క్షీణత నుంచి వృద్ధి బాటలోకి పారిశ్రామిక ఉత్పత్తి
సెప్టెంబర్‌లో 3.1 శాతం పురోగమనం
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో 3.1 శాతం వృద్ధిని (2023 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఆగస్టు సూచీలో వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు సూచీని సమీక్షా నెల్లో వృద్ధి బాటన నిలబెట్టాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం... మైనింగ్ రంగం 0.2 శాతం పురోగమించింది. మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 3.9 శాతం వృద్ధిని సాధించింది.
విద్యుత్ ఉత్పత్తి 0.5 శాతం ఎగసింది. ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.7 శాతం క్షీణించగా, తయారీ రంగం కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా తాజా సమీక్షా నెల్లో భారీ యంత్ర పరికరాల డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది.
ఆరు నెలల్లో 4 శాతం వృద్ధి
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ 4 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం.
Comments
Please login to add a commentAdd a comment