిజ బ్లాకుల కేటాయింపు ప్రారంభమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 45 మినరల్ బ్లాక్‌లను అమ్మకానికి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు వేలం ద్వారా ఆదాయంలో చాలా మంచి వాటాను పొందుతున్నాయని కేంద్రం పేర్కొంటోంది. ఈ రేసులో మొదట ఉన్న రాష్ట్రాలు ఆదాయాల వాటా విషయంలో సంతోషంగా ఉన్నాయని తెలుపుతోంది. ఖనిజాల వేలం నిబంధనలలో సవరణలు పోటీని ప్రోత్సహిస్తాయని, తద్వారా బ్లాక్‌ల విక్రయంలో మరింత భాగస్వామ్యానికి అవకాశం ఉంటుందని గనుల మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది. మినరల్స్ (ఎవిడెన్స్ ఆఫ్ మినరల్ కంటెంట్స్) రూల్స్, 2015 (ఎంఈఎంసీ రూల్స్), మినరల్స్ (ఆక్షన్) రూల్స్, 2015 (ఆక్షన్ రూల్స్)ను సవరించడానికి కేంద్ర గనుల మంత్రిత్వశాఖ పలు నిబంధనలను నోటిఫై చేసింది. వీటిలో మినరల్స్ (ఎవిడెన్స్ ఆఫ్ మినరల్స్ కంటెంట్స్) రెండవ సవరణ నిబంధనలు, 2021, మినలర్ (ఆక్షన్) నాల్గవ సవరణ నిబంధనలు, 2021 ఉన్నాయి. రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలు, గనుల విభాగంలో నిపుణులు, ఇతర భాగస్వాములు, సాధారణ ప్రజలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ సవరణ నియమాలు రూపొందాయి. -
మంగంపేట బెరైటీస్ బంగారం.. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలోని బెరైటీస్ ఖనిజానికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ ఖనిజం కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తాజాగా నిర్వహించిన ఈ–ఆక్షన్‌లో రికార్డు స్థాయి రేట్లు నమోదయ్యాయి. ఏకంగా 50 శాతం అధిక రేట్లను బిడ్డర్లు కోట్ చేశారు. ఈ ఖనిజం విక్రయాల ద్వారా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.925 కోట్లు ఆదాయం వస్తుంది. తాజా రేట్లతో అదనంగా రూ.260 కోట్లు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. బెరైటీస్ ఉత్పత్తిలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏపీఎండీసీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తోంది. అత్యంత పారదర్శక విధానాలు అవలంబిస్తోంది. అధునాతన పద్ధతుల్లో నాణ్యమైన ఖనిజాన్ని వెలికితీస్తోంది. దీంతో అంతర్జాతీయంగా బిడ్డర్లు పోటీపడుతున్నారు. తాజాగా ఎ, బి, సి, డి గ్రేడ్ల ఖనిజం విక్రయం కోసం ఏపీఎండీసీ ఈ–ఆక్షన్ నిర్వహించింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ’ఎ’ గ్రేడ్ ఖనిజం, 3 లక్షల మెట్రిక్ టన్నుల ’బి’ గ్రేడ్, 20 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజానికి ఆక్షన్ నిర్వహించింది. ’ఎ’ గ్రేడ్ ఖనిజాన్ని మెట్రిక్ టన్నుకు అత్యధికంగా రూ.6,691కి బిడ్డర్లు కోట్ చేశారు. గతంలో దీని ధర రూ.4,625 కాగా ఇప్పుడు రూ.2,066 ఎక్కువ రేటు వచ్చింది. అలాగే టన్ను ’బి’ గ్రేడ్ రూ.5,225 పలికింది. గతంలో ఇదే ’బి’ గ్రేడ్ మెట్రిక్ టన్ను రూ.3,350 కాగా ఇప్పుడు రూ.1,875 ఎక్కువ లభించింది. సి, డి గ్రేడ్ ఖనిజం ధరల్లోనూ స్వల్ప పెరుగుదల నమోదయింది. సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు మైనింగ్ రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మంగంపేట బెరైటీస్‌కు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడానికి, రికార్డు స్థాయిలో రేటు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణం. మైనింగ్ రంగంలో పారదర్శకత, ఏపీఎండీసీని ప్రోత్సహించడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీఎండీసీపై పలుమార్లు సమీక్షలు నిర్వహించి, తగిన సూచనలిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దారు. బెరైటీస్‌తో పాటు బొగ్గు, గ్రానైట్, బీచ్ శాండ్, కాల్సైట్, గ్రాఫైట్, లెడ్, జింక్, ఐరన్ ఓర్ వంటి ఖనిజాలను కూడా వెలికితీయడం ద్వారా ఏపీఎండీసీ మైనింగ్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది. లాభాల బాటలో పయనిస్తోంది. మున్ముందు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్నిస్తుంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ మంత్రి నాణ్యత ప్రమాణాలతో సంస్థకు గుర్తింపు ప్రపంచంలోనే అత్యధికంగా బెరైటీస్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏపీఎండీసీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యత ప్రమాణాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థ, సమర్థవంతమైన మైనింగ్ ఆపరేషన్స్ దాని సొంతం. గతేడాది రాయలసీమలో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడినప్పటికీ, రికార్డు స్థాయిలో పెద్దమొత్తంలో బెరైటీస్‌ను వెలికితీసింది. ప్రతికూల వాతావరణంలోనూ ఖనిజాన్ని అందించడం వల్ల అంతర్జాతీయంగా పేరొచ్చింది. ప్రాజెక్ట్‌లో ఉన్న 74 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజాన్ని కూడా విక్రయించేందుకు కొనుగోలుదారులతో మాట్లాడుతున్నాం.. – ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి -
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అంతంతే!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి సెప్టెంబర్‌లో స్వల్పంగా 3.1 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. మైనింగ్ రంగం మెరుగైన ఫలితాన్ని నమోదుచేసుకుంది. బేస్ ఎఫెక్ట్ దన్నుతో గడచిన ఆరు నెలలుగా (2021 మార్చి నుంచి ) రెండంకెల్లో ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి, తన ధోరణిని కొనసాగించకుండా తక్కువ వృద్ధి రేటుకు పడిపోవడం ఆందోళన పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎలా అంటే... 2020 సెప్టెంబర్‌లో సూచీ 124.1 పాయింట్ల వద్ద ఉంది. 2021 సెప్టెంబర్‌లో సూచీ 127.9 పాయింట్లకు ఎగసింది. అంటే వృద్ధి 3.1 శాతమన్నమాట. 2019లో సూచీ 122.9 వద్ద ఉంది. కరోనా ముందస్తు కాలంతో పోల్చినా సూచీల్లో పురోగతి ఉన్నా... ఇది అతి స్వల్పంగా మాత్రమే ఉండడం గమనించాల్సిన అంశం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం ఈ గణాకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు ఇవీ... ► మొత్తం ఐఐపీలో దాదాపు 77.63 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం సెప్టెంబర్‌లో 2.7 శాతం పురోగమించింది. ► మైనింగ్ రంగం వృద్ధి రేటు 8.6 శాతంగా ఉంది. ► విద్యుత్ ఉత్పత్తి కేవలం ఒక శాతం పెరిగింది. ► భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగం కేవలం 1.3 శాతం లాభపడింది. 2020 ఇదే కాలంలో ఈ రంగం అసలు క్షీణతలో ఉంది. ► కన్జూమర్, నాన్ కన్జూమర్ గూడ్స్ ఉత్పత్తి క్షీణతలో ఉండడం గమనార్హం. రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ 2021 సెప్టెంబర్‌లో 2 శాతం క్షీణించింది. నిత్యావసరాలకు సంబంధించి (ఎఫ్ఎంసీజీ) నాన్ కన్జూమర్ గూడ్స్ ఉత్పత్తులు 0.5 శాతం క్షీణించాయి. ► మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా కలిగిన ఎనిమిది రంగాల మౌలిక పరిశ్రమల గ్రూప్ 4.4 శాతం పురోగమించింది. సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6% ఎగసింది. ఇక సిమెంట్ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1.7% క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.02% పురోగమించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 1% పెరిగింది. స్టీల్ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1%. -
గనులు ఆర్థిక వ్యవస్థను మార్చేస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి మైనింగ్ రంగానికి ఉందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రగతిని గనులు నిర్దేశిస్తాయని అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (తెలంగాణ స్టేట్ సెంటర్) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ ఆడిటోరియంలో ‘మైనింగ్– ప్రజెంట్ అండ్ ఫ్యూచర్–ఇన్వెస్టిమెంట్స్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్’అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి మైనింగ్ ఇంజనీర్లు, మేధావులు, నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవం అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థకు మూలం గనులేనని, వాటిని క్రమపద్ధతిలో వినియోగించుకుంటే అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మైనింగ్‌లో విప్లవాత్మక మార్పులు జరిగాయని, ఆదాయం కూడా భారీగా పెరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004–2013 మధ్య కాలంలో ఇసుకపై వచి్చన ఆదాయం రూ.13.66 కోట్లయితే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచి్చన ఆదాయం రూ.2,383 కోట్లని తెలిపారు. ప్రారంభోత్సవ సదస్సు అనంతరం సెషన్ల వారీగా వివిధ అంశాలపై బృంద చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాల్గొన్న యువ ఇంజనీర్లను ఉద్దేశించి వక్తలు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహముద్ అలీ, ఎఫ్ఐఈ ప్రెసిడెంట్ టీఎం గుణరాజా, చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వరరావు, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ బీఆర్‌వీఎస్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్.. మనీ
తెలంగాణలో మైనింగ్ ఆదాయం ఏడాదికేడాది పెరిగిపోతోంది. రాష్ట్ర అభివృద్ధికి ఆదాయం సమకుర్చే వనరుల్లో మైనింగ్ రంగం ఒకటి. దీంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇసుక, గ్రానైట్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించింది. గతంలో మాదిరిగా ఇసుక రీచ్‌లను వేలం వేయడం కాకుండా టీఎస్ఎండీసీ ద్వారా ఆన్లైన్ కొనుగోలు పద్ధతిని ప్రవేశపెట్టింది. దీంతో ఇసుక రీచ్‌ల వద్ద లెక్కలోకి రాని ఇసుక తగ్గి పోయింది. ఫలితంగా ఆదాయం గణనీయంగా పెరిగింది. గ్రానైట్ రవాణాకు సంబంధించి తనిఖీలు పెరగడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. వీటి ఫలితంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతూ పోతోంది. తెలంగాణ ఏర్పాటు కాకముందు రూ.1,807 కోట్లు ఉంటే ఇప్పుడు ఆ ఆదాయం రూ.3,169 కోట్లకు చేరింది. ఇసుక, గ్రానైట్‌తోపాటు బొగ్గు, ఇనుప ఖనిజం, డైమండ్, డోలమైట్, యూరేనియం, సున్నపురాయి నిక్షేపాలు తెలంగాణలో విరివిగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే సిమెంట్ కర్మాగారాలు, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, గ్రానైట్ కటింగ్, ఫేసిటింగ్, స్ట్రీల్, స్పాంజ్ ఐరన్ వంటివి మొత్తం 1,904 పరిశ్రమలు ఉన్నాయి. వీటి లైసెన్సులు, అమ్మకాలు, లీజు, పన్నుల ద్వారా ఆదాయం భారీగా సమకూరుతోంది. – సాక్షి, వరంగల్ రూరల్ తెలంగాణలో ఖనిజ ఆధార పరిశ్రమలు... సిమెంట్ ప్లాంట్స్ 21 స్పాంజ్ ఐరన్ ప్లాంట్స్ 15 క్వార్జ్ పల్వరైజింగ్ యూనిట్స్ 79 ఫెర్రో అల్లాయ్స్ యూనిట్స్ 02 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ 723 స్టోన్ క్రషింగ్ యూనిట్స్ 463 నాప స్లాబ్ యూనిట్స్ 183 ఇసుక తయారీ యూనిట్లు 44 రెడీమిక్స్ కాంక్రీట్ యూనిట్లు 34 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు 03 క్లే సిరామిక్ యూనిట్స్ 29 పుల్లర్స్ ఎర్త్ ప్రాసెసింగ్ యూనిట్లు 55 మొజాయిజ్ చిప్స్ యూనిట్స్ 16 లాటరైల్ బెనిఫిసియేషన్ ప్లాంట్స్ 02 బరైటీస్ ప్రాసెసింగ్ యూనిట్స్ 01 తెలంగాణలో ఖనిజ వనరులు బొగ్గు: దక్షిణ భారత దేశంలో తెలంగాణ లోనే బొగ్గు నిక్షేపాలున్నాయి. రాష్ట్ర ప్రభు త్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ద్వారా తవ్వకాలు జరిపిస్తున్నది. ఇనుము: బయ్యారం రక్షిత అటవీ ప్రాం తంలో మీడియం గ్రేడ్ ఇనుప ఖనిజం, మహబూబాబాద్, జయశంకర్ భూపాల పల్లి, జగిత్యాల, వరంగల్ అర్బన్ జిల్లాలో ఫ్లోట్ ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉన్నాయి. యురేనియం: నల్లగొండ జిల్లా లంబాపూ ర్, పులిచర్ల, నమ్మాపురం, ఎల్లాపురం గ్రామాల్లో 11 మిలియన్ టన్నుల యురేనియం ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. సున్నపురాయి: ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపే ట, వికారాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సుమారుగా 7,519 మిలియన్ టన్నుల సున్నపురాయి నిక్షేపాలున్నాయి. 21 సిమెంట్ ప్లాంట్లు ఉండగా అందులో 10 మేజర్, 11 మైనర్‌వి. 29.50 ఎంటీపీఏ సామర్థ్యం తో సున్నపురాయిని వాడుతున్నారు. గ్రానైట్: కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహ బూబాబాద్, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో గ్రానైట్ లభిస్తున్నది. కరీంనగర్, పెద్దపల్లి, జగి త్యాలల్లో బ్రౌన్ పొర్పొరే, రెడ్ రోజ్, బ్లూబ్రౌన్, టాన్ బ్రౌన్ లభిస్తాయి. -
రికవరీ బాటలో పరిశ్రమలు..
న్యూఢిల్లీ: పరిశ్రమలు మే నెలలో సానుకూల ఫలితాన్ని అందించాయి. ఆర్థికాభివృద్ధికి సంకేతాలను ఇస్తూ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.7 శాతం వృద్ధి సాధించింది. ఇది 19 నెలల గరిష్ట స్థాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈ యేడాది జనవరి నుంచీ చూస్తే, మొదటి నెలలో స్వల్ప వృద్ధి 1.1 శాతం నమోదుకాగా, అటు తర్వాత రెండు నెలల్లో (ఫిబ్రవరిలో 2 శాతం క్షీణత, మార్చిలో 0.5 శాతం క్షీణత) అసలు వృద్ధి చోటు చేసుకోలేదు. ఏప్రిల్‌లో వృద్ధి రేటు 3.4 శాతం నమోదుకాగా, మేలో ఇది మరింత పెరగడం సానుకూలాంశం. కాగా 2013 మే నెలలో ఐఐపీలో అసలు వృద్ధి లేదు. ఆ నెలలో మైనస్ 2.5 (క్షీణత) నమోదయ్యింది. 2 నెలల్లో వృద్ధి 4 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్-మే) చూస్తే వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. 2013-14ఇదే కాలంలో ఈ రేటు క్షీణతలో -0.5 శాతంగా నమోదయ్యింది. కీలక రంగాలను చూస్తే... తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన ఈ రంగం ఉత్పత్తి 2013 మేతో పోల్చితే 2014 మేలో క్షీణత నుంచి వృద్ధి బాటకు మళ్లింది. ఈ రేటు -3.2 శాతం నుంచి 4.8 శాతం వృద్ధికి మళ్లింది. ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలూ ఏప్రిల్-మేలోనూ ఇదే పరిస్థితి నమోదయ్యింది. 0.7 క్షీణత నుంచి ఈ రంగం 3.7 శాతం వృద్ధికి మళ్లింది. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో 16 సానుకూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. మైనింగ్: ఈ రంగం ఉత్పత్తి 2013 మేతో పోల్చితే 2014 మేలో క్షీణత నుంచి బైట పడింది. -5.9 శాతం నుంచి 2.7 శాతం వృద్ధి బాటలోకి మళ్లింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది. విద్యుత్: ఉత్పత్తి వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. రెండు నెలల్లో వృద్ధి భారీగా 5.3 శాతం నుంచి 9 శాతానికి ఎగసింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు చిహ్నంగా ఉన్న ఈ రంగం ఉత్పత్తి 2013 మేలో అసలు వృద్ధి లేకపోగా 3.7 శాతం క్షీణించింది. అయితే 2014 మేలో ఈ రంగం 4.5 శాతం వృద్ధికి మళ్లింది. ఏప్రిల్-మే నెలల్లో సైతం ఉత్పత్తి -2.1 శాతం (క్షీణత) నుంచి 9.3 శాతం వృద్ధికి మళ్లింది. వినియోగ వస్తువులు: ఈ రంగం ఉత్పత్తి 18.3 శాతం క్షీణ బాటలోంచి 3.2 శాతం వృద్ధిలోకి మళ్లింది. అయితే ఏప్రిల్-మే నెలల్లో క్షీణత కొనసాగుతోంది. అయితే ఈ క్షీణత - 14 శాతం నుంచి - 2.5 శాతానికి మెరుగుపడింది. విశ్వాసం పెరుగుతోంది...: పారిశ్రామిక ప్రతినిధులు తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కలిగిస్తున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పారిశ్రామిక ఉత్పత్తిలో క్షీణత ధోరణి ముగిసినట్లేనని, ఉత్పత్తి రికవరీ బాట పట్టిందని పేర్కొనేలా గణాంకాలు ఉన్నాయన్నారు. ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానిస్తూ, తయారీ రంగం వృద్ధిని నమోదుచేసుకున్నప్పటికీ, బేస్ ఎఫెక్ట్‌నూ (తాజా గణాంకాలకు గత ఏడాది మేలో క్షీణతను ప్రాతిపదికగా తీసుకోవడం) ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అయితే తయారీ రంగంలోని మెజారిటీ విభాగాలు సానుకూలతలో ఉండడం హర్షణీయమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పారిశ్రామికోత్పత్తి గణాంకాల్లో సానుకూల ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.5 శాతాన్ని అధిగమించడానికి ఈ సానుకూల పరిస్థితి దోహదపడుతుందని కూడా కపూర్ అభిప్రాయపడ్డారు.